బద్ధకమనే బంధనం... తెంచుకోలేనా?
మన బలహీనతలని మనమే అధిగమించాలి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే తప్ప మీకు ఏ కౌన్సిలరూ సహాయం చేయలేడు. నేను స్వీట్లు మానను అంటే ఎవరేమి సలహా ఇవ్వగలరు?
జీవన గమనం
నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు బద్ధకం చాలా ఎక్కువ. అయితే టీవీ చూడాలని పిస్తుంది లేకపోతే నిద్రపోవాలనిపిస్తుంది. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతు న్నాను. ఈ బలహీనతనెలా అధిగమించాలి?
- రసూల్, మెయిల్
బద్ధకం అన్న పదాన్ని మనం సృష్టించుకున్నామే తప్ప దానికి ఒక నిర్దిష్ట మైన అర్థం లేదు. ఒక పని చేయలేక పోవడమన్నది రెండు కారణాల వల్ల జరుగుతుంది. 1. శారీరకంగా బలహీన మైనప్పుడు. 2. మానసికంగా ఆ పని చేయడం ఇష్టం లేనప్పుడు. కొంచెంసేపు చదవగానే ఒక కుర్రవాడు ‘మమ్మీ, అలసిపోయాను’ అంటాడు. ‘కొంచెంసేపు రెస్టు తీసుకోరా’ అని తల్లి అనగానే పుస్తకం విసిరేసి టీవీ ఆన్ చేస్తాడు. అలసి పోయిన కుర్రవాడికి టీవీ చూసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా విశ్లేషించు కుంటే ఈ బద్ధకం అనేది రెండు రకాలుగా కలుగుతుంది. ఒకటి అలసట, రెండు విసుగు.
బాగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాసేపు నిద్రపోవాలనిపిస్తుంది. అలా కాకుండా గంటల తరబడి పక్క మీద నుంచి లేవ కుండా నిద్రపోవడాన్ని ‘హైపర్ సోమ్నియా’ అంటారు. ‘ఇన్‌సోమ్ని (నిద్రలేమి)’కి ఇది వ్యతిరేక పదం. మీ ఉత్తరం చూస్తుంటే మీకు ఈ వ్యాధి ఉన్నట్టు కనబడటం లేదు. కేవలం టీవీ మీద ఆసక్తి వల్లే చదువుపై శ్రద్ధ తగ్గింది. దానికే మీరు బద్ధకం అని పేరు పెట్టు కున్నారు.
మన బలహీనతలని మనమే అధిగమించాలి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే తప్ప మీకు ఏ కౌన్సెలరూ సహాయం చేయలేడు. నేను స్వీట్లు మానను అంటే ఎవరేమి సలహా ఇవ్వ గలరు? టీవీ తీసేయమని మీ తల్లిదండ్రు లకు చెప్పండి. లేదా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగే శక్తిని తెచ్చుకోండి. ఆరోగ్యకరమైన అభిరుచులు అలవాటు చేసుకోండి. అప్పుడు బద్ధకం దానంతట అదే తగ్గిపోతుంది.
నేను బీఈడీ పూర్తి చేశాను. ఈమధ్య మావాళ్లు నాకో సంబంధం చూశారు. ఆయనో టీచరు. నాకు చాలా నచ్చారు. కానీ ఆయన నాకంటే పదేళ్లు పెద్దవారని మావాళ్లు ఆ సంబంధం వద్దన్నారు. కానీ నాకు ఆయన్నే చేసుకోవాలనుంది. మంచి వ్యక్తి. చెడలవాట్లు లేవు. కట్నం వద్దన్నారు. మా ఇంటి బాధ్యత కూడా తనే తీసుకుంటానంటున్నారు. అయినా మావాళ్లు అంగీకరించట్లేదు. ఏం చేయాలి?
- లక్ష్మీప్రియ, మదనపల్లి
భార్యాభర్తల మధ్య పదేళ్ల వయసు తేడా పెద్ద సమస్య కాదు. మీరు ఆయన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీ సమస్య ఆయనతోనే చర్చించండి. ‘మా ఇంటి బాధ్యత తీసుకుంటా నంటున్నారు’ అని రాశారు. అది నాకు అర్థం కాలేదు. మీకు తల్లిదండ్రులు లేరా? మావాళ్లు అంటే ఎవరు? మరింత విపు లంగా రాసివుంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం తేలికయ్యేది. రాయలేదు కాబట్టి ఇంతకంటే చెప్పడం కష్టం.
నా స్నేహితురాలికి ముప్ఫై అయిదేళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. తనకు పెళ్లి మీద సదభిప్రాయం లేదు. చాలా సంస్థల్లో పని చేసింది కానీ ఎక్కడా ఎక్కువ రోజులు స్థిరంగా లేదు. ఆథ్యా త్మిక గురువుగా మారి జరగబోయేది ముందే ఊహించి చెప్పాలన్నదే తన లక్ష్యమంటోంది. అది సాధ్యం కాదని నాకు తెలుసు. పైగా వాళ్ల కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. తను పెళ్లి చేసుకుని, మంచి వ్యక్తితో సెటిలైతే బాగుం టుందని వాళ్ల ఆశ, నా ఆశ. మనసు గాయ పడకుండా తనని మార్చే మార్గం చెప్పండి.
- సురేంద్రకుమార్, బెంగళూరు
సురేంద్రగారూ! మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం, వాళ్లు అడక్క పోయినా సలహా ఇవ్వడం, అవతలివారి జీవన విధానం పట్ల అమితంగా శ్రద్ధ తీసుకోవడం, బాధపడటం... ఇవన్నీ ఆరోగ్యకరమైన లక్షణాలు కావు. ఆథ్యాత్మిక గురువుగా మారి, అమాయక ప్రజలకు జరగబోయే భవిష్యత్తును ముందుగా ఊహించి చెప్పి, లక్షలూ కోట్లూ సంపాదించాలన్నది ఆమె ఆలోచన అయితే... అది సాధ్యం కాదని మీరు ఇప్పుడే ఎలా చెప్పగలరు? పెళ్లి చేసుకోవడం చక్కగా ఉంటుందని మీరు ఏ అనుభవంతో చెప్పారో నాకు అర్థం కావడం లేదు. తనను మార్చే ఆలోచన మానుకుని, మీరు మారటమే మంచిదని నా ఉద్దేశం.
- యండమూరి వీరేంద్రనాథ్