గరగపర్రు ఘటనలో తహసీల్దార్, ఎస్సై సస్పెన్షన్
జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన కారెం శివాజీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు (మెట్రో): గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణపై సకాలంలో స్పందించని పాలకోడేరు మండల తహసీల్దార్ జి.రత్నమణి, ఎస్సై వి.రాంబాబును సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ చెక్ పవర్ రద్దు చేయాలన్నారు.
మంగళవారం కారెం శివాజీ, మంత్రులు నక్కా ఆనందబాబు, కేఎస్ జవహర్ గరగపర్రులో గ్రామ సభ నిర్వహించారు. కాగా, గరగపర్రు ఘటన సున్నితమైందని, నిజనిర్దారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చెప్పారు.