Sivaramakrsnan
-
చిట్ ఫండ్ కంపెనీలపై జీఎస్టీ భారం మోపొద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక సేవలతో చేరువైన నమోదిత చిట్ ఫండ్ కంపెనీలపై జీఎస్టీ భారం మోపొద్దని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ (ఏఐఏసీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. పన్ను పెరిగితే కంపెనీల మనుగడ ప్రశ్నార్థకమని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టి.ఎస్.శివరామకృష్ణన్ ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘100 ఏళ్లకుపైగా దేశంలో సామాన్యులకు ఆర్థిక సేవలందిస్తున్న పరిశ్రమ ఇది. ట్యాక్స్ విషయంలోనైనా చిట్ ఫండ్ సంస్థలను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) కింద పరిగణించాలి. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలపై సర్వీస్ ట్యాక్స్ 5 శాతం మించడం లేదు. అదే చిట్ ఫండ్ కంపెనీలు 15 శాతం చెల్లిస్తున్నాయి. జీఎస్టీ అమలైతే ఈ పన్ను మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భారం కస్టమర్లపై పడే అవకాశమూ లేకపోలేదు’ అని వివరించారు. చిట్ ఫండ్ యాక్ట్–1982కు సవరణ జరగాలన్నారు. పోంజీ స్కీములతో జాగ్రత్త.. అధిక కమీషన్ ఆశజూపే వ్యక్తులు, కంపెనీలకు సామాన్యులు దూరంగా ఉండాలని అసోసియేషన్ సలహాదారు, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ సూచించారు. సమస్యల్లా నమోదు కాని చిట్ కంపెనీల నుంచేనని చెప్పారు. స్థానికంగా ప్రభుత్వ శాఖలే వీటికి అడ్డుకట్ట వేయాలన్నారు. ‘ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నమోదిత చిట్ కంపెనీలు పారదర్శకంగా వ్యవహరిస్తున్నాయి. చిట్ కంపెనీల వడ్డీ 1 శాతంలోపే ఉంటోంది. అవసరానికి ఆదుకునే సాధనమైన చిట్‌ను సామాన్యులు పొదుపుగా భావిస్తారు. ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నాం. జీఎస్టీ పేరుతో ప్రజల పొదుపుపై పన్ను భారం ఉండొద్దు. ఇదే జరిగితే కస్టమర్లు ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు ఆర్థిక సహాయం కోసం వెళ్తారు. నెలకు 10 శాతందాకా వడ్డీ తీసుకునే వ్యాపారులూ ఉన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని అన్నారు. దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు నమోదిత చిట్ కంపెనీలు ఉన్నాయి. వీటి వార్షిక టర్నోవరు రూ.40,000 కోట్లు దాటింది. -
‘రాజధాని కమిటీ చైర్మన్’ శివరామకృష్ణన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య శాఖలో కార్యదర్శిగా, పర్యావరణశాఖలో అదనపు కార్యదర్శిగా, కోల్కత్తా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా పనిచేశారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధికారత కోసం కృషి చేసిన శివరామకృష్ణన్.. 73, 74వ రాజ్యాంగ సవరణలకు కారణమయ్యారని ప్రశంసలు అందుకున్నారు. 1992లో ఆయన పదవీ విరమణ పొందారు. అనంతరం వరల్డ్ బ్యాంక్‌లో పట్టణాభివృద్ధిపై సీనియర్ సలహాదారునిగా నియమితులయ్యారు. ఆయన సామర్థ్యంపై నమ్మకంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నట్లుగా ఏపీ కొత్త రాజధాని ఎంపికకు అధ్యయన కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈయన నేతృత్వంలోని కమిటీయే కేంద్రానికి నివేదికను సమర్పిస్తూ పలు కీలక సిఫారసులు చేసింది. అలాగే ఆర్థికశాస్త్రం, పొలిటికల్ సైన్స్, లా విభాగాల్లో ప్రావీణ్యం సాధించిన శివరామకృష్ణన్ పట్టణాభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, ఎన్నికల్లో సంస్కరణలు, పర్యావరణంపై పుస్తకాలు రాశారు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఆయన చివరి పుస్తకం ‘గవర్నెన్స్ ఆఫ్ మెగాసిటీస్: ఫ్రాక్చర్డ్ థింకింగ్, ప్రాగ్‌మెంటెడ్ సెటప్’. సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: రాజధాని అధ్యయన కమి టీ చైర్మన్ శివరామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నివేదికను అమలు చేసినప్పుడే నివాళి అర్పించినట్లు: వైఎస్ జగన్ శివరామకృష్ణన్ మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఏపీ రాజధాని అంశంపై శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను అమలు చేసినపుడే నిజమైన నివాళి అర్పించినట్లని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
చిరస్మరణీయుడు శివరామకృష్ణన్
నవ్యాంధ్రప్రదేశ్‌లో అభి వృద్ధి వికేంద్రీకరణ, వెను కబడిన ప్రాంతాల అభి వృద్ధి, ప్రత్యేకించి నూతన రాజధాని తదితర అంశా లపై చాలా శాస్త్రీయమైన పద్ధతిలో ప్రాంతీయ రాగ ద్వేషాలకు అతీతంగా నివే దిక సమర్పించినవారు శివరామకృష్ణన్. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని ప్రజల సర్వతోముఖాభివృద్ధిపై ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ సమర్పించిన నివేది కను ప్రతి తెలుగువాడు అధ్యయనం చేయాలి. గతం లో కృష్ణా జలాల పంపిణీ సందర్భంగా పరీవాహక రాష్ట్రాల మధ్య తగాదాలు తీర్చడానికి ఏర్పాటైన బచావత్ కమిషన్, అలాగే గోదావరీ జలాల విని యోగంపై ఏర్పాటు చేసిన గుల్హాతి కమిషన్, ఇటీ వల రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ నివేదికలు చాలా విలువైనవి. తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలపై ఎంతో బాధ్య తతో అధ్యయనం జరిపి ఇచ్చిన నివేదికలవి. ఆ నివే దికల ఆధారంగా మన తెలుగు పాలకులు బాధ్య తగా స్పందించి ఉంటే నేడు ఏర్పడబో తున్న సంక్షోభాలను పరిష్కరించి ఉండ వచ్చు. కేంద్రంలో నాటి సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఆంధ్రప్ర దేశ్ విభజనానంతర పరిస్థితులను, ఏర్పడబోయే పరిణామాలను సక్రమం గా అంచనా వేయకుండా చేసిన విభజన తో జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. విభ జన జరిగిన తీరు కూడా భారత పార్లమెంట్ చరి త్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది. శ్రీకృష్ణ కమి షన్ నివేదికలను ఆనాటి పాలకులు చెత్తబుట్టలోకి నెట్టివేస్తే, శివరామకృష్ణన్ నివేదికను నేడు చంద్ర బాబు ప్రభుత్వం కనీస చర్చను కూడా చేపట్టకుండా అసెంబ్లీలో ఏకపక్షంగా రాజధాని నిర్మాణ ప్రాంతా లను ఎంపిక చేసింది. కనీసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. రాజధాని నిర్మాణ ఎంపిక పరిణామా లపై చర్చించనూ లేదు. రాష్ట్రంలో చాలా విలువైన పంట భూములను రైతన్నల నుంచి సేకరించ డం సరైంది కాదని ప్రభుత్వం భూము లు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్నా యని, తరచుగా వరదలు తుఫానులకు గురయ్యే ప్రాంతాల ఎంపిక సరికాదని, పైగా ఆ ప్రాంతాలకు భూకంప ప్రభా విత చరిత్ర కలదని శివరామకృష్ణన్ హెచ్చరిక చేశారు. అంతటి విలువైన నివేదికను నిర్లక్ష్యం చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశా రు. ఆయన ప్రధాని నరేంద్రమోదీ నుంచి కనీస రాజకీయ విజ్ఞత నేర్చుకోవాలి. దేశంలో నేడు ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను మోదీ ఆహ్వానించి మరీ చర్చలు జరిపారు. కనీస రాజకీయ విజ్ఞత ఉంటే రాజధాని ప్రాంతాల సమ స్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చర్చలకు ఆహ్వానించాలి. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమస్యలు, ప్రత్యేకించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల అభివృద్ధి సమస్యలపై ప్రతిపక్ష నేత అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోవాలి. చంద్రబాబు విపరీతమైన అభివృద్ధిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తుండటం వల్ల శివరామకృష్ణన్ హెచ్చరికలు చేసినట్లు భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదముంది. దీనికి భిన్నంగా శివరామకృష్ణన్ నివేదిక అమలుపరిస్తే విభజన ఉద్య మాలు పుట్టుకొచ్చేవని చంద్రబాబు ప్రకటించడం వింతగొల్పుతుంది. ఎంతో బాధ్యతతో కూడిన కమి షన్ నివేదికపై బురదజల్లాలని, తిమ్మినిబమ్మిని చేయాలని చంద్రబాబు ప్రయత్నించటం పెద్దలు శివరామకృష్ణన్గారిని కించపర్చడానికి చేసిన ప్రయ త్నమే. ఎంతో విజ్ఞులు, వివేకవంతులైన శివరామ కృష్ణన్ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా తమ నివేదికను తెలుగు ప్రజల ముందు ఉంచారు. ఇవ్వాళ ఆయన భౌతికంగా మన ముందు లేకపో వచ్చు. కాని తన నిష్పాక్షిక నివేదికతోపాటు ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, అమరజీవిగా నిలిచిపోతారు. (శివరామకృష్ణన్ మృతికి నివాళి) వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు ఇమామ్