Sloth
-
ఆన్లైన్లో దుమ్మురేపుతున్న సెల్ఫీ
స్లాత్స్.. ఇవి చాలా అరుదుగా కనిపించి అటవీ జంతువులు. ఎప్పుడు నిద్రమత్తులో ఉండి బద్ధకంగా ఉంటుంటాయి. మిగితా జంతువుల కంటే భిన్నంగా చెట్లకు వేలాడుతుంటాయి. అది కూడా రెండు కాళ్లు చెట్టుకొమ్మకు మెలేసి ఓ చేతిని కిందకి వేలాడేసి మరో చేత్తో ఆ చెట్టుకొమ్మను పట్టుకొని.. ఇవి ఎట్టి పరిస్థితుల్లో నేలపై అడుగుపెట్టవు. ఒక చెట్టుమీద నుంచి మరో చెట్టుమీదకు కొమ్మలద్వారా వెళుతుంటాయి. అది కూడా మన్ను తిన్నపాములాగా నెమ్మదిగా.. అలాంటి స్లాత్స్ కనిపించడమే అరుదవుతుండగా దానితో నికోలస్ హుస్కార్ అనే ఓ యువకుడు ఏకంగా సెల్ఫీనే దిగాడు. ఆ ఫోటోకు స్లాత్ కూడా చక్కగా నవ్వుతూ పోజిచ్చింది. వాస్తవానికి ఈ జంతువు కెమెరాకు చిక్కడం చాలా అరుదు. ఓ అడవిలో ట్రెక్కింగ్ కు వెళుతున్న నికోలస్ తనకు స్లాత్ కనిపించగానే వెంటనే తన సెల్ఫీ స్టిక్ తీస్కొని ఫొటోకు పోజివ్వగా.. అది చూసిన స్లాత్ కూడా నేను కూడా రెడీ అన్నట్లు స్మైల్ తో పోజిచ్చింది. ఈ ఫొటోను ఆన్ లైన్ లో పోస్ట్ చేయగా దుమ్మురేపుతోంది. ఇప్పటికే రెండు లక్షలమంది ఆ ఫొటోను చూశారు. -
బద్ధకమనే బంధనం... తెంచుకోలేనా?
మన బలహీనతలని మనమే అధిగమించాలి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే తప్ప మీకు ఏ కౌన్సిలరూ సహాయం చేయలేడు. నేను స్వీట్లు మానను అంటే ఎవరేమి సలహా ఇవ్వగలరు? జీవన గమనం నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు బద్ధకం చాలా ఎక్కువ. అయితే టీవీ చూడాలని పిస్తుంది లేకపోతే నిద్రపోవాలనిపిస్తుంది. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతు న్నాను. ఈ బలహీనతనెలా అధిగమించాలి? - రసూల్, మెయిల్ బద్ధకం అన్న పదాన్ని మనం సృష్టించుకున్నామే తప్ప దానికి ఒక నిర్దిష్ట మైన అర్థం లేదు. ఒక పని చేయలేక పోవడమన్నది రెండు కారణాల వల్ల జరుగుతుంది. 1. శారీరకంగా బలహీన మైనప్పుడు. 2. మానసికంగా ఆ పని చేయడం ఇష్టం లేనప్పుడు. కొంచెంసేపు చదవగానే ఒక కుర్రవాడు ‘మమ్మీ, అలసిపోయాను’ అంటాడు. ‘కొంచెంసేపు రెస్టు తీసుకోరా’ అని తల్లి అనగానే పుస్తకం విసిరేసి టీవీ ఆన్ చేస్తాడు. అలసి పోయిన కుర్రవాడికి టీవీ చూసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా విశ్లేషించు కుంటే ఈ బద్ధకం అనేది రెండు రకాలుగా కలుగుతుంది. ఒకటి అలసట, రెండు విసుగు. బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాసేపు నిద్రపోవాలనిపిస్తుంది. అలా కాకుండా గంటల తరబడి పక్క మీద నుంచి లేవ కుండా నిద్రపోవడాన్ని ‘హైపర్ సోమ్నియా’ అంటారు. ‘ఇన్సోమ్ని (నిద్రలేమి)’కి ఇది వ్యతిరేక పదం. మీ ఉత్తరం చూస్తుంటే మీకు ఈ వ్యాధి ఉన్నట్టు కనబడటం లేదు. కేవలం టీవీ మీద ఆసక్తి వల్లే చదువుపై శ్రద్ధ తగ్గింది. దానికే మీరు బద్ధకం అని పేరు పెట్టు కున్నారు. మన బలహీనతలని మనమే అధిగమించాలి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే తప్ప మీకు ఏ కౌన్సెలరూ సహాయం చేయలేడు. నేను స్వీట్లు మానను అంటే ఎవరేమి సలహా ఇవ్వ గలరు? టీవీ తీసేయమని మీ తల్లిదండ్రు లకు చెప్పండి. లేదా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగే శక్తిని తెచ్చుకోండి. ఆరోగ్యకరమైన అభిరుచులు అలవాటు చేసుకోండి. అప్పుడు బద్ధకం దానంతట అదే తగ్గిపోతుంది. నేను బీఈడీ పూర్తి చేశాను. ఈమధ్య మావాళ్లు నాకో సంబంధం చూశారు. ఆయనో టీచరు. నాకు చాలా నచ్చారు. కానీ ఆయన నాకంటే పదేళ్లు పెద్దవారని మావాళ్లు ఆ సంబంధం వద్దన్నారు. కానీ నాకు ఆయన్నే చేసుకోవాలనుంది. మంచి వ్యక్తి. చెడలవాట్లు లేవు. కట్నం వద్దన్నారు. మా ఇంటి బాధ్యత కూడా తనే తీసుకుంటానంటున్నారు. అయినా మావాళ్లు అంగీకరించట్లేదు. ఏం చేయాలి? - లక్ష్మీప్రియ, మదనపల్లి భార్యాభర్తల మధ్య పదేళ్ల వయసు తేడా పెద్ద సమస్య కాదు. మీరు ఆయన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీ సమస్య ఆయనతోనే చర్చించండి. ‘మా ఇంటి బాధ్యత తీసుకుంటా నంటున్నారు’ అని రాశారు. అది నాకు అర్థం కాలేదు. మీకు తల్లిదండ్రులు లేరా? మావాళ్లు అంటే ఎవరు? మరింత విపు లంగా రాసివుంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం తేలికయ్యేది. రాయలేదు కాబట్టి ఇంతకంటే చెప్పడం కష్టం. నా స్నేహితురాలికి ముప్ఫై అయిదేళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. తనకు పెళ్లి మీద సదభిప్రాయం లేదు. చాలా సంస్థల్లో పని చేసింది కానీ ఎక్కడా ఎక్కువ రోజులు స్థిరంగా లేదు. ఆథ్యా త్మిక గురువుగా మారి జరగబోయేది ముందే ఊహించి చెప్పాలన్నదే తన లక్ష్యమంటోంది. అది సాధ్యం కాదని నాకు తెలుసు. పైగా వాళ్ల కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. తను పెళ్లి చేసుకుని, మంచి వ్యక్తితో సెటిలైతే బాగుం టుందని వాళ్ల ఆశ, నా ఆశ. మనసు గాయ పడకుండా తనని మార్చే మార్గం చెప్పండి. - సురేంద్రకుమార్, బెంగళూరు సురేంద్రగారూ! మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం, వాళ్లు అడక్క పోయినా సలహా ఇవ్వడం, అవతలివారి జీవన విధానం పట్ల అమితంగా శ్రద్ధ తీసుకోవడం, బాధపడటం... ఇవన్నీ ఆరోగ్యకరమైన లక్షణాలు కావు. ఆథ్యాత్మిక గురువుగా మారి, అమాయక ప్రజలకు జరగబోయే భవిష్యత్తును ముందుగా ఊహించి చెప్పి, లక్షలూ కోట్లూ సంపాదించాలన్నది ఆమె ఆలోచన అయితే... అది సాధ్యం కాదని మీరు ఇప్పుడే ఎలా చెప్పగలరు? పెళ్లి చేసుకోవడం చక్కగా ఉంటుందని మీరు ఏ అనుభవంతో చెప్పారో నాకు అర్థం కావడం లేదు. తనను మార్చే ఆలోచన మానుకుని, మీరు మారటమే మంచిదని నా ఉద్దేశం. - యండమూరి వీరేంద్రనాథ్ -
సేదదీరితే... లావెక్కుతారట!
పరిపరి శోధన తీరిక దొరకడమే తడవుగా బద్ధకంగా సేదదీరుతూ గడిపేస్తున్నారా? పనీపాటా లేకుండా, సోఫాలో చారబడి టీవీ చూస్తూనో, అందుకు కూడా బద్ధకించి, తిండి కోసం తప్ప మంచం కూడా దిగకుండా గంటలకు గంటలు గడిపేస్తున్నారా..? ఇలాంటి అలవాటు ఏమంత క్షేమం కాదు. అతిగా సేదదీరితే త్వరగా లావెక్కిపోతారని టెల్ అవివ్ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎంత తీరిక దొరికినా, ఒంటికి పనిచెప్పకుండా అతిగా సేదదీరితే, శరీరంలో కొవ్వుకణాలు పేరుకుపోయి, త్వరగా లావెక్కుతారని, ఆ తర్వాత స్థూలకాయంతో తలెత్తే రకరకాల సమస్యలతో బాధపడక తప్పదని వారు చెబుతున్నారు. -
మరి.. మరి... సోమరి
సోల్ / బద్ధకం ‘బద్ధకము సంజ నిద్దుర... వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్...’ అంటూ శతకకారుడు ఏనాడో హితవు పలికాడు గానీ బద్ధకస్తులు ఇలాంటి వాటిని పట్టించుకుంటారా? లోకం తలకిందులైపోయినా వారి రూటే సెపరేటు. పనికీ బద్ధకస్తులకూ చుక్కెదురు. ఖాళీగా కూర్చొనే బదులు పనేదైనా చేసుకోవచ్చు కదా అని పొరపాటున ఏ బద్ధకస్తుడినైనా అడిగారనుకోండి... ‘కూర్చోవడం మాత్రం పని కాదేంటి?’ అని ఠపీమని ఎదురు ప్రశ్నించి నోరు మూయించగలరు.బద్ధకస్తుల్లో అలాంటి తెలివితేటలకు ఏమాత్రం లోటుండదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఏదైనా పనీపాటా చేసుకోవచ్చు కదా’ అని పెద్దలెవరైనా మందలించబోతే... ‘కూర్చుని తింటే కొండలేం కరుగుతాయి గానీ, కూర్చుని తినేవాళ్లు కొండలా పెరుగుతారు... కావాలంటే నన్ను చూడు’ అని తమ భారశరీరాన్నే ఉదాహరణగా చూపి చమత్కరించగలరు. సోమరితనం సహజ లక్షణం బద్ధకస్తులను సోమరులని, సోంబేరులని ఆడిపోసుకుంటారు గానీ, సోమరితనం మనుషుల సహజ లక్షణం. ఎంతటి పనిమంతులకైనా ఎంతో కొంత బద్ధకం ఉండనే ఉంటుంది. అయితే, అది శ్రుతి మించిన వాళ్లనే లోకం బద్ధకస్తులుగా పరిగణిస్తుంది. ఆదిమానవుడి వారసత్వ లక్షణంగా బద్ధకం ఇప్పటికీ మనుషుల్లో కొనసాగుతోందనేది శాస్త్రవేత్తల వాదన. వేట మాత్రమే తెలిసిన ఆదిమానవుడు అప్పటి తన అవసరాల మేరకు శక్తిని ఎడాపెడా వినియోగించుకోకుండా, పదిలపరచుకోవడానికే అలవాటు పడ్డాడు. ఎందుకంటే, ఆకలేసినప్పుడు వేటాడదామంటే జంతువులు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. అందువల్ల జంతువు కనిపించినప్పుడే వేటాడటం, కడుపారా తిని, మరో జంతువు కనిపించేలోగా విశ్రాంతి తీసుకోవడం తప్ప వేరే పనేమీ ఉండేది కాదు. పరిణామ క్రమంలో వ్యవసాయం అలవడిన తర్వాత మానవుడి జీవితమే మారిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు మానవులకు పని అనివార్యంగా మారింది. అయితే, అనివార్యములను శాయశక్తులా నివారించుకోవడంలోనే బద్ధకస్తులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఒళ్లొంచని ధీరులు బద్ధకస్తుల్లోనూ స్థాయీ భేదాలు ఉంటాయి. కొందరు సాదాసీదా బద్ధకస్తులు. మరీ తప్పనిసరైతే నెమ్మదిగా, అయిష్టంగా ఏదోలా పని చేసేందుకు సిద్ధపడతారు. ఇంకొందరు ఉంటారు... అరివీర భయంకర పరమ బద్ధకస్తులు. కొంపలు అంటుకుంటున్నా సరే... ససేమిరా పని చేయరు. ఇలాంటి బాపతు మనుషులు గనుక ఇంట్లో ఉంటేనా... ఆస్తులు కరిగిపోయి ఆరిపోవడం ఖాయం. పనెందుకు చేయవని ప్రశ్నిస్తే, పని గండం ఉందంటూ తప్పించుకునే బాపతు వీరు. కర్మకాలి ఇలాంటి వాళ్లు ఉద్యోగాల్లో చేరితేనా..? వాళ్లు పనిచేసే ఆఫీసుల్లో పరిస్థితులు అతలాకుతలం కావడానికి ఎంతో కాలం పట్టదు. బద్ధకస్తులైన ఉద్యోగులు పొరపాటుగానైనా పని చేయరు. పని ఎగ్గొట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెబుతుంటారు. బద్ధకస్తులందరూ దాదాపు సాటిలేని ‘సాకు’వీరులే! తప్పనిసరిగా పని చేయాల్సి వస్తే, అందుబాటులోని అమాయక జీవిని ఎవరినైనా ఎంచుకుని, ఆ బకరాపైకి పని నెట్టేసి, ఖుషీగా కాలక్షేపం చేసేస్తారు. ఇలాంటి శాల్తీలు ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే కనిపిస్తారు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లుగా... కాస్తో కూస్తో పనిచేసే వాళ్లనూ వీళ్లు చెడగొడతారు. తెలివైన వాళ్లే... కాకపోతే... బద్ధకస్తులు చాలా తెలివైన వాళ్లు. సోంబేరులంటూ ‘పని’మంతులందరూ వీళ్లను ఈసడిస్తారు గానీ, చాలామంది పనిమంతుల కంటే బద్ధకస్తులకు తెలివితేటలు ఎక్కువ. కాకపోతే, అవన్నీ పనిని ఎగ్గొట్టేందుకు మాత్రమే పనికొచ్చే చావు తెలివితేటలు. చాలా కష్టమైన పనికి సులువైన మార్గాన్ని కనిపెట్టాలంటే అలాంటి పనిని బద్ధకస్తుడెవరికైనా అప్పగిస్తే చాలని నిపుణులు చెబుతారు. కష్టమైన పనిని ‘పని’మంతులకు అప్పగిస్తే, వాళ్లు పాపం నానా ప్రయాసపడి ఆ పనిని పూర్తి చేస్తారు. అదే బద్ధకస్తులకు అప్పగిస్తేనా..? అతి తక్కువ శ్రమతో ఆ పనిని పూర్తిచేసే మార్గాన్ని అన్వేషిస్తారు. మన సమాజంలోని దృష్టి లోపమే తప్ప, బద్ధకస్తుల్లో ఏ లోపమూ లేదనేది వారిని సమర్థించే కొందరి వాదన. సక్రమంగా ఉపయోగించుకుంటే, బద్ధకస్తుల వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుందని, శ్రమ దమాదులతో కూడుకున్న పనులను తేలికగా చేసే మార్గాలన్నీ అలాంటి వాళ్ల చలవ వల్లనే అందుబాటులోకి వస్తాయని చెబుతారు. గెలుపు భయం వల్లనే... బద్ధకం జన్యులక్షణమని జన్యుశాస్త్ర నిపుణులు చెబుతుంటే, మానసిక శాస్త్రవేత్తలు మాత్రం బద్ధకానికి సవాలక్ష కారణాలను చెబుతున్నారు. ఆత్మగౌరవం లేకపోవడం, పిరికితనం, నిరాశ వంటి కారణాల వల్ల చాలామంది బద్ధకస్తులుగా మారుతారట. ముఖ్యంగా గెలుపు పట్ల ఉండే భయం వల్ల చాలామంది బద్ధకస్తులుగా మిగిలిపోతారట. ఒకవేళ పనిచేస్తే, పొరపాటున అది విజయవంతమవుతుందేమో! చేసిన పని విజయవంతమైతే అందరూ పొగుడుతారేమో! అలాంటి పొగడ్తలను భరించడం ఇబ్బందిగా ఉండదూ! అందుకే పని చేయకుండా ఉంటేనే మేలు అని డిసైడైపోతారట ఇలాంటి వాళ్లంతా. వీళ్లకు పని చేతకాకపోవడం అంటూ ఉండదని, పని చేతనైనా, పని చేస్తే వచ్చే పర్యవసానాల గురించిన ఆందోళన వల్లనే కొందరు బద్ధకస్తుల్లా తయారవుతారని, ఈ మానసిక పరిస్థితిని చక్కదిద్దకుంటే, వాళ్లు శాశ్వతంగా సోమరి జీవితాన్ని గడిపేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బద్ధకస్తులను గుర్తించడం తేలికే గానీ, వారు ఎందుకలా తయారయ్యారో తెలుసుకోవాలంటే మాత్రం మానసిక విశ్లేషణ చేయక తప్పదు.