మానవాభివృద్ధి సూచిలో జిల్లాకు ఆరో ర్యాంకు
పురోగమనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయ చైతన్యానికి మారుపేరయిన ఖమ్మం జిల్లా సామాజిక చైతన్యానికి కూడా నిదర్శనంగా నిలుస్తోంది. మానవాభివృద్ధి విషయంలో జిల్లా ఓ అడుగు ముందుకేసింది. గత లెక్కలతో పోలిస్తే ఓ స్థానం పెకైళ్లి, ఆరోస్థానంలో నిలిచింది. తెలంగాణ నూతన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రణాళిక విభాగం గత నెల 29న ఓ నివేదిక (2013 మార్చి వరకు ఉన్న గణాంకాలతో) సమర్పించింది. దాని ప్రకారం మానవాభివృద్ధి సూచి (హెచ్‌డీఐ)లో జిల్లా ఆరోస్థానంలో ఉంది. అదే 2004-05లో ఏడో స్థానంగా నమోదైంది. జిల్లా ప్రజానీకం తలసరి ఆదాయంతో పాటు అక్షరాస్యత, విద్య, ఆరోగ్య ప్రమాణాలు, నివాస సదుపాయాలు, ఇతర అంశాలన్నింటినీ పరిగణ నలోకి తీసుకుని నిర్ధారించే మానవాభివృద్ధి సూచి జిల్లాలో పెరగడం హర్షించదగిన పరిణామమేనని అధికార వర్గాలంటున్నాయి.
ఇక, తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణలో జిల్లా మూడో స్థానంలో నిలుస్తోంది. రెండో సవరించిన అంచనాల ప్రకారం 2010-11 ఆర్థిక సంవత్సరానికి (స్థిరధరల ప్రకారం) జిల్లా తలసరి ఆదాయం రూ. 38,888గా నమోదైంది. 2004-05తో పోలిస్తే రూ.10 వేలకు పైగా తలసరి ఆదాయం పెరగడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల తర్వాత ఎక్కువ తలసరి ఆదాయం జిల్లాలోనే నమోదు కాగా, పక్కనే ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల కన్నా తలసరి ఆదాయం మెరుగ్గా ఉంది. జనాభా నియంత్రణలోనూ జిల్లా వాసులు ముందున్నారని ప్రణాళిక విభాగం లెక్కలు చెపుతున్నాయి.
ఒకటి కాదు... రెండు కాదు... దశాబ్ద కాలపు లెక్కలు తీస్తే... గత పదేళ్లలో జనాభా పెరుగుదల విషయంలో భారీ మార్పు కనిపిస్తోంది. గత పదేళ్లలో (2001-2011) జిల్లా జనాభాలో కేవలం 8.47 శాతమే పెరిగింది. అంతకు ముందు పదేళ్లతో పోలిస్తే ఇది సగానికి సగం తగ్గడం గమనార్హం. అంతకుముందు పదేళ్లలో (1991-2001) జనాభా పెరుగుదల 16.39 శాతంగా నమోదైంది. తెలంగాణలోని పది జిల్లాలతో పోలిస్తే దశాబ్ద కాలపు జనాభా పెరుగుదలలో జిల్లా ఐదో స్థానంలో ఉంది. జనాభా తగ్గుదలతో పాటు జిల్లాకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తక్కువేనని తెలుస్తోంది. తెలంగాణ జిల్లాలోనే అత్యల్ప వ్యవసాయ విద్యుత్ వినియోగం మన జిల్లాలోనే నమోదయింది. అదే గృహ వినియోగానికి వస్తే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత మనమే ముందున్నాం. ఇక రసాయన ఎరువుల వినియోగంలోనూ జిల్లా రైతులు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు ప్రణాళిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. జిల్లాలో 2012-13 సంవత్సరంలో అన్ని రకాల ఎరువులు కలిసి కూడా లక్ష టన్నులు ఉపయోగించలేదు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే తెలంగాణలో చేపల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే. రవాణాకు సంబంధించి జిల్లాలో వ్యవసాయ వినియోగానికి గాను 9,345 ట్రాక్టర్లున్నాయని ప్రణాళిక శాఖ లెక్కలు చె పుతున్నాయి.
ద్విచక్రవాహనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నా ఆటోలలో మాత్రం జిల్లా ముందుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ ఆటోలున్నాయి. జిల్లాలో మొత్తం 28,016 ఆటోలున్నాయని ప్రణాళిక శాఖ గుర్తించింది. రైతులు, ఇతర వర్గాలు బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల కంటే జిల్లా ప్రజలు దాచిపెట్టుకున్న సొమ్మే ఎక్కువగా ఉందని ప్రణాళిక శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది.
నివేదికలో జిల్లాకు సంబంధించిన ముఖ్యాంశాలివి...
మానవాభివృద్ధి సూచిలో ఆరోస్థానంలో ఉన్న జిల్లా ఆర్యోగం విషయంలో ఐదో స్థానంలో, విద్యా రంగంలో నాలుగో స్థానంలో ఉంది. జీవన ప్రమాణంలో విషయానికి వస్తే జిల్లా ఏడో స్థానంలో ఉంది.జనాభా పెరుగుదలకు సంబంధించి గత పదేళ్లలో 8.47 శాతం పెరుగుదల నమోదైంది. అందులో 3.55 శాతం గ్రామీణ జనాభా పెరగగా, 28.39 శాతం పట్టణాల్లో జనాభా పెరిగింది. అంటే జీవన పోరాటంలో భాగంగా ఎక్కువ మంది పట్టణాలకు వలస వస్తున్నారని తెలుస్తోంది. అదే విధంగా పురుష జనాభాలో 6.54 శాతం పెరుగుదల ఉంటే, స్త్రీలు గత పదేళ్లలో 10.44 శాతం పెరిగారు. అంటే ప్రతి 100 మంది స్త్రీలకు మరో 10 మంది పెరిగారన్నమాట.
గత వందేళ్లలో పరిశీలిస్తే 1901-11 వరకు 23.46 శాతం, 1911-21లో 0.72 శాతం, 1921-31లో 21.61 శాతం, 1931-41 వరకు 17.60 శాతం, 1941-51 వరకు 19.53 శాతం, 1951-61 మధ్యకాలంలో 30.88 శాతం జనాభా పెరుగుదల కనిపిస్తోంది. ఈ పదేళ్లలో తెలంగాణలోని అన్ని జిల్లాల కన్నా మన జిల్లాలోనే ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఇక, 1961-71 వరకు 29.54, 71-81 వరకు 27.86, 81-91 వరకు 26.50 శాతం జనాభా పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
ఆవాసాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 8,70,625 గృహాలుండగా, అందులో 39,459 ఖాళీగా ఉన్నాయి. 7,28,996 గృహాల్లో జనాభా నివాసముంటుండగా, 19.361 ఆవాసాల్లో దుకాణాలు, కార్యాలయాలున్నాయి. 6,449 భవనాల్లో స్కూళ్లు, కాలేజీలుండగా, 1,521 భవనాల్లో లాడ్జిలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. మిగిలిన వాటిలో ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాప్‌లు, ప్రార్థనా మందిరాలున్నాయి. చాలాకాలంగా 1,419 ఆవాసాలకు తాళాలు వేసి ఉన్నాయని ప్రణాళిక శాఖ లెక్కలు చెపుతున్నాయి.
వ్యవసాయానికి సంబంధించి రసాయన ఎరువుల వినియోగం ఇతర జిల్లాలతో పోలిస్తే మన దగ్గర తక్కువగానే ఉంది. నత్రజని ఎరువును ఒక ఏడాదిలో 71,679 టన్నులు వినియోగించగా, ఫాస్పరస్ 21,556 టన్నులు, పొటాష్ 6,455 టన్నులు వినియోగించారు. ఇదంతా కలిపినా లక్ష టన్నుల లోపే. అదే ఇతర జిల్లాల విషయానికి వస్తే వరంగల్‌లో 1.66 లక్షల టన్నులకుపైగా, నల్గొండలో 1.53లక్షల టన్నులకు పైగా, కరీనంగర్‌లో 1.70లక్షల టన్నులకు పైగా వినియోగించారు.
చేపల ఉత్పత్తిలోనూ తెలంగాణలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉంది. చేపలు, రొయ్యల ఉత్పత్తికి సంబంధించి 2010-11లో జిల్లాలో 13,650 టన్నుల ఉత్పత్తి రాగా, 2011-12లో అది 23,770 టన్నులకు చేరింది. ఇక, 2012-13లో 35,016 టన్నుల ఉత్పత్తి వచ్చింది.
విద్యుత్ వినియోగానికి సంబంధించి తలసరి వినియోగాన్ని పరిశీలిస్తే తెలంగాణ జిల్లాల్లోనే మన జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం తక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ విద్యుత్ తలసరి వినియోగం 117 యూనిట్లు మాత్రమే నమోదైంది. అదే నల్లగొండలో 318 యూనిట్లు, మహబూబ్‌నగర్‌లో 387 యూనిట్లుగా నమోదైంది. పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలో మాత్రం మనకంటే చాలా తక్కువగా 60 యూనిట్లే నమోదు కావడం విశేషం. అంటే ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాతో పాటు వరంగల్‌లో బావులపై ఆధారపడి వ్యవసాయం తక్కువేనని తెలుస్తోంది. అదే గృహ విద్యుత్ వినియోగం వచ్చే సరికి హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత మన జిల్లాలోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రణాళిక శాఖ లెక్కలు చెపుతున్నాయి.
వాహనాల విషయానికి వస్తే జిల్లాలో 2013, మార్చి 31 నాటికి 18,987 కార్లు, 559 జీపులు, 2,67,563 ద్విచక్ర వాహనాలు, 9,345 ట్రాక్టర్లు, 446 ఓమ్నీ బస్సులు, 182 రిగ్గులు, 57 క్రేన్లు ఉన్నాయి. ఇక, ఆటోలయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ. జిల్లాలో మొత్తం 28,016 ఆటోలుండగా, పక్కనే ఉన్న నల్లగొండలో 23,917, వరంగల్‌లో 16,476 ఆటోలున్నాయి.
జిల్లాలో మార్చి 2013 నాటికి 3,743 మంది హెచ్ఐవి బాధితులున్నారు. వీరిలో 1,909 మంది మహిళలు, 1,660 మంది పురుషులు ఉన్నారు.