తరగతి గదికి సామాజిక స్పృహ
చుక్కా రామయ్య
నేరాలు జరిగే వాతావరణాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నాం. నేరం జరిగాక ఖండిస్తాం. ఉరిశిక్షకు కూడా వెనుకాడం. పరిష్కారం ఇదేనా? నేరంతో నేరాన్ని నిరోధించలేం. పౌరసమాజం, పాలనా యంత్రాంగం దూరదృష్టితో తగు చర్యలు తీసుకుంటేనే నేరాలు తగ్గుతాయి. దీనికి తోడు నేరగ్రస్తతను మొగ్గలోనే తుంచేసే పని ఇంటి నుంచే, బడి నుంచే మొదలు కావాలి. విద్యార్థికి సామాజిక సమస్యలపై అవగాహనను, బాధ్యతను నేర్పాలి. నేరం జరగకుండా నివారించేందుకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవిధంగా పనిచేయాలన్నదే నేటి సవాల్.
మన విద్యా వ్యవస్థ బాగోగుల పట్ల పట్టింపు ఉన్న నాకు వివిధ దేశాల విద్యావిధానాలను గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఏ దేశం వెళ్ళినా అక్కడి విద్యావిధానాన్ని పరిశీలించడం కోసం అక్కడి పాఠశాలలను సందర్శించేవాడిని. అలా కొన్ని సార్లు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లాను. కొన్ని సార్లు ఉన్నత పాఠశాలలు తిరిగాను. ప్రతిష్టాత్మకమైన కళాశాలలు, సుప్రసిద్ధ విశ్యవిద్యాలయాలు కూడా చూశాను. ఎక్కడికి వెళ్ళినాకానీ, సమాజంలోని వాస్తవ పరిస్థితుల పట్ల, దైనందిన సమస్యల పట్ల విద్యార్థులకు వారి స్థాయికి విధంగా అవగాహనను కల్పించడం అక్కడి విద్యా కార్యక్రమంలో విడదీయ రాని భాగంగా ఉండటం స్పష్టంగా కనిపించింది. మన దేశంలో లాగా విదే శాల్లో బోధనా ప్రణాళిక (కరికులం) స్థిరంగా ఉండదు. మారుతున్న సామా జిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు.
పాఠాలు చెప్పే పోలీసాఫీసర్లు
ప్రాథమిక పాఠశాలలను పరిశీలించేందుకు వెళితే ఒక చోట... ఒక పోలీసు అధికారి వచ్చి తరగతి గదిలో చిన్న పిల్లలకు రోడ్డు ప్రమాదాలను గురించి వివరిస్తుండటం కనిపించింది. ఆయన తనతో పాటు ఒక ప్రొజెక్టర్‌ను కూడా తెచ్చుకున్నాడు. ప్రొజెక్టర్‌పై బొమ్మలు చూపిస్తూ రోడ్డుపైన జరిగే ప్రమాదాల తీవ్రతను, అవి బాధితుల భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని, ప్రమాదాల తదుపరి బాధితుల కుటుంబాల పరిస్థితిని వివరిస్తూ... రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను పిల్లల మనస్సుల్లో ముద్రపడేలా వివరించి చెపుతు న్నాడు.
చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వారికి వారి సొంత భాషల్లోనే చెప్పిస్తున్నారు. అది చూస్తుంటే నాకు విజయవాడ రోడ్లపై జరిగే ప్రమాదాలు గుర్తుకొచ్చాయి. రోడ్డు ప్రమాదాలపై అవగాహనను మనం ట్రాఫిక్ పోలీసుల వరకే పరిమితం చేస్తున్నాం. కానీ ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పిల్లలకే అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు బాధితులకు, వారి కుటుం బాలకే గాక మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం చూపే ప్రభావం ఎలా ఉంటుందో బొమ్మలలో చూపి, వివరించి చెబుతున్న ట్రాఫిక్ పాఠాలను పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయా లనే తపన, లక్ష్యం అక్కడి విద్యావ్యవస్థలో బలంగా కనబడుతుంది. ఆ బోధన చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఉన్నత పాఠశాలకు వెళితే ఒక డాక్టర్ వచ్చి మాదక ద్రవ్యాల వాడకం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఎదుగుదలపై ఎలాంటి దుష్ర్పభావాలను కలిగిస్తుందో, ఆ వ్యసనం ఎలాంటి సామాజిక సమస్యలకు దారితీస్తుందో వివరిస్తున్నాడు.
అనర్ధాలకు అడ్డుకట్ట అవగాహనే
మరో సందర్భంలో ఒక కళాశాలకు వెళ్ళాను. అక్కడ 14 నుంచి 16, 17 ఏళ్ల లోపు విద్యార్థులున్నారు. ఆ తరగతి గదిలో అంతా మగపిల్లలే ఉండడం గమనించాను. మానవ పునరుత్పత్తి ప్రక్రియను గురించి వారికి వివరిస్తు న్నారు. వయసుతోపాటూ క్రమంగా ఆడ, మగ పిల్లల శరీర భాగాల్లో వచ్చే మార్పులేమిటి? సంపర్కం వలన గర్భం రావడం, గర్భంలో శిశువు ఎదుగు దల ఎలా సాగుతుంది? అనే విషయాలను అక్కడ విడమర్చి చెపుతున్నారు. విచ్చలవిడి సంపర్కం వల్ల ఎటువంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది? వాటి దుష్పరిణామాలేమిటి? వంటి పలు విషయాలపై యుక్త వయస్సులోకి అడుగిడుతున్న పిల్లలకు తరగతి గదుల్లోనే అక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ అలాంటి అంశాలను బహిరంగంగా చర్చించడానికే సంకోచిస్తాం. ఆ బోధనాంశం ప్రత్యేకతకు అనుగుణంగానే ఆడ, మగ పిల్లలకు ఇలాంటి తరగతులను వేరువేరుగా నిర్వహిస్తారు.
చిన్నతనం నుంచే, తరగతి గది నుంచే మంచి పౌరులను తయారు చేయడంలో తీసుకునే ఈ జాగ్రత్తల వల్లనే ఆయా దేశాల్లో నేరాలు దినదినం తగ్గుతుంటాయి. నేరాలను తగ్గించడంలో పోలీసుల పాత్ర ఎంతుంటుందో, పౌరుల పాత్ర కూడా అంతే ఉంటుందని ఇలాంటి అవగాహనా తరగతుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు. కానీ మన దేశంలో నేరాలు, నేరాల నివారణ వంటి అంశాలపై అవగాహనంతా పోలీసులకే పరిమితం అవు తోంది. కాబట్టే ఈ సమస్య పట్ల మొత్తంగా సమాజానికి ఉన్న బాధ్యతను విస్మరిస్తున్నాం. అందువల్లనే ఒకే విధమైన నేరాలు పదేపదే పునరావృతం అవుతున్నాయి.
‘యాసిడ్ దాడులకు మేమే కారణం!’
వరంగల్‌లో జరిగిన ఒక దుర్ఘటన సందర్భంగా ఒక పోలీస్ ఆఫీసర్ నాతో కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. ఆడపిల్లలపై జరిగిన యాసిడ్ దాడుల గురించి మాట్లాడుతూ ఆయన నాతో పంచుకున్న భావాలు పౌర సమాజాన్ని ఆలోచింపజేసేవిగా అనిపించాయి. యాసిడ్ దాడులలాంటి సంఘటనలు జరగడానికి తామే కారణమని ఆ అధికారి అన్నాడు. ఎందుకు? అని అడిగాను. వామపక్ష భావాలు ప్రచారంలో ఉన్న ప్పుడు పిల్లలు సామాజిక సమస్యలను గురించి ఆలోచించేవారు. యువతీ యువకులు జీవితంలో ఎదురయ్యే సమస్యలపై కలసి పనిచేసేవారు. మేం మా పోలీసు బలగాలతో కలసి వామపక్ష విద్యార్థి సంఘాలే లేకుండా చేశాం. వారిని బలవంతంగా అణచివేశాం. సామాజిక సమస్యలపై పోరాడే వారిని నేరస్తులుగా చిత్రీకరించాం. సమాజం బాగు కోసం యోచించే విద్యార్థుల ఆలోచనలను స్వీయ మానసిక సమస్యలపైకి మళ్లించామంటూ ఆ అధికారి బాధతో చెప్పారు.
సినిమాలు బోధిస్తున్నదేమిటి?
అలా స్వీయగత మనస్కులైన విద్యార్థుల ఆలోచనలు పెడదోవలు పట్టడానికి సినిమాలు తోడయ్యాయంటూ ఆయన ఆ విషయాన్నీ వివరించారు. సినిమాల్లో కుమ్మరిస్తున్న విషభావజాలంతో కుర్రాళ్లలో ఉద్రేకాలు అవధులు దాటి రెచ్చిపోతాయి. వినోదం అర్థం మారుతుంది. ఆ ‘వినోదం’గా చూపే దాన్ని స్వయంగా అనుభవించాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది. సంపన్న వర్గాల వారైతే ఎలాగోలా వారి కోర్కెలను తీర్చుకుంటారు. అది సమాజానికి ఆమోదయోగ్యమే. అదే పేద, దిగువ మధ్యతరగతి వారైతే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆ ‘వినోదాన్ని’ డబ్బుతో కొనుక్కుని అనుభవించ లేరు. కనుక పర్యవసానాల గురించిన ఆలోచనే లేకుండా బలప్రయోగం ద్వారా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే నేరాలకు పాల్పడతారు. సామాజిక సమస్యలు, ప్రజా జీవితాలను గురించి ఆలోచించాల్సిన వయసు లోని యువత ఆలోచనలను మేమూ, సినిమా వాళ్లు కలసి ధ్వంసం చేశాం. ఆ విధ్వంసం ఫలితాలు నేడు అనేక రూపాలు తీసుకుంటున్నాయి. మరోవంక దేశవ్యాప్తంగానే ఆర్థిక అసమానతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పేదవాడికీ, ధనికుడికీ మధ్య అగాధం పెరుగుతున్నది. ఒకడు డబ్బుతో అనుభవిస్తున్నాడు. రెండవ వాడు బలంతో తన కోర్కెను తీర్చుకుంటున్నాడు. కాబట్టే నేను బాధపడుతున్నాను అంటూ ఆ పోలీసు అధికారి తన ఆవేదనను నాతో పంచుకున్నారు.
ఎవరినని నిందించాలి?
కాలేజీల్లో విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు విద్యార్థినీ, విద్యార్థులంతా సామాజిక సమస్యలపై కలసి ఆలోచించేవారు, పనిచేసేవారు. ప్రజాసంఘాల పోరాటాల్లో విద్యార్థులు ముందుండేవారు. ఆ వాతావరణాన్నే సినిమాలు కూడా ప్రతిబింబించేవి. సమాజం ప్రభావం సినిమాలపైన ఉండటం సహ జం. అందుకే అప్పట్లో సామాజిక సమస్యలపై సినిమాలు తీసేవారు. అలాం టి విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, అర్థరహితమైన హింస వంటి పెడదోవల్లోకి నేటి సినిమా ‘వినోదం’ మళ్లించింది. సినిమాల్లోని హీరోల వీరోచిత కృత్యాలు ఎప్పుడూ సుఖాంతమే అవుతాయి. నిజజీవితంలో ఇలాంటి చర్యలన్నీ వికృతమైనవిగానే మిగులుతాయి, వైఫల్యాలనే మిగులు స్తాయి. ప్రతీకార వాంఛను ప్రేరేపించి మానవత్వాన్ని మంటగలిపేసేట్టు చేస్తాయి. ఆడపిల్లలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా యంటే దానికి ఎవరు కారణం అంటారు? విద్యార్థులా? సినిమా మార్కెట్టా? లేక పాలనా యంత్రాంగం పట్టింపులేని వైఖరా? మనం ఎవరినని నిందిస్తాం? ఈ విపరిణామాలకు బలైపోతున్నదెవరు?
శిక్షలతో నేరాలకు అడ్టుకట్ట వేయగలమా?
నేరాలు అన్ని దేశాల్లో జరుగుతాయి. అన్ని దేశాల్లో వచ్చినట్టే కాలాను గుణంగా మన దేశంలోని యువత మానసిక స్థితిలో కూడా మార్పు వచ్చింది. కానీ ఇతర దేశాల్లో ఆ మానసిక స్థితిని సన్మార్గంలోకి మళ్ళించారు. పాలనా యంత్రాంగం, విద్యావ్యవస్థ, పోలీసు యంత్రాంగం, పౌరసమాజం అంతా కలసి యువత ఆలోచన పెడదోవలు పట్టకుండా నిరోధించేందుకు చేస్తున్న కృషి ఫలితం అది. నేరపూరిత ఆలోచనా విధానానికి అక్కడ వారంతా అడ్డుకట్టవేస్తున్నారు. అందుకు భిన్నంగా మన దేశంలో నేరాలు జరగడానికి కావాల్సిన వాతావరణాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నాం. నేరం జరిగాక అందరం కలసి దాన్ని ఖండిస్తాం. జరిగిన నేరాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తాం. అవసరమైతే ఉరిశిక్షకు కూడా వెనకాడం. ఇదేనా సమస్యకు పరిష్కారం? ఉరిశిక్షతో నేరాలు ఆగుతాయా? నేరంతో నేరాన్ని నిరోధిం చలేం. పౌరసమాజం, పాలనా యంత్రాంగం దూరదృష్టితో తగు చర్యలు తీసుకుంటే సమాజంలో నేరాలు క్రమేణా తగ్గుతాయి. నేరగ్రస్తతను మొగ్గ లోనే తుంచేయాలంటే ఆ పని ఇంటి నుంచే, బడి నుంచే మొదలు కావాలని పాలకులు గుర్తించాలి. విద్యార్థికి సామాజిక సమస్యలపై అవగాహన, బాధ్యత నేర్పాలి. అంతేగానీ నేరం జరిగే పరిస్థితులకు అవకాశం కల్పించి, నేరం జరిగే వరకు వేచి ఉండి, జరిగిన నేరాన్ని తీవ్రంగా పరిగణించడం వల్ల ఫలితం శూన్యం. నేరం జరగకుండా నివారించేందుకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవిధంగా పనిచేయాలన్నదే నేటి సవాల్.
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ)