భారతదేశపు ఖర్జూరం....
జ్వరంగా అనిపిస్తే పిసరంత చింతకాయపచ్చడి నాలిక్కి రాసుకుంటే చాలు.. పోతుందనుకున్న ప్రాణం తిరిగి దోసిట్లో పడ్డట్టు అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో గరిటెడు చింతచిగురు పప్పు, చెంచాడు నెయ్యి వేస్తే.. జిహ్వ చచ్చిన నాలుక తిరిగి జీవం పోసుకుంటుంది. దక్షిణ భారతదేశ ఆహారంలో ముఖ్యమైన భాగం చింతపండు. దీంతో రసం, సాంబారు, రకరకాల పులుసులు, పులిహోర.. ఒకటేమిటి చింతపండుతో ఏది వండినా పుల్ల పుల్లని రుచిని ఇచ్చి జీవాత్మతో ఆహా అనిపిస్తుంది. భారతదేశపు ఖర్జూరంగా పేరొందిన చింతపండు పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. గుబురుగా, బలంగా, పచ్చగా కనువిందుచేసే చింతచెట్టు దాదాపు 60 అడుగుల వరకు పెరుగుతుంది. దీని నుంచి మనం చింతాకు, చింతకాయ, చింతపండు, చింతపిక్కలను ఆహారపదార్థాలలో వాడుకుంటాం.
అంతేనా, దీని కలపతో ఇంటి సామాన్లూ తయారుచేసుకుంటాం. ఆసియాలో చింతపండు ఈనెలని కంచు, రాగి పాత్రల్ని శుభ్రంచేయడానికి, మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసాన్ని చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్‌లో తియ్యని ఒక రకం చింతపండును ఇష్టంగా తింటారు. పొద్దున లేచింది మొదలు చింతపండుతో మనం ఇన్ని పనులు పెట్టుకున్నామా.. దీని మూలాలు ఆఫ్రికాలో ఉన్నట్టు.. అక్కడ నుంచి రకరకాల దారులు మారి ఇండియాకు వచ్చినట్టు కథలు ఉన్నాయి. 16వ శతాబ్దిలో దీనిని మెక్సికో పరిచయం చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. ప్రస్తుతానికి మాత్రం చింత దిగుబడిలోనూ, ఎగుమతిలోనూ భారత్‌దే అగ్రస్థానం. ఆ తర్వాత ప్లేస్‌లో తూర్పు ఆసియా, అమెరికా, మెక్సికోలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.