![Warangal: People Prefer Idli And Poori As Breakfast Interesting Survey - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/17/idly-poori.jpg.webp?itok=70oWQaKw)
వరంగల్ నగర ప్రజల జిహ్వచాపల్యం భలేగాఉంది. ఉదయం టిఫిన్‌ను ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటుండగా, అదేస్థాయిలో ఆయిల్ ఫుడ్ అయిన పూరీని కూడా అంతే ఇష్టపడుతున్నారు. మరికొందరు వడ, దోశ కూడా భుజిస్తున్నారు. ఉదయాన్నే విధులకు హాజరుకావాల్సి ఉండడంతో ఇంట్లో అల్పాహారం తయారీకి తగిన సమయం లేకపోవడంతో హోటళ్లవైపు చూస్తున్నారు. ఇంట్లోకంటే రుచిగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు.
ఇంటివారిని ఉదయాన్నే ఇబ్బంది పెట్టకుండా బయట టిఫిన్ చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. అదేసమయంలో కరోనా సమయం కాబట్టి హోటళ్లకంటే ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నారు. వరంగల్ నగరంలో ప్రజల అల్పాహార రుచులపై ‘సాక్షి’ సోమవారం పలుచోట్ల సర్వే నిర్వహించింది. వరంగల్, హనుమకొండలో 8 టిఫిన్ సెంటర్లలో సాక్షి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
20 ఏళ్లలోపు వారికి పూరీ అంటేనే ఇష్టం..
కాజీపేట ఏరియాలో నిట్, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ ఏరియాలోని రెండు హోటళ్లలో జరిపిన సర్వేలో యువత పూరీ ఇష్టపడుతున్నారు. ఫాతిమానగర్‌లోని ఓ మెస్‌లో నిట్ విద్యార్థులు పూరీనే అధికంగా తీసుకున్నారు. 10 నుంచి 20 ఏళ్ల వయస్సు గల 25 మందిని సర్వే చేయగా.. ఎవరు కూడా ఇడ్లీని ఇష్టపడడం లేదు. పూరీపైనే ఆసక్తి కనబరిచారు. హన్మకొండలోని మరో ప్రధాన హోటళ్లలో ఇడ్లీ 10 మంది.. పూరీ ఆరుగురు ఇష్టపడ్డారు. వీరంతా యువతే కావడం గమనార్హం.
సర్వేలో ఆసక్తికరమైన విషయాలు..
- క్షణం తీరికలేని ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో బిజీ లైఫ్‌లో సైతం ఆహార విషయంలో కచ్చితమైన జాగ్రత్తలను పాటిస్తున్నారు.
- ఉదయం తీసుకునే టిఫిన్స్‌పై ప్రజల అభిప్రాయాన్ని అధ్యయనం చేయగా అత్యధిక శాతం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆయిల్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలనుకోవడం, సులువుగా జీర్ణం అవుతుండడం, ఆరోగ్యవంతమైన ఫుడ్ కావడమే ముఖ్య కారణం.
- యువత పూరీ, దోశ, వడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవీ తినడానికి రుచిగా ఉన్నాయని చెబుతున్నారు.
- ఉదయం సమయంలో ఎక్కువగా 15ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు హోటళ్లలో టిఫిన్స్ కోసం వచ్చారు.
- ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువత ఎక్కువగా ఇడ్లీ, వడ, పూరీ, దోశను ఆర్డర్ చేశారు.
- 40ఏళ్ల పైపడిన వారు ఇడ్లీ ఎంచుకున్నారు.
- ఇందులో ఎక్కువ ఇడ్లీ, వడ కాంబినేషన్ తిన్నారు.
- కొంతమంది ఫేమస్ హోటల్స్ అని తెలవడంతో రుచిచూద్దామనే ఆలోచనతో వచ్చామని చెప్పగా, మరికొందరు ఫ్రెండ్స్‌తో టిఫిన్స్ ఆరగించామని వివరించారు.
- ఉదయం ఇడ్లీ, పూరీ, బొండా, వడ లాంటి టిఫిన్లను నగర వాసులు ఇష్టపడుతుండగా, సాయంత్రం ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి టిఫిన్లకు ఎక్కువగా గిరాకీ ఉంటున్నదని నిర్వాహకులు తెలిపారు.
ఇంట్లో ఒకే వెరైటీ...
ఇంట్లో చేస్తే ఒకే వెరైటీ టిఫిన్ చేస్తారు. అదే హోటల్‌కు వెళితే ఇడ్లీ సాంబార్‌తో, చట్నీ, నెయ్యి, కారంతో లాగించేయొచ్చు. ఇలా ఇంట్లో కుదరదు. ఇడ్లీతోపాటు వడ, పూరీ, చక్కరపొంగలి, పెసరట్టు, దోశతోపాటు వెరైటీలు తినొచ్చు.- గాండ్ల మధు, వరంగల్
రుచికరంగా ఉంటాయంటే వచ్చా
కరీమాబాద్ జంక్షన్‌లో టిఫిన్స్ రుచికరంగా ఉన్నాయని తెలిసి ఫెండ్స్‌తో కలిసి వచ్చాను. అప్పుడçప్పుడు మాత్రమే హోటల్స్‌లో తినడానికి ఇష్టపడతాను. - బొల్లం రాకేశ్, వరంగల్
పూరీ నా ఫేవరెట్
నేను ప్రతి రోజూ పూరీని టిఫిన్‌గా తింటాను, పూరీ నా ఫేవరెట్ టిఫిన్. మా ఇంట్లో చేసిన టిఫిన్ కంటే అన్నపూర్ణ హోటల్‌లోని పూరీ ఇష్టంగా తింటాను. స్కూల్‌కు వెళ్లే సమయంలో పూరీని టిఫిన్ బాక్స్‌లో తీసుకువెళ్లేందుకు ఇష్టపడతాను. – కట్కూరి అనుష్క, కాజీపేట
ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదని
నా వయస్సు 55 సంవత్సరాలు. దాదాపు 40 ఏళ్లుగా టైలర్ వృత్తిలో ఉన్నా. వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తుంటాను. నేను తీసుకునే ఆహారం ఈజీగా జీర్ణం కావాలంటే ఇడ్లీ తీసుకోవడమే మంచిది. పొద్దున్నే ఇడ్లీ కాకుండా పూరీ, వడ లాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణం కావు. ఆయిల్‌ఫుడ్ తిని అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడం కంటే వితౌట్ ఆయిల్‌తో చేసిన ఇడ్లీ తినడం ఆరోగ్యానికి మంచిదే కదా. – పొడిశెట్టి వెంకటేశ్వర్లు, టైలర్, కుమార్‌పల్లి
సర్వే ఇలా..
వరంగల్, హనుమకొండ ఏరియాల్లో మొత్తం 8 ప్రధాన టిఫిన్ సెంటర్లలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పరిశీలన.. తీసుకున్న శాంపిల్స్ : 105
- ఆన్‌లైన్‌లో.. 39
- పార్సిల్ 46
- హోటల్‌లో తిన్నవారు 128
- ఇడ్లీ : 19
- పూరీ : 12
- వడ : 10
- దోశ, ఇతరాలు : 14
- ఇడ్లీ : 10
- పూరీ : 19
- వడ : 04
- దోశ, ఇతరాలు : 17
Comments
Please login to add a commentAdd a comment