తల్లి మృతిచెందిన రెండో రోజే తనయుడు మృతి
టేకులపల్లి(ఖమ్మం) : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన సర్పంచ్ తనయుడు సోమవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తడికలపూడి పంచాయతీ పరిధిలోని కోక్యాతండాకు చెందిన బానోతు నీల తీవ్ర జ్వరంతో ఈనెల 4న మృతిచెందిన విషయం విదితమే. తల్లి మరణంతోపాటే పెద్ద కొడుకు సురేష్‌కుమార్(21) అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఖమ్మం తరలించగా.. జన్యులోపం వల్ల సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న అతడికి రక్త మార్పిడీ చేయిస్తున్నారు.
ఇటీవలే బీటెక్ పూర్తి పూర్తి చేసిన అతడు ఎంటెక్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉండి పరీక్షకు శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో తల్లి అస్వస్థతకు గురికావడంతో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తల్లి మృతిచెందడంతో అంత్యక్రియల కోసం సురేష్‌ను ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. తర్వాత అస్వస్థతకు గురైన సురేష్‌ను ఖమ్మం తరలించగా.. పరిస్థితి విషమించడంతో సోమవారం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా.. తల్లీ, సోదరుడు కళ్లముందే మృతిచెందడంతో తమ్ముడు కల్యాణ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇతడికి కూడా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉండటం గమనార్హం.