ఉసురు తీస్తున్న వడగాడ్పులు
* రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 65 మంది మృతి
* ఉదయం ఏడు గంటల నుంచే ఠారెత్తిస్తున్న వేడి గాలులు
* భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న చిన్నా పెద్దా
* పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
* జాడలేని నైరుతి
రాష్ట్రాన్ని వడగాడ్పులు వణికిస్తున్నాయి. జూన్ మొదటి, రెండో వారంలోనే నైరుతి జల్లులతో చల్లబడాల్సిన వాతావరణం చివరి వారం ముగుస్తున్నప్పటికీ నైరుతి జాడలేక చల్లబడకపోగా రోహిణీ కార్తెను తలదన్నుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఎండకుతోడు వడగాడ్పులు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. తీవ్రవైన వడగాడ్పుల బారిన పడి బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో మొత్తం 65 మంది మృతి చెందారు. వడగాడ్పుల కారణంగా అత్యధికంగా ప్రకాశంలో 15 మంది, విశాఖ జిల్లాలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుండడంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. విపరీతమైన ఎండలకు భయపడి ప్రభుత్వ ఉద్యోగులు ఆకస్మిక సెలవులు పెడుతుండడంతో పలు జిల్లాల్లో ఉద్యోగులు లేక కార్యాలయాలు బోసిపోతున్నాయి. అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
విజయనగరం: జిల్లాలో వడదెబ్బ కారణంగా బుధవారం 10 మంది మృతి చెందారు. వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రతకు బుధవారం జిల్లాలో 13 మంది మృతి చెందారు. దీంతో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇదిలావుంటే, జిల్లాలో రేడియేషన్‌తో కూడిన ఉష్ణగాలులు వీస్తుండడంతో ప్రజలు చర్మవ్యాధులకు గురవుతున్నారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో వడగాడ్పులకు బుధవారం ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు వడగాడ్పుల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 100కు చేరింది.
విశాఖ: విశాఖపట్నం జిల్లాలో వడదెబ్బకు బుధవారం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండ వేడిమి ధాటికి ఉద్యోగులు కార్యాలయాలకు సెలవులు పెట్టేస్తున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వడగాడ్పుల కారణంగా బుధవారం ఇద్దరు మృతి చెందారు. గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది.
శ్రీకాకుళం: శ్రీకాకుళంలో వేడిగాలుల ధాటికి బుధవారం ఐదుగురు చనిపోయారు. దీంతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య 145కు చేరింది.
చిత్తూరు: జిల్లాలో వడగాడ్పుల ధాటికి బుధవారం ముగ్గురు మృతి చెందారు. దీంతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య 24కు చేరింది. తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె మున్సిపాలిటీ సహా 484 గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో బుధవారం పొలంపనికి వెళ్లిన ఓ మహిళ వడదెబ్బతో మృతి చెందింది.
రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో వడగాడ్పులతో బుధవారం ఓ వ్యక్తి మృతి చెందాడు.
ప్రకాశం: వడదెబ్బకు గురై ప్రకాశం జిల్లాలో బుధవారం 13 మంది మృతి చెందారు.
ఈ నెలలో వర్షాలు లేనట్లే!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి పవనాలు నీరసించిపోయాయి. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా వర్షాలు పడతాయని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనపడినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఇప్పట్లో వర్షాలు లేనట్లేనని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తాపై అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున ఇప్పట్లో వానలు కురవకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక జూలైలోనే వర్షాలు పడే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఆంధ్రా, కోస్తా ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, ఇది అల్పపీడనంగా మారితే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి మరింత సమయం పట్టవచ్చని తెలిపింది.
కాగా, ఉత్తరాది నుంచి వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యాయి. బాపట్లలో 43 డిగ్రీలు, ఒంగోలులో 42, నెల్లూరు, తిరుపతి, గన్నవరం, మచిలీపట్నం, నర్సాపట్నం, కాకినాడ, తునిలలో 41, విశాఖపట్నంలో 40, రామగుండం, కర్నూలులో 39, నిజామాబాద్, హైదరాబాద్‌లో 38, అనంతపురంలో 37 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు మరింత విజృంభించే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.