ముమ్మిడివరంలో 'రణ'రంగం | TDP Chair Person Santha Kumari Resign East Godavari | Sakshi
Sakshi News home page

ముమ్మిడివరంలో 'రణ'రంగం

Published Fri, Jun 1 2018 7:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

TDP Chair Person Santha Kumari Resign East Godavari - Sakshi

చైర్‌ పర్సన్‌ చెల్లి శాంతకుమారి , ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముమ్మిడివరం టీడీపీ విభేదాలతో రోడ్డెక్కింది. ఒకరినొకరు బ్లాక్‌ మెయిల్‌ చేసుకునేలా టీడీపీలో రెండు వర్గాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌ చెల్లి శాంతకుమారి తన పదవికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. దీంట్లో ఎమ్మెల్యే పాత్ర ఎంత ఉంది? చైర్‌పర్సన్‌ వ్యతిరేక వర్గీయుల వాదనలో నిజమెంత? చైర్‌పర్సన్‌ భర్త వైఖరేంటి? అన్నది పక్కన పెడితే ముమ్మిడివరం నగర పంచాయతీ రోడ్డున పడింది.

ఎవరేంటో...: నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ శాంతకుమారి భర్త చెల్లి అశోక్‌ తన సొంతఅజెండాతో వ్యవహరిస్తున్నారన్న అక్కసు అటు ఎమ్మెల్యే, ఇటు కౌన్సిలర్లలో నెలకొంది. 2014 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి వీరి మధ్య అంత సఖ్యత లేదనే వాదన ఉంది. తమను పట్టించుకోకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుని నగర పంచాయతీలో చైర్‌పర్సన్‌ భర్త చెల్లి అశోక్‌ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారన్న ఆవేదనతో కౌన్సిలర్లున్నారు. దీనికితోడు లేఅవుట్ల విషయంలో అక్రమాలు, మున్సిపల్‌ నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న వాదన ఎక్కువైంది. ఆ నేపథ్యంలో ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు నిర్వహించడం, రెండు నెలల క్రితం నగర పంచాయతీ మేనేజరుగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి అవినీతికి పాల్ప డుతూ ఏసీబీ అధికారులకు చిక్కడంతో నగర పంచాయతీ అవినీతి ముద్రను కూడా వేసుకుంది. దీనివెనక అధికార పార్టీ కౌన్సిలర్లున్నారని చైర్‌పర్సన్‌ శిబిరంలో ప్రచారం జరుగుతోంది.

బ్లాక్‌ మెయిలింగ్‌ వ్యూహమా?
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చైర్‌పర్సన్‌ భర్త చెల్లి అశోక్‌ను దారికి తెచ్చుకునేందుకు అసమ్మతి కౌన్సిలర్లు తరచూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో రెండుసార్లు ఇదే అంశాలపై వాకౌట్‌ చేశారు. తాజాగా గురువారం జరిగిన నగర పంచాయతీ కౌన్సిల్‌ సమావేశంలో కూడా అసమ్మతి కౌన్సిలర్లు గళం విప్పారు. ఎమ్మెల్యే బుచ్చిబాబుకు చెప్పినా ఫలితం లేకపోయిందనో...ఆయన కూడా వారి ట్రాప్‌లో పడ్డారనే అనుమానమో తెలియదు గానీ అసమ్మతి కౌన్సిలర్లు వాకౌట్‌ చేసి తమ నిరసన తెలియజేశారు. అంటే చైర్‌పర్సన్‌ను దారికి తెచ్చుకునే వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. ఇక, చైర్‌పర్సన్‌ శాంతకుమారి కూడా అందుకు దీటుగా రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

తరుచూ స్వపక్ష కౌన్సిలర్లు ఇబ్బంది పెడుతున్నారనే అభిప్రాయంతో రాజీ నామాకు దిగారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పరిస్థితులను దారికి తెస్తారని, నగర పంచాయతీలో తన మాటే వేదమనే భరోసా పొందేందుకు వ్యూహాత్మకంగా రాజీనామా పావులు కదిపినట్టు స్పష్టమవుతోంది. చైర్‌పర్సన్‌ శాంతకుమారి తన రాజీనామా లేఖను కమిషనర్‌ పి.ఆర్‌.అప్పలనాయుడుకి అందజేశారు. ఆమెను బుజ్జగించేందుకు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయితోపాటు పలువురు నాయకులు యత్నిస్తున్నారు. ఈ పంచాయతీ మురమళ్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొంది. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు వాకౌట్‌ చేసిన అధికార పార్టీ కౌన్సిలర్లను పిలిపించుకొని చర్చిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

చైర్‌పర్సన్‌ చెల్లి శాంత కుమారి రాజీనామా
ముమ్మిడివరం: ముమ్మిడివరం నగర పంచాయితీ చైర్‌పర్సన్‌ చెల్లి శాంతకుమారి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కమిషనర్‌ పీఆర్‌ అప్పలనాయుడుకు అందజేశారు. కొంత మంది స్వపక్షానికి చెందిన కౌన్సిలర్లు వలస వెళ్లిపోవడానికి దీన్ని సాకుగా చూపి పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, ఎస్సీ మహిళను కావడం వల్లే ఇలా చేస్తున్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement