Sky Way
-
స్కైవే.. నో వే!
ఉప్పల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ (స్కైవే) అలంకారప్రాయంగానే మిగలనుందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. 163 జాతీయ రహదారిపై 6.2 కిలోమీటర్ల మార్గంలో నిర్మిస్తున్న ఈ కారిడార్ కేవలం 10–20శాతం వాహనాలకే సౌలభ్యంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నారపల్లి వరకున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా... తీరా చూస్తే కార్యాచరణ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ ప్రాంతంలో శరవేగంగా విస్తరిస్తున్న బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో భాగమయ్యాయి. బోడుప్పల్ పరిధిలో 1.30 లక్షల జనాభా, పీర్జాదిగూడ పరిధిలో 1.50 లక్షల జనాభా ఉంది. అయితే ఇంత ప్రాధాన్యమున్న ప్రాంతాలను పలకరించకుండానే స్కైవే నిర్మాణం జరుగుతోంది. ఉప్పల్ నుంచి సీపీఆర్ఐ నారపల్లి వరకు ఎక్కడా ర్యాంపులు లేకుండా పనులు చేస్తున్నారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇదీ ఉద్దేశం... ఉప్పల్ జంక్షన్ నుంచి నల్ల చెరువు, పీర్జాదిగూడ కమాన్, బోడుప్పల్ డిపో, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తా వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. వాహనాలు నిత్యం గంటల తరబడి రోడ్లపై నిలిచి పోతుంటాయి. ఇక వర్షం వచ్చినప్పుడు, ఈవెంట్లు ఉన్నప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కైవే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రతిపాదనకు విరుద్ధంగా ఘట్కేసర్ మీదుగా యాదాద్రితో పాటు నేరుగా హన్మకొండ, వరంగల్ వెళ్లే వారికి మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎక్కడా కనెక్టివిటీలు ఇవ్వకపోవడంతో ఈ మార్గ మధ్యలోని బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల ప్రజలకు ఇది నిరుపయోగంగా మారుతుంది. పరిస్థితి ఇదీ.. ఆర్టీసీ బస్సులు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల, నారపల్లి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. నాన్‌స్టాప్ బస్సులు మినహా మిగతావన్నీ ప్రతి స్టాప్‌లోనూ ఆగాల్సి ఉంటుంది. ఇక క్యాబ్‌లు సైతం కింది నుంచే వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు ద్విచక్ర వాహనాలు స్కైవే ఎక్కే పరిస్థితిలు లేవు. అంటే ఒక్క ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వెళ్లే వాహనాలు మాత్రమే స్కైవేను వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా గమనిస్తే కేవలం 10–20 శాతం వాహనాలకు మాత్రమే స్కైవే అనుకూలంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిర్మాణం ఇలా.... అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. 6.2 కిలోమీటర్ల మేర 148 పిల్లర్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఆరు లైన్ల స్కైవే. 2018 జూలైలో పనులకు శ్రీకారం చుట్టగా... 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉప్పల్ ఎలక్ట్రికల్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే కారిడార్ నారపల్లి సీపీఆర్ఐ వద్ద ముగుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.707 కోట్లు. ఇప్పటికే 52 పిల్లర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నల్ల చెరువుపై ఆరు పోర్టల్ బీమ్‌లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏం ప్రయోజనం? స్కైవే ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తున్నాం. ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందనుకున్నాం. కానీ ర్యాంపులు లేవని మీరు చెబితేనే తెలిసింది. ఇక ర్యాంపులు లేకపోతే ప్రయోజనం ఏముంటుంది. ఇప్పటికే వ్యాపారులు నష్టపోతున్నారు. ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. – అమరేందర్‌రావు, బోడుప్పల్ -
చేతులెత్తేశారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోడ్డు దాటడంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు 52 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు(ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు), 8 జంక్షన్లలో స్కైవేల టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యేలాలేవు. నగరంలో ఎఫ్ఓబీల పనులు ఒకడుగు ముందుకు.. వందడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. మూడేళ్లుగా ఇదే తంతు. గతంలో ఎఫ్‌ఓబీలను నిర్మించే కాంట్రాక్టు ఏజెన్సీలకు వాటిపై ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మించేవారు. ఆ విధానంలో ప్రజలకు ఉపయుక్తమైన ప్రాంతాల్లో కాకుండా కేవలం ప్రకటనల ఆదాయం కోసం..అవసరం లేని ప్రాంతాల్లో నిర్మిస్తున్నారనే ఆరోపణలతోపాటు, ప్రజలు నడిచేందుకంటే ప్రకటనల కోసమే వాటిని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు రావడంతో అప్పటికే పిలిచిన టెండర్లను సైతం రద్దు చేసి ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కొత్త పద్ధతిలో భాగంగా ఎఫ్ఓబీల కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలే భరిస్తాయి. వాటిపై ప్రకటనల ఆదాయం కోసం టెండర్లను ఆహ్వానించాలనేది యోచన. తద్వారా ఎఫ్‌ఓబీలపై ప్రకటనల స్థలాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ప్రయోజనకరంగా మాత్రమే వీటిని కట్టాలని భావించారు. అందులో భాగంగా పాతవాటినన్నింటినీ పక్కనబెట్టి గత జూలైలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, టెండర్లను ఆహ్వానించారు. 52 ప్రాంతాల్లో ఎఫ్ఓబీలతోపాటు 8 జంక్షన్లలో స్కైవేల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. నాలుగు ప్యాకేజీలకు గాను కేవలం ఒకే ప్యాకేజీ (ఎల్బీనగర్ జోన్)కి ఒకే ఒక్క టెండరు దాఖలైంది. మిగతా మూడు ప్యాకేజీలకు అసలు టెండర్లే రాలేదు. తిరిగి పిలుద్దామనుకునేలోగా ముందస్తు ఎన్నికల ప్రకటన రావడంతో పిలిచే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చిన టెండరు అగ్రిమెంట్ పూర్తికాకపోవడంతో అదీ స్తంభించింది. ఎన్నికలు పూర్తయితే కానీ.. తిరిగి టెండర్లు పిలిస్తే అప్పటికైనా కాంట్రాక్టర్లు వస్తారో, రారో తెలియని పరిస్థితి. కారణాలెన్నో... ఎఫ్ఓబీలంటే వ్యాపార ప్రకటనల ఆదాయాన్నే ప్రధానంగా భావించే కాంట్రాక్టర్లు కొత్త విధానం తమకు లాభసాటి కాదని రాలేదని తెలుస్తోంది. దాంతోపాటు తమ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ కాకుండా నిర్దిష్ట ప్రాంతాల్లోనే నిర్మించాల్సి ఉండటం.. నిర్ణీత వ్యవధి వరకు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉండటంతో వెనుకడుగు వేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒక్కో ప్యాకేజీ విలువ రూ. 40 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు ఉండటంతో టెండర్లలో పాల్గొనాలంటే నిర్ణీత వ్యవధిలో అందులో 50 శాతం మేర విలువైన పనుల్ని పూర్తిచేసి ఉండాలి. ఈ నిబంధనతో కాంట్రాక్టర్లు ముందుకు రారనే గత అనుభవాలతో 25 శాతం మేర విలువైన పనులకు పరిమితం చేస్తూ నిబంధన సడలించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్వరత్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహ కూడా లేని తరుణంలోనే టెండర్లు పిలిచినప్పటికీ.. ఎన్నికల దృష్టితో ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోసహ వివిధ పనుల్ని త్వరితంగా పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడాన్ని పరిగణనలోకి తీసుకొని వెనుకడుగు వేసినట్లు సమాచారం. స్టీల్ స్కైవేలు.. ఎఫ్‌ఓబీలతో పాటు అత్యంత రద్దీ ఉన్న ఎనిమిది జంక్షన్లలో స్టీల్ స్కైవేలు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు.ఆయా జంక్షన్లలోని పరిస్థితుల కనుగుణంగా ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్లేందుకైనా వర్తులాకారంలో, త్రిభుజారకారంలో, చతురస్రాకారంలో వీటిని ఏర్పాటు చే సేందుకు టెండర్లు పిలిచారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు వైపులకు వెళ్లేలా, మెహదీపట్నంలో మూడు వైపులకు వెళ్లేలా స్కైవేలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 52 ఎఫ్‌ఓబీల్లో 39 ఎఫ్‌ఓబీలకు అవసరమైన రూ. 75 కోట్లు హెచ్ఎండీయే, మిగతావి జీహెచ్ఎంసీ నిధుల నుంచి వెచ్చించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్యాకేజీలు.. అంచనా వ్యయం .. ప్యాకేజీ–1(ఎల్బీనగర్జోన్): 11 ఎఫ్‌ఓబీలు, 1 స్కైవే : రూ. 40.14కోట్లు ప్యాకేజీ–2(చార్మినార్‌జోన్): 11 ఎఫ్‌ఓబీలు, 1 స్కైవే : రూ. 37.93 కోట్లు ప్యాకేజీ–3(ఖైరతాబాద్,సికింద్రాబాద్ జోన్లు):16 ఎఫ్‌ఓబీలు, 4 స్కైవేలు:రూ. 75.79 కోట్లు ప్యాకేజీ–4(కూకట్పల్లి,శేరిలింగంపల్లి జోన్లు)) : 14 ఎఫ్‌ఓబీలు, 2 స్కైవేలు: రూ. 53.85 కోట్లు. స్కైవేలు ఎక్కడెక్కడ.. 1.ఉప్పల్ రింగ్‌రోడ్డు 2.ఆరాంఘర్ చౌరస్తా 3.ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 4.లక్డీకాపూల్ 5.రోడ్ నెంబర్ 1, 12 జంక్షన్, బంజారాహిల్స్ 6.మెహదీపట్నం 7.సుచిత్రా జంక్షన్ 8.బోయిన్పల్లి క్రాస్‌రోడ్ ఎఫ్‌ఓబీలు ఎక్కడ.. రామకృష్ణామఠం (ఇందిరాపార్కు ఎదుట), చిలకలగూడ రింగ్‌రోడ్, మహావీర్ హాస్పిటల్, చెన్నయ్ షాపింగ్‌మాల్(మదీనగూడ), హైదరాబాద్ సెంట్రల్‌మాల్, ఆల్విన్‌క్రాస్‌రోడ్స్ (మియాపూర్), ఉప్పల్ రింగ్‌రోడ్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ (రామంతాపూర్), ఇందిరానగర్ జంక్షన్(గచ్చిబౌలి), నేరెడ్మెట్ బస్టాప్, గాంధీ హాస్పిటల్, కేవీఆర్ కాలేజ్(సంతోష్‌నగర్), గెలాక్సీ(టోలిచౌకి), ఆరె మైసమ్మటెంపుల్ (లంగర్‌హౌస్), సాయిసుధీర్‌కాలేజ్(ఏఎస్‌రావునగర్), రాయదుర్గం జంక్షన్, ఒయాసిస్ స్కూల్(షేక్‌పేట), ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), విజేత సూపర్ మార్కెట్(చందానగర్), వర్డ్ అండ్ డీడ్ స్కూల్ (హయత్‌నగర్), హెచ్ఎండీఏ(మైత్రివనం), జీడిమెట్ల బస్టాప్, నోమ ఫంక్షన్ హాల్(మల్లాపూర్), రంగభుజంగ థియేటర్(షాపూర్‌నగర్), స్వప్న థియేటర్(రాజేంద్రనగర్), సన్‌సిటీ(బండ్లగూడ), సుచిత్ర సర్కిల్, ఐడీఏ ఉప్పల్, విశాల్‌మార్ట్(అంబర్‌పేట), బిగ్‌బజార్(ఐఎస్ సదన్), దుర్గానగర్ టి జంక్షన్, సుష్మ థియేటర్ (వనస్థలిపురం), నెహ్రుజూలాజికల్‌పార్క్, ఓల్డ్కర్నూల్రోఓడ్ టి జంక్షన్(ఉందానగర్ దగ్గర), అపోలో హాస్పిటల్(సంతోష్‌నగర్), ఒమర్ హోటల్, సైబర్ గేట్‌వే(హైటెక్‌సిటీ) తదితర ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. -
స్కైవే..సందిగ్ధం
కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగోదిగా నిలిచిన ‘మూసీ’ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరీకరణ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఇందులో భాగంగా చేపట్టనున్న ఈస్ట్– వెస్ట్ కారిడార్(స్కైవే)కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు జారీచేసే అంశంపై ఎటూ తేల్చడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది సుందరీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న ఈస్ట్– వెస్ట్ కారిడార్(స్కైవే) ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ పర్యావరణ అనుమతులు జారీచేసే అంశంపై సందిగ్ధత వీడడం లేదు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్‌లెవల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ)లు రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక ఏకపక్షంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ వేత్తలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హడావుడిగా నివేదిక రూపొందించారని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) నివేదించారని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టు స్వరూపం.. రీచ్1: ఉస్మాన్‌సాగర్ హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి బాపూ ఘాట్‌వరకు(19 కి.మీ) చూడముచ్చటైన రహదారిని తీర్చిదిద్దడం. అంచనా వ్యయం రూ.647.98 కోట్లు రీచ్2: బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి(21.50)కి.మీ మార్గంలో రహదారి ఏర్పాటుకు రూ.2162.01కోట్లు రీచ్3: నాగోల్‌బ్రిడ్జి నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు (గౌరెల్లి) వరకు (15 కి.మీ) మార్గంలో అప్రోచ్ రోడ్ ఏర్పాటు రూ.155.52 కోట్లు. ప్రస్తుత దుస్థితి ఇదీ.. వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడినుంచి సుమారు 90 కి.మీ మేర ప్రవహించి ఈ నది బాపూఘాట్ వద్ద హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మార్గంలో ప్రవేశిస్తోంది. నిత్యం గృహ, వాణిజ్య,పారిశ్రామిక వాడల నుంచి 1400 మిలియన్ లీటర్ల మురుగునీరు నిత్యం ఈ నదిలోకి ప్రవేశిస్తోంది. ప్రధానంగా జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థజలాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాల్లో జలమండలి నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్పేట్ మురుగు శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసి ఈ నదిలోకి వదిలిపెడుతోంది. మిగతా 700మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు పదిచోట్ల నూతనంగా మురుగుశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నది జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నది నాలుగోస్థానంలో నిలవడం ఈ నది దుస్థితికి అద్దం పడుతోంది. మూసీ ప్రక్షాళన రెండోదశకు రూ.1200 కోట్లు అవసరం.. . మూసీ నదిని కాలుష్యం కోరల నుంచి రక్షించాలంటే రెండోదశ ప్రక్షాళన పథకాన్ని తక్షణం పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకు రూ.1200 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మూసీ నది ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఐదేసి చొప్పున మొత్తం..పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎస్టీపీలు నిర్మించాల్సిన ప్రాంతాలు: అంబర్పేట్(142ఎంఎల్డి),నాగోల్(140ఎంఎల్డి), నల్లచెరువు (80ఎంఎల్డి), హైదర్షాకోట్ (30), అత్తాపూర్ (70ఎంఎల్డి), మీరాలం(6ఎంఎల్డి), ఫతేనగర్ (30ఎంఎల్డి), ఐడీపీఎల్ టౌన్షిప్ (59ఎంఎల్డి), నాగారం(29ఎంఎల్డి), కుంట్లూర్‌హయత్‌నగర్ (24 ఎంఎల్డి) రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం కాప్రా పర్యావరణ ప్రభావనివేదిక లోపభూయిష్టం మూసీరివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిష్టంగా ఉంది. మూసీ ప్రవాహమార్గంలో ఏర్పాటుచేసిన పలు వాణిజ్య, నివాస సముదాయాలతో మూసీ రోజురోజుకూ మూసుకుపోతోంది. చాదర్‌ఘాట్ వద్ద మూసీ ప్రవాహమార్గంపైనే మెట్రో స్టేషన్,దాని పక్కనే ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ ఏర్పాటుచేశారు. భారీ వర్షాలు,వరదలు వచ్చినపుడు వీటి మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. మూసీఅభివృద్ధి ప్రాజెక్టుపై పర్యావరణ వేత్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరవాతే పనులు మొదలుపెట్టాలి. మూసీ రివర్ మేనేజర్మెంట్ కమిటీ ఏర్పాటుచేసి చారిత్రక నదిని పరిరక్షించాలి.– ప్రొఫెసర్ నరసింహారెడ్డి,పర్యావరణవేత్త -
