ప్రమాదం అని తెలిసినా..
మారీసుపేట: ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వెళ్లక తప్పని పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి వీరి తలరాతలు మారతాయనుకున్నా వీరి ఆశలు అడియాసలుగానే మిగులుతున్నాయి. దీంతో వీరు బలకట్టుపైనే నిత్యం రాకపోకలు సాగించడం తప్పడం లేదు. సంగంజాగర్లమూడిలో సంగమేశ్వరస్వామి దేవస్థానం ఎదురు కొమ్మమూరు కాల్వ ఉంది. దేవస్థానం ఎదురుగా కొందరూ పేదలు నివసిస్తున్నారు. వీరు గ్రామంలోకి రావాలంటే బలకట్టును ఆశ్రయించక తప్పదు. ఎన్నో ఏళ్ళ నుంచి పేదలు ఈ విధంగా బలకట్టుపైనే అటు ఇటూ రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి పేదలకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేద్దామనే ఆలోచన పాలకులకు రాకపోవడం విడ్డూరం. ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కాలినడక వంతెనను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.