Southwestern monsoon
-
తెలంగాణలో వానలే వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జోరు వానలు నమోదవుతున్నాయి. సీజన్ మొదటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా సంతృప్తికర వర్షాలే కురుస్తున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 60.7 సెంటీమీటర్ల సగటు వర్ష పాతం నమోదు కావాల్సి ఉండగా... శుక్రవారం ఉదయం వరకు 75.54 సెం.మీ. నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సాధారణం కంటే 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం 72.05 సెం.మీ... కానీ ఇప్పటికే సీజన్ సగటు వర్షపాతానికి మించిన వాన లు నమోదు కావడం విశేషం. గత రెండ్రోజులుగా రాష్ట్రం లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్నట్లు అధికారులు చెప్పారు. రానున్న పక్షం రోజుల్లో వర్షాలు మరింత విస్తారంగా కురిసే అవకాశం ఉందన్నారు. 24 జిల్లాల్లో అధిక వర్షాలు సీజన్ మొదటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు ఒకేతీరుగా నమోదవుతున్నాయి. వానాకాలంలో ఇప్పటివరకు ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సంతృప్తికరమైన వర్షాలు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురవగా, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత నెలలో మందకొడిగా... జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. జూన్ 3న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పట్నుంచి రుతుపవనాలు చురుకుగా కదిలినప్పటికీ ఆగస్టులో మాత్రం కాస్త మందకొడిగా సాగాయి. జూన్, జూలైల్లో సాధారణానికి మించి వర్షాలు కురవగా... ఆగస్టులో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఆ నెలలో 21.9 సెం.మీ. సగటు వర్షపాతానికిగాను 18.6 సెం.మీ. మాత్రమే నమోదైంది. దక్షిణాది జిల్లాల్లో అతి తక్కువగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తమ్మీద గతేడాది సాధారణం కంటే 50 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్‌లో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల నడుం ఎత్తు వరకు నీళ్లున్నాయి. దీంతో బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నిత్యావసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. అనేక అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు వచ్చిచేరడంతో అక్కడివారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మోటార్లతో నీటిని తోడేసుకుంటున్నారు. సెల్లార్లు జలమయం కావడంతో లిఫ్టులు ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్లు, గోడలు కూలిపోయాయి. గతంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూల్చివేయాలని అధికారులు చెప్పినా కొందరు యజమానులు పెడచెవిన పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చింది. నీటమునిగిన పంట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు భారీ వర్షాలకు నీట మునిగాయి. గత నెలలో కురిసిన వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినగా తాజాగా మరో లక్ష ఎకరాల్లో నష్టం జరిగినట్లు సమాచారం. ఇప్పుడు 60వేల ఎకరాల్లో పత్తి పంట మునిగిపోగా, 20 వేల ఎకరాల్లో వరి, మరో 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అనధికారిక అంచనాలు ఉన్నాయి. పంట నష్టంపై అంచనాలు వేయమని సర్కారు ఆదేశించక పోవడంతో వ్యవసాయశాఖ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అత్యధిక వర్షపాతం: సిద్దిపేట, నారాయణపేట్ అధిక వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫా బాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నల్లగొండ, ఖమ్మం సాధారణం: మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ములుగు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్‌నగర్, మీర్పేట్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, బేగంపేట, హయత్‌నగర్, కోఠిలలో వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు జలమయంగా మారాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
తగ్గుతున్న ఉష్ణతాపం
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఒకట్రెండు రోజులున్నా.. ఎండలు మాత్రం అంతగా ఉండవని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమంటున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయన్నదానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
ఉసురు తీస్తున్న వడగాడ్పులు
* రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 65 మంది మృతి * ఉదయం ఏడు గంటల నుంచే ఠారెత్తిస్తున్న వేడి గాలులు * భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న చిన్నా పెద్దా * పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు * జాడలేని నైరుతి రాష్ట్రాన్ని వడగాడ్పులు వణికిస్తున్నాయి. జూన్ మొదటి, రెండో వారంలోనే నైరుతి జల్లులతో చల్లబడాల్సిన వాతావరణం చివరి వారం ముగుస్తున్నప్పటికీ నైరుతి జాడలేక చల్లబడకపోగా రోహిణీ కార్తెను తలదన్నుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఎండకుతోడు వడగాడ్పులు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రవైన వడగాడ్పుల బారిన పడి బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో మొత్తం 65 మంది మృతి చెందారు. వడగాడ్పుల కారణంగా అత్యధికంగా ప్రకాశంలో 15 మంది, విశాఖ జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుండడంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. విపరీతమైన ఎండలకు భయపడి ప్రభుత్వ ఉద్యోగులు ఆకస్మిక సెలవులు పెడుతుండడంతో పలు జిల్లాల్లో ఉద్యోగులు లేక కార్యాలయాలు బోసిపోతున్నాయి. అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విజయనగరం: జిల్లాలో వడదెబ్బ కారణంగా బుధవారం 10 మంది మృతి చెందారు. వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రతకు బుధవారం జిల్లాలో 13 మంది మృతి చెందారు. దీంతో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇదిలావుంటే, జిల్లాలో రేడియేషన్‌తో కూడిన ఉష్ణగాలులు వీస్తుండడంతో ప్రజలు చర్మవ్యాధులకు గురవుతున్నారు. ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో వడగాడ్పులకు బుధవారం ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు వడగాడ్పుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 100కు చేరింది. విశాఖ: విశాఖపట్నం జిల్లాలో వడదెబ్బకు బుధవారం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండ వేడిమి ధాటికి ఉద్యోగులు కార్యాలయాలకు సెలవులు పెట్టేస్తున్నారు. ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వడగాడ్పుల కారణంగా బుధవారం ఇద్దరు మృతి చెందారు. గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది. శ్రీకాకుళం: శ్రీకాకుళంలో వేడిగాలుల ధాటికి బుధవారం ఐదుగురు చనిపోయారు. దీంతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య 145కు చేరింది. చిత్తూరు: జిల్లాలో వడగాడ్పుల ధాటికి బుధవారం ముగ్గురు మృతి చెందారు. దీంతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య 24కు చేరింది. తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె మున్సిపాలిటీ సహా 484 గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. అనంతపురం: అనంతపురం జిల్లాలో బుధవారం పొలంపనికి వెళ్లిన ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది. రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో వడగాడ్పులతో బుధవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం: వడదెబ్బకు గురై ప్రకాశం జిల్లాలో బుధవారం 13 మంది మృతి చెందారు. ఈ నెలలో వర్షాలు లేనట్లే! సాక్షి, విశాఖపట్నం: నైరుతి పవనాలు నీరసించిపోయాయి. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా వర్షాలు పడతాయని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనపడినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఇప్పట్లో వర్షాలు లేనట్లేనని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తాపై అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున ఇప్పట్లో వానలు కురవకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక జూలైలోనే వర్షాలు పడే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఆంధ్రా, కోస్తా ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, ఇది అల్పపీడనంగా మారితే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి మరింత సమయం పట్టవచ్చని తెలిపింది. కాగా, ఉత్తరాది నుంచి వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యాయి. బాపట్లలో 43 డిగ్రీలు, ఒంగోలులో 42, నెల్లూరు, తిరుపతి, గన్నవరం, మచిలీపట్నం, నర్సాపట్నం, కాకినాడ, తునిలలో 41, విశాఖపట్నంలో 40, రామగుండం, కర్నూలులో 39, నిజామాబాద్, హైదరాబాద్‌లో 38, అనంతపురంలో 37 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు మరింత విజృంభించే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.