అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల్లో రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు అంతగా సహించవు. రుచి లేదని బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ, దోశల తయారీలో కొన్ని కొత్త పదార్థాలను జోడించి వండితే.. రెండు తినేవారు నాలుగు తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లను సరికొత్త రుచితో ఎలా వండుకోవచ్చో చూద్దాం..
సొరకాయ దోశ
కావలసినవి..
మీడియం సైజు సొరకాయ – ఒకటి, బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు, ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ – దోశ వేయించడానికి సరిపడా.
తయారీ:
►ముందుగా సొరకాయ తొక్క తీసి శుభ్రంగా కడగాలి. తరువాత గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి.
►ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
►ఈ పేస్టుని ఒక పెద్దగిన్నెలో వేసి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి.
►ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కనపెట్టాలి.
►తరువాత వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లుకుని దోశలా పోసుకోవాలి.
►దోశను రెండువైపుల క్రిస్పీగా కాల్చితే సొరకాయ దోశ రెడీ.
చదవండి: Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే!
సగ్గుబియ్యం ఇడ్లీ
కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, ఇడ్లీ రవ్వ – కప్పు, పుల్లటి పెరుగు – రెండు కప్పులు, బేకింగ్ సోడా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు – 8
తయారీ:
►ముందుగా సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను కడగాలి.
►ఒక పెద్దగిన్నెలో సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు పేసి కలపాలి.
►ఈ మిశ్రమంలో రెండు కప్పులు నీళ్లుపోసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టాలి.
►నానిన పిండికి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి.
►ఇడ్లీ ప్లేటుకు కాస్త ఆయిల్ రాసి జీడిపప్పులు వేసి, వీటిపైన పిండిని వేయాలి. సిమ్‌లో పదిహేను నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. ఏ చట్నీతోనైనా ఈ ఇడ్లీ చాలా బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment