spatial election
-
85.86% తొలి విడత పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 33 మండలాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడత ఎన్నికల్లో మొత్తం 11,94,075 ఓట్లు కాగా, 10,25,195 ఓట్లు పోల య్యాయి. 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మూడు డివిజన్ల పరిధిలోని ఎంపీటీసీ 459 స్థానాలు, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 1,699 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 213 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులకు సరిసమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు మండలాల నుంచి పోలైన ఓట్లకు సంబంధించి వివరాలు విడివిడిగా రావడం ఆలస్యం కావడంతో అధికారులు ఆమేరకు పురుషులు, మహిళల ఓటర్ల సంఖ్యను నిర్ధారించలేకపోయారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా తుంగతుర్తి, వేములపల్లి, చందంపేట, మిర్యాలగూడ మండలాల పరిధిలో రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లను ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో ఆయా స్థానాల్లో ఎన్నికల తంతు ఆలస్యంగా ముగిసింది. తుంగతుర్తిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడం వల్ల పోలింగ్ మరింత జాప్యమైంది. రికార్డు స్థాయిలో పోలింగ్... ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ 12 శాతం నమోదు కాగా, ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11 గంటలకు 31 శాతంగా నమోదైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55 శాతానికి పెరిగింది. దాదాపు మొత్తం పోలింగ్ శాతం సగానికి పూర్తయ్యింది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు 31 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 16.85 శాతంతో పూర్తయింది. పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరడంతో పోలీసులు, పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డివిజన్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు... పోలింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల సాయంతో బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలనకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఓట్ల లెక్కింపు మే నెలకు వాయిదా వేయాలని ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ ఈ మార్పు చేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు కూడా డివిజన్ కేంద్రాల్లోనే నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.దామోదర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తాగునీరూ కరువే.... పోలింగ్ కేంద్రాలో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. కనీసం గొంతు తడుపుకునేందుకు మంచినీళ్లు సమకూర్చిన పాపాన పోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయలేదు. దీంతో ఓటర్లు ఎర్రటి ఎండలోనే గంటల తరబడి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది. అర్వపల్లిలోని 24వ పోలింగ్ బూతు వద్ద ఎండలోనే గంటల కొద్దీ ఓటర్లు బారులు తీరారు. అయినా క్యూ ముందుకు వెళ్లకపోవడంతో మహిళా ఓటర్లు ఒక్కసారిగా కేంద్రంలోకి చొచ్చుకపోయారు. అధికారుల తప్పిదం... ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపించింది. వేములపల్లి -1 ఎంపీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రం 36 (ప్రభుత్వ ఉన్నత పాఠశాల)లో చెట్లచెన్నారం గ్రామానికి సంబంధించిన రెండు ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు అందజేశారు. ఓటర్లు గుర్తించేంత వరకుగానీ అధికారులు మేల్కోలేదు. ఓటర్లు అభ్యంతరం చెప్పడంతో చివరకు పరిశీలించారు. దీంతో 45 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. తప్పును సరిదిద్దాక పోలింగ్‌ను కొనసాగించారు. -
ఇక.. మాటల్లేవ్! తొలివిడతకు సన్నద్ధం
ముగిసిన ప్రాదేశిక ప్రచారం నల్లగొండ, న్యూస్‌లైన్,ప్రాదేశిక ఎన్నికల తొలి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. ఇక.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. సార్వత్రిక సమరానికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అత్యధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేట, మిర్యాల గూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతుండడంతో మాజీ మంత్రులు కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అదే విధంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక సీపీఎం శాసనసభ పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపిం చాలని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. ఈ మూడు డివిజన్లలో కాంగ్రెస్ ఒంటిరిగానే పోటీచేస్తుండగా, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలు అవగాహన మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలిసారిగా ప్రాదేశిక బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను సాధించే దిశగా ఇప్పటికే పల్లెలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ నియోజక వర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. 33 మండలాల్లో ఎన్నికలు... మూడు డివిజన్లలో 33 మండలాల పరిధిలో ఎంపీటీసీ 473, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎంపీటీసీ 14 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 459 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోరులో మొత్తం 11,94,433 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5,96,704, మహిళలు 5,97,729 మంది ఉన్నారు. ఎంపీటీసీ 459 స్థానాలకు 1,699 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ 33 స్థానాలకు 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం 3,292 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 908 ప్రాంతాల్లో 1554 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీకి గులాబీ, ఎంపీటీసీ సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. మూడు డివిజన్లను 164 జోన్లుగా విభజించి 164 రూట్లను గుర్తించారు. ఎన్నికల విధుల్లో 7,770 మంది సిబ్బంది పాల్గొననున్నారు. మైక్రో అబ్జర్వర్స్ -175, వీడియోగ్రాఫర్స్-317, వెబ్ కాస్టింగ్ సిబ్బంది-52 మందిని నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా.. మూడు డివిజన్లలో 381 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అతి సున్నితమైన గ్రామాలు 383 ఉన్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది. మావోయిస్టుల ప్రభావితం ఉండే గ్రామాలు 61గా గుర్తించారు. వీటిలో 52 గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని వీక్షించనున్నారు. మరో 317 గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు ప్రత్యేకంగా 175 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.