సినిమా రివ్యూ - జాదూగాడు
జాదూ చేసినా కూర్చోలేం!
.......................................
తారాగణం - నాగశౌర్య, సోనారికా భడోరియా, అజయ్, కోట శ్రీనివాసరావు, రవి కాలే, ఆశిష్ విద్యార్థి, కథ - మాటలు - మధుసూదన్, సంగీతం - సాగర్ మహతి (తొలి పరిచయం), నిర్మాత - వి.వి.ఎన్. ప్రసాద్, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - యోగేశ్
......................................
కోటి రూపాయలు సంపాదిస్తే జీవితంలో సెటిలైపోవచ్చనుకొనే ఓ కుర్రాడు (నాగశౌర్య). దాని కోసం కాస్తంత వెరైటీ రూట్లో అయినా సరే ట్రై చేద్దామనుకొనే స్వభావం ఉన్నవాడు. అలాంటివాడు నగరాన్ని గడగడలాడించే ఒక ముఠా నేత దగ్గర చేరితే? ఈ కుర్రాణ్ణి వాడుకోవాలనుకొనే గ్యాంగ్‌లీడర్, ఆ గ్యాంగ్ లీడర్ సాయంతో కొన్ని వేలకోట్ల రూపాయల డీల్ నడిపే ఒక కేంద్ర మంత్రి (జగదీశ్ నాయుడుగా కోట శ్రీనివాసరావు), మరోపక్క పదవిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించాలనుకొనే పోలీస్ కమిషనర్ (ఆశిష్ విద్యార్థి), అతగాడి కిందే పనిచేస్తూ తానే పోలీసులకందరికీ చీఫ్ అన్న స్థాయిలో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ (రవి కాలే) - ప్రతి ఒక్కరూ మరొకరిని అడ్డం పెట్టుకొని, డబ్బు సంపాదించాలని చూసే ఈ క్రమంలో ఎవరు పెద్ద ‘జాదూగాడు’? ఈ పాయింట్‌ను రెండు గంటల పైచిలుకు నిడివిలో వెండితెరపైకి ఎక్కించిన ప్రయత్నం - నాగశౌర్య నటించిన ‘జాదూగాడు’. దీనికి ఛేజ్‌లు, కాల్పులు, వెకిలి కామెడీలు అదనం.
ఎలా నటించారంటే...
చొక్కా రంగు, క్వాలిటీ బాగున్నాయి కదా అని ప్రతి ఒక్కరూ వేసుకోకూడదు. ఆ చొక్కా తమకు బిగుతుగా ఉంటుందో, వదులుగా ఉంటుందో తెలుసుకొనేందుకు సైజు చూసుకోవాలి. ఆ రంగు తమ ఒంటికి నప్పుతుందో లేదో గమనించుకోవాలి. ‘జాదూగాడు’కు వచ్చిన తిప్పలు అవే. ‘‘యాన్ యాక్షన్, ఎంటర్టైనర్ ఫిల్మ్ బై యోగేశ్’’ అని దర్శకుడు మాగంటి యోగేశ్ (గతంలో ‘చింతకాయల రవి’ సినిమాకు యోగి పేరుతో దర్శకత్వం వహించింది ఈయనే) స్వయంగా స్పెషల్ టైటిల్ కార్డు వేసుకున్న ఈ సినిమా కథాంశం ఏ పెద్ద హీరోలకో అయితే బాగుండేది. వాళ్ళ ఏజ్‌కీ, యాక్షన్ ఇమేజ్‌కీ కొంత నప్పేది. వర్ధమాన యువహీరో నాగశౌర్యకు మరీ పెద్ద చొక్కా వేసేసుకున్నారు. ఎవరికో రాసుకున్న కథను వేరెవరితోనో తీస్తే ఇలా ఉంటుందని అనిపిస్తుంది. ఈ పాత్ర, అంత హీరోయిజమ్ బరువు నాగశౌర్య లేత భుజాలపైకి ఎత్తుకొని, నలిగిపోయారు. నటనలోనూ ఇప్పటికే ఉన్న యువస్టార్స్ హావభావాలే గుర్తుకొస్తుంటే, వాళ్లుండగా వీళ్లనెందుకు చూడాలనే ప్రశ్న సగటు ప్రేక్షకులకు కలిగితే, ఏమీ అనలేం.
హిందీ హిట్ టీవీ సీరియల్ ‘హరహర మహాదేవ’లో పార్వతీదేవిగా ప్రశంసలందుకొన్న సోనారిక ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. బుల్లితెరపై ఆరాధ్యదైవంగా కనిపించి, ఇక్కడ పార్వతీ ఓమనకుట్టిగా చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించింది. ‘ఏబీసీడీ...’ అంటూ వచ్చే రొమాంటిక్ సాంగ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రకరకాల కామసూత్ర భంగిమలూ వేయించారు. కానీ, హీరో కన్నా హీరోయినే పెద్దదేమో అని కెమేరా సాక్షిగా అనిపించేస్తుంటుంది. దుబాయ్‌కి వెళ్లడమనే సింగిల్ పాయింట్ ఎజెండాతో నడిచే సదరు మధ్యతరగతి నర్సు పాత్రకు ఒక లక్ష్యం, లక్షణం ఏమీ కనిపించవు. కాబట్టి, ఆ పాత్రతో అభినయం ఆశిస్తే, అది ఆడియన్స్ తప్పే!
సినిమాలో విలన్ల సంఖ్యకు కొదవ లేదు కానీ, ఎవరూ పవర్‌ఫుల్‌గా ఉండరు. మా లావు గ్యాంగ్‌స్టర్ కూడా మామూలు తూటా దెబ్బకు బెదిరిపోతుంటాడు. కేంద్ర ఆర్థికమంత్రికీ, పోలీస్ ఆఫీసర్కీ డ్రగ్స్ వ్యాపారం మీదే దృష్టి. ఒకానొక దృష్టిలో దేశంలో గ్యాంగ్స్టర్స్ కన్నా పోలీసులే ఎక్కువ డేంజర్‌గా ఉన్నారనే భావనా కలుగుతుంది.
మితిమీరిన అతి కామెడీ!
క్లైమాక్స్ ముందు వచ్చే ఛేజ్, కొన్నిచోట్ల కెమేరా వర్క్ బాగున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి ఈ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఉన్నంతలో కుర్రాడు బాగానే చేశాడు. రీ-రికార్డింగ్‌లో తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రతిభ చూపారు. కొన్నిసార్లు సీన్లో దమ్ము కన్నా రీ-రికార్డింగ్ ఎఫెక్టే ఎక్కువగా ఉందనీ అనిపించారు.
యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పుకున్నందుకు గాను ఈ సినిమాలో కామెడీ కూడా చాలానే పెట్టారు. అయితే, ఫస్టాఫ్‌లో హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, బృందం చేసిందే కొంత నవ్వించింది. సెకండాఫ్‌కు వచ్చే సరికి ఆ పాత్రలు పత్తా లేకుండా పోతాయి. వాళ్ళు లేరేమిటి చెప్మా అనుకొనే లోపల తాగుబోతు ఆటోడ్రైవర్‌గా రెండు సీన్లలో ‘తాగుబోతు’ రమేశ్ మరోసారి చేతిలో క్వార్టర్ బాటిల్‌తో ఎప్పటిలానే కనిపిస్తారు. ఇక, గ్యాంగ్‌స్టర్ విలన్ అద్దెకుంటున్న ఇంటి ఓనర్‌గా అమెరికా నుంచి దిగబడే ఎన్నారై పాత్రలో కమెడియన్ సప్తగిరి సెకండాఫ్‌లో దిగబడతాడు. క్రమంగా రొటీనైపోతున్న సప్తగిరి అంతరాత్మ కామెడీ కాస్త ఫరవాలేదనిపించినా, దాదాపు ఆరేడు నిమిషాల పైచిలుకు వచ్చే ‘వయాగ్రా’ కామెడీ (?)తో జుగుప్స కలిగించారు. సామాన్య జనాలు ఇలాంటి వాటికి ఈలలు వేస్తారనుకొనో ఏమో, దర్శక - రచయితలు చేసిన ఈ సెక్సువల్ కామెడీని సెన్సార్ వాళ్లు ఎలా దేశం మీదికి వదిలారో అర్థం కాదు. 250 సరుకుకు పాతిక వేలా అంటూ అతి చౌకబారుగా చూపిన ఈ 'ధడేల్ రాణి’ ఎపిసోడ్ రేపు శాటిలైట్ టీవీ ప్రసారాల్లోనూ సినిమాలో చూపిస్తే... హతవిధీ!
ఎలా ఉందంటే...
ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. హీరో మాట్లాడే తింగరి మాటలు... అక్కడక్కడ అర్ధనర్మగర్భంగా అసభ్య డైలాగులు... వినోదం సరిపోతుందో, లేదో అనుకొని (హీరోయిన్ మీద కోపంతో) హీరో ఒక థర్డ్ జెండర్‌తో జరిపే హిజ్రా లవ్ కామెడీ... ఆ హిజ్రా కట్టుకున్న చీరను పైకెత్తే ప్రయత్నం చేసే తాగుబోతు డ్రైవర్... మంచి యాక్షన్ సీన్ మధ్యలో హీరో హీరోయిన్ల లిప్‌లాక్ సీన్లు... ‘తొడగొట్టేవాడు...’ అంటూ నర్తకి తన ఊరుసౌందర్యం చూపిస్తూ చేసే ఐటమ్ సాంగ్... ఇలా చాలా ఉన్నాయి. మామూలు జనం వీటి కోసమే వస్తారనో, కనీసం వీటి కోసమైనా వస్తారనో - దర్శక, రచయితలు ప్రయత్నలోపం లేకుండా కృషి చేశారు. కానీ, కథ మీద, దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడం మీద, కనీసం ఓ మేరకైనా లాజిక్ ఉండేలా చూసుకోవడం మీద మాత్రం దృష్టిపెట్టడం పాపం మర్చిపోయినట్లున్నారు.
కోటి రూపాయల సంపాదన... బ్యాంకుకు పేరుకుపోయిన మొండి బాకీల వసూలు పని మీద మొదలైన హీరో - కాసేపటికే అది పక్కన పడేస్తాడు. విలన్ గ్యాంగ్‌లో చేరాక మొదట అక్కడ, ఆ తరువాత పోలీసు చేతుల్లో ‘టాయ్’గా మారినట్లుగా హీరో పాత్ర కనిపిస్తుంది. క్లైమాక్స్ చివరలో మూడు నిమిషాల ఏకధాటి హీరో ఉపన్యాసంతో అసలు ముడి విప్పుతారు. కానీ, అప్పటికే పొసగని ఈ కథ, పాత్ర చిత్రణల మధ్య విసిగిన ప్రేక్షకుడు కుర్చీలో నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అసలు ట్విస్ట్ అంతా అక్కడే పెట్టేసరికి, దర్శక, రచయితలు తమను ‘టాయ్’ (బొమ్మ) లాగా వాడుకున్నారనీ, అప్పటి దాకా చూసిన సినిమాకు అసలు కథ వేరే ఉందనడం ద్వారా తాము చీటింగ్‌కు గురయ్యామనీ ప్రేక్షకులు ఫీలయ్యే ప్రమాదం ఉంది. వెరసి, ‘ఒళ్లంతా రొమాన్సే’ ఉన్న హీరోను పెద్ద జాదూగాడుగా చూపిన ఈ కథలో తీసినవారికి క్లారిటీ పూజ్యం. రెండుగంటల పైచిలుకు చూసివారికీ అంతే. అందుకే, జనంపై ఈ ‘జాదూ’ ఫలించడం కష్టమే!
- రెంటాల జయదేవ