స్కైవేల నిర్మాణంపై నార్వే ఆసక్తి
హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నార్వే బృందంతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్కైవేల నిర్మాణం, మూసీ నది ప్రక్షాళనతో పాటు చెరువుల పునరుద్ధరణపై నార్వే బృందం ఆసక్తి చూపిందని అన్నారు. తాజాగా వాల్‌మార్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌ను మంగళవారం ఐటీ పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నగరాభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ భాగస్వామ్యం అందిస్తామని ఆయనకు ఐటీ ప్రముఖులు హామీ ఇచ్చారు. మరో మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. విద్యుత్ శాఖతో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ను ఆయనకు కేటాయిస్తూ మంగళవారం జీవో చేశారు. -
రూ.10వేల కోట్లతో స్కైవేలు
సాఫీ ప్రయాణ ఏర్పాట్లకు రూ.7 వేల కోట్లు దశల వారీగా పూర్తి సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం.. మార్గమధ్యలో రెడ్సిగ్నళ్లు లేకుండా ఒకచోటు నుంచి మరో చోటుకు సాఫీ ప్రయాణానికి తలపెట్టిన స్కై వేల కోసం ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనుంది. సుమారు 100 కి.మీ. మేర స్కైవేలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. వీటితో పాటు ప్రధాన మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ వేలు, సమగ్ర రహదారుల అభివృద్ధికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. మొత్తంగారూ.17వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా. నగరంలోని వివిధ మార్గాల్లో స్కైవేలు.. కొన్ని ప్రాంతాల్లో మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు (ఫ్లై ఓవర్లు), ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు, స్పైరల్ మార్గాలు, ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్లకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో... స్కైవేలకు రూ.10 వేల కోట్లు, నగరంలో తీవ్ర రద్దీ ఉండే సుమారు 600 కి.మీ. రహదారి అభివృద్ధి పనులు, 50 జంక్షన్లలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు/ఆర్ఓబీలకు మరో రూ.7 వేల కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చారు. కన్సల్లెంట్ల నుంచి నివేదికలు అందాక అవకాశాన్ని బట్టి తొలుత కొన్ని మార్గాల్లో ఈ పనులు ప్రారంభించనున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ శనివారం విలేకరులకు చెప్పారు. ఈ మార్గాల్లో సెంట్రల్ డివైడర్లు, డక్టింగ్, గ్రీనరీ, వరద కాలువలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. ఈ రహదారులను నాలుగు లేన్లతో ఏర్పాటు చేస్తారు. ప్రణాళికలు తుదిరూపు సంతరించుకునేందుకు మరో 15 రోజులు పడుతుందన్నారు. పనులు చేపట్టేందుకు సుమారు నెల రోజులు పడుతుందన్నారు. దశల వారీగా వీటిని చేపడతారు. తొలిదశలో ఎంపిక చేసిన 60 మార్గాల్లోని 300 కి.మీ. రహదారులు అభివృద్ధి చేస్తారు. ఎక్కడెక్కడంటే... నగరంలోని హరిహరకళాభవన్ -ఉప్పల్, మాసబ్‌ట్యాంక్ -హరిహర కళాభవన్, నాగార్జున సర్కిల్-మాదాపూర్, తార్నాక -ఈసీఐఎల్, చార్మినార్- బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల్లో స్కైవేలు నిర్మిస్తారు. ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్ పార్క్, ఖైరతాబాద్, సచివాలయం, నెక్లెస్ రోడ్డు చౌరస్తా, అబిడ్స్, చాదర్‌ఘాట్, కోఠి, ఒవైసీ హాస్పిటల్, తిరుమలగిరి జంక్షన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సంగీత్, ప్యారడైజ్ తదితర జంక్షన్ల వద్ద మల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్స్ ఏర్పాటు చేసే యోచన లో అధికారులు ఉన్నారు.