సోంపేట ఎంపీపీ ఎంపికపై టీడీపీలో పోరు
సోంపేట: సోంపేట మండల అధ్యక్షుని గా పట్టణానికి చెంది న 5వ వార్డు ఎంపీటీసీ సభ్యుడు చిత్రాడ శ్రీనును ఎన్నుకున్నట్లు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్పష్టం చేశారు. పట్టణంలోని శైలజా కల్యాణ మండపంలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ టీడీపీ మండల కార్యకర్తలు, సర్పంచ్లు, ప్రాదేశిక సభ్యులతో కలసి ఎంపీపీ ఎన్నికపై సమావేశం నిర్వహించారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు సూరడ చంద్రమోహన్, మండలాధ్యక్షుడు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎంపీపీగా చిత్రాడ శ్రీనుని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ ప్రకటించడంతో పదవి ఆశించిన బిన్నళ జగన్నాథం నిరాశకు గురయ్యూరు. పార్టీ నాయకులు సోంపేట సర్పంచ్ చిత్రాడ నాగరత్నం ,శేఖర్,జి.కె నాయుడు, దెవు చిట్టిబాబు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
అలిగి బయటకు వెళ్లిపోయిన జగన్నాథం...
ఎంపీపీ పేరు ప్రకటించగానే టీడీపీ సీనియర్ నాయకుడు తాళభద్ర ఎంపీటీసీ బిన్నళ జగన్నాథం తన అనుచరులతో కలసి సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. పలాస ఎమ్మెల్యే తీరుపై ఆయన భగ్గుమన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లడం, ఆస్తులు అమ్ముకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని ఆవేదన చెందారు. శివాజీ నమ్మించి మోసం చేశాడని తీవ్ర పదజాలంతో దుర్భషలాడారు. ఎమ్మెల్యే అశోక్ వారిని సముదాయించి పంపించారు.