భార్యను కత్తితో పొడిచి చంపిన ఎస్సై
కన్న బిడ్డల ఎదుటే దారుణం
ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడి
హైదరాబాద్: జీవితాంతం తోడుండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడుగా మారాడు.. ఆర్థిక సమస్యలతో ఆవేశానికి లోనై తనలో సగభాగాన్ని కిరాతకంగా చంపేశాడు. కన్నబిడ్డల ఎదుటే భార్యను కత్తితో పొడిచి చివరికి పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ సీఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన భానుప్రకాశ్ (45), సౌజన్య(37)లది ప్రేమ వివాహం. వీరికి తన్మయ్, కౌశిక్ ఇద్దరు సంతానం. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ సమతానగర్ ప్రసాద్ రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. కాగా, భానుప్రకాష్ నగరంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అధికారులకు చెప్పకుండా మూడేళ్ల పాటు దీర్ఘకాలిక సెలవు తీసుకున్నాడు. దీంతో అధికారులు పలుమార్లు అతనికి నోటీసులు జారీ చేశారు. అయినా భానుప్రకాశ్ నుంచి సరైన సమాధానం రాలేదు.
దీంతో గత ఏడాది అతడిని సస్పెండ్ చేశారు. నాలుగు నెలల కిందటే కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రసాద్ రెసిడె న్సీలో వీరి కుటుంబం అద్దెకు దిగింది. ఉద్యోగం పోవడంతో జీతం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో దంపతులిద్దరూ రోజూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం భానుప్రకాశ్, సౌజన్యల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశానికిలోనైన భానుప్రకాష్ కత్తితో పొడిచి భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత తన ఇద్దరు పిల్లలను ఆల్విన్‌కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. అనంతరం కేపీహెచ్‌బీ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)