టీడీపీకి చావుదెబ్బ
Published Fri, Sep 27 2013 12:23 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన పాపంలో భాగస్వామై సీమాంధ్రలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మరో షాక్ తగిలింది. పార్టీ చరిత్రలో సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పార్టీ నాయకులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తూ కొత్త సంక్షోభానికి తెర తీశారు. జిల్లా పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, తనకు సంబంధం లేకుండానే పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెడుతుండడం, వారం రోజులుగా అధినేతతో మాట్లాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం... వంటి కారణాలతో సోమిశెట్టి, ఆయన వర్గీయులు పార్టీ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
అసలే ఉనికి ప్రశ్నార్థకంగా తయారైన పరిస్థితుల్లో పార్టీని పట్టుకొని వేళాడుతున్న సోమిశెట్టి అధ్యక్ష పదవిని వదులుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన రాజకీయ భవిష్యత్తును ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తానని చెప్పిన ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. ఎస్.వి.సుబ్బారెడ్డి... భూమా నాగిరెడ్డి దంపతులు... కేఈ సోదరులు... బి.వి. మోహన్‌రెడ్డి... ఎన్‌ఎండీ ఫరూఖ్... బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి... బుడ్డా రాజశేఖర్ రెడ్డి... ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని భుజాలపై మోసిన నేతలు వీరంతా. ఎన్.టి.రామారావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి 2009 ఎన్నికలకు ముందు వరకు ఇలాంటి నాయకులతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కళకళలాడింది. అయితే అధినేత చంద్రబాబు నాయుడు అసమర్థ నిర్ణయాలు, ముఖ్యమైన నేతల మధ్య విభజించు-పాలించు తరహా చిచ్చుపెట్టడం, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లడం వంటి కారణాలతో ముఖ్య నేతలంతా ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోయారు.
వీరిలో ఇప్పుడు మిగిలిన నేతలు ఒకరిద్దరే. వారు కూడా ప్రత్యామ్నాయం లేక అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 8వ సారి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు తన పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నుంచి తనకు తగిన గౌరవం లభించడం లేదని విమర్శించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేఈ సోదరులు కూడా పార్టీ అవ లంబిస్తున్న తెలంగాణ రాష్ట్ర అనుకూల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీలో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీలో కొనసాగి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని తిరిగి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరికి పార్టీలో లభిస్తున్న అధిక ప్రాధాన్యత జిల్లా పార్టీ నేతలకు రుచించడం లేదు.
పార్టీ కష్టసుఖాల్లో తోడుగా ఉన్న తమను కాదని తన ప్రయోజనాల కోసం తెలుగుదేశంలో చేరిన చౌదరి సూచించిన నాయకులకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడాన్ని జీర్ణించుకోలేకే పార్టీ నేతలు మూకుమ్మడిగా పదవీ త్యాగాలకు పాల్పడ్డారు. జె.రుస్తుంఖాన్ అనే నాయకుడిని జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా చౌదరి నియమింపజేయడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పదవులకే రాజీనామా చేసినప్పటికీ, అవసరమైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమన్న సంకేతాలను నేతలు పంపడం గమనార్హం.
Advertisement
Advertisement