సాక్షి, హైదరాబాద్: మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుంటే ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు అనుమతిచ్చింది బీజేపీ అనే విషయం మరచిపోవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల వ్యవహారం కేంద్రం చేతిలో ఉండగా, ఆ సమావేశాలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ బాధ్యత లేకుండా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బృందానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదులు చేయడంపై మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో బాగా పనిచేస్తోందని కేంద్ర బృందం కితాబిస్తుంటే, వారి వద్దకు రాష్ట్ర బీజేపీ నేతలు వెళ్లి ఫిర్యాదులు చేయడాన్ని తప్పుబట్టారు. విపక్షాలు ఒకరు రాజకీయాల కోసం మరొకరు మతం కోసం పాకులాడుతున్నాయన్నారు. ఇండోనేసియా వారు కరీంనగర్‌కు వస్తే పట్టుకొని పరీక్షలు చేసి, మర్కజ్ విషయాన్ని దేశానికి తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వారందరికీ పరీక్షలు చేశామని, లేకుంటే దేశంలోనే అత్యధిక కరోనా కేసులు హైదరాబాద్‌లోనే ఉండేవన్నారు. మర్కజ్ నుంచి వచ్చిన 1,244 మందిని, వారితో కలిసిన 10 వేల మందికి పరీక్షలు చేసి కరోనాను కట్టడి చేశామన్నారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపై, వైద్యారోగ్య శాఖ అధికారులపై దాడి చేశారని చెప్పారు. వాళ్లను పట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో 90% కేసులకు మర్కజ్ లింకే ఉందన్నారు.
దాచేస్తే దాగవు..
కేసులు, మరణాలు దాచేస్తే దాగవని మంత్రి ఈటల అన్నారు. లాక్‌డౌన్‌ను గొప్పగా అమలు చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు పరీక్షలు చేయట్లేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలాంటి ఆరోపణలు చేయరన్నారు. విపక్షాలు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు తెలుసుకొని, వాటిని చదివిన తర్వాత మాట్లాడాలని ఈటల హితవు పలికారు. కరోనా విస్తరించొద్దనే ఉద్దేశంతో విమానాలు, రైళ్లు బంద్ చేయాలని కేంద్రాన్ని తామే ముందు కోరామన్నారు. లాక్‌డౌన్‌ను కూడా తెలంగాణలోనే పకడ్బందీగా అమలు చేశామన్నారు. మన విధానాల్ని అమెరికాలో ఉన్నవాళ్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. లక్షణాలుంటేనే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ సూచించిందన్నారు.
గురువారం 22 కేసులు వచ్చాయని, ఒకరిద్దరు మర్కజ్ కాంటాక్టులు పహాడీ షరీఫ్ మార్కెట్‌లో పనిచేయడం వల్ల వచ్చాయన్నారు. మర్కజ్ కాంటాక్టుల గుర్తింపులో చాలా కఠినంగా వ్యవహరించామని చెప్పారు. సూర్యాపేటలో సామాజిక వ్యాప్తి జరిగిందని తొలుత భయపడ్డామని, కానీ అన్నింటినీ గుర్తించామని వివరించారు. అక్కడ చివరి కేసు ఏప్రిల్ 21న రాగా, వికారాబాద్‌లో 19న, గద్వాలలో 24న వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,044 కేసుల్లో 22 మినహా మిగిలినవన్నింటికీ లింకులు దొరికాయన్నారు.వాటికి సంబంధించిన లింకులను కూడా గుర్తిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైరస్ నుంచి కోలుకున్న వారు 47 శాతం ఇక్కడే ఉన్నారన్నారు.
అవసరమైతే లక్ష మందికైనా చికిత్స
కరోనా అనుమానిత లక్షణాలున్న వారు ఇక నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి రావాలని మంత్రి ఈటల సూచించారు. అక్కడికి వస్తే పరీక్షలు చేస్తారని తెలిపారు. అవసరమైతే 20 వేల మందికి వెంటిలేటర్లపై, 80 వేల మందికి ఐసోలేషన్‌లో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నా మని పేర్కొన్నారు. మొత్తంగా లక్ష మందికి వైద్యం అందిస్తామని వివరించారు. గ్రేటర్ పరిధిలో కట్టడిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు సూర్యాపేట, వికారాబాద్, గద్వాలలో మాదిరిగా హైదరాబాద్‌లోనూ స్పెషలాఫీసర్లను నియమిస్తామని చెప్పారు. వైరస్ ప్రభావిత పొరుగు రాష్ట్రాల నుంచి వస్తే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. ఇళ్లలో సౌకర్యం ఉన్నవారిని మినహాయిం చి, మిగిలిన వారిని సర్కారీ కేంద్రాలకు పంపుతామని వెల్లడించారు.
గ్రీన్‌జోన్ జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులకు అనుమతించామని, సీఎం కేసీఆర్‌తో చర్చించి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వలస కార్మికులకు క్వారంటైన్ సెంటర్లను పెట్టనున్నట్టు తెలిపారు. ఇంట్లో సౌకర్యాలు ఉన్నవాళ్లు, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండొచ్చన్నారు. కరోనా వచ్చిన రోజునుంచి సీఎం కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రధానిని విమర్శిస్తుంటే, ఇప్పుడు రాజకీయం చేయొద్దని వారించిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. తాము ఇంత విశాల ధృక్పథంతో ఆలోచిస్తుంటే, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు.
మరో 6 పాజిటివ్ కేసులు..
రాష్ట్రంలో శుక్రవారం ఆరు కేసులు నమోదయ్యాయని మంత్రి ఈటల తెలిపారు. అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాలో నమోదు కాగా, మరో 5 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,044కు చేరుకున్నాయని తెలిపారు. తాజాగా 22 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 464 మంది కోలుకొని ఇంటికి వెళ్లారన్నారు. ఇప్పటివరకు 28 మంది మరణించగా, 552 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment