సిరి ఫోర్ట్ శ్రీరంగనీతులకు విలువేదీ!
అమెరికా నల్లజాతీయులు ఇటీవల నిర్వహించిన ప్రదర్శనలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేశాయి. అమెరికా ప్రజాస్వామ్యం, అభివృద్ధి మానవాళికే మార్గదర్శనం చేస్తాయని గట్టిగా నమ్మేవారిని సైతం అవి కలవరపెట్టాయి. ఇంతకీ ఆ ఆగ్రహమంతా అగ్రరాజ్యంలో జాతి వివక్షపైనే. శ్వేతజాతి దురహంకారం మీదే.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 27న భారత పర్యటన ముగించుకుని వెళు తూ ఒక సందేశం ఇచ్చారు. జాతి, మత, వర్ణ వివక్షలకు దూరంగా ఉండడం వల్లనే భారత్ విజయవంతంగా దూసుకు పోగలుగుతోందని ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరి యంలో అన్నారాయన. షారుక్ ఖాన్ (బాలీవుడ్), మేరీ కోమ్, మిల్ఖాసింగ్ (మన అథ్లెట్లు) ఏ ఆరాధనా విధా నానికి చెందిన వారు అనే విషయం పట్టించుకోకుండా వారి విజయాలకు భారత జాతి మొత్తం పండుగ చేసుకో వాలని కూడా ఒబామా చెప్పారు. మతస్వేచ్ఛ మన రెం డు (భారత్, అమెరికా) సంస్కృతుల ఆంతర్యమని గుర్తుచేశారు. వివక్షకు గురికాకుండా ఎవరి విశ్వాసాల ను, మతాచారాలను వారు ఆచరించే హక్కు ఉండాలని ఈ సందర్భంగా ఒబామా హితవు చెప్పారు. అక్కడ అమెరికా అధ్యక్షుని నోటి నుంచి వర్ణవివక్షలోని దుర్మా ర్గం, సమత్వంలోని విశిష్టత, సహనంలోని ఔదార్యం వంటి బరువైన భావాలను మోసుకొస్తూ కొన్ని పదాలు కూడా వెలువడ్డాయి. అయితే తను పాలిస్తున్న అమెరికా గతం, వర్తమానం ఒబామాకు తెలియవని అనుకోలేం?
ఇటీవలి కాలంలో అమెరికాలోని నల్లజాతీయులు నిర్వహించిన ప్రదర్శనలు ప్రపంచ దేశాలను విస్మయా నికి గురిచేశాయి. అమెరికా ప్రజాస్వామ్యం, అభివృద్ధి మానవాళికే మార్గదర్శనం చేస్తాయని నమ్మే వారిని సైతం ఆ నిరసనలు కలవరపెట్టాయి. ఆ ఆగ్రహమంతా జాతి వివక్షపైనే. శ్వేతజాతి దురహంకారం మీదే. శ్వేత జాతీయులైన పోలీసులు నల్లజాతివారిని అకారణంగా కాల్చి చంపిన దుర్ఘటనలు, వాటి పట్ల న్యాయ వ్యవస్థ స్పందించిన తీరు నల్లవారిలో ఉద్రిక్తతలను రగిలించిం ది. జూలై 17, 2014న ఎరిక్ గార్నెర్ అనే 43 ఏళ్ల నల్లజా తీయుడిని న్యూయార్క్ పోలీసు అధికారి అకారణంగా కాల్చిచంపాడు. మళ్లీ ఆగస్ట్‌లో సెయింట్ లూయిస్ నగరానికి చెం దిన మైక్ బ్రౌన్ అనే నిరాయు ధుడైన ఆఫ్రికన్ అమెరికన్‌ను డేరిన్ విల్సన్ అనే శ్వేతజాతి పోలీసు అధి కారి కాల్చిచంపాడు. నవంబర్ 24న క్లీవ్‌ల్యాండ్ పోలీసులు బొమ్మ తుపా కీ కలిగిన 12 ఏళ్ల నల్లజాతి బాలుడిని కాల్చిచంపారు. రెండేళ్ల క్రితం ఫ్లోరిడాలో మరో దుర్ఘటన జరిగింది. జిమ్మర్ మాన్ అనే అమెరికా శ్వేతజాతీయుడు తన పొరు గునే ఉన్న ట్రామెన్ మార్టిన్ అనే నల్లజాతి యువకుడిని కాల్చిచంపాడు.
వీటిలో ఏ ఒక్క ఘటనలోను నల్లజాతీయులకు న్యాయం జరగలేదు. చట్టం తనపని తాను చేయలేదు సరికదా, అసలు నిష్పాక్షిక నేర విచారణకు కూడా వ్యవస్థ నిరాకరించింది. మైక్ కేసులో పోలీసు అధికారి మీద నేరం మోపాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించడా నికి పన్నెండు మంది సభ్యులతో గ్రాండ్ జ్యూరీని నియ మించారు. మూడు నెలల విచారణ తరువాత పోలీసు అధికారి ఆత్మరక్షణకే కాల్పులు జరిపాడనీ, నేరం మోపి విచారించవలసిన అవసరం లేదనీ జ్యూరీ తీర్పు ఇచ్చింది. ఇంతకీ 12 మంది సభ్యుల జ్యూరీలో 9 మంది తెల్లవారే. ఒక నిర్ణయం జరగడానికి కావలసిన ఓట్లు కూడా తొమ్మిదే. తీర్పు వెలువడగానే సెయింట్ లూయి స్, పోర్ట్లాండ్, లాస్ఏంజెలిస్, ఓక్‌ల్యాండ్, షికాగో, బోస్టన్, వాషింగ్టన్ వంటి చోట్ల నిరసనలు హోరెత్తాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లజాతీయులకు బతికే హక్కుం ది) అని రాసిన ప్లకార్డులు శ్వేతసౌధం ఎదుట దర్శనమి చ్చాయి. మూడు రోజులలోనే వంద నగరాలకు ఆందో ళన వ్యాపించింది. అయినా మిస్సోరి గవర్నర్ ఈ కేసులో మరొక ధర్మాసనాన్ని నియమించేందుకు నిరాకరించి, జాత్యహంకారాన్ని ప్రదర్శించాడు. శ్వేతసౌధంలో కొలు వైన నల్లజాతీయుడు (ఒబామా), ఇదంతా తనకూ ఆం దోళన కలిస్తున్నదని, ప్రజలు శాంతంగా ఉండాలని ప్రక టించారు. అంతేగాని మళ్లీ న్యాయ విచారణ జరుపుతానని చెప్పలేదు.
దేశంలోని చట్టాలు జాతి వివ క్షను సుస్పష్టంగానే ప్రదర్శిస్తున్నా యనీ, కొన్నింటిని సమీక్షించుకోవా లనీ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ పేర్కొంది. కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాలు ‘స్టాండ్ యువర్ గ్రౌండ్’ (కదలకుండా నిలబడు) సూత్రంతో ఉన్నా యని, ఇవే పోలీసులకు విశేష అధికారాలు ఇస్తున్నా యని అక్కడి న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడు తున్నారు. ఆత్మరక్షణ పేరిట జరుగుతున్న కాల్పులలో నల్లజాతీయులే ప్రధానంగా బలికావడం యాదృచ్ఛికం గా కాదన్న వాదనలు కూడా ఉన్నాయి.
ఇటీవలి పరిణామాలు అమెరికా ఆర్థిక, సామాజిక పరిస్థితులను సంక్షోభం వైపు తీసుకువెళుతున్నాయి. నల్లజాతీయులే కాదు, శ్వేతజాతీయులు కూడా పేదరికం అనుభవిస్తున్నారు. ధనవంతులు పెరుగుతున్నారు. 2007 ఆర్థిక మాంద్యంతో ఇది మరింత స్పష్టమైంది. గత ఏడాది వరకు ఉన్న పూర్తి సమయం ఉద్యోగుల స్థానం లో ఇప్పుడు 5 లక్షల మంది తాత్కాలికోద్యోగులు వచ్చా రు. యువతలో 47 శాతానికే ఉపాధి ఉంది. కార్మికులలో 53 శాతం మంది వార్షిక ఆదాయం 30 వేల డాలర్లకు మించడం లేదు. అయితే అమెరికాలో చాలామందిలో ఇంకా నల్లజాతీయుల పట్ల చిన్నచూపు అలాగే ఉంది. అయితే ప్రస్తుతానికి అల్లర్లు చల్లారినట్టు కనిపించవచ్చు. కానీ నిగూఢంగా అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఇరాక్, అఫ్ఘాన్ల మీద చేసిన ఖర్చు, జరిగిన ప్రాణనష్టం పౌరులను బాధిస్తున్నాయి. అమెరికా సైనిక వ్యయం, చమురు రాజకీయాలు ఆ అసంతృప్తిని చల్లారనిచ్చేవి కావు. ఈ నేపథ్యంలో వచ్చిన సిరి ఫోర్ట్ సందేశం శ్రీరంగ నీతులనే తలపిస్తున్నది.
విశ్లేషణ: ఎస్. జీవన్‌కుమార్, (వ్యాసకర్త హక్కుల కార్యకర్త), మొబైల్: 98489 86286