ఆదివాసీలపై లాఠీచార్జి?
ఠాణా నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ
అభ్యంతరం తెలిపిన రాళ్లగెడ్డ వాసులు
అడ్డుకున్న గిరిజనులను కొట్టిన పోలీసులు
విశాఖపట్నం: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం రాళ్లగెడ్డలో బుధవారం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ పోలీస్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిసింది. ఈ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గిరిజనులపై పోలీసులు లాఠీచార్జి చేసినట్టు సమాచారం. చింతపల్లి మండలం బలపం పంచాయతీ రాళ్లగెడ్డ గ్రామంలోని గిరిజనులకు సంబంధించిన భూమిలో పోలీసుస్టేషన్ నిర్మించాలని ఇదివరకే పోలీసుశాఖ నిర్ణయించింది. దీనిపై అప్పట్లోనే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ జీవనోపాధికి, వ్యవసాయం చేసుకోవడానికి ఈ భూములొక్కటే ఆధారంగా ఉన్నాయని వారు పోలీసు అధికారులకు వివరించినట్లు తెలిసింది.
అయినప్పటికీ గిరిజనుల అభ్యర్థనలను పట్టించుకోని అధికారులు ఇక్కడే పోలీసు స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు గురువారం భూమి పూజ నిర్వహించడంతో గ్రామస్తులు వ్య తిరేకించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేసినట్లు తెలిసింది. రూరల్ ఎస్పీతోపాటు చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర, అన్నవరం ఎస్ఐ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది.