కెప్టెన్‌కు గట్టి ఎదురుదెబ్బ!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు.
డీఎండీకేకు చెందిన ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా చేసిన రాజీనామాను ఆదివారం స్పీకర్ ధనపాల్ ఆమోదించారు. అలాగే, ప్రధాన ప్రతి పక్ష పదవికి విజయకాంత్ అర్హత కోల్పోయినట్టుగా ప్రకటించారు.
♦ డీఎండీకే ఎమ్మెల్యేలు 8 మంది రాజీనామా
♦ ప్రతిపక్ష నేత పదవి దూరం
♦ ఆమోదంతో కోల్పోయిన అర్హత
♦ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనట్టే
♦ పీఎంకే, పీటీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా
♦ స్పీకర్ ధనపాల్ ప్రకటన
సాక్షి, చెన్నై : ఏ పార్టీకి అర్హత లేని దృష్ట్యా, అసెంబ్లీకి ప్రధాన ప్రతి పక్షం అన్నది లేనట్టేనని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం ఎమ్మెల్యే రామస్వామి సైతం పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
2011 అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 29 మంది డీఎండీకే సభ్యులు విజయ కేతనం ఎగుర వేయడంతో రాష్ర్టంలో అతి పెద్ద పార్టీగా ఉన్న డీఎంకేకు పెద్ద దెబ్బ తగిలినట్టైంది. కనీసం ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు.
డీఎండీకే అధినేత విజయకాంత్ ఈ ఎన్నికల ద్వారా ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఇంత వరకు బాగానే పయనం సాగినా తదుపరి పరిణామాలు అన్నాడీఎంకే, డీఎండీకేల మధ్య వైర్యాన్ని పెంచాయి. అసెంబ్లీ వేదికగా సాగిన సమరంతో వివాదం ముదిరింది. అదే సమయంలో అన్నాడీఎంకే చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో డీఎండీకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్‌గా అవతరించారు. డీఎండీకేలో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలోనే కాదు, ఇంటా బయట వ్యవహరించడం మొదలెట్టారు.
వీరిలో పాండియరాజన్(విరుదునగర్), సీ.అరుణ్ పాండియన్(పేరావూరని), మైకెల్ రాయప్పన్(రాధాపురం), టి సుందరరాజన్( మదురై వెస్ట్), తమిళలగన్(దిట్టకుడి), టి సురేష్‌కుమార్(సెంగం), శాంతి (సెంథామంగళం), అరుణ్ సుబ్రమణ్యం(తిరుత్తణి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, డీఎండీకే సీనియర్ నేత, ఆలందూరు ఎమ్మెల్యే బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేసి అన్నాడీఎంకేలో చేరారు. ఉప ఎన్నికల్లో ఆ సీటు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరింది. ఇన్నాళ్లు రెబల్ ఎమ్మెల్యేలు డీఎండీకే సభ్యులుగానే ఉంటూ రావడంతో ప్రధాన ప్రతి పక్ష నేతగా విజయకాంత్ కొనసాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా రాజీనామా చేయడం, దానికి ఆఘ మేఘాలపై స్పీకర్ ధనపాల్ ఆమోదం తెలపడంతో విజయకాంత్‌కు గట్టి షాక్ తగిలినట్టు అయింది.
అర్హత కోల్పోయిన విజయకాంత్ :
29 మంది సభ్యుల్ని కల్గి ఉన్న విజయకాంత్‌కు బన్రూటి రామచంద్రన్ రూపంలో ఓ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది మంది రాజీనామాతో సంఖ్యా బలం 20కు పడిపోయింది. ఈ ఎనిమిది మంది రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ధనపాల్ ప్రకటన విడుదల చేశారు. డీఎండీకేకు చెందిన ఎనిమిది మంది సభ్యుల రాజీనామా ఆమోదించడం జరిగిందని, అందువల్ల ఆ పార్టీ సంఖ్యా బలం 20కు చేరినట్టు వివరించారు. ఈ దృష్ట్యా, అసెంబ్లీ ప్రధాన ప్రతి పక్ష నేత పదవిని విజయకాంత్ కోల్పోయినట్టుగా, ఆ పదవికి తగ్గట్టు కల్పించిన అన్ని రాయితీలను, అర్హతలను వెనక్కు తీసుకోవడం జరుగుతున్నదని ప్రకటించారు.
ఏ ప్రతి పక్ష పార్టీకి 24 మంది సభ్యులు అసెంబ్లీలో లేని దృష్ట్యా, ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించే అర్హత ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు రాజీనామా చేయకుండా రెబల్స్‌గా వ్యవహరిస్తూ వచ్చిన డీఎండీకే సభ్యులు ఎనిమిది మంది హఠాత్తుగా స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించడం, దానికి ఆమోదం తెలపడం గమనించాల్సిన విషయం.
ఇటీవల పీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆనైకట్టు ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం నుంచి బయటకు వచ్చిన నీల కోటై ఎమ్మెల్యేలు రామస్వామి తాజాగా రాజీనామ చేసి స్పీకర్‌కు పంపించారు. వీరిలో కలైయరసన్ రాజీనామా ఆమోదిం చారు. ఆశ్రయం ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా ఇన్నాళ్లు వ్యవహరించి తాజాగా రాజీ నామా చేసి బయటకు వ స్తున్న వీరందరికీ అన్నాడీఎంకే లో సీట్లు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే.