గుంటూరు, సాక్షి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ వారిని కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై సోమవారం స్పీకర్ తమ్మినేని విచారణ జరిపారు. అయితే ఇందులో స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ క్రమంలో వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు టైం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు కూడా. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment