somisetty venkateswarlu
-
సోమిశెట్టీ.. నోరు అదుపులో పెట్టుకో
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకొని..పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. ఇది చరిత్రాత్మకమవడంతో టీడీపీ నేతల్లో వణుకు పుడుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత సోమిశెట్టికి లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిందె నీళ్లతో చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు నటించడం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే చెల్లుతుందన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు పెరుగు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
నంద్యాలను అభివృద్ధి చేయలేకపోయాం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మూడేళ్ల తెలుగుదేశం పాలనలో నంద్యాలను అభివృద్ధి చేయలేకపోయామని ఆ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్ అన్నారు. బుధవారం..పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కావాలంటే నంద్యాల ప్రజలు ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు. నాలుగేళ్ల వరకు మునిసిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిబంధనలు ఒప్పుకోవన్నారు. అయితే కౌన్సిలర్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నిస్తే..నీళ్లు నమిలారు. జూలై 6, 7 తేదీల్లో మంత్రి లోకేష్ జిల్లాకు రానున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
సోమిశెట్టి.. నోరు అదుపులో ఉంచుకో
వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మండిపాటు బనగానపల్లె: ప్రజల మనిషిగా పేరు గాంచిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీకి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎక్కడదంటూ ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డితో పాటు మరికొందరు నాయకులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సోమిశెట్టిపై ధ్వజమెత్తారు. మాట్లాడేటప్పుడు స్థాయిని గుర్తించాలని సూచించారు. అమరావతి నిర్మాణంలో పాల్పడుతున్న అవినీతితో సీఎం చంద్రబాబు,లోకేష్ త్వరలో జైలుకెళ్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని సోమిశెట్టి తెలుసుకోవాలన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ హుసేన్, బీసీ సెల్ జిల్లా నాయకులు పాపన్న, కార్యవర్గ సభ్యులు మురళీమోహన్‌రెడ్డి, కంబగిరి స్వామి పాల్గొన్నారు. -
టీడీపీ నేత సోదరుని కుమారుడు పై నిర్భయ కేసు
నిందితుడు టీడీపీ నేత సోదరుని కుమారుడు మారేడుపల్లి పీఎస్‌లో లైంగిక దాడి కేసు మాఫీ చేయించేందుకు మాజీ మంత్రి ద్వారా యత్నం కర్నూలులో తెలంగాణ పోలీసుల తిష్ట హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోదరుడు సోమిశెట్టి ప్రకాష్ కుమారుడు సోమిశెట్టి హరికృష్ణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు కర్నూలులో తిష్ట వేశారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శివఅరుణ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడినట్లు హరికృష్ణపై ఈనెల 11న వెస్ట్ మారేడుపల్లి పోలీసుస్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు (క్రైం నెం.172/2014, తేదీ.11.06.2014) నమోదైంది. నిందితుని ఆచూకీ కోసం మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ అదనపు ఇన్స్పెక్టర్ నరహరి నేతృత్వంలో రెండు బృందాలు గాలిస్తున్నాయి. హరికృష్ణ కొంతకాలంగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నట్లు సమాచారం అందడంతో రెండు పోలీసు బృందాలు అతని కోసం తీవ్రంగా గాలించాయి. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కర్నూలులో ఆరా తీస్తున్నారు. ఇన్స్పెక్టర్ నరహరి కర్నూలులోనే తిష్ట వేసి నిందితుని కోసం గాలిస్తున్నట్లు సమాచారం. కేసును మాఫీ చేయించుకునేందుకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ద్వారా పోలీసు శాఖ ఉన్నతాధికారులపై టీడీపీ నాయకుడు ఒత్తిడి పెంచినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ కేసు విషయంపై టీడీపీ నేత హైదరాబాద్‌కు వెళ్లి మాజీ మంత్రి ద్వారా తీవ్రంగా ఒత్తిడి చేసినప్పటికీ పోలీసులు అరెస్టు చేసేందుకే సిద్ధపడటం గమనార్హం. -
టీడీపీకి చావుదెబ్బ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన పాపంలో భాగస్వామై సీమాంధ్రలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మరో షాక్ తగిలింది. పార్టీ చరిత్రలో సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పార్టీ నాయకులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తూ కొత్త సంక్షోభానికి తెర తీశారు. జిల్లా పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, తనకు సంబంధం లేకుండానే పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెడుతుండడం, వారం రోజులుగా అధినేతతో మాట్లాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం... వంటి కారణాలతో సోమిశెట్టి, ఆయన వర్గీయులు పార్టీ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అసలే ఉనికి ప్రశ్నార్థకంగా తయారైన పరిస్థితుల్లో పార్టీని పట్టుకొని వేళాడుతున్న సోమిశెట్టి అధ్యక్ష పదవిని వదులుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన రాజకీయ భవిష్యత్తును ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తానని చెప్పిన ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. ఎస్.వి.సుబ్బారెడ్డి... భూమా నాగిరెడ్డి దంపతులు... కేఈ సోదరులు... బి.వి. మోహన్‌రెడ్డి... ఎన్ఎండీ ఫరూఖ్... బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి... బుడ్డా రాజశేఖర్ రెడ్డి... ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని భుజాలపై మోసిన నేతలు వీరంతా. ఎన్.టి.రామారావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి 2009 ఎన్నికలకు ముందు వరకు ఇలాంటి నాయకులతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కళకళలాడింది. అయితే అధినేత చంద్రబాబు నాయుడు అసమర్థ నిర్ణయాలు, ముఖ్యమైన నేతల మధ్య విభజించు-పాలించు తరహా చిచ్చుపెట్టడం, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లడం వంటి కారణాలతో ముఖ్య నేతలంతా ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. వీరిలో ఇప్పుడు మిగిలిన నేతలు ఒకరిద్దరే. వారు కూడా ప్రత్యామ్నాయం లేక అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 8వ సారి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు తన పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నుంచి తనకు తగిన గౌరవం లభించడం లేదని విమర్శించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేఈ సోదరులు కూడా పార్టీ అవ లంబిస్తున్న తెలంగాణ రాష్ట్ర అనుకూల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీలో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీలో కొనసాగి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని తిరిగి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరికి పార్టీలో లభిస్తున్న అధిక ప్రాధాన్యత జిల్లా పార్టీ నేతలకు రుచించడం లేదు. పార్టీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్న తమను కాదని తన ప్రయోజనాల కోసం తెలుగుదేశంలో చేరిన చౌదరి సూచించిన నాయకులకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడాన్ని జీర్ణించుకోలేకే పార్టీ నేతలు మూకుమ్మడిగా పదవీ త్యాగాలకు పాల్పడ్డారు. జె.రుస్తుంఖాన్ అనే నాయకుడిని జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా చౌదరి నియమింపజేయడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పదవులకే రాజీనామా చేసినప్పటికీ, అవసరమైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమన్న సంకేతాలను నేతలు పంపడం గమనార్హం.