‘రాజధాని కమిటీ చైర్మన్’ శివరామకృష్ణన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య శాఖలో కార్యదర్శిగా, పర్యావరణశాఖలో అదనపు కార్యదర్శిగా, కోల్‌కత్తా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా పనిచేశారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధికారత కోసం కృషి చేసిన శివరామకృష్ణన్.. 73, 74వ రాజ్యాంగ సవరణలకు కారణమయ్యారని ప్రశంసలు అందుకున్నారు.
1992లో ఆయన పదవీ విరమణ పొందారు. అనంతరం వరల్డ్ బ్యాంక్‌లో పట్టణాభివృద్ధిపై సీనియర్ సలహాదారునిగా నియమితులయ్యారు. ఆయన సామర్థ్యంపై నమ్మకంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నట్లుగా ఏపీ కొత్త రాజధాని ఎంపికకు అధ్యయన కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈయన నేతృత్వంలోని కమిటీయే కేంద్రానికి నివేదికను సమర్పిస్తూ పలు కీలక సిఫారసులు చేసింది. అలాగే ఆర్థికశాస్త్రం, పొలిటికల్ సైన్స్, లా విభాగాల్లో ప్రావీణ్యం సాధించిన శివరామకృష్ణన్ పట్టణాభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, ఎన్నికల్లో సంస్కరణలు, పర్యావరణంపై పుస్తకాలు రాశారు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఆయన చివరి పుస్తకం ‘గవర్నెన్స్ ఆఫ్ మెగాసిటీస్: ఫ్రాక్చర్డ్ థింకింగ్, ప్రాగ్‌మెంటెడ్ సెటప్’.
సీఎం సంతాపం
సాక్షి, హైదరాబాద్: రాజధాని అధ్యయన కమి టీ చైర్మన్ శివరామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
నివేదికను అమలు చేసినప్పుడే నివాళి అర్పించినట్లు: వైఎస్ జగన్
శివరామకృష్ణన్ మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఏపీ రాజధాని అంశంపై శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను అమలు చేసినపుడే నిజమైన నివాళి అర్పించినట్లని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.