slams bjp
-
మా ధనం కావాలి.. ధాన్యం వద్దా..? కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
సిరిసిల్ల: ‘రాష్ట్రం పన్నుల రూపంలో అందించే ధనం కావాలి.. కానీ మా రైతులు పండిస్తున్న ధాన్యం మాత్రం వద్దా?’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్రాన్ని ప్రశ్నిం చారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. దేశానికి ఆర్థికంగా అండగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, రాష్ట్రం అతిపెద్ద ఆర్థిక వనరుగా అవతరించిందని ఆర్బీఐ నివేదికే చెబుతోందని పేర్కొన్నారు. ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ సాయమూ చేయలేదన్నారు. కాళేశ్వరం కట్టినా పైసా ఇవ్వలేదన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేం త వరకు వరి వేయొద్దని మంత్రి రైతులను కోరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఉలుకూ.. పలుకులేదన్నారు. కేంద్రం వైఖరిని దేశం ముందు ఉంచేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గురువారం ధర్నా చేస్తున్నారని తెలిపారు. వానాకాలం వడ్లు కొంటున్నాం.. రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం వడ్లను కొంటున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పుష్కలమైన సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలా నష్టం చేస్తుందని, ఈ విషయంలో రైతన్నలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవసాయాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లి మృతిచెందిన పిల్లల కుటుంబాలను మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం పరామర్శించారు. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న జడల వెంకటసాయి, సింగం మనోజ్‌కుమార్, తీగల అజయ్‌కుమార్, శ్రీరాముల క్రాంతికుమార్, కొంగ రాకేశ్ కుటుంబాలను ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఉన్నారు. -
KTR: వసూలు ఇక్కడ.. ఖర్చు అక్కడా?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులను కేంద్రం యూపీ, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేస్తోంది. తెలంగాణ చెల్లించే ప్రతిపైసా తిరిగి రాష్ట్రానికే రావాలని మేము కోరు కోవడం లేదు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో కనీ సం సగం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వ డం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పునస్స మీక్షించి, వాటిని నెరవేర్చాలి’ అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ‘మ్యాన్ఎక్స్ 2021’ సదస్సులో కేటీఆర్ కీలకోప న్యాసం చేశారు. ‘పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు, భూములు, విద్యుత్, శాంతి భద్రతలతోపాటు మానవ వనరులు కూడా ముఖ్యమే. దీని కోసం ఐఐఎం, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ కరీంనగర్, ఐసెర్, ట్రైబల్ వర్సిటీలు, మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మం జూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. బుల్లెట్ ట్రైన్ వచ్చినా ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్తుందే తప్ప హైదరాబాద్ లేదా దక్షిణాదికి ఎందుకు రాదు? దేశం స్వయం స్వావలంబన దిశగా పయనించాలనుకుంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలి’ అని వ్యాఖ్యానించారు. ఏడున్నరేళ్లుగా శూన్యహస్తం.. ‘దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతమే అయినా దేశ జీడీపీకి 5శాతం సమకూరుస్తోంది. భౌగోళికంగా 12వ అతిపెద్ద రాష్ట్రమైనా మా కంటే పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ జీడీపీ సమకూర్చంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ప్రగతిశీల విధానాలతో దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషి స్తున్న తెలంగాణను వెన్నుతట్టి ప్రోత్సహించాలని కేంద్రానికి అనేక వినతలు చేశాం. స్థానికంగా ఉద్యోగాల కల్పన కోసం భారీ పారిశ్రామిక పార్కులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చైనా వంటి పెద్ద దేశాలతో ఉత్పత్తి రంగంలో పోటీ పడాలంటే చిన్న పారిశ్రామిక పార్కులతో సాధ్యం కాదు. రాష్ట్రం ఏర్పాటు చేసిన మెగా పారిశ్రామిక పార్కులు ఫార్మాసిటీ, మెగా టెక్స్టైల్ పార్కులను కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశం స్వయం స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలి. 2014కు ముందు నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో చెప్పడం లేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో అండగా నిలిచాం.. కోవిడ్.. లాక్డౌన్ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కాపాడుకునేందుకు కేంద్రంతో అనేకమార్లు సమన్వయం చేశాం. అయితే వీటిని ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ కంటి తుడుపు కాకుండా ఉద్యోగాల కల్పన, పురోగతికి దోహదం చేసేలా ఉండాలి. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఎంఎస్ఎంఈలపై ఆశించిన ప్రభావం చూపలేదు. కోవిడ్ సమయంలోనూ తెలంగాణలో అనేక ప్రముఖ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. తైవాన్, కొలంబియా, పోలండ్, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చాయి’అని కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా ఎగుమతులు, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలు, ఉత్తమ స్టార్టప్‌లు తదితరాలకు సంబంధించి ఆరు కేటగిరీల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తరఫున విజేతలకు కేటీఆర్ అవార్డులు అందజేశారు. సీఐఐ భాగస్వామ్యంతో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్’అవార్డులను కూడా అందజేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సమీర్ గోయల్, సీఐఐ కన్వీనర్ శోభా దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్ దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– విజయవాడ నడుమ పారిశ్రామిక కారిడార్ల కోసం అనేక విన తులు చేశాం. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీలో పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని కేంద్రం ప్రకటించినా.. ఏడున్నరేళ్లుగా శూన్య హస్తమే ఎదురవుతోంది. – కేటీఆర్ -
వారి ఆకలి కేకలు వినపించడం లేదా?
న్యూఢిల్లీ : దేశం మొత్తానికి వలస కార్మికుల కష్టాలు కనిపిస్తుంటే ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. నిరుపేదలు, చిరు వ్యాపారులు, వలస కూలీల సహాయార్థం ఏర్పాటు చేసిన 'స్పీక్ అప్ ఇండియా' క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం సోనియా మాట్లాడారు. తినడానికి తిండిలేక కాలిబాటనే స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కూలీల బాధలు వర్ణణాతీతం అని పేర్కొన్న సోనియా.. కేంద్రప్రభుత్వం తక్షణమే వారికి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు భరోసానిచ్చే బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. ప్రతి పేద కుటుంబానికి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను అందివ్వాలని, వచ్చే ఆరు నెలల పాటు 7,500 రూపాయలను వారి ఖాతాల్లో జమచేయాలని కోరారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో అలమటిస్తూ.. కిలోమీటర్ల మేర రహదారుల వెంబడి కాలినడకన ప్రయాణిస్తున్న వలసకూలీల ఆకలి కేకలు కేంద్రానికి ఎందుకు వినిపించడం లేదని సూటిగా ప్రశ్నించారు. (‘సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు’ ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు.. కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికుల సమస్యలపై తనంత తానుగా సుప్రీంకోర్టు స్పందించింది. తదుపరి విచారణను మే28కి వాయిదా వేసింది. (వలస జీవుల కష్టాలు తీర్చండి! ) -
మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు
సాక్షి, హైదరాబాద్: మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుంటే ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు అనుమతిచ్చింది బీజేపీ అనే విషయం మరచిపోవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విలేకరులతో మాట్లాడారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల వ్యవహారం కేంద్రం చేతిలో ఉండగా, ఆ సమావేశాలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ బాధ్యత లేకుండా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బృందానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదులు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో బాగా పనిచేస్తోందని కేంద్ర బృందం కితాబిస్తుంటే, వారి వద్దకు రాష్ట్ర బీజేపీ నేతలు వెళ్లి ఫిర్యాదులు చేయడాన్ని తప్పుబట్టారు. విపక్షాలు ఒకరు రాజకీయాల కోసం మరొకరు మతం కోసం పాకులాడుతున్నాయన్నారు. ఇండోనేసియా వారు కరీంనగర్‌కు వస్తే పట్టుకొని పరీక్షలు చేసి, మర్కజ్ విషయాన్ని దేశానికి తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వారందరికీ పరీక్షలు చేశామని, లేకుంటే దేశంలోనే అత్యధిక కరోనా కేసులు హైదరాబాద్‌లోనే ఉండేవన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన 1,244 మందిని, వారితో కలిసిన 10 వేల మందికి పరీక్షలు చేసి కరోనాను కట్టడి చేశామన్నారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపై, వైద్యారోగ్య శాఖ అధికారులపై దాడి చేశారని చెప్పారు. వాళ్లను పట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో 90% కేసులకు మర్కజ్ లింకే ఉందన్నారు. దాచేస్తే దాగవు.. కేసులు, మరణాలు దాచేస్తే దాగవని మంత్రి ఈటల అన్నారు. లాక్‌డౌన్‌ను గొప్పగా అమలు చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు పరీక్షలు చేయట్లేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేయరన్నారు. విపక్షాలు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు తెలుసుకొని, వాటిని చదివిన తర్వాత మాట్లాడాలని ఈటల హితవు పలికారు. కరోనా విస్తరించొద్దనే ఉద్దేశంతో విమానాలు, రైళ్లు బంద్ చేయాలని కేంద్రాన్ని తామే ముందు కోరామన్నారు. లాక్‌డౌన్‌ను కూడా తెలంగాణలోనే పకడ్బందీగా అమలు చేశామన్నారు. మన విధానాల్ని అమెరికాలో ఉన్నవాళ్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. లక్షణాలుంటేనే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ సూచించిందన్నారు. గురువారం 22 కేసులు వచ్చాయని, ఒకరిద్దరు మర్కజ్ కాంటాక్టులు పహాడీ షరీఫ్ మార్కెట్లో పనిచేయడం వల్ల వచ్చాయన్నారు. మర్కజ్ కాంటాక్టుల గుర్తింపులో చాలా కఠినంగా వ్యవహరించామని చెప్పారు. సూర్యాపేటలో సామాజిక వ్యాప్తి జరిగిందని తొలుత భయపడ్డామని, కానీ అన్నింటినీ గుర్తించామని వివరించారు. అక్కడ చివరి కేసు ఏప్రిల్ 21న రాగా, వికారాబాద్‌లో 19న, గద్వాలలో 24న వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,044 కేసుల్లో 22 మినహా మిగిలినవన్నింటికీ లింకులు దొరికాయన్నారు.వాటికి సంబంధించిన లింకులను కూడా గుర్తిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైరస్ నుంచి కోలుకున్న వారు 47 శాతం ఇక్కడే ఉన్నారన్నారు. అవసరమైతే లక్ష మందికైనా చికిత్స కరోనా అనుమానిత లక్షణాలున్న వారు ఇక నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి రావాలని మంత్రి ఈటల సూచించారు. అక్కడికి వస్తే పరీక్షలు చేస్తారని తెలిపారు. అవసరమైతే 20 వేల మందికి వెంటిలేటర్లపై, 80 వేల మందికి ఐసోలేషన్‌లో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నా మని పేర్కొన్నారు. మొత్తంగా లక్ష మందికి వైద్యం అందిస్తామని వివరించారు. గ్రేటర్ పరిధిలో కట్టడిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సూర్యాపేట, వికారాబాద్, గద్వాలలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ స్పెషలాఫీసర్లను నియమిస్తామని చెప్పారు. వైరస్ ప్రభావిత పొరుగు రాష్ట్రాల నుంచి వస్తే కచ్చితంగా క్వారంటైన్లో ఉంచుతామన్నారు. ఇళ్లలో సౌకర్యం ఉన్నవారిని మినహాయిం చి, మిగిలిన వారిని సర్కారీ కేంద్రాలకు పంపుతామని వెల్లడించారు. గ్రీన్‌జోన్ జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులకు అనుమతించామని, సీఎం కేసీఆర్‌తో చర్చించి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వలస కార్మికులకు క్వారంటైన్ సెంటర్లను పెట్టనున్నట్టు తెలిపారు. ఇంట్లో సౌకర్యాలు ఉన్నవాళ్లు, ఇంట్లోనే క్వారంటైన్లో ఉండొచ్చన్నారు. కరోనా వచ్చిన రోజునుంచి సీఎం కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రధానిని విమర్శిస్తుంటే, ఇప్పుడు రాజకీయం చేయొద్దని వారించిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. తాము ఇంత విశాల ధృక్పథంతో ఆలోచిస్తుంటే, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. మరో 6 పాజిటివ్ కేసులు.. రాష్ట్రంలో శుక్రవారం ఆరు కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటల తెలిపారు. అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదు కాగా, మరో 5 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,044కు చేరుకున్నాయని తెలిపారు. తాజాగా 22 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 464 మంది కోలుకొని ఇంటికి వెళ్లారన్నారు. ఇప్పటివరకు 28 మంది మరణించగా, 552 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. -
బీజేపీపై పాలమూరు టీఆర్ఎస్ నేతల ఫైర్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, ప్రధానంగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పొద్దున లేచింది మొదలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు. టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలంలో ఆయన ఆదివారం మాజీ ఎంపీ మందా జగన్నాథంతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లి అధిక నిధుల కోసం కొట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని కిషన్‌రెడి ఆరోపించడం దారుణమని, కొత్త రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, రూ.17వేల కోట్లు రుణ మాఫీలో ఇప్పటికే రూ.7వేల కోట్లు బాంకులకు చెల్లించిన విషయం తెలియదా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరడంతో వీరికి ఏమీ పాలుపోవడం లేదన్నారు. దళిత ఎమ్మెల్యేలపై కక్ష గట్టిన డికె అరుణ కుటుంబం తమ భూస్వాయ్య నైజాన్ని చాటుకున్నారని మాజీ ఎంపీ మంద జగన్నాథం దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.