ప్రణయ్ కేసు: మీడియా ముందుకు నిందితులు
సాక్షి, మిర్యాలగూడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు తెలియజేశారు. కులాలు వేర్వేరు కావడంతోనే మారుతీరావు ప్రణయ్‌ను హత్యచేయించినట్లు తెలిపారు. ‘ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం. హత్య చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ. అతన్ని సమస్తిపూర్ కోర్టులో హాజరుపరిచాం. అమృత తండ్రి మారుతీరావు రూ. కోటి రూపాయల ఒప్పందంతో హత్య చేయించారు. ఈ కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 సుభాష్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 మహ్మద్ బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఏ7 మారుతీ రావు డ్రైవర్ శివకుమార్‌లలో ఏ2 మినహా మిగతావారిని మీడియా ముందుకు తీసుకొచ్చాం. సుభాష్‌శర్మను రేపు మీడియా ముందు ప్రవేశపెడతాం.
అస్గర్ అలీ, మహ్మద్ బారీలపై గతంలోనే కేసులున్నాయి. మహ్మద్ బారీ ప్రస్తుతం హైదరాబాద్ మలక్ పేటలో నివసిస్తున్నాడు. 2012 నుంచి మారుతీరావుకు బారీతో పరిచయం ఉంది. రాజమండ్రి జైలులో మహ్మద్‌బారీ, సుభాష్‌శర్మలకు పరిచయం ఏర్పడింది. ప్రణయ్ హత్యా ఒప్పందానికి కరీం సహకరించాడు. జనవరిలో ప్రణయ్, అమృతలు పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వల్ల వారి చదువులను మధ్యలోనే ఆపేశారు. మారుతీరావు కొన్నిసార్లు ప్రణయ్‌ను బెదిరించాడు. సెక్యూరిటీ కోసం ప్రణయ్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు. జూలై తొలి వారంలోనే హత్యకు ప్లాన్ చేశారు. మారుతీరావు తరుపున కరీం హంతకులతో మాట్లాడారు. కరీం, అస్గర్, బారీ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారు.
మిర్యాలగూడ ఆటోనగర్‌లో కారులో కూర్చుని డీల్ మాట్లాడారు. రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని ఒప్పందం కుదర్చుకొని రూ.15 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బులను కరీం,అస్గర్,బారీలు పంచుకున్నారు. హత్య తర్వాత పారిపోయేందుకు వీలుగా ముందే స్కూటీ కొన్నారు. మాట్లాడుకునేందుకు ఫేక్ అడ్రస్‌లతో మూడు సిమ్‌కార్డులు కొన్నారు. అమృతకు అబార్షన్ చేయడానికి మారుతీరావు చాలా ప్రయత్నాలు చేశారు. అబార్షాన్ చేయడానికి డాక్టర్‌పై చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆగస్టు 17న మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది. దీంతో అతనికి పరువు పోయినట్లు భావించి మరింత కోపం పెంచుకున్నాడు.
తొలి ప్రయత్నం విఫలం..
ఆగస్టు14న ప్రణయ్‌ను చంపేందుకు తొలి ప్రయత్నం చేశారు. బ్యూటీ పార్లర్ వద్ద ప్రణయ్ సోదరుడు అజయ్ కూడా ఉండటంతో ఎవరు ప్రణయో తెలియక అయోమయానికి గురై వెనక్కి వెళ్లారు. ఆగస్టు 22న సుభాష్ శర్మ మిర్యాలగూడ వచ్చాడు. అదే రోజున ప్రణయ్ ఇంటికెళ్లి అతని తండ్రిని కారు కిరాయికిస్తారా? అని అడిగాడు. సెప్టెంబర్ తొలి వారంలో అమ్మాయిని కిడ్నాప్ చేసి అనంతరం ప్రణయ్‌ను చంపుదామని కూడా వ్యూహం రంచించారు. దీనికోసం హైదరాబాద్ నుంచి కొంతమంది రౌడీలను పిలిపించారు. కానీ వారి వ్యవహారం నచ్చని అస్గర్ అలీ ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సెప్టెంబర్ 14న మధ్యాహ్నాం 1.30కు హత్య జరిగింది. ఆ రోజు శర్మ బైక్‌పై కారును ఫాలో చేసాడు. అనంతరం అస్గర్ అలీ డైరెక్షన్లో శర్మ ఒక్కడే వెళ్లి హత్య చేసాడు. అమృత బాబాయ్ శ్రవణ్‌కు మారుతీ రావుకు మధ్య మనస్పర్థాలు ఉన్నాయి. ఏ6, ఏ7 లకు ఈ కేసుతో అంతగా సంబంధం లేదు. పలు ఏజెన్సీల సాయంతో రెండు మూడు రోజుల్లో ఈ కేసును చేధించడం జరిగింది.
రాజకీయ నాయకులకు సంబంధం లేదు
ఈ కేసులో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆయన కూడా కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ప్రణయ్ తండ్రితో మాట్లాడినట్లు చెప్పారు. ఈ కేసుకు నయీం అనుచరులకు ఎలాంటి సంబంధం లేదు. మారుతీరావు ఇటీవలే టీఆర్ఎస్లో చేరాడు. కరీం కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. మహ్మద్ బారీ ఎంఐఎం పార్టీలో ఉన్నాడు. అంతేగానీ రాజకీయంగా ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు. అమృత తల్లికి కూడా ఈ హత్య గురించి తెలియదు. ఆమెను నమ్మించి కూతురుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని మారుతిరావు తెలుసుకున్నాడు.’ అని ఎస్పీ మీడియాకు వివరించారు. ఈ కేసు గురించి అసత్య వార్తాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మారుతీరావు భూదందాల గురించి త్వరలో దర్యాప్తు చేపడుతామన్నారు.