‘స్మార్ట్’ కి దాతలు కావలెను
జిల్లాలో 1,200 మంది అవసరం
ఇప్పటి వరకు ముందుకొచ్చింది
కేవలం 124 మంది వితరణశీలురే
దాతల అన్వేషణ, ఎంపిక కోసం గ్రామం నుంచి కమిటీలు
కలెక్టర్ చైర్మన్‌గా రెండు రోజుల్లో జిల్లా కమిటీని ప్రకటించే అవకాశం
రక్షణ లేని కల్వర్టులు.. కనిపించని డ్రైనేజీలు.. రోడ్లపైనే పారే మురుగునీరు.. కుళాయి నీటిని మురుగు నీటిలోనే పట్టుకునే దుస్థితి.. పసర్లు పట్టిన పంచాయతీ చెరువులు.. చాలీచాలని తరగతి గదులు.. సౌకర్యాలు లేని పాఠశాలలు.. అసౌకర్యాల నిలయాలుగా పీహెచ్సీ సెంటర్లు.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో సమస్యలు గ్రామాల్లో పడకేశాయి. వాటిని పరిష్కరించేందుకు స్మార్ట్ విలేజ్, వార్డు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాతల కోసం వేట ప్రారంభించింది.
సాక్షి, విజయవాడ : జిల్లాక ు ‘స్మార్ట్’ దాతలు కావాలి. వీరి కోసం ప్రభుత్వం కూడా అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ కూడా రెండు రోజుల్లో ఏర్పాటుకానుంది. దాతల సహకారంతో గ్రామాలను స్మార్ట్ విలేజీలుగా, మున్సిపాలిటీల్లో స్మార్ట్ వార్డులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల నుంచి ఇంటర్నెట్ వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ‘స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు’ కార్యక్రమాన్ని గత నెల 18న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ప్రణాళికా విభాగం అధికారులు జిల్లాలో స్మార్ట్ విలేజి కార్యక్రమం అమలు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాలో గ్రామాలను దత్తత తీసుకోవడానికి పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ముందుకొస్తున్నారు. దాతల సమగ్ర వివరాలను జిల్లా కమిటీ పరిశీలించిన తర్వాత గ్రామాలను దత్తత ఇస్తారు.
కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా కమిటీ..
గ్రామాల్లో సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలను చూపేందుకు మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయి కమిటీలు పూర్తికాగా, జిల్లా స్థాయి కమిటీ రెండు రోజుల్లో ఏర్పాటుకానుంది. జిల్లా కమిటీకి అనుబంధంగా సపోర్ట్ కమిటీ మరొకటి ఏర్పాటుచేస్తారు.
జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ అహ్మద్‌బాబు కన్వీనర్‌గా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్ శర్మ, సభ్యులుగా డీఆర్డీఏ, డ్వామా పీడీలు, మరో ముగ్గురు ఉంటారు. దాతల ఎంపికపై ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. దాతల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, గ్రామాల ఎంపిక ప్రక్రియ సాగుతుందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎంపిక చేసిన గ్రామాల్లో దాతల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
నిమ్మకూరును దత్తత తీసుకున్న నారా బ్రాహ్మణి
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జన్మస్థలమైన నిమ్మకూరు గ్రామాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, ఎన్టీఆర్ మనుమరాలు నారా బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. నిమ్మకూరును స్మార్ట్ విలేజీగా రూపొందించేందుకు తాను దత్తత తీసుకున్నట్లు ఆమె గత నెల 18న ప్రకటించారు.
950 గ్రామాలు...
277 వార్డులకు దాతలు కావాలి
జిల్లాలోని 49 మండలాల్లో 950 గ్రామాలు ఉన్నాయి. ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో 218 వార్డులు, విజయవాడ నగరపాలక సంస్థలో 59 డివిజన్లు ఉన్నాయి. ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లను దాతలకు అప్పగించి వారి నిధులు, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేశారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఆర్డీవోల నేతృత్వంలో నియమించిన కమిటీలు ప్రతి గురువారం గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు, సమస్యలను అధ్యయనం చేసి ఆర్డీవో ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గత గురువారం జిల్లాలో ప్రారంభించారు.
ఈ క్రమంలో జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు దాతలు కూడా ముందుకొస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే మండలాలను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆన్లైన్లో 124 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు సమర్పించిన వారిలో ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉండటం విశేషం.
దాతల ఎంపిక ఇలా...
- సాయం చేస్తామని ముందుకొచ్చిన దాతల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి సమగ్రంగా పరిశీలిస్తారు.
- దాత ఆసక్తి ఏమిటి.. గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు.. అతని గత అనుభవం ఏమిటనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
- ఈ నెల రెండో వారంలోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాతల జాబితాను ప్రకటిస్తారు.
- దాతల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.