South Indian food
-
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
టిఫిన్‌లో ఇడ్లీ, దోశలు తింటున్నారా? అయితే ఆ వ్యాధి బారినపడ్డట్లే!
సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్‌గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్‌లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి. ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా? అన్ని టిఫిన్స్‌తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి ►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. ► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. -ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు. -
ఎవర్గ్రీన్ హీరో.. సౌతిండియన్ ఫుడ్డే కారణం
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చే మాట ఎవర్గ్రీన్ హీరో. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఎవరికైనా వయసు పెరుగుతుంది.. కానీ అనిల్ కపూర్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. అవును వయసు పైబడుతున్న కొద్ది అనిల్ కపూర్ మరింత యవ్వనంగా తయారవుతున్నారు. ఆయన పిల్లలకే ముప్పై ఏళ్లు పైబడ్డాయి. అయినా పిల్లల్ని, అనిల్ కపూర్‌ని పక్క పక్కన నిలబెడితే.. వారందరిని తోబుట్టువులే అనుకుంటారు ఎవరైనా. ప్రతి ఇంటర్వ్యూలో సాధరణంగా అనిల్ కపూర్‌కు ఎదురయ్యే ప్రశ్న.. ఇంత అందంగా ఉంటారు ఏం తింటారు సర్ అని. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ చెప్పేశారు అనిల్ కపూర్. తను ఇంత ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి సౌత్ ఇండియన్ ఫుడ్డే కారణం అంటున్నారు అనిల్ కపూర్. ఇడ్లీ, దోశ, సాంబార్ తినడం వల్లే తాను ఇంత అందంగా ఉన్నాను అంటున్నారు అనిల్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం. మనం కూడా ఇదే ఆహారం తింటున్నాం కదా.. మరి మనం ఎందుకు అనిల్ కపూర్‌లా కాలేకపోతున్నాం అని అడిగే వారికి డైటీషియన్ కవిత చెప్పే సమాధానం ఏంటంటే.. ఆహారంతో పాటు వ్యాయామం, మంచి జీవన శైలి పాటించాలి అంటున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశ ఆహారంలో ప్రధానంగా కన్పించే అంశం.. పులియబెట్టడం. ఇడ్లీ, దోశ పిండిని పులియబెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా పులియబెట్టిన ఆహారం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు కవిత. పులియబెట్టిన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. అందువల్ల మన శరీరం తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. రెండు.. పులియబెట్టడం వల్ల ఆహార పోషక విలువ పెరుగుతుంది. తద్వారా మన శరీరం ఎక్కువ పోషకాలను గ్రహించడమే కాక శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. ఫలితంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పుకొచ్చారు కవిత. అయితే పులియబెట్టిన ఆహారాన్ని.. కొబ్బరి నూనెతో కలిపి ఉడికించి తింటేనే ఈ ఫలితం దక్కుతుందంటున్నారు కవిత. కొబ్బరి నూనె, పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు కవిత. దాంతో పాటు తరచుగా కొబ్బరి నీరు తాగాలని సూచిస్తున్నారు. -
భారతదేశపు ఖర్జూరం....
జ్వరంగా అనిపిస్తే పిసరంత చింతకాయపచ్చడి నాలిక్కి రాసుకుంటే చాలు.. పోతుందనుకున్న ప్రాణం తిరిగి దోసిట్లో పడ్డట్టు అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో గరిటెడు చింతచిగురు పప్పు, చెంచాడు నెయ్యి వేస్తే.. జిహ్వ చచ్చిన నాలుక తిరిగి జీవం పోసుకుంటుంది. దక్షిణ భారతదేశ ఆహారంలో ముఖ్యమైన భాగం చింతపండు. దీంతో రసం, సాంబారు, రకరకాల పులుసులు, పులిహోర.. ఒకటేమిటి చింతపండుతో ఏది వండినా పుల్ల పుల్లని రుచిని ఇచ్చి జీవాత్మతో ఆహా అనిపిస్తుంది. భారతదేశపు ఖర్జూరంగా పేరొందిన చింతపండు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. గుబురుగా, బలంగా, పచ్చగా కనువిందుచేసే చింతచెట్టు దాదాపు 60 అడుగుల వరకు పెరుగుతుంది. దీని నుంచి మనం చింతాకు, చింతకాయ, చింతపండు, చింతపిక్కలను ఆహారపదార్థాలలో వాడుకుంటాం. అంతేనా, దీని కలపతో ఇంటి సామాన్లూ తయారుచేసుకుంటాం. ఆసియాలో చింతపండు ఈనెలని కంచు, రాగి పాత్రల్ని శుభ్రంచేయడానికి, మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసాన్ని చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్‌లో తియ్యని ఒక రకం చింతపండును ఇష్టంగా తింటారు. పొద్దున లేచింది మొదలు చింతపండుతో మనం ఇన్ని పనులు పెట్టుకున్నామా.. దీని మూలాలు ఆఫ్రికాలో ఉన్నట్టు.. అక్కడ నుంచి రకరకాల దారులు మారి ఇండియాకు వచ్చినట్టు కథలు ఉన్నాయి. 16వ శతాబ్దిలో దీనిని మెక్సికో పరిచయం చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ప్రస్తుతానికి మాత్రం చింత దిగుబడిలోనూ, ఎగుమతిలోనూ భారత్‌దే అగ్రస్థానం. ఆ తర్వాత ప్లేస్‌లో తూర్పు ఆసియా, అమెరికా, మెక్సికోలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.