మ్యాక్ కంప్యూటర్లతో మార్కెట్ ను దోచేస్తాం
కోల్ కత్తా : భారత్ లో కేవలం ఐఫోన్ అమ్మకాలను మాత్రమే కాదు.. మ్యాక్ కంప్యూటర్లపై కూడా టెక్ దిగ్గజం యాపిల్ దృష్టి సారిస్తోంది. చిన్న చిన్న పట్టణాలకు మ్యాక్ కంప్యూటర్లను తీసుకెళ్తూ.. మ్యాక్ కంప్యూటర్ అమ్మకాల పంపిణీని పెంచుకుని భారత మార్కెట్ ను దోచేయాలని చూస్తోంది. ఇతర కంపెనీల ఎలక్ట్రానిక్ స్టోర్ల ద్వారా మ్యాక్ కంప్యూటర్లను వినియోగదారులకు చేరువలో ఉంచాలని భావిస్తోంది.
మ్యాక్ కంప్యూటర్లకు టాప్-10 మార్కెట్ గా ఉన్న భారత్ లో, పర్సనల్ కంప్యూటర్ల పెట్టుబడులు పెంచాలని ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజం ప్లాన్ చేస్తుందని యాపిల్ కు సంబంధించిన ఇద్దరు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 75 సిటీలుగా ఉన్న మ్యాక్ కంప్యూటర్ల పంపిణీ అందుబాటును, వచ్చే రెండు, మూడేళ్లలో రెండింతలు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న కంప్యూటర్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ స్టోర్ల ద్వారా యాపిల్ మ్యాక్ కంప్యూటర్ల పంపిణీని పెంచుకోనుందని చెప్పారు.
ఇప్పడివరకూ మ్యాక్ కంప్యూటర్లు కేవలం యాపిల్ స్టోర్లలోనూ, ఆన్ లైన్ లోనూ, అతిపెద్ద రిటైల్ చైన్స్ క్రోమా, రిలయెన్స్ డిజిటల్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. యాపిల్ కలిగి ఉన్న కన్సూమర్ పీసీ విభాగ 8-9శాతం మార్కెట్ల షేరులో భారత్ కూడా ఒకటి. మ్యాక్ వ్యాపారాల రెవెన్యూలు గత కొన్నేళ్లలో 100శాతానికి పైగా పెరిగాయి. యాపిల్ కు మ్యాక్ పీసీ సరుకు రవాణా ఏడాదియేడాదికి 50 శాతం పైగా పెరుగుతున్నాయి.
ఐఫోన్ బిజినెస్ లు పడిపోయి యాపిల్ నిరాశలో ఉన్నప్పటికీ మ్యాక్ కంప్యూటర్లకు వస్తున్న ఆదరణ ప్రస్తుతం యాపిల్ కు ఊరటగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ ట్రాకర్ ఐడీసీ నివేదిక ప్రకారం, భారత్ లో కంప్యూటర్ విభాగంలో 32.7శాతం షేరుతో జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అగ్రస్థానంలో ఉంది. హెచ్ పీ 29.1శాతం షేరు, డెల్ 17.1శాతం మార్కెట్ షేరును కలిగి ఉన్నాయి.