సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు.
కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్‌గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్‌లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు.
ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి.
ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా?
అన్ని టిఫిన్స్‌తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్.
ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు.
బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి
►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు.
► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది.
► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు.
► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి.
►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి.
► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి.
-ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు.
Comments
Please login to add a commentAdd a comment