Speaker office
-
TG: స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ తీసుకోలేదని హైకోర్టును ఆశ్రయించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను తీసుకోవాలని, పిటిషనర్‌కు ధ్రువీకరణ రశీదు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.ఎమ్మెల్యేలు దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలు చేసిన పిటిషన్లపైనా కూడా ధర్మాసనం విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారంటూ ఏజీ తెలిపారు. 3 నెలలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదన్న ఏజీ.. వివాదం కోర్టులో ఉన్నందున స్పీకర్.. పిటిషన్లను పరిశీలించలేదన్నారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
గుంటూరు, సాక్షి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ వారిని కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై సోమవారం స్పీకర్ తమ్మినేని విచారణ జరిపారు. అయితే ఇందులో స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు టైం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు కూడా. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. -
మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించారు
బెంగుళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాష్ట్ర విధాన సౌధలో ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. ప్రస్తుతం స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కార్యాలయంగా ఉన్న రెండు గదులను సిద్ధరామయ్యకు కుమారస్వామి ప్రభుత్వం కేటాయించింది. సిద్ధరామయ్యకు ఎలాంటి పదవీ లేనప్పటికి ఆయనకు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మాజీ సీఎం కోసం స్పీకర్‌ను ఖాళీ చేయించడం ఏంటని హాట్ టాపిక్‌గా మారింది. కాగా మాజీ స్పీకర్ కేబీ కోలివాడ్ ఆ కార్యాలయాన్ని వినియోగించిన కాలంలో 68 లక్షల ఖర్చుతో దాన్ని ఆధునీకరించారు. కాంగ్రెస్ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సిద్ధరామయ్యకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించలేదన్న విషయం తెలిసిందే. -
స్పీకర్ కార్యాలయంలో టీడీపీ నేతల బైఠాయింపు
తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం 9 గంటల నుంచి నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని తాము స్పీకర్ మధుసూదనాచారిని కోరామని టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు, పార్టీ మారిన నేతలపై అనర్హత వేటుతో పాటు.. గవర్నర్ ప్రసంగం సమయం నాటి అసెంబ్లీ ఫుటేజి ఇవ్వాలని తాము స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. సీట్ల కేటాయింపుపై బుధవారం నాడు స్పష్టత ఇస్తామని స్పీకర్ తెలిపారని, అయితే ఫుటేజి మాత్రం ఇచ్చేది లేదన్నారని ఆయన వివరించారు. అనర్హత విషయం తేల్చేందుకు సమయం పడుతుందని స్పీకర్ సమాధానం ఇచ్చినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ రెండు అంశాలపైనా కూడా స్పష్టత ఇచ్చేంతవరకు తాము స్పీకర్ కార్యాలయంలోనే బైఠాయిస్తామన్నారు. -
స్పీకర్ ఫార్మాట్లో 13 మంది ఎంపీలు రాజీనామా!
కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మొత్తం 13 మంది లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. ఇందులో 10 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు ఉన్నాయి. వీరిలో ఏడుగురు మాత్రమే ఇంతవరకూ స్పీకర్ మీరాకుమార్ను స్వయంగా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారని తెలిపింది. స్పీకర్‌ను కలవని ఆరుగురు ఎంపీలు స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వచ్చి మీరాకుమార్ను కలిసి వెళ్లాల్సిందిగా కోరుతూ కార్యాలయ అధికారులు వారికి నోటీసులు పంపారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఎంపీలు స్వయంగా స్పీకర్ ఎదుట హాజరై రాజీనామాలకు కారణాలను వివరించాల్సి ఉంటుందని.. రాజీనామాలను ఆమోదించేందుకు సభ్యులు ఎలాంటి ఒత్తిళ్లకు, భావోద్వేగాలకు గురికాకుండా స్వచ్ఛందంగానే పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకోవాలని భావిస్తున్నట్లు స్పీకర్ సంతృప్తి చెందాల్సి ఉంటుందని ఒక బులెటిన్‌లో వివరించారు. లోక్‌సభ నియమ, నిబంధనల్లోని 101 (3) (బి) ప్రకారం స్పీకర్ తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని విచారించే అవకాశముందని పేర్కొన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు సమర్పించిన తర్వాత కూడా సభకు హాజరైనట్లు స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన నోట్లో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించడంతో గత ఆగస్టు 2వ తేదీ తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్, జి.వి.హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి (ఇటీవల వైఎస్సార్సీపీలో చేరారు.), కొనకళ్ల నారాయణరావు (టీడీపీ), వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్) రాజీనామాలు సమర్పించారు. వీరిలో ఏడుగురు - ఉండవల్లి, లగ డపాటి, అనంత, సాయిప్రతాప్, సబ్బం హరి, రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి మాత్రమే గత నెలాఖరులో విడివిడిగా స్పీకర్‌ను స్వయంగా కలిశారు. స్పీకర్ విచారణలో వీరిలో కొంతమంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజానీకంలో పెల్లుబుకిన ఆగ్రహావేశాల కారణంగా తాము నియోజకవర్గాలకు కూడా వెళ్లలేకపోతున్నామని, రాజీనామా చేయాల్సిందిగా తమపై ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నదని అంగీకరించిన ట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌ని కలిసినప్పుడు తన రాజీనామాను, తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున జగన్మోహన్రెడ్డి స్వయంగా రాలేకపోయారని, ఆయన తరఫున తాను ఆయన రాజీనామాను కూడా ఆమోదించాల్సిందిగా కోరుతున్నానని స్పష్టంచేశారు.