sony music
-
రా యాక్షన్ ఫిల్మ్ 'థగ్స్'.. మ్యూజిక్ పార్టనర్‌గా సోనీ మ్యూజిక్
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మిస్తున్నారు. యంగ్ హీరో హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలె విడుదలై థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా మ్యూజిక్, ప్రోమో కంటెంట్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.కాగా ఈ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రోమో ఎడిటర్‌గా పనిచేసిన ప్రవీణ్ ఆంటోనీ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధత్యలు తీసుకున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
AR Rahman: 'ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’
‘ఇప్పటివరకూ చాలా విన్నారు ఈ ఒక్కసారి నా పిలుపు వినండి’ అని భూమి తల్లి పిలుస్తోంది. ‘ఈ జగతి ఆశతో నిండి ఉంది. ఈ నేల నీలిమతో నిండి ఉంది. హాయిగా ఊపిరి పీల్చుకోండి. స్వస్థత పడండి’ అని చెబుతోంది. మహమ్మారి రోజులలో మనుషులకు స్థయిర్యం ఇచ్చేందుకు గుల్జార్ రాసిన ‘మేరి పుకార్ సునో’ పాటను రహమాన్ కంపోజ్ చేశారు. ఆరుగురు గాయనులు గానం చేశారు. ఈ కాలానికి అవసరమైన గీతం ఇది. కరోనా మహమ్మారి వేళ ప్రజలందరూ ధైర్యాన్ని కోల్పోయారు. స్థయిర్యాన్ని జార్చుకున్నారు. వారిని తిరిగి వారిలా చేయాలి. అందుకు అమ్మే పూనుకోవాలి. అలా భూమి తల్లి తన పిల్లలకు ధైర్యం చెప్పడానికి పిలుస్తున్న పిలుపునే ‘మేరి పుకార్ సునో’ పాటగా ఆస్కార్ అవార్డు గ్రహీత గుల్జార్ రాశారు. మరో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రహమాన్ ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీమణులు– అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషాల్, సాధనా సర్గం, చిత్ర, షాషా తిరుపతి, అసీస్ కౌర్ ఆ భూమితల్లికి గొంతునిచ్చారు. సోనీ మ్యూజిక్ ఈ పాటను విడుదల చేసింది. ఈ వెలుతురు తీసుకోండి గుల్జార్ ఈ పాటను గొప్పగా రాశారు. ‘నా నేల మీది బతికే పిల్లలారా... నా మాట వినండి... ఇప్పటి దాకా చాలా విన్నారు... ఈసారి నన్ను వినండి’ అనే పల్లవితో మొదలెట్టారు. చరణంలో భూమి తల్లి చేత ‘సూర్యుని దగ్గర ఎంతో వెలుతురు ఉంది. తీసుకొని పంచుకోండి. ఆకాశం నిండా గాలే. గుండెల నిండా పీల్చుకోండి’... అని అనిపిస్తారు. రెండో చరణంలో ‘ఈ అనంత విశ్వంలో ఈ భూమి ఒక్కటి మీది... ఎన్ని మోకరింపులు ఎన్ని ప్రార్థనలో దీని మీద... జీవితం చాలా ఉంది... మీ మీ మట్టి పొత్తిళ్లను జీవితంతో నింపుకోండి’... అని రాశారు. ఇలా పాటంతా భూమి తన పిల్లలతో మాట్లాడుతుంది. ఏమిటి సందేశం? ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉంది. ప్రతి ఒక్కరిలో సంవేదన ఉంది. అయినా పర్వాలేదు. అందరం ఒక్కతాటిపై రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా నిలవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. మళ్లీ జీవితాన్ని నిర్మించుకోవచ్చు... మానవులు ఎన్నో కష్టాలు దాటి వచ్చారు... ఈ కష్టం కూడా దాటేస్తారు... అందుకు భూమి తల్లే సాక్ష్యం... అని ఈ పాట చెబుతోంది. ‘ఈ పాట ఒక స్వాంతనం... ఓదార్పు. భూమి తల్లి తన కూతుళ్ల (గాయనుల) ద్వారా జనంతో మాట్లాడుతోంది. ఆమె గొంతును మహిళా సింగర్లు తప్ప ఇంకెవరు వినిపించగలరు. గుల్జార్ గారూ నేను కలిసి చేసిన ఆలోచన ఈ పాట’ అని దీనిని కంపోజ్ చేసిన ఏ.