నంబర్ వన్ కావడమే లక్ష్యం
సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెనిచిరో హిబి సాన్
సాక్షి,విశాఖపట్నం: మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారత్లో తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెనిచిరో హిబి సాన్ తెలిపారు. విశాఖలోని డైమండ్ పార్క్, గాజువాఖ ప్రాంతాల్లో గల సోనీ సెంటర్లను సోమవారం రాత్రి ఆయన సందర్శించారు. సోనీ ఏపీ మేనేజర్ అభిజిత్, సోనీ విశాఖ సెంటర్ యజమాని జగదీష్లు కెనిచిరోకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు.ప్రస్తుతం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆరు శాతం, టెలివిజన్ మార్కెట్లో 30 శాతం వాటా సోనీకి ఉందన్నారు. ఈ ఏడాది నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది ఐసీసీ వరల్డ్కప్ వంటి పెద్ద ఈవెంట్స్ ఉండటంవల్ల అమ్మకాలు బాగున్నాయన్నారు.
ఈ ఏడాది దసరా, దీపావళి వంటి పండుగలపైనే వ్యాపారం ఆధారపడిందన్నారు. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు కొత్త టెక్నాలజీలను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. దానిలో భాగంగానే గత ఆగస్టులో తొలిసారిగా సోనీ బ్రేవియా ఆండ్రాయిడ్ టీవీలు ప్రవేశపెట్టామన్నారు.