చిరు వ్యాపారి హత్య?
గరివిడి, న్యూస్‌లైన్: అతనో చిరు వ్యాపారి. పొట్టకూటి కోసం గ్రామంలో టీ దుకాణం నడుపుకొనేవాడు. ప్రతి శనివారం దగ్గర్లోని సంతకు వెళ్లి అక్కడ టీ దుకాణం పెట్టేవాడు. యథావిధిగా సంతకు వెళ్లిన అతను ఆది వారం ఉదయం అనుమానాస్పద స్థితిలో గ్రామ సమీపంలో విగతజీవిగా కనిపించా డు. గరివిడి మండలం శేరిపేట గ్రామానికి చెందిన ఆకుల చిన్నారావు(52) శనివారం రాత్రి హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు... గ్రామంలోను, అలాగే ప్రతి శనివారం సంతలోను టీ దుకాణం పెట్టుకునే చిన్నారావు బలహీనత.. చేతిలో డబ్బులుంటే పూటుగా మద్యం తాగడం.
ఎప్పటిలాగానే భార్య రమణమ్మతో కలిసి సంతకు వెళ్లిన చిన్నారావు సాయంత్రం గ్రామానికి వస్తుండగా మద్యం విషయమై భార్యాభర్తల మధ్య స్వల్ప తగాదా జరిగింది. దీంతో శేరిపేట సెంటర్ వద్ద చిన్నారావు ఉండిపోగా భార్య ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి ఎనిమిది గంటలైనా భర్త ఇంటికి రాకపోవడంతో రమణమ్మ తన బంధువులతో కలిసి శేరిపేట సెంటర్‌కు వచ్చింది. అయితే అప్పటికే చిన్నారావు తప్పతాగి సెంటర్ వద్ద గల ఓ దుకాణంలో పడుకున్నాడు. ఎంత లేపినప్పటికీ భర్తకు మెలకువ రాకపోవడంతో విసిగిపోయిన రమణమ్మ తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆదివారం ఉదయం గ్రామం నుంచి శ్మశానానికి వెళ్లే రహదారి మధ్యలో చిన్నారావు మృతదేహం ఉంది. అంతేకాకుండా మృతుడి ఒంటినిండా పిడిగుద్దులతో కొట్టిన ట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చిన్నారావు తలమీద బండరాయితో కానీ, కర్రలు,రాడ్లతో కానీ కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శేరిపేట ప్రధాన రహదారి నుంచి చిన్నారావును కొట్టుకుని ఈడ్చుకుంటూ శ్మశానవాటిక రహదారి వరకు తీసుకువెళ్లి అక్కడ హతమార్చినట్లు పరిస్థితు లు కన్పిస్తున్నాయి.
విజయనగరం నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ శ్మశాన వాటిక రోడ్డు మీదుగా గ్రామంలోకి వెళ్లాయి. దీంతో చిన్నారావు హత్యలో స్థానికుల హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె లక్ష్మి ఉన్నారు. కుమారుడు కూలి పనుల నిమిత్తం భార్య సహా చెన్నైలో ఉంటున్నాడు. కుమార్తెను గుర్ల మండలం పోలయ్యవలస గ్రామస్తునికిచ్చి వివాహం చేశారు. చిన్నారావుకు తాగుడు వ్యసనం ఉన్నప్పటికీ గ్రామంలో ఎవ్వరితోనూ విరోధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. చీపురుపల్లి సీఐ వాసుదేవ్, గరివిడి ఎస్ఐ టి.కాంతికుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.