చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సామాజిక న్యాయ వేదిక (ఎస్జేఎఫ్) సూపర్ సిక్స్ (ఆరు) ప్రశ్నలు సంధించింది. సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బహిరంగ లేఖను విడుదల చేసింది. ఎస్జేఎఫ్ రాష్ట్ర చైర్మన్ యర్రాకుల తులసీరామ్ యాదవ్, కో చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పంచాది రంగారావు, కో కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. తాము సంధించిన సూపర్ సిక్స్ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ప్రశ్నలివీ..
► రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు, స్థానిక సంస్థలు, గ్రామ, వార్డు వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోరి్సంగ్ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలు చేస్తోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సంపూర్ణ మహిళా సాధికారతకు మూలాలైన విద్య, ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మీకు (చంద్రబాబు) ఉన్న ఇబ్బందేవిుటి? మీరు ఆ దిశగా ఎందుకు హామీ ఇవ్వలేక పోతున్నారు?
► బీసీ, పేద ఓసీ, కాపులు, మహిళలకు సమన్యాయం–సామాజిక న్యాయం చేయడానికి మీకు ఇబ్బందేవిుటి?
► బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బాహాటంగా హామీ ఇస్తున్న మీరు.. విద్య, ఉద్యోగాల్లో కూడా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఎందుకు ఇవ్వడంలేదు? ఈ ద్వంద్వ నీతి ఏమిటి? ఈ ద్వంద్వ విధానం దేనికి సంకేతం?
► అగ్రవర్ణ పేదలకు (బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ తదితరులకు) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగించడానికి మీకు ఇబ్బందేవిుటి?
► మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా అటు బీసీలు, ఇటు ఓసీలకు ఇబ్బంది లేకుండా 10 శాతం ప్రత్యేక బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి న్యాయం చేయడానికి మీకున్న ఇబ్బందేవిుటి?
► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సబ్‌ప్లాన్ మాదిరిగా ఓసీ, కాపు సబ్‌ప్లాన్ అమలు చేస్తానని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు? కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయడం కాకుండా వారికి అధికారంలో ఎందుకు పరిగణనలోని తీసుకోవడంలేదు అంటూ చంద్రబాబుకు ఎస్జేఎఫ్ ప్రశ్నలు సంధించింది.