ఆర్.రహమాన్ అన్నారు. ‘ఈ నేల మన నుంచి వాగ్దానం అడుగుతోంది... జీవితాన్ని కోల్పోవద్దని. మనమంతా భూమికి వాగ్దానం చేయాలి... అవును.. మేము లేచి నిలబడతాం... ఈ గాలులు వీచనిస్తాం... ఈ కెరటాలు విరిగి పడుతూనే ఉండేలా చూస్తాం అని చెప్పాలి. ఆ మాటలే పాటలో రాశాను’ అంటారు గుల్జార్. బాధను మర్చిపోవడానికి ‘ఈ లాక్డౌన్ల కాలంలో ఇంట్లోనే ఉండటం కొన్నాళ్లు బాగానే ఉండింది. కాని ఆ తర్వాత బాధ మొదలైంది’ అంటారు చిత్ర. ఆమె ‘మేరి పుకార్ సునో’ పాటలో దక్షణాది ప్రతినిధిగా కనిపిస్తారు. ‘నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను. ఎందుకంటే నా కూతురు నందన (మరణించింది) జ్ఞాపకాలు చుట్టుముడతాయి’ అంటారామె. ‘నాలాగే ఎందరో ఈ కరోనా కాలంలో ఎంతో బాధను, కష్టాన్ని భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పాటలాంటిది ఒక పెద్ద ఓదార్పు. రహమాన్ ఎప్పుడు పాడమన్నా నేను మూడు నాలుగు రకాలుగా పాడి వినిపిస్తాను. ఈసారి నేరుగా రికార్డింగ్ లేదు. ఇంటి నుంచి పాడి పంపించాను.’ అన్నారు చిత్ర. ‘అయినవారిని కోల్పోవడం కంటే మించిన బాధలేదు. నా కూతురు మరణించాక అలాంటి దుఃఖమే ఎదురైన వారు నా దగ్గరికొచ్చి ఆ బాధ ఎలా మర్చిపోవాలో చెప్పమ్మా అని అడుగుతుంటారు. నేనేం చెప్పగలను? పనిలో పడితే అదే కొంచమైనా తగ్గుతుంది అంటాను. నా కూతురు పోయిన దుఃఖాన్ని పనిలో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాను. కాని అప్పుడప్పుడు కడుపు భగ్గుమన్న భావన కలుగుతూనే ఉంటుంది’ అంటారు చిత్ర. కష్టకాలంలో కళే మనిషికి ఓదార్పు. ఈ సమయంలో ఇలాంటి పాట స్త్రీల గొంతుక నుంచి వినడం నిజంగానే ఒక అమ్మ నుంచి విన్న నిశ్చింత. తల్లి ఒడిలో తల పెట్టుకున్నంత నెమ్మది. ఇక ఏ భయం లేదన్న దిటవు. ఆ దిటవే ఇప్పుడు కావాలి. – సాక్షి ఫ్యామిలీ -
సోనీమ్యూజిక్తో టిక్‌టాక్ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: నిషేధిత చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ (ఎస్ఎంఇ) తో కొత్త లైసెన్సింగ్ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ కొత్త డీల్ ప్రకారం యాప్ లో సోనీ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్స్ ని క్రియేటర్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం విలువ వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. అయితే టిక్‌టాక్ యూజర్లు సోనీ మ్యూజిక్ కళాకారుల కంటెంట్ వాడుకోవచ్చని టిక్‌టాక్ ఒక ప్రకటనలో తెలిపింది తాజా ఒప్పందంతో సోనీ మ్యూజిక్ ప్రస్తుత హిట్స్, కొత్త రిలీజ్ లు, ఐకానిక్ క్లాసిక్స్ లాంటివి టిక్‌టాక్ క్రియేటర్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సోనీ మ్యూజిక్ క్లిప్‌లను ప్రదర్శించడాని కంటే మించి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నాలతోపాటు, యూజర్లకు మంచి మ్యూజిక్ అందుబాటులోకి వస్తుందని సోనీ మ్యూజిక్ ప్రతినిధి డెన్నిస్ కూకర్ తెలిపారు. సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చాలా ఆనందంగా ఉందనీ, తద్వారా అమెరికా సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోనీ కళాకారుల అద్భుతమైన కంటెంట్‌ను కొత్త ప్రేక్షకులతో అనుసంధానించడానికి, టిక్‌టాక్ శక్తిని ఉపయోగించుకోవాడినికి వీలవుతుందని టిక్‌టాక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ ఓలే ఒబెర్మాన్ పేర్కొన్నారు. టిక్‌టాక్ ఇప్పటికే యూనివర్సల్, సోనీ వార్నర్‌లతో స్వల్పకాలిక లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. -
డిజిటల్ ఫార్మెట్లో డోరా గీతాలు
డోరా చిత్ర గీతాలను డిజిట ల్ ఫార్మెట్లో విడుదల కానున్నారుు.లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో డోరా ఒకటి. వి.హిందేశ్ జపక్ సమర్పణలో నెమిచంద్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తంబిరామయ్య, హరీష్‌ఉత్తమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సర్గుణం సినిమాస్ సంస్థ నెమిచంద్ జపక్కు ఫస్ట్‌కాపీ బెస్లో నిర్మిస్తోంది.ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ల ద్వయం సంగీతాన్ని, దినేశ్కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ డోరా చిత్ర టాకీ పార్టు పూర్తి అరుు్యందన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న డోరా చిత్ర ఆడియోను సింగిల్ ట్రాక్‌ను సోనీ మ్యూజిక్ సంస్థ డిజిటల్ విధానంలో వరుసగా ఒక్కో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. నయన ఇప్పటి వరకూ నటించనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా మంచి అటెన్సన్ను క్రియేట్ చేసిందని, చిత్రం కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు. -
12 శాతం సంపాదన సంగీతానికే...
న్యూఢిల్లీ: సంగీతమంటే చెవి కోసుకునేవాళ్లు ఉంటారని విన్నాం.. మధురమైన సంగీతానికి ప్రకృతి కూడా స్పందిస్తుందనీ విన్నాం.. చెవికోసుకోవడం, స్పందించడం మాటేమోగానీ.. భారతీయులు సంగీతం కోసం తమ సంపాదనలో 12 శాతం వరకూ ఖర్చు చేస్తున్నారని మాత్రం ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ఇదేంటి అంటారా? ప్రముఖ ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 23 పట్టణాల్లో 7,500 మందిని ప్రశ్నించి ఈ నిర్ధారణకు వచ్చారు. సగటున ఒక భారతీయుడు వారంలో 15 గంటలపాటు సంగీతం వింటున్నాడని సర్వే పేర్కొంది. సంగీతానికి సంబంధించి దేశంలో స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది. పెద్ద నగరాల కంటే ఓ మోస్తరు నగరాల్లో ఉన్నవారే సంగీతాన్ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుని వింటున్నారని సోనీ సంస్థ భారత ప్రతినిధి శ్రీధర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. మొత్తంగా 40 శాతం మంది యువత మ్యూజిక్ అప్డేట్ల కోసం నేరుగా ఫేస్బుక్ వంటి సామాజిక వెబ్సైట్లలో ఆయా సంగీత విద్వాంసులు, గాయకులను అనుసరిస్తున్నారని సర్వేలో వెల్లడైందని చెప్పారు. మీకు సంగీతం అంటే ఇష్టమా..? నచ్చిన పాటలు, సంగీతం కోసం ఎంతైనా ఖర్చుపెడతారా..? అయితే మీరూ ఈ జాబితాలో ఉన్నట్లే!