Special appreciation
-
భయం
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ‘‘నేనెక్కడున్నాను..’’ అన్నాను మత్తుగా.. ముద్దుగా.. బద్ధకంగా. ‘‘శ్మశానంలో’’.. ఓ కోరస్ వినిపించింది. ‘‘ఎవరు మీరంతా.. ఈ తెల్లని ఏకరూప దుస్తులేంటి? చిరాకుగా ఉంది’’ మత్తుగా అన్నాను. ‘‘నీకింకా మత్తు దిగినట్టు లేదు. కల్తీ కల్లు తాగితే చస్తార్రా ఎదవల్లారా అంటే వినరు కదా’’... కోరస్‌గా గొంతు. ‘‘కల్తీ కల్లు దొరక్క చస్తుంటే.. మీ బృందగానాలొకటి’’... విసుక్కున్నాను. ‘‘నీకు మరీ భాషాభిమానంలా ఉందే. ఇంతకీ ఇక్కడికొచ్చి ఎందుకు చచ్చావు’’... మళ్లీ కోరస్. నాకు కోపం వచ్చింది. ‘‘నేను చావలేదు. బ్రతకలేక చస్తున్నాను. చచ్చేలా బ్రతుకుతున్నాను.’’ ‘‘నాయన... ఆ పేపర్ భాష ఆపు. లేకపోతే మేము చంపుతాం.’’ ‘‘ఇంతకీ ఎవరు మీరంతా. ఈ తెల్లని దుస్తులెందుకేసుకున్నారు? ఆ జుత్తెందుకు అలా వదిలేసారు?’’ ‘‘మేము దెయ్యాలం. ఏమో.. సినిమాల్లో, కథల్లో ఇలాంటి డ్రస్సే వేయాలని చెప్పారు కదా..’’ ‘‘అవునా.. మరి నేను..’’ అన్నాను. ‘‘అది నీవు చెప్పాలి’’ అన్నాయి దెయ్యాలు. ‘‘అవును. శ్మశానాలు ఇంకా ఉన్నాయా? అన్నీ కబ్జా అయిపోయాయి కదా. ఎవరింట్లో వారే చచ్చినవారిని తగలేసుకోవలసిన దినాలు కదా. అందుకయ్యే ఖర్చులు కూడా సబ్సిడీ మీద ఋణాలు ఇస్తున్నాయి కదా బ్యాంకులు.’’ ‘‘కావచ్చు ఆ కథలు తరువాత. ముందు నీ కథ చెప్పి చావు.’’ ‘‘మీ దెయ్యాల కథ చెప్పి చావండి’’... రిటార్ట్ ఇచ్చా. ‘‘ఆల్రెడీ చచ్చాం. మళ్లీ చావాలా. సరే చెబుతాం ఇను.’’ విశాఖ నగరం... అందమైన నగరం. స్మార్ట్ సిటీగా ఎంపికైంది. అంతా వెలిగిపోతున్నాదని నాయకులు ‘గంటా’ (పదం తప్పకాదు) పథంగా చెబుతున్నారు. అటువంటి నగరానికి దూరంగా ఓ పెద్ద ఫై ్ల ఓవరుంది. దాని కింద కొన్ని గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లో మనుషులు లేని వేళ పందులు, అవి లేని వేళ మనుషులుంటారు. మనుషులంతా రోజులో ప్రపంచంలో ఎన్ని రకాల పనులున్నాయో అన్ని రకాలు చేస్తారు. కొందరు ‘రాత్రి పనులు’ మాత్రమే చేస్తారు. ఆకలి కదా మరి. ఏది ఏమైనా వారంతా మనుషులు. మనుషులు కాని మనుషులు. విశాఖ నగరంలో... అందమైన నగరంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ప్లీట్లు జరుగుతున్న నగరంలో ఉన్న ప్రాంతం. అక్కడ బతుకుతున్న జనం... ఒకరోజు... ‘ఇక్కడ నుంచి మెట్రో రైలు మార్గం వేస్తున్నారు. పనులు తొందరలోనే జరుగుతాయి. వారంలోగా మీరంతా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి’ అని అధికారులు తాఖీదులిచ్చారు. ‘‘అంటే ఏమిటి?’’ అడిగారు జనం అమాయకంగా. ‘‘అభివృద్ధి.. రైలుమార్గం.. జపాన్.. సింగపూర్‌లా అన్నమాట’’ అధికార్లు బూరా ఊదారు. ‘‘అక్కడ కూడా మాలాంటి వారున్నారన్నమాట. వారిని తరిమేసి, రైళ్లు వేసారన్నమాట. మనుషుల కన్నా అవే ఎక్కువన్నమాట’’ అన్నారు మరింత అమాయకంగా. ‘‘మీకు ప్రభుత్వం భూములిస్తుంది. ఇళ్లు కట్టుకొనేందుకు బ్యాంకులు లోనిస్తాయి. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అన్నపూర్ణ, ఆధార్, పాన్ కార్డులిస్తారు. మీ పిల్లలకు ఉద్యోగాలు...’’ ‘‘మాకు పెళ్ళిళ్ళు కాలేదయ్యా. ఎవరూ పిల్లనివ్వలేదు’’ అన్నారు మగాళ్లంతా. ‘‘పెళ్ళి చేసుకోవటానికి పిల్లలు కావాలని ఓ పిటిషన్ రాసివ్వండి. కలక్టర్కిస్తాం’’ అని ఒక అధికారి నాలిక కరుచుకున్నాడు. ‘‘అలాగే సామి.. ఓ పది మందైతే సరిపోతారు. లేదా సర్దుకుపోతాం. ఎలా రాయాలో మీరే రాసియ్యండి సామి. ఏలి ముద్రగాళ్ళం... మాకేటి తెలుస్తాది. కావాలంటే నిశానీలేస్తాం’’ అన్నారు జనం.. మరింత అమాయకత్వంతో. అధికార్లు అసహనంగా, కోపంగా ‘‘మరో వారానికి ఖాళీ చేయండి’’ అన్నారు మరేమీ అనలేక. ప్రతిపక్షం వాళ్లు వద్దన్నారు. ప్రభుత్వం వారిని ‘అభివృద్ధి నిరోధకులంది’. ఒకరోజు... నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయింది. దాదాపు పదిహేను మంది చనిపోయారు. కాంట్రాక్టరు చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఇచ్చాడు. తరువాత నిర్మాణ పనుల బడ్జెట్ పెంచాడు (లంచాల శాతం పెరిగింది..ట). ప్రభుత్వం ‘మానవతా దృక్పథం’తో స్పందించి బడ్జెట్‌ను అంగీకరించింది. అలాగ జనం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసారు. కాదు... భయపెట్టి ఖాళీ చేయించారు. ఇది జరిగి పదిహేనేళ్ళయింది. అక్కడ ఏమీ లేదు. విరిగిన ఫై ్లఓవర్ను మాత్రం అతికారు. ఆ పదిహేను మందిలో మేము కూడా ఉన్నాం. ‘‘దారుణం..’’ అన్నాను నేను. ‘‘నిజమే.. దారుణం..’’ దెయ్యాల కోరస్. ‘‘ఇప్పుడు చెప్పు నీవెందుకు చావాలనుకున్నావు. ఇంతకీ చచ్చావా లేదా?’’ ‘‘తెలియదు. ప్రస్తుతానికి చస్తూ బ్రతుకుతున్నాను. బతకటానికి చస్తున్నాను.’’ ‘‘ఆపు ఆ సినిమా భాష. వినలేక ఛస్తున్నాం’’ దెయ్యాల కోరస్. ‘‘అదేంటి చచ్చామన్నారు కదా. అంటే చావలేదా..?’’ నా సందేహం. ‘‘కోడిగుడ్డు మీద ఈకలు లాగటం ఆపి, అసలు విషయం చెప్పిచావు’’ అన్నాయి దెయ్యాలు కోపంగా. దెయ్యాలు కోపాన్ని ఎల్లా ఎక్స్‌ప్రెస్ చేస్తాయి..? సందేహాలు మానేసి.. సమాధానం చెప్పదలచాను. ‘‘నేనో మధ్యతరగతి మనిషిని. ఆశలు, భయాలు ఎక్కువ. భయాన్ని ఆశలు చంపుతాయి. కోరికలు తలెత్తుతాయి.’’ ‘‘నీకు టీవీలో బాబాలు చెప్పే సొల్లు వినే అలవాటుందా నాయనా’’ అంది ఓ దెయ్యం బాబా లెవెల్లో. ‘‘అది దెయ్యం బాబాలే నాయనా. నీవు చెప్పు’’ అన్నాయి మిగిలిన దెయ్యాలు. ‘‘అంటే.. బాబాలాంటి దెయ్యమా? దెయ్యం లాంటి బాబానా? ఇక్కడ దెయ్యాల లాంటి బాబాలే ఎక్కువ కదా.’’ ‘‘అవన్నీ తరువాత. ముందు నీ కథ చెప్పు.’’ ‘‘ఓ.కె. ఒకనాడు ఓ గోల్డ్ స్కీమ్ ఏజంట్ వచ్చాడు... పది వేలు కడితే ఆరు నెలలకి లక్షన్నర ఇస్తామని. నేను మరో పదిమంది చేత కట్టిస్తే రెండు లక్షలిస్తారని చెప్పాడు. బంగారం లాంటి అవకాశమన్నాడు. నేను నమ్మాను. మరో పదిమంది చేత నమ్మించాను. సంవత్సరం తిరిగే సరికి గోల్డ్ సంస్థను మూసేసారు. నిండా మునిగాను. నన్ను నమ్మినవారు మునిగారు. నన్ను తంతామన్నారు. తన్నేరు కూడా. బాధను మరవటానికి తాగాను. మా ఆవిడ నన్నొదిలేసి కన్నవారింటికి వెళ్ళిపోయింది. పోలీసు కేసు పెట్టారు. స్నేహితులు కాపుకాసి కాపాడారు. జైలుకి వెళ్ళవలసిన అవసరం తప్పిపోయింది. ఊరి నుంచి పారిపోయాను. చద్దామనుకుంటున్నాను. చెప్పండి... చావాలా? వద్దా?’’ నాకు ఏడుపు వచ్చింది. కన్నీరు మూసీ నదిలోని మురికి నీరులా తన్నుకు వచ్చింది. ‘‘అయినా ఒరే.. పది వేలు కడితే ఆరు నెలల్లో లక్ష ఎలా ఇస్తారురా. ముష్టివాడికి పావలా వేయటానికి చెల్లదని తెలిసినా పదిసార్లు ఆలోచిస్తారు కదా. లక్షలకు లక్షలు ఎలా వాడి ఎదాన పడేస్తున్నారు. ఎర్రి సన్నాసులారా..!’’ ‘‘ఆశ నాయనా. ఆశ.’’ బాబా దెయ్యం ఉవాచ. ‘‘నువ్వు కాస్త మూసుకో. అర్ధరాత్రి అమ్మాయిల సేవలను భక్తి సేవలని చెప్పే కామ బాబాలు చెప్పే మాటలంటే అసహ్యం.’’ ‘‘అంటే.. మన బాబా దెయ్యం కూడా అదే టైపా?’’ అన్నాను ఆశగా. ‘‘నోర్ముయ్. వెధవ మనిషి సందేహాల నీవునూ’’ అన్నాయి దెయ్యాలు. కొంచెం సేపు మా మధ్య నిశ్శబ్దం. తూర్పున వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. ‘‘నాయనా.. వర్తమానంలో అధికార్లు, ప్రభుత్వం, చిట్ కంపెనీలు అన్ని ఓ మాయ. ఓ దెయ్యాల ప్రపంచం.. బాబాల కన్నా వారే కమ్మగా కబుర్లు చెబుతున్నారు. వారికి కావలసిన విధంగా జనాలను మలుచుకుంటున్నారు. జనాలు చావాలనుకోకూడదు. బ్రతకాలి. అటువంటి వారికి బుద్ది చెప్పటం కోసమైనా బతకాలి’’ బాబా దెయ్యం సలహా. మిగిలిన దెయ్యాలు అదే నిజమన్నాయి. శ్మశానం నిశ్శబ్దమైపోయింది. నగరం లాంటి శ్మశాన నిశ్శబ్దం కన్నా శ్మశాన నిశ్శబ్దం బాగుంది. ప్రశాంతంగా ఉంది. నేను మెల్లగా లేచాను. దెయ్యాలకున్న పాటి జ్ఞానం కూడా నాకు లేనందుకు బాధపడ్డాను. ఇదంతా కలా..? నిజమా..? నేను దెయ్యాలను చూసానా? వాటితో మాట్లాడానా? వాస్తవంలో ఇది సాధ్యమా? వాస్తవమే. చావు భయం.. చావలనే ధైర్యం.. దెయ్యాల వంటివి. వాటితో నేను ఎంతో కాలంగా సహజీవనం చేస్తున్నాను. కోరికలు కూడా దెయ్యాలే. మరణాన్ని అవి ఆహ్వానిస్తాయి.’’ ఏదో ఉపన్యాసంలో సద్గురు జగ్గీబాబా మాటలు గుర్తుకు వచ్చాయి. ‘‘జీవితమూ మరణమూ కలిసే వస్తాయి. జీవనం సాగాలంటే, మరణం సంభవించడానికి అవకాశం ఇచ్చి తీరాలి. భయం సహజమైనది కాదు. దాన్ని సృష్టించే వ్యక్తే, దాన్ని సృష్టించడం ఆపేస్తే సరి. భయమనేది మిమ్మల్ని మీరే ఓడగొట్టుకొనే ఆయుధం. భయాన్ని తరిమేయాలని అనుకోవటం కన్నా, అది సృష్టించబడకుండా ఉండటమెలాగో చూడాలి. భయం లేకుండా జీవిస్తే జీవితమంతా అవకాశాలమయంగా కనిపిస్తుంది. ఆటంకాలు తొలగిపోయి జయాలు తప్పక సిద్ధిస్తాయి.’’ ఆ దిశగా నేను ప్రయాణించాలనుకొన్నాను. నేను దెయ్యాలను చూడాలనుకోవటంలేదు. బహుశా ఇంక అవి కనిపించకపోవచ్చు. - భమిడిపాటి గౌరీశంకర్ -
బలేటోళ్లు
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ఒళ్లంతా చెమట. వెంకటేశ్, భాస్కర్ టీషర్ట్లు తడిచిపోయాయి. ఇద్దరూ శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల ప్రధాన భవనం చుట్టూ ఉండే తారు రోడ్డుపైన మార్నింగ్ వాక్ చేస్తున్నారు. వయసు యాభైకి దగ్గర. వేళకు మంచి ఆహారం, తగినంత నిద్ర ఉండడం, ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో వారి వయసు కంటే ఐదారేళ్లు తక్కువగా కనిపిస్తున్నారు. ‘‘మీకేం సార్.. ఇద్దరూ కొడుకులు.. ఖర్చు తక్కువ’’ అన్నాడు వెంకటేశ్ అంతకు ముందు మాటలకు కొనసాగింపుగా. ‘‘మీకు ఒకమ్మాయే కదా సార్. మాకంటే మీకే ఖర్చు తక్కువ. మాకిద్దరు పిల్లలు. వాళ్లకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం. అన్నీ డబుల్ డబులే కదా’’ బదులిచ్చాడు భాస్కర్. ‘‘మీరెంత పెట్టినా చదువుకే. పెండ్లికేమీ ఖర్చుండదు. మాకట్ల కాదే. పేరుకే ఫిఫ్టీ టూ సేలరీ. అందులో కటింగ్స్, సేవింగ్స్, ఇంటి లోనిన్స్టాల్మెంట్ పోను చేతికొచ్చేది ట్వంటీ కూడా ఉండదు. దాంట్లో మళ్లా నెలనెలా గోల్డ్ కోసం షాపులో ఫైవ్ థౌజండ్ కడతాండాం. బయట ఫైవ్ లేక్స్ చీటీ వేసిండాం. మీరూ వేసినారు కదా. ఇంకేంది సార్ మిగిలేది. ఎవ్రీ మంత్ మంతెండింగ్ వచ్చిందంటే బండ్లోకి పెట్రోలుక్కూడా డబ్బుండడం లేదు.’’ నిజమే అన్నట్టు తలూపి, ‘‘మీకూ మాకూ పెద్ద తేడా ఏం లేదుసార్. మీరు మీ అమ్మాయి పెండ్లి చేసేదానికి ఇప్పటి నుంచీ సేవింగ్స్ చేస్తాండారు. మేము మా కొడుకులకు ఉద్యోగాల కోసం సేవింగ్స్ చేస్తాండాం. నాకు మీ కన్నా టూ తౌజండ్స్ ఎక్కువంతే కదా జీతం. అయినా మంతెండింగ్కు చేతిలో సింగిల్ రూపీ ఉండదు.’’ ‘‘లాస్ట్ మంత్ మా అమ్మాయి బర్త్‌డేకు ఫోర్ గోల్డ్ బ్యాంగిల్స్ కొన్నాం. ఇప్పుడొద్దంటే మా మిసెస్ వినలా. తర్వాతైనా కొనాల్సిందే కదా అంది. ఫోర్ బ్యాంగిల్స్ కలిపి ఎయిటీ గ్రామ్స్పైన్నే ఉన్నేయి. దగ్గర దగ్గర టూ అండాఫ్ లేక్ అయింది. మా బామ్మర్ది దగ్గర ఫిఫ్టీ చేబదులు తీసుకున్నే. వాడికి చీటీ పాడినప్పుడు ఇస్తానన్నే.’’ ‘‘మీరన్నా మేలుసార్. మాకు టొంటీ లేక్స్ అయిందే. ఉండే ఇల్లు ఒగనికి సరిపోతుంది. ఇంకోడికి..? నగలు బ్యాంకులో పెట్టి, ఇంగో లోను పెట్టి, అప్పులు చేసి టొంటీ లేక్స్‌తో స్థలం కొన్నేం. మీక్కూడా తెలుసు కదా. మనకు జీతాలు సరిపోవడం లేదు సార్.’’ ఇద్దరూ తమ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను, ఒంట్లోంచి చెమటను వెళ్లగక్కుతూ నడుస్తున్నారు. సమయం ఆరున్నర. ఆరుగంటలకే ఉదయించిన సూర్యుడు అప్పుడే తన ప్రతాపం చూపుతున్నాడు. ‘‘గుడ్ మానింగ్ సార్’’ అంటూ వచ్చాడు చంద్ర. ‘‘అప్పుడే మీ నడక ఐపోయినట్టుంది?’’ అడిగాడు భారంగా అడుగులేస్తూ చంద్ర. చంద్రకు కూడా యాభై ఏళ్లకు అటూ ఇటుగా ఉంటుంది. ఆరడుగుల పొడవున్నాడు. పెద్ద బొజ్జ. నడక కూడా కష్టంగానే ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తి డాక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో నెల నుంచీ క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. ‘‘ఎలా ఉంది సార్ బిజినెస్’’ అడిగాడు భాస్కర్. ‘‘ఇప్పటికైతే పర్లేదు సార్. ఈసారి వానలు బాగా పన్నేయి. జిల్లాలో రైతులంతా వరి సాగు చేశారు. బియ్యం రేటు పడిపోతుందేమో’’ అన్నాడు చంద్ర. అతని వద్ద ఎప్పుడూ రెండు వందల టన్నులకు తగ్గకుండా బియ్యం ఉంటాయి. చంద్ర బియ్యం వ్యాపారం చేసే వ్యక్తిలా లేడు. రైతులు పండించిన ధాన్యం మొత్తం ఒక్కడే తినేసినవాడిలా ఉన్నాడు. ‘‘అనంతపురం, కడప, నెల్లూరు, మన జిల్లాలో మాత్రమే వానలు. ఇంక రాష్ర్టంలో ఎక్కడా వానల్లేవు.’’ ‘‘మీకేం భయం లేదు లేండీ. మన ముఖ్యమంత్రి పుణ్యమా అని ఈసారి సుమారు అరవై వేల ఎకరాల్లో కోస్తాలో వరి పండదులే.’’ ‘‘అదేంటండీ.. ముప్ఫై వేల ఎకరాలే కదా... గవర్నమెంట్ తీసుకుంది.’’ ‘‘గవర్నమెంట్ తీసుకుంది ముప్ఫై వేల ఎకరాలే. రియలెస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసింది... ముప్ఫై కంటే ఎక్కువే ఉంటుంది. ఒక్కసారిగా అరవై వేల ఎకరాల్లో వరి పండకపోతే.. అమ్మో... తలచుకుంటేనే భయమేస్తా ఉంది.’’ ముగ్గురూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. పెద్ద కానగచెట్టు కిందున్న సిమెంట్ అరుగు మార్నింగ్ వాక్కు వచ్చినవారితో కిటకిటలాడుతోంది. రోజూ అక్కడికి తెలుగు దినపత్రిక ఒకటి, ఆంగ్ల దినపత్రిక ఒకటి వస్తాయి. వాటిలో తలా ఒక పేపర్ చేతిలోకి తీసుకుని కొందరు సీరియస్‌గా ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉందన్నట్టుగా చదువుతున్నారు. కొంతమంది మార్నింగ్ టాక్ కోసమే వచ్చినట్టుగా ఉంటారు. వారక్కడికి వచ్చినప్పటి నుంచి మాట్లాడ్డమే పనిగా పెట్టుకోనుంటారు. వాళ్లు ఏ విషయంపైనైనా సరే మాట్లాడతారు. ఆ రోజు కూరగాయలపైన చర్చ వాడి వేడిగా సాగుతా ఉంది. అక్కడున్న వాళ్లలో రైతులెవరూ లేరు. అయితే వారిలో చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చినవారే. వాళ్లకు కాస్త దూరంలో ఉండే బెంచీపైన విశ్రాంతిగా కూర్చున్నారు వెంకటేశ్, భాస్కర్. ‘‘కందిపప్పు టూ హండ్రెడ్ దాటిపాయ. ఆనియన్ సెవంటీ. తెల్లగడ్డలు టూ హండ్రెడ్. టమోటాలు ఫిఫ్టీ. కాకర, బీన్స్, క్యారెట్, చిక్కుడు ఆరవైకి తక్కువలే. వంకాయ, ముల్లంగి, బంగాళదుంప, పచ్చిమిరప ఫార్టీ పైన్నే.. ముందు ముందు మనట్లాటోళ్లకు ఇంకా కష్టమైపోతాదేమో సార్’’ అన్నాడు వెంకటేశ్ ‘‘నిజమే సార్.. రైతుల పనే మేలుగా ఉండాది. మా ఊర్లో ఒగాయన రెండెకరాల్లో టమేటాలు ఏసినాడంట. ఇప్పుడు కిలో ఫిఫ్టీ పైన్నే ఉంది. ఇప్పటికే టూ లేక్స్ వచ్చేసిందంట. ఇంగా టూ లేక్స్ వస్తాదంటా ఉండారు.’’ చెప్పాడు భాస్కర్. ఇంతలో చంద్ర గసపోస్తా వచ్చి వాళ్ల పక్కనుండే బెంచీపైన కూర్చున్నాడు. ‘‘కుచ్చొనేస్తిరే. నడక ఐపోయినట్టుంది’’ మాటల్లో వ్యంగ్యం ధ్వనించకుండా వ్యంగ్యంగా అడిగాడు వెంకటేశ్. ‘‘ఔను సార్. మీ మాదిరిగా ఉంటే ఎన్ని రౌండ్లయినా వేయచ్చు. నాకు కష్టం’’ నవ్వుతూ చెప్పాడు చంద్ర. ‘‘మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినోళ్లం కదా. చిన్నప్పుడంతా బాగా కష్టపడినాం. అందుకే ఇప్పుడింత స్ట్రాంగ్‌గా ఉన్నాం’’ చెప్పాడు భాస్కర్. ‘‘నేను చిన్నప్పటినుంచీ కష్టమంటే ఏందో తెలీకుండా పెరిగినా సార్. ఇప్పుడిట్ల ఒళ్లు చేసి నడవాల్సి వస్తాండాది. ఇప్పుటికీ మీకు ఊర్లో సేద్యం ఉందా సార్’’ అడిగాడు ఆసక్తిగా చంద్ర. ‘‘ఇంకా ఎక్కడ సేద్యం. ఆడ నీళ్లా పంటలా పాడా. ఎప్పుడో అమ్మేసి ఈడ ప్లాట్ తీసుకున్నేం. దాంట్లోనే ఇల్లు కట్టుకోనుండాం.’’ ‘‘సేద్యం చేస్తా ఉంటే ఎన్నేండ్లున్నే మా బతుకులూ ఆడికాడికే ఉండేటియి. ఏదో మా పెద్దోల్లు తినీ తినక చదివించడంతో ఇప్పుడీ స్థాయికొచ్చినాం.’’ ‘‘నిజమే సార్. ఉద్యోగస్తుల పనే మేలు. యాపారంలో పోటీ పెరిగిపోయిండాది. మా నాయన సంపాదించిందాన్ని పోగొట్టుకోకుండా ఉంటే చాలు. దానికే చానా కష్టంగా ఉండాది.’’ ‘‘ఉద్యోగుల పని ఏం మేలోలే. పోదామా సార్’’ లేస్తూ అన్నాడు భాస్కర్. ఒళ్లంతా చెమట. రామచంద్ర వేసుకున్న కాటన్ షర్టు, భరత్ టీషర్టూ తడిసిపోయాయి. రామచంద్రకు నలభై ఏళ్లు. వేళకు సరైన తిండి, తగినంత నిద్ర లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మరో ఐదారేళ్లు పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అతని కొడుకు భరత్‌కు పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదవుతున్నాడు. మనిషి పీలగా, పొట్టిగా పదేళ్ల పిల్లాడిలా ఉన్నాడు. రామచంద్ర నెత్తిన వంకాయల గంప ఉంది. గంపకు చుట్టూ మూరడెత్తు ఒక గుడ్డ కట్టారు. పాతిక కిలోల కాయలుంటాయి. దానికి తోడు చేతిలో మరో సంచీ ఉంది. దాంట్లో బెండకాయలు, తక్కెడ, తూకం రాళ్లు ఉన్నాయి. తిరుపతికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపల్లె వాళ్లది. వాళ్లు తిరుపతికి రావాలంటే మూడు కిలోమీటర్లు నడిచి తన పల్లెకు రావాల. అక్కడి నుంచి బస్సో, ఆటోనో ఉంటుంది. అందులో కూడా మనిషికి పది రూపాయలు. గంప ఉంటే మరో పది రూపాయలు. గొల్లపల్లె నుంచి తిరుపతికి ఇద్దరు మనుషులు ఒక గంపను తీసుకుని ఆటోలో రావాలంటే వంద ఇవ్వాల్సిందే. వంద రూపాయలుంటే ఏదైనా అవసరం తీరుతుందని తిరుపతికి నడక మొదలుపెట్టాడు రామచంద్ర. అతడి పక్కనే వస్తున్నాడు భరత్. తండ్రీకొడుక్కు ఎదురుగా వచ్చి ఆపి స్కూటరాపి ‘‘ఏం రామచంద్రా! పిల్లోన్నిగూడా నడిపిస్తాండావే’’ అన్నాడు నవ్వుతూ రాజారెడ్డి. ‘‘ఏం చేద్దాంనా. మా రాతలట్లుండాయి. దించుకోన్నా’’ అన్నాడు రామచంద్ర. అప్పటికే అతను స్కూటర్ సైడ్ స్టాండ్ వేశాడు. రామచంద్ర తల పైనుండే గంపను కిందకు దింపుతా ‘‘ఇంత బరువుందేందిప్పా’’ అన్నాడు. ‘‘వంకాయల్నా’’ అన్నాడు తలపైన చుట్టను విప్పదీసి టవల్‌తో ముఖం తడుచుకుంటా రామచంద్ర. ‘‘ఈ మధ్య కనపన్నే లేదు. నీళ్లు తాగతావా’’ అని సమాధానం కోసం చూడకుండా స్కూటర్ సైడ్ బ్యాగులోంచి ఓ బాటిల్ తీసి ఇచ్చాడు. సగం బాటిల్ నీళ్ల్లు గటగటా తాగేసి కొడుక్కు ఇచ్చాడు. వాడు దానిని చేతిలోకి తీసుకుని తాగుదామా వద్దా అన్నట్టుగా రాజారెడ్డి ముఖంలోకి చూశాడు. ‘‘పర్వాలేదులే తాగు. నేను తణపల్లెలో పట్టుకుంటాలే’’ అన్నాడతను. ‘‘ఎకరా నేలలో వంకాయలు ఏసినాంనా. ఇంగో ఎకరాలో టమేటా ఏసినాం. వానలు పడేలకు ఎండిపోయిన బోర్లో నీల్లొచ్చినాయి. రెండెకరాల్లో వరేసినాం. క్షణం తీరికలేదునా.’’ ‘‘అయితే ఇంగేమప్పా. నువ్వే షావుకారివి’’ సిగరెట్ తీసి వెలిగించి, ఒక సిగరెట్ రామచంద్రకు ఇస్తా అన్నాడు రాజారెడ్డి. రామచంద్ర సిగరెట్‌ను చేతిలోకి తీసుకుంటా కొడుకు వైపు చూశాడు. ‘‘ఏంరా. నీగ్గూడా కావాల్నా సిగరెట్టు’’ నవ్వుతూ అడిగాడు రాజారెడ్డి. ‘‘అమ్మకు చెప్పేస్తా’’ అన్నాడు వాడు నీళ్లు తాగేసి బాటిల్‌కు మూత వేస్తా. ‘‘ఇది సిగరెట్టురా. బీడీ కాదులే’’ నంగి నంగిగా కొడుకుతో అని వెలిగించాడు రామచంద్ర. ఏమయింది అన్నట్టుగా కండ్లెగరేసినాడు రాజారెడ్డి. ‘‘ఆరోగ్యం బాగలేదన్నా. కరెంటు రేత్తిరిపూట ఇస్తారు. నీళ్లు కట్టాలంటే మేలుకోవాల. మేలుకునేదానికి బీడీలు తాగి తాగి దగ్గొచ్చింది. డాక్టర్ కాడికి పోతే బీడీలు మానెయ్యమని చెప్పినాడు. నెలయిందినా మానేసి’’ చెప్పాడు రామచంద్ర. ‘‘పగలు పూట తొమ్మిది గంటలు కరెంటిస్తామంటా ఉండారు.’’ ‘‘అయ్యన్నీ అయినప్పటికిలేన్నా. రాజకీయ నాయకుల మాటలు భూమిలో నాయట్లావోడు ఏసిన ఇత్తనాల్లాంటియి.’’ ‘‘ఇత్తనం వేసినాక మొలస్తాది. పంట చేతికొస్తాది..’’ అది మంచిదే కదా అన్నట్టుగా మాట్లాడాడు రాజారెడ్డి. ‘‘అదే నిజమయితే మా బతుకులు ఇట్లెందుకుంటాయినా. ఇత్తనాలు మంచియి కాకుంటే, ఇత్తనం ఏసినాక నీళ్లు లేకపోతే.. మొల్చినాంక వానలు పడకపోతే.. కాయలు కాసే ఏళకు ఏదైనా రోగమొస్తే.. కోతకొచ్చినప్పుడు వడగండ్ల వానొస్తే.. తీరా పంట పండినాంక రేటు లేకుంటే..’’ ‘‘అయితే రాజకీయ నాయకులు చెప్పినోటియి నెరవేరవా’’ నవ్వుతూ అడిగాడు రాజారెడ్డి. ‘‘ఎందుకు నెరవేరవు. కీనీరు బాయి ఉండి, ఇత్తనం గింజలు మనమే ఎత్తిపెట్టుకోనుండి, పంట సాగుచేస్తే, రోగాలు రాకుండా మందులు కొట్టి, పంట కోసి, ఇంట్లో పెట్టుకుని, రేటొచ్చినప్పుడు అమ్ముకుంటే బాగనే ఉంటాది. ఇట్లా ఎంతమందికయితాది. ఇరవై ముప్ఫై ఎకరాల సేద్యం, రెండు మూడు మిద్దెలు, ఒకటి రెండు ట్రాక్టర్లు ఉండే వాళ్లకయితే సరి. ఏ పంటేసినా బాగొస్తాది. ఆ మాదిరిగా రాజకీయ నాయకులు కూడా అన్నీ ముందే చూసుకోని ఏది చెయ్యగలం ఏది చెయ్యలేం అనేది ఆలోచించి మాటిస్తే నెరవేరతాది. లేదంటే... ఇదో మేం సేద్దిం చేసినట్లే ఉంటాది.’’ ‘‘నాలుగెకరాలు సాగు చేసినానంటివి. ఈసారితో నీ బాధలన్నీ పోతాయిలే.’’ ‘‘ఏం లాబంలేనా. ఎకరా టమేటా పనికి రాకుండా పోయింది. ఇత్తనాలు మంచియి కాదు. చెట్లు పెరిగినాయే కానీ పూతే లేదు. వంకాయలు గూడా బాగేం కాయలా. వాటికేందో రోగమొచ్చిండాది. చెట్టుకు ఆరేడుండాయంతే. ఇదే తొలి కోత. ఎకరా అంతా తిరిగి కోస్తే ఈ కాయలయినాయి. వరి కత చూడాల’’ అన్నాడు రామచంద్ర. ‘‘నీళ్లుంటే వరికేంలే. బాగనే పండతాది’’ చెప్పాడు రాజారెడ్డి. ‘‘నాయనా.. నాకు సైకిల్ తీసివ్వాల’’ అప్పటివరకూ వాళ్ల మాటలు వింటా నిలబడుకోనుండే భరత్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. ‘‘సైకిలెందుకురా నీకు’’ అడిగాడు రాజారెడ్డి. ‘‘బడికి పొయ్యేదానికి.’’ ‘‘బస్సులో పోవచ్చు కదా.’’ ‘‘మా వూరికి బస్సు రాదు’’ చకచకా సమాధానాలు చెప్పాడు భరత్. ‘‘నీకూ తెలుసు కదాన్నా. మా ఊరికి బస్సు రాదు. రెండు మైళ్లు నడుచుకోని తణపల్లెకొచ్చి ఆట్నించి బస్సుకు తిరపతికి పోవాల. ఈ రూట్లో బస్సులు తక్కువ. ఆటోలకు చార్జీలెక్కువు. రోజూ పుస్తకాల బ్యాగెత్తుకోని నడవాలంటే కష్టంగా ఉండాది. సైకిల్ కావాలని రెండేండ్లగా అడగతాండాడు’’ చెప్పాడు రామచంద్ర. ‘‘ఒగడే కదా కొడుకు. సైకిల్ తీసీలేవా.’’ ‘‘కూతురుండ్లేదానా. ఇప్పుడంటే వానలు పన్నేయి. పదేండ్లగా మనకు వానలేడ? నీళ్లులే. పంటల్లే. కూలిపన్లకు పోతాంటిమి. నీ దెగ్గిరిక్కూడా వచ్చినాం కదాన్నా పనికి. పేరుకు నాలుగెకరాల సేద్యగాన్ని. నాలుగు లక్షల దాంకా అప్పులుండాయి. మొండోన్ని కాబట్టి బండిలాక్కస్తాండా.’’ ఔనన్నట్టు తలూపి ‘‘మొండోళ్లు కాకపోతే ఇట్లా ఊర్లల్లో సేద్యం చేసి బతకలేరు. ఎన్నో క్లాసురా’’ అడిగాడు భరత్‌ను. ‘‘నైన్త్.’’ ‘‘ఓ.. ఇంక టెన్త్ క్లాసా. బాగా చదువుకో. మీ నాయన్ను చూస్తాండావు కదా. సేద్యంతో ఎంత కష్టపడతాండాడో. బాగా చదివి ఉద్యోగం తెచ్చుకోని మీ నాయన్ను కుచ్చోబెట్టి సాకాల’’ అన్నాడు నవ్వుతూ రాజారెడ్డి. ‘‘నేను కలెక్టరైతా’’ అన్నాడు వాడు. కలెక్టరయితే నాయనను కుచ్చోబెట్టి సాకచ్చు అని వాడి మాటల్లో ధ్వనించింది. ‘‘మా ఊరికి తాగే నీళ్లు లేకుండా ఉంటే, నాలుగు నెలల ముందు అందరం చిత్తూరుకు పోయి కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినాంనా. ఆయనకు అర్జీ ఇచ్చినా మరసటిరోజు నించి ట్యాంకర్లతో నీళ్లు తోలినారు. అప్పట్నింటీ ఈడు కలెక్టరైతా కలెక్టరైతా అంటాండాడు’’ నవ్వుతూ చెప్పి చేతిలోని టవల్‌ను చుట్టగా చుట్టాడు రామచంద్ర. ‘‘కష్టపడి చదివితే కలెక్టర్ ఎందుక్కాకూడదు. అయితాడులే’’ అని గంపనెత్తి రామచంద్ర నెత్తిన పెట్టాడు. జేబులోంచి రెండు పది రూపాయల నోట్లు తీసి భరత్ వైపు చేయి చాపాడు రాజారారెడ్డి. వాడు వద్దన్నాడు. ‘‘కొందురు దుడ్డో, తినేదో ఇచ్చి కీతాగా చూస్తాంటారునా. అందుకని తిరిపానికి ఎవురేమిచ్చినా తీసుకోవద్దని చెప్పినాం వాడికి. ఎప్పటికీ కష్టపడుకోని సంపాదించుకోవాల. ఖర్చు పెట్టుకోవాల. తీసుకోరా. మనోడేలే అన్న’’ అన్నాడు రామచంద్ర. ‘‘తీసుకోరా. నేనూ మీ మాదిరిగా కష్టపడి సంపాదించిందేలే’’ అన్నాడు నవ్వుతూ రాజారెడ్డి. నాన్నవైపు ఒకసారి చూసి ఇరవై రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు భరత్. ‘‘దుర్గసముద్రం కాడికి పోతాండా. పనికి మనుషులు రాక కష్టమైపోతాండాది. ఆట్నించి ఇద్దురొస్తాన్నేరు. నాలుగు రోజులుగా రావడం లేదు’’ అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారెడ్డి. అతనటు, అబ్బాకొడుకు ఇటు బయలుదేరారు. ‘‘ఎంతయ్యా.. వంకాయలు..?’’ గంపను కింద పెట్టి, అక్కడే ఉన్న కానగచెట్టులో ఆకులున్న రెండు చిన్న కొమ్మలు విరిచి కిందేసి వాటిపైన టవల్ పరుస్తున్న రామచంద్ర తల పెకైత్తి చూసి ‘‘కాల్ కేజీ పదైదు సార్’’ అన్నాడు. పొద్దున్నే ఏడు కిలోమీటర్లు నడవడంతో పట్టిన చెమట... అక్కడకు స్కూటర్లో రావడంతో వీచిన చల్లగాలికి ఇంకిపోవడంతో.. భాస్కర్, వెంకటేశ్ శరీరాలకు, మనసుకు చాలా హాయిగా ఉంది. ఏడు కిలోమీటర్లు నెత్తిన బరువు మోసుకుని వచ్చి అక్కడ దించి కూర్చున్నా... అవి సరిగా అమ్ముడుపోతాయో పోవో అని అబ్బాకొడుక్కు దిగులుగా ఉంది. ‘‘పదైదు రూపాయలా..? కేజీ ముప్ఫైకి ఇస్తాండారే’’ భాస్కర్. ‘‘లేదు సార్. అర్దకేజీ ఇరవై ఐదుకిస్తా. ఇప్పుడే తోటలోనించి కోసుకోనొస్తాండాం సార్. చాలా బాగుండాయి చూడండి. ఒక్క పుచ్చు కూడా లేదు’’ వివరించాడు రామచంద్ర. ‘‘ఎన్నియా ఇయ్యి. యాభై కేజీలుంటాయా..?’’ అడిగాడు వెంకటేశ్. ‘‘లేదు సార్.. ఇరవై ఐదు కేజీలుంటాయి.’’ ‘‘ఇరవై ఐదా. ఇన్నుండాయే. ముఫ్ఫై అనుకో. ముప్ఫై ఇంటూ యాభై. అంటే రోజుకు నీ ఆదాయం పదైదు నూర్లు. నెలకు నలభై ఐదు వేలు. పక్కన మునక్కాయలు, బెండకాయలుండాయే. అయ్యి ఎట్ల లేదన్నా ఐదు నూర్లు. నెలకు పదైదు వేలు. అంటే నెలకు మీ ఆదాయం అరవై వేలు. చూస్తిరా సార్. వీళ్లకు మన జీతం కన్నా ఎక్కువ ఆదాయం’’ అన్నాడు వెంకటేశ్. ‘‘రోజూ వంకాయలు, మునక్కాయలు, బెండకాయలు ఉండవు కదా సార్’’ నవ్వుతూ అన్నాడు రామచంద్ర. ‘‘మేమూ రైతుబిడ్డలమే. మాకు తెలీదా సేద్యం గురించి. రోజూ లేకపోయినా రోజు మార్చి రోజే అనుకో. అట్లెత్తుకున్నా నెలకు మీకు ముప్ఫై వేలొస్తాది. మాకు చదువులకెంతయింది? రోజూ మేము పొద్దున్నే పోతే సాయంత్రానికొస్తాం. రోజుకు పదిగంటలకు పైగా కష్టపడతాండాం. మీరూ..’’ భాస్కర్ అన్నాడు. ‘‘మేము కుచ్చోనుంటే పంట చేతికొచ్చేస్తాదా సార్’’ కోపాన్ని నిగ్రహించుకుంటూ అడిగాడు రామచంద్ర. ‘‘కుచ్చోనుంటే ఏదీ రాదులే. మా మాదిరిగా రోజుకు పది పన్నెండు గంటలు పనిచేసే అవసరం లేదు కదా. వరి అయితే నాట్లేసినాంక, కలుపు తీస్తారు. మళ్ల కోతలు కోసి కుప్ప కొడతారు. మధ్యలో రోజు మార్చి రోజు గంటసేపు నీళ్లు కడతారంతే. వంకాయలు, టమేటాలు ఏస్తే మధ్యలో ఒకసారి తవ్వతారు. వారానికి ఒకసారి రెండు మూడు గంటలు నీళ్లు కడతారు. అంతే. ఇంగ రోజు మార్చి రోజు ఇట్లా కోసుకోనొచ్చి అమ్ముకుంటారు. కష్టం తక్కువ. ఫలితం ఎక్కువ’’ చెప్పాడు వెంకటేశ్. ‘‘మీరు చెప్పినంత సులభంగా పంటలు పండేటిగా ఉంటే మీరెందుకు సార్ సేద్ది మొదిలేసి ఉద్యోగం చేస్తాండారు’’ ప్రశ్నించాడు రామచంద్ర. వాళ్లకు తగలాల్సిన చోటే తగిలింది. ‘‘మేము చెప్పింది ఇప్పుడు సేద్యం, ఇప్పుడు రేట్ల సంగతి. మా చిన్నప్పుడు వంకాయలు కేజీ అర్ధ రూపాయి. టమేటాలు పావలా. ఎర్రగడ్డలు రూపాయి. మిరపకాయలు రూపాయి. కందిపప్పు పది రూపాయలు. ఇప్పుడు మాదిర్తో అప్పుడు రేట్లున్నింటే సేద్యమే చేసుకోనుందుము. ఏం సార్’’ అన్నాడు వెంకటేశ్ వైపు చూసి భాస్కర్. బాగా చెప్పావన్నట్టు తలూపాడతను. ‘ఇప్పుడు మీ జీతమెంత. ముప్ఫై ఐదేండ్లకు ముందు ఈ ఉద్యోగం చేసినోళ్లకు ఇచ్చిన జీతమెంత?’ అని అడగాలనుకున్నాడు. పేదవాడి కోపం పెదవికి చేటనే విషయం తెలిసినవాడు కావడంతో మౌనంగా ఉండిపోయాడు రామచంద్ర. ‘‘కేజీ ముప్ఫై ఐదు చేసుకో. ఒక కేజీ కొంటాం’’ అన్నాడు భాస్కర్. ‘‘కేజీ యాభైకి తక్కువ లేదు సార్’’ అన్నాడు రామచంద్ర. ‘‘మునక్కాయలెంత?’’ ‘‘పదికి మూడు.’’ ‘‘పదికి ఐదిస్తాండారే.’’ ‘‘అయ్యన్నీ చిన్నయి సార్. ఇయ్యి ఒగోటి రెండు మూరలుండాయి.’’ ఏవీ కొనకుండానే అక్కడి నుంచీ భాస్కర్, వెంకటేశ్ ముందుకు పోయారు. ఆ ఇద్దరూ తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటారు. ఇద్దరివీ పక్క పక్క ఇళ్లు. ఒకే చోట ఉద్యోగం. ఇద్దరూ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. రోజూ ఆఫీసుకు ఒకరి బైక్‌లో పోతారు. మరొకరి బైక్‌లో వాకింగ్‌కు పోతారు. ఆ రకంగా పెట్రోలు ఆదా చేస్తుంటారు. మార్కెట్‌కు వచ్చినా కూరగాయలు బేరమాడి ఆడి, రేటు తగ్గించే కొంటారు. అది తిరుపతిలోని పళని థియేటర్ రోడ్డు. పక్కనే రైతు బజార్ ఉంది. రైతు బజార్ వెలుపల రోడ్డుపైన పండ్లు, పూలు పెట్టుకుని అమ్ముతున్నారు. రామచంద్ర లాంటివాళ్లు కూడా నలుగురైదుగురు కూరగాయలు పెట్టుకోని అమ్ముతున్నారు. భరత్‌కు ఇది వింతగా ఉంది. వాడికి ఊహ వచ్చాక ఈ మాత్రం పొలం సాగు చేయడం ఇదే మొదటిసారి. తిరుపతికి కూరగాయలు తీసుకొచ్చి అమ్మడం కూడా ఇదే మొదటిసారి. తోటలో వంకాయలు అయిపోయేలోపు తనకు సైకిల్ తీసిస్తానని నాన్న చెప్పాడు. తమ ఊర్లో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి వేయి రూపాయల్లో ఉంది. దాన్ని ఆ రోజు సాయంకాలమే కొనుక్కోవాలనుకుని మనసులో అనుకుని నాన్నతో పాటు తిరుపతికొచ్చాడు వాడు. ఇలా అయితే సైకిల్ కొనుక్కోవడం కష్టమని భరత్‌కు అక్కడికొచ్చిన కాసేపట్లోనే అర్థమైపోయింది. పది నిముషాలయింది. కిలో వంకాయలు అమ్ముడుపోయాయి. భాస్కర్, వెంకటేశ్ తిరిగి వచ్చారు. ఇద్దరి చేతుల్లోనూ రిలయన్స్ మార్ట్ కవర్లున్నాయి. వాటిలో ఏవో కూరగాయలున్నాయి. ‘‘చెప్పయ్యా.. ఎంతకిస్తావు.. వంకాయలు’’ అడిగాడు భాస్కర్. ‘‘చెప్పినా కదా సార్.. అర కేజీ ఇరవై ఐదు.’’ ‘‘అవునూ... నువ్వు బయటెందుకు అమ్మతాండావు. రైతు బజార్ లోపల కదా అమ్ముకోవాల’’ అన్నాడు వెంకటేశ్. ‘‘వారానికి ఒకటి రెండుసార్లు వచ్చేటోళ్లం. లోపల అమ్మాలంటే ఎట్లయితాది సార్. వాళ్లకు గేటు కట్టద్దా.’’ ‘‘లోపల అమ్మేటోళ్లంతా రైతులు కాదా?’’ అడిగాడు భాస్కర్. నువ్వు నేరం చేస్తున్నావు అన్నట్టున్నాయి ఆ మాటలు. ‘‘మీరు సేద్యం చేసినామంటిరి. రోజూ కూరగాయలు కాస్తాయా సార్. లోపల చానామంది మా యట్లా రైతుల దగ్గర కొనుక్కోని మారుబేరానికి అమ్ముకుంటారు.’’ ‘‘అంటే నువ్వు... లోపల రైతు బజారోళ్లకు గేటు డబ్బు కట్టకుండా, బయట పెట్టుకోని ఎక్కువ రేటుకు అమ్మతాండావా. ఏం తెలివి. బలేటోళ్లుయా మీ రైతులు. ఎంతకిస్తావో చెప్పు’’ అని గీరి గీరి బేరం చేసి కిలో నలభై ఐదు లెక్కన రెండు అర కిలోలు తీసుకున్నారు. పదికి నాలుగు మునక్కాయల వంతున ఇరవై రూపాయలకు తీసుకుని భాస్కర్, వెంకటేశ్ వెళ్లిపోయారు. మనుషూలు వస్తున్నారు. పోతున్నారు. బేరం చేస్తున్నారు. కొంటున్నారు. గొణుగుతున్నారు. మధ్యలో పోలీసోళ్లొచ్చారు. మున్సిపాలిటీ వాళ్లొచ్చారు. రైతు బజార్ మేనేజర్ వచ్చి తిట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. రోజూ అక్కడ చెట్టుకింద పండ్లమ్ముకునే తోపుడు బండ్లవాళ్లూ కేకలు వేశారు, తమ వ్యాపారానికి అడ్డమని. రెండు గంటల సేపున్నా ఐదు కిలోలకు మించి అమ్మలేకపోయారు. కొడుకును అక్కడే పెట్టి రైతు బజారు లోపలకు పోయి చూసొచ్చాడు రామచంద్ర. అక్కడ పుచ్చులున్న వంకాయలు నలభై ఐదుకు అమ్ముతున్నారు. రోడ్డుపైన తమను అమ్ముకోనివ్వడం లేదు. రైతు బజార్లో ఒక వ్యాపారికి చెప్పాడు తన దగ్గర వంకాయలున్నాయని. అతను గంప దగ్గరకొచ్చి చూశాడు. ‘‘కిలోకు ఇరవై ఇస్తా’’ అన్నాడు. రామచంద్ర బిత్తరపోయాడు. ‘‘లోపల నలభై ఐదుకు అమ్మతాండారే’’ అన్నాడు. అతను నవ్వి ‘‘బలేటోడివే. నువ్వు పొద్దుట్నించీ కుచ్చొన్నే ఐదు కేజీలే అమ్మినావు. పది గంటలవతాంది. ఎండెక్కతాంది. ఇంగ కొనేదానికి ఎవురూ రారు. ఈపొద్దు ఆదివారం. సాయంత్రం వస్తే వస్తారు. లేదంటే లేదు. ఈ వంకాయలన్నీ అమ్మాలంటే రెండు మూడు రోజులు పడతాది. రేపొగేళ వంకాయలు ఎక్కువొచ్చినాయంటే కేజీ పదికి కూడా అమ్మలేం. వీటికి ఇరవై రూపాయలు కూడా ఎక్కువే. ఆలోచించుకో’’ అన్నాడతను నవ్వుతూ. రామచంద్ర ఇంకేమీ ఆలోచించలేకపోయాడు. అతనికి ఇచ్చేశాడు. తెచ్చింది ఇరవై ఐదు కిలోలు. అమ్మింది ఐదు కిలోలు. ఉండాల్సింది ఇరవై కిలోలు. కానీ అక్కడ తూకం మాత్రం పద్దెనిమిది కిలోలే ఉండాయి. మునక్కాయలు, బెండకాయలు కూడా వ్యాపారి చెప్పిన ధరకే ఇచ్చేసి, తండ్రీ కొడుకు రోడ్డుపైకి వచ్చారు. వంకాయ తోటకు పట్టిన రోగాన్ని వదిలించేందుకు పురుగుల మందు కొనుక్కోవడానికి ఎరువుల దుకాణం వైపు నడక మొదలుపెట్టారు. రైతులు పండించినోటియి తప్ప వేరే వేటితోనూ బతకలేమని తెలిసినా, కంటికి వారి పేదరికం స్పష్టంగా కనిపిస్తున్నా, వారు పండించే వాటిని అతి తక్కువకు కొనాలని చూసే మనుషుల జబ్బును నయం చేసే మందులు ఎప్పటికైనా తయారవుతాయా? - సుంకోజి దేవేంద్రాచారి -
డాక్టర్ మీరు చూసారా?
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ మనిషి తన అపూర్వమైన మేధాసంపత్తితో చంద్రుని మీదకు వెళ్లిరావడమే కాకుండా ఆకాశంలో ఉన్న ఇతర గ్రహాల మీదకు కూడా సజీవంగా వెళ్లిరావడానికి పరిశోధిస్తున్నాడు. కాని ఎన్నాళ్లు పరిశోధిస్తాడు? అతను జీవించినంత కాలమే కదా! మరణించాక మరి పరిశోధనలు ఉండవు కదా! కాని ఈ మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు? అని అనేక మంది ప్రశ్నలు సంధిస్తుంటారు. నేను ఈ విషయంలో ఒక కోణంలో ఏకీభవించాను. ఎందుకంటే మనిషి జీవనానికి నాడి అయిన గుండెలను చీల్చి అందులో లోపాలను సరిచేసి, కొన్ని వందల గుండెలను స్పందించేట్లు చేసే డాక్టర్ని కాబట్టి. అయితే ఈ గుండెజబ్బులు అసలు లేకపోతేనో, ఇదో చిక్కు ప్రశ్న. హాస్పిటల్లో నా చాంబర్లో ఆలోచనల్లో మునిగిపోయిన నాకు క్షణం క్రితమే వెళ్లిపోయిన హార్ట్ పేషెంట్ గుర్తుకొచ్చాడు. ఆయనకు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ అయింది. మరలా ఇప్పుడు ఆయనకు అదే లోపం వచ్చింది. ఆయన గుండెకు ఇప్పుడు మరలా ఆపరేషన్ చెయ్యాలి. కాని ఆయన వయస్సు అరవై తొమ్మిది దాటింది. ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేటు చాలా తక్కువ. నాకేమీ కాదు చెయ్యండి అని ఆయన అంటాడు. అమ్మో వద్దు బతికినన్నాళ్లూ బతుకుతారులే, అని ఆయన భార్య అంటుంది. బాగా ఆలోచించుకుని రమ్మని వారిని పంపించేశాను. ఇంతలో ఒక పదేళ్ల పాపను తీసుకుని దంపతులు వచ్చారు. వాళ్ల ముఖాల్లో దుఃఖం గూడు కట్టుకుని ఉన్నట్లుగా ఉన్నారు. పాప మాత్రం చలాకీగా ఉంది. పసుపూ గంధమూ కలగలిపిన రంగులో సుమారు నాలుగు అడుగుల ఎత్తులో బొద్దుగా ఉంది. గుండ్రని ముఖం, నవ్వుతున్నప్పుడు చొట్టలు పడే బుగ్గలూ, పొడవాటి ముక్కూ, గిరజాల జుట్టూ, విశాలమైన నుదురూ, మిలమిలా మెరిసిపోయే పెద్ద కళ్లూ, చిన్ని నోరూ ముత్యాల పలువరుసతో పున్నమి చందమామను చూసిన ఆనందం కలిగింది నాకు. ‘దైవమా ఈ ముద్దులొలికే పాపను గుండెజబ్బుకు గురి చేశావా?’ అనుకున్నాను. ‘‘నమస్తే డాక్టర్ - మా పాప పేరు గాయత్రి. మా ఊరిలో హార్ట్ క్లీనిక్ వారు మీ దగ్గరకు వెళ్లమని చెప్పారు. మీరే మా పాపను బతికించాలి’’ అంటూ గొల్లుమంది తల్లి. నేను పాప ఫైలు తీసుకుని కేస్ స్టడీ చేశాను. ఒక వాల్వ్‌కు రక్త ప్రసరణ సరిగా లేదు, మరో వాల్వ్ నుండి రక్తం గుండె బయటకు వెళ్లిపోతోంది. ఫైలులో ఆపరేషన్ సాధ్యమైనంత తొందరగా చేయాలని రాశారు. తల్లీ తండ్రీ ఆతృతగా నన్ను చూస్తున్నారు. పాప తండ్రి ‘‘పాపకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నారండీ. లేకపోతే పాప ఎంతో కాలం బతకదన్నారు. మా ఊరి డాక్టరు మీ దగ్గరకు తీసుకువెళ్లమనీ, మీరు ఇటువంటి కేసులు ఎన్నో నయం చేశారనీ కూడా చెప్పారు. మీ మీదే...’’ అంటూ పొంగుతున్న దుఃఖంతో మాటలు రాక మూగబోయాడు. ‘‘పాపను రేపే జాయిన్ చెయ్యండి. ఒక పది రోజుల్లో ఆపరేషన్ చేసేద్దాం. పాపకు తప్పక నయమౌతుంది. పాపకు ఏ భయం లేదు’’ అన్నాను వెంటనే పాప చేతిని నా చేతికి అందించి. వాళ్లిద్దరూ నా కాళ్లమీద పడ్డారు, నేను కాళ్లు వెనక్కు లాక్కునే లోపే. వాళ్లిద్దరి కళ్లల్లోంచి కన్నీళ్లు నా పాదాలను తాకనే తాకాయి. నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అయినా నేను ఇలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు నా మనసును స్థిరపరచుకుని కర్తవ్యోన్ముఖుణ్ని అవుతుంటాను. స్పెషల్ వార్డ్‌లో గాయత్రిని చేయించి అన్ని పరీక్షలు చేశాం. ఒక వారం రోజుల్లో ఆపరేషన్ పోస్ట్ చేశాం. పాప గదిలో తల్లీ తండ్రీ తప్ప ఎవర్నీ రానివ్వడం లేదు. ప్రతీవాళ్లు వచ్చి పాపను చూసి సానుభూతి ప్రదర్శిస్తుంటే పాప కుమిలిపోతుందని. పాప తల్లిదండ్రులకు దైవం మీద ఉన్న నమ్మకానికి నేను ఆశ్చర్యపోయాను. పాప ప్రాణాలు కాపాడుకోవడం కోసం అంతులేని ఆరాటంతో అనేక రూపాలలో ఉన్న భగవంతుణ్ని అనుక్షణం ప్రార్థిస్తూనే ఉన్నారు. ఒకరోజు విష్ణు సహస్రనామ పారాయణం, శివునికి రుద్రాభిషేకం చేయించిన తీర్థం, ఇంకో రోజు గాయత్రీదేవి కోటి యజ్ఞం, లలితా సహస్రనామం, మృత్యుంజయ హోమం... ఇలా ఎన్నో చేయిస్తున్నారని పాప వుండే స్పెషల్ రూమ్ అటెండయ్యే మా నర్స్ చెప్పింది. ఈ సందర్భంలో నేను చదివిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఇటలీలో 999 మంది హృద్రోగులను డాక్టర్లు నియమిత కాలంలో పరీక్షించారుట. హాస్పిటల్లో చేరిన తరువాత వారి హృదయ స్పందన మామూలుగా ఆరోగ్యంగా మారడం ఆశ్చర్యంతో గమనించి వారిని ప్రశ్నించగా, ‘‘నేను రోజూ దేముణ్ని ప్రార్థిస్తాను, నా గుండెను దేముడే రక్షిస్తున్నాడు’’ అన్నారుట వాళ్లందరూ. అదే సమయంలో దేముడంటే విశ్వాసం లేని వారి గుండెజబ్బు త్వరగా నయం కాకపోవడం కూడా డాక్టర్లు నిశితంగా గమనించారట. అందుకే ఎన్ని రకాలుగా దైవాన్ని పూజించినా ఎవరికి అభ్యంతరం ఉంటుంది? పాపను చూడటానికి స్పెషల్ రూమ్‌లో ప్రవేశించాను. ‘‘నమస్కారం సార్’’ అంది పాప. వెన్నెల వంటి చిరునవ్వు ముఖంతో, పాప కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. అలాగని అనవసరమైన విషయాలు కాదు, ఎంతో చక్కగా వివేకంతో మాట్లాడుతుంది. ‘‘డాక్టర్, నేను మా క్లాసులో టాపర్‌ని. ఎవరికీ ఫస్ట్ ర్యాంక్ రానివ్వను. నేను వేణువు నేర్చుకుంటున్నాను. చౌరాసియా అంకుల్‌లాగా నేను అందర్నీ మైమరపిస్తాను. వేణుగానంతో, సంగీతం నేర్చుకుంటున్నాను. సుశీల ఆంటీలా సినిమాల్లో మంచి పాటలు పాడతాను. నేను డాక్టరు చదువుతాను. గుండెజబ్బులపై ప్రత్యేకంగా చదివి, గాయత్రీ హార్ట్ కేర్ అని హాస్పిటల్ స్థాపించి, పేదవారికి ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేస్తాను. నాకు ఇంకా ఎన్నో ఆశలు వున్నాయంకుల్. నేను అనుకున్నవన్నీ చేయగలనా అంకుల్. అయితే ఇవన్నీ మీ వలననే అవుతాయంకుల్. ఎందుకంటే నాకు ఆపరేషన్ మీరు బాగా చేస్తే నేను అనుకున్నవన్నీ చేసేస్తానంకుల్...’’ అంటూ కనుగుడ్లూ, చేతులూ అటూ ఇటూ తిప్పుతూ మాట్లాడుతున్న పాపను చేష్టలుడిగి చూస్తూ వుండిపోయాను. పాప కళ్లల్లో తేజస్సు వుంది. ఈ పాప తాను అనుకున్నవన్నీ చేయగలదు. అయితే ఈ క్లిష్టమైన ఆపరేషన్ అనే యమదూతతో సమరాన్ని జయించాలి. చిన్ని పాప హృదయంలో కోటి ఆశలూ ఆశయాలూ కల్పించావే సర్వాంతర్యామీ, అదే చేత్తో ఈమెకు సంపూర్ణ ఆయుర్దాయం కూడా ప్రసాదించు అని నా వంతుగా దైవానికి నా కోరిక విన్నవించుకున్నాను. ఇంతలో పాప నా ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కుంటూ, ‘‘సారీ అంకుల్’’ అంటూనే నా చెవిలో ‘‘అంకుల్ మా మమ్మీ, డాడీ నాకు చెప్పారు. దేముడెక్కడో లేడు. ఎప్పుడూ మన గుండెల్లోనూ, మన వెనకాలే ఉంటాడని. మన వెనకాలే వుంటే మరి కనపడడేం అంకుల్. నేను చాలాసార్లు ఎంతోసేపు కళ్లు మూసుకుని, గభాల్న వెనక్కు తిరిగి చూశాను. దేవుడు కనుపిస్తాడేమోనని. నేను చూసేలోగానే గభాల్న దాక్కున్నాడేమో. అయితే మా అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదంకుల్. మన గుండెల్లో తప్పక ఉంటాడంకుల్. అందుకని మీరేం చేస్తారంటే, నా గుండె కోసి తెరచినప్పుడు మీరు నా గుండెల్లో బాగా లోతుగా చూడండంకుల్, దేవుడున్నాడేమో. ఒకవేళ ఆపరేషన్ తరువాత నేను బతికి వున్నా లేకపోయినా మీరు దేవుడిని చూసిన విషయం మా అమ్మా నాన్నలకు, మిగతావారికీ చెప్పండంకుల్. నాకైతే నా గుండెల్లో దేవుడుంటాడని గట్టి నమ్మకం అంకుల్...’’ పాప ఇంకా మాట్లాడుతూనే వుంది. చాటుగా నిలబడి, పాపనూ, నన్నూ నర్స్నీ గాయత్రి తల్లి చీరకొంగులో ముఖం దాచుకుని వలవలా ఏడుస్తోంది. తండ్రి టర్కీ టవల్ ముఖానికి అడ్డం పెట్టుకుని మోకాళ్లమీద కూర్చుని విలపిస్తున్నాడు. పాపను చూడడానికి వచ్చిన ప్రతిసారీ, వాళ్లు కుళ్లి కుళ్లి రోధించడం చూస్తూనే వున్నాను. కన్నతల్లి తండ్రి ఆవేదన, దుఃఖం ఎవరు ఆపగలరు? కడుపు నిండా ఏడిస్తే వారి దుఃఖ భారం తగ్గవచ్చును. అందుకే వారిని ఆపేవాడిని కాదు. ఆ రోజు పాపకు ఆపరేషన్. ఆపరేషన్ థియేటర్లో అడుగుపెట్టాను. కళ్లు మూసినా తెరచినా గాయత్రి రూపమే ప్రత్యక్షమౌతోంది. ‘‘డాక్టర్ నన్ను రక్షించండి’’ అంటూ దీనంగా వేడుకుంటున్నట్లుగా. ఇంతవరకూ ఎన్నో ఆపరేషన్లు చేశాను గాని, నాకు ఈ పాప ఆపరేషన్ ఒక వ్యక్తిగతమైన కేసులాగా, చాలెంజింగ్‌గా తీవ్రమైన పరీక్షలా అనిపిస్తోంది. ఆపరేషన్ థియేటర్లో మంద్ర స్వరంతో గాయత్రి మంత్రం వినిపిస్తోంది. గాయత్రి బీజాక్షరాల సంపుటిలో పంచభూతాల సంబంధమైన బలం, ఒక్కో అక్షరంలో ఇమిడి వుంది. ఈ బీజాక్షరాలను జపించడం ఎంతో మంచిది. వీటిని పలికిన కొద్దీ, శరీరంలోని మలం కరిగిపోతుంది. నాడీ మండలం వికసించి మలిన రక్తం క్రమక్రమంగా శుభ్రపడి శరీరమంతా శుద్ధి అవుతుంది. ఈ మంత్రం జనన మరణ చక్రం నుండి తప్పించి అమృతం ప్రదానం చేస్తుంది. ఉచితమూ, అవసరమూ ఐన కోరికలను తీరుస్తుంది అంటారు. అందుకే కల్పవృక్షం అన్నారు. అందుకే నేను ఈ మంత్రాన్ని మా హాస్పిటల్లో డాక్టర్స్ ఛాంబర్స్లోనూ, రోగులు కూర్చునే హాల్స్‌లోనూ ఆపరేషన్ థియేటర్స్‌లోనూ వినిపించే ఏర్పాటు చేశాను. మా హాస్పిటల్లో గుండె ఆపరేషన్స్ సక్సెస్‌కి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తాం. ఆ రోజు తొమ్మిది ఆపరేషన్స్‌లో తొలి ఆపరేషన్ పాపదే పోస్ట్ చేశాం. ఎందుకంటే ఫ్రెష్‌గా నేను ఇంటి వద్ద దైవ ధ్యానం చేసుకుని, ప్రశాంతంగా హాస్పిటల్‌కి రాగానే గాయత్రికి ఆపరేషన్ చెయ్యాలి. ప్రతీ ఆపరేషన్‌కీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ సంబంధిత పేషెంట్ యొక్క ప్రాథమిక ఆపరేషన్ అంటే రోగి యొక్క ఛాతీ మధ్యభాగాన్ని బలమైన కత్తితో కోసి, ఛాతీ ఎముకలను కత్తులతో కోసి, పండు మధ్యలో కోసి విడదీసినట్లుగా, మధ్యలో ఉన్న గుండెను బయటకు కనిపించే రీతిలో చేస్తారు. అంతకుముందే మోకాళ్ల కింద భాగం మధ్యలో కోసి గుండె ఆపరేషన్‌లో ఉపయోగించడానికి నరాన్ని తీసి ఉంచుతారు. ఊపిరితిత్తులను, గుండెను తాత్కాలికంగా పనిచేయించడానికి హార్ట్ లంగ్ బైపాస్ మెషీన్‌కి కనెక్ట్ చేస్తారు. అప్పుడు నన్ను పిలుస్తారు. నేను ఆపరేషన్ పూర్తి చేశాక, కోసిన శరీర భాగాలను మూసేయడం, మందులు వేయడం, బ్యాండేజ్ వేయడం వంటి పనులన్నీ వాళ్లే చేస్తారు. ప్రాథమిక ఆపరేషన్ మొదలైనప్పటి నుండి మొత్తం ఆపరేషన్ పూర్తి అయ్యేవరకూ పేషెంట్ వెంటిలేటర్ కంట్రోల్లోనే జీవిస్తాడు. రోగి గుండె బయటకు కనిపించగానే నన్ను పిలుస్తారు. నేను వెళ్లి గుండెకు సంబంధించిన లోపాలను, రోగి కాళ్ల నుండి తీసిన నరంతో లోపాన్ని సరిచేసి, గుండె మామూలు స్థితికి వచ్చిందో లేదో చూసి వచ్చేయడం వరకే నా డ్యూటీ. ‘డాక్టర్ రండీ’ అంటూ నా అసిస్టెంట్ వచ్చారు. అయితే పాపకు ఆపరేషన్ చేసే సమయం వచ్చేసిందన్నమాట. ఆపరేషన్ టేబుల్ మీద గాయత్రి ప్రకాశవంతమైన ముఖం మత్తులో పడుకుని ఉంది. జాతి, మతం, కులం మొదలగు వైషమ్యాలతో మనిషి సతమతమైపోతుంటాడు. కాని ఏ శరీరాన్ని కోసినా ఎర్రని రక్తం చిందుతుంది. డాక్టర్లుగా మేము ప్రతీరోజూ చూసే దృశ్యమే ఇది. అయితే ఈ రోజు పాప గాయత్రి రక్తం చూస్తోంటే, ఏదోలా అనిపించింది. ఆమె రక్తంలో వింత కాంతి గోచరిస్తోంది. కోసిన గుండెలో రక్తం లేకుండా రక్తాన్ని ఆపుచేస్తాం. అందువలన గుండెలో లోపాలు క్లియర్‌గా తెలుస్తాయి. అప్పుడు సంబంధిత గుండెకు సంబంధించిన రిపోర్టులు పరిశీలించిన దానిని బట్టి ఆ లోపాలను సరిచేస్తాం. ఆ విధంగా గాయత్రి గుండెలోని లోపాలన్నీ సరిచేశాను. ‘‘డాక్టర్స్... బ్లడ్ సప్లై రిస్టోర్ చెయ్యండి’’ అన్నాను. ఒక నిముషం కూడా కాలేదు. నా పక్కనే వున్న అసిస్టెంట్స్ ‘‘సారీ సర్... పాప గుండెలోకి బ్లడ్ రావడం లేదు, ఎలాగా? చిన్న పాప కదా ఒకవేళ బాడీ రెస్పాండ్ కాలేకపోతోందేమో...’’ అన్నారు. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకు బ్లడ్ రిస్టోర్ కాదు? అవుతుంది. అని ప్రశాంత వదనంతో నిర్జీవంగా తెరచిన గుండెతో పడివున్న గాయత్రి వద్దనే నిలబడ్డాను. ఇంతలో ‘‘డాక్టర్... ఆపరేషన్ తరువాత నేను బతికినా, చనిపోయినా ఫర్వాలేదు గాని డాక్టర్, నా గుండెల్లో దేవుడుంటాడని అమ్మ చెప్పింది. దయచేసి నా గుండె తెరచిన తరువాత బాగా పరిశీలనగా చూసి, మీరు నా గుండెల్లో దేవుడున్నాడో లేదో మా అమ్మా నాన్నలకు చెప్పండంకుల్’’ అని పదే పదే చెప్పిన పాప మాటలు నా చెవుల్లో రింగు రింగుమంటున్నాయి. వెంటనే నేప్కిన్తో ముఖం తుడుచుకుని, ‘‘డాక్టర్స్ ఒక్కసారి మళ్లీ పాప గుండె చూడండి’’ అంటూ నేను కూడా ఆతృత ఆపుకోలేక పాప తెరచిన గుండె చూద్దును కదా. ఆమె గుండెలో ఎర్రని రక్తం మెల్లగా ప్రవహించడం మొదలైంది. చిప్పిల్లిన ఆ ఎర్రని రక్తంలో నాకు మెరుపులు గోచరించాయి. అంతే! మరుక్షణం నా మనసూ, శరీరమూ, దూది పింజల్లా గాలిలో తేలిపోయాయి ఆనంద డోలికల్లో. గాయత్రి గుండెలో నిజంగా దేముడు ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడు అనే మాట నా చెవుల్లో ముమ్మారు ప్రతిధ్వనించింది. అంబరాన్నంటిని సంబరంతో - ‘‘డాక్టర్స్ ఫినిష్ ది ఫార్మాలిటీస్. షి ఈజ్ ఆల్ రైట్’’ అంటూ బయటకు నా రూమ్‌లోకి వస్తున్నాను. ఆపరేషన్ థియేటర్లో మిగతా ఎనిమిది మంది మత్తులో బెడ్స్ మీద పడుకుని ఉన్నారు. వారందరి గుండెలూ నేను ఇవ్వాళ చూడాలి. వాళ్లందరూ ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. వారిని ఏం చేసినా వారికి ఏమీ తెలియదు. వారి మనుగడ జనన మరణాల మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది ఈ రోజున. నేను చేతులూ, ముఖమూ కడుక్కుని, థియేటర్లో నా రూమ్‌కి వచ్చి టేబుల్ మీద మంచినీళ్లు తాగుతూంటే నా మనోఫలకం మీద... బంగారు మేని ఛాయలో గాయత్రి గులాబి రంగు చీర కట్టుకుని వేదికపై వేణుగానం చేస్తూ ఆడిటోరియంలోని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న దృశ్యం... ఎర్రని పట్టుచీర కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆడిటోరియంలో ఆపదమొక్కులవాని భక్తిగీతాలు ఆలపిస్తోన్న గాయత్రి ముగ్ధమోహన రూపం... లేత నీలం రంగు వాయిల్‌చీర మీద తెల్లని కోటు ధరించి, మెడలో స్టెత్‌తో చిరునవ్వులు చిందిస్తూ చురుకుగా పేషెంట్స్ అందరినీ విశదంగా పరీక్షిస్తూ, వారందరికీ భుజం తట్టి ధైర్యం చెబుతున్న గాయత్రి నా కళ్ల ముందు కనిపిస్తోంది. నా మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఆలోచనల్లో ఉన్న నాకు మరో గుండె ఆపరేషన్‌కు పిలుపు వచ్చింది. ఇటలీలో 999 మంది హృద్రోగులను డాక్టర్లు నియమిత కాలంలో పరీక్షించారుట. హాస్పటల్లో చేరిన తరువాత వారి హృదయ స్పందన మామూలుగా ఆరోగ్యంగా మారడం ఆశ్చర్యంతో గమనించి వారిని ప్రశ్నించగా, ‘‘నేను రోజూ దేముణ్ని ప్రార్థిస్తాను, నా గుండెను దేముడే రక్షిస్తున్నాడు’’ అన్నారుట వాళ్లందరూ. అదే సమయంలో దేముడంటే విశ్వాసం లేని వారి గుండెజబ్బు త్వరగా నయం కాకపోవడం కూడా డాక్టర్లు నిశితంగా గమనించారట. అందుకే ఎన్ని రకాలుగా దైవాన్ని పూజించినా ఎవరికి అభ్యంతరం ఉంటుంది? - కె.బి.కృష్ణ (కాకరపర్తి భగవాన్ కృష్ణ) -
ఎదురీత ఋతువు
ప్రత్యేక ప్రశంస పొందిన కథ ‘‘మంచిని పదిచ్చి కొనుక్కోవాలి. చెడును పదిచ్చి వదులుకోవాలి’’ రామ్మూర్తి తన జీవితానుభవాల్లోంచి, తన కొడుకు కిరణ్‌కు ఎప్పుడూ చెప్పే మాట ఇది. అయినా గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకుపోవచ్చు గాని, నీళ్లు తాగించలేమన్నట్టు తరం నుండి తరానికి ఇలా అనుభవాలు, సూక్తులు, నీతులు అందించవచ్చేమో గాని, వాటిని పాటించేటట్టు చేయలేమని రామ్మూర్తికి తొందరలోనే తెలిసి వచ్చింది. అసలు రామ్మూర్తి ఏమనుకున్నాడు? కాలం మారుతుంటే విలువలు మారుతుంటాయి. కొత్తొక వింత, పాతొక రోతలా తయారవుతుంది. తన కాలంలో ఎవరైనా ఓ టీచరుద్యోగం సంపాదిస్తే, పది ఊర్లకు అతడొక ఆదర్శం. ఇవాళ బడిపంతులు కంటే, పది ఫెయిలై అక్రమంగా సంపాదించే రియలెస్టేట్ వ్యాపారికే విలువెక్కువ. ఈ ప్రమాదాన్ని గుర్తించాడు గనకనే, తల్లికోడిలా తన పిల్లలిద్దరినీ రెక్కల కిందే పొదివి పట్టుకున్నాడు రామ్మూర్తి. అలాగని తనేం ఆధునికతను వ్యతిరేకించే ఛాందసుడు కాదు. చెడును మాత్రమే వ్యతిరేకించేవాడు. ఏమున్నా లేకున్నా మనిషికి వ్యక్తిత్వం ఉండాలి. పైపై మెరుగులకు ఆశపడి మూలాలను మరిచిపోవద్దని కూడా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనలాగే తన పిల్లలుండాలని కోరుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా నలుగురిలో తలెత్తుకొని జీవించాలన్నాడు. అందుకోసం తన జీవితాన్నే ప్రతీ రాత్రి కథగా చెప్పేవాడు. ‘‘ఇంటి నిండా గంపెడు మంది సంసారం మాది. నాలుగు మెతుకులకూ కరువే. ఒక పూట ఉంటే, మరోపూటకు ఉండదు. ఊరంతా అన్నం తింటుంటే, చిల్లిగవ్వ లేక మక్కజొన్న గడక తిని బతికిన గతం. అవమానాలు, అంటరానితనాలు, జీవితం నిండా చెరగని గుర్తులు. కరువులతో ముందుకు సాగని వ్యవసాయం. ఆత్మహత్యల బాట పట్టిన అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం వలసెల్లిపోయిన వాడలు. ఇప్పుడు ఇలా మధ్యతరగతి మనిషిగా ఎదిగినా, వెనక్కి తిరిగి చూసుకుంటే మానని గాయాలే’’. అన్నీ రామ్మూర్తికి ఇంకా గుర్తే ఉన్నాయి. మరిచిపోవాలనుకున్నా మరువలేనివి అవి. అవే తన పిల్లలకు అనుభవాలుగా చెబుతుండేవాడు. ఇలా చెప్పడంలో తనకు రెండు భయాలు. ఒకటి ఈ కాలానికి ఎదురీద లేక ఎక్కడ తన పిల్లలు ఆగమవుతారోనని ఒక భయం. రెండవది ఒకవేళ కాలాన్ని గెలిచినా, సాటి మనుషుల పట్ల ఏ బాధ్యత లేకుండా మర మనుషుల్లా, అహంకారుల్లా మారిపోతారేమోనని మరో భయం. ఈ రెండు భయాలే రామ్మూర్తిని పదేపదే తన బతుకును వల్లేసేలా చేశాయి. చూస్తుండగానే పిల్లలు యవ్వన కాలానికి చేరారు. కూతురు పెళ్లి చేశాడు. కొడుకును బీటెక్ దాకా చదివించాడు. ఎక్కడ పాడైపోతారో అనుకున్న తన భయాలు తొలగిపోయాయి. అనుకున్నంత కాకపోయినా ఒక మాదిరిగా పిల్లలు చేతికందారు అనుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడ్డది. చెట్టంత ఎదిగిన కిరణ్ ఏ కొలువు లేకుండా, ఊళ్లల్లో దేవుని పేరున ఊరుమీద వదిలేసిన ఎద్దులా తిరగడం తనకు బాధ కలిగిస్తున్నది. తనకా వృద్ధాప్యం ముంచుకొస్తోంది. రిటైర్మెంట్ కూడా దగ్గరపడుతోంది. తాను పడ్డ కష్టాలు తన పిల్లలు పడొద్దని, వెయ్యి కళ్లతో జాగ్రత్తపడినోడు రామ్మూర్తి. ఇప్పుడు మాత్రం తన కొడుక్కి ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా వస్తే బాగుండునని, ప్రతిరోజూ దేవుడి ఫొటో ముందు దండం పెడుతూనే ఉన్నాడు. తనుంటున్న కాలనీలోని తన సహోద్యోగులు, ఏ టీ కొట్టు దగ్గరో తమ పిల్లల గురించి గొప్పలు చెబుతుంటే, రామ్మూర్తికి మనసు చివుక్కుమంటున్నది. తను ఎన్ని కొనిచ్చాడు కొడుక్కి?! టెన్త్‌లో గేర్ సైకిలన్నా, ఇంటర్లో షికార్లకు బైక్ కావాలన్నా, బీటెక్‌లో కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లన్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. ఇక పాకెట్ మనీకైతే కిరణ్‌కి రామ్మూర్తి ఒక ఏటీఎం సెంటరే. అలా కిరణ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులిస్తుంటే తల్లి రాధమ్మ అడ్డుచెప్పేది. ‘‘పోనీలేవే. నేను వాడి వయసులో ఉన్నప్పుడు టీ తాగడానికి కూడా చిల్లర డబ్బుల కోసం జేబులు వెతుక్కునేవాణ్ని. కనీసం వాడైనా చిన్న చిన్న అవసరాలకు, ఇతరుల ముఖాలు చూడకుండా ఉంటే చాలు’’ అనేవాడు. ఎక్కడి నుండి ముంచుకొచ్చిందో ఆ తుఫాను. ఆన్లైన్ తుఫానట. ఇంట్లో కంప్యూటర్లో ఇరవై నాలుగ్గంటలూ అంతా ‘ఆన్లైన్ షాపింగ్’ చేయడం మొదలుపెట్టాడు కిరణ్. స్మార్ట్ ఫోన్లు, షూలు, వాచ్‌లు అవసరమున్నా లేకపోయినా రకరకాల గాడ్జెట్స్ ఆన్లైన్లో ఆర్డరివ్వడం, వాటికోసం తండ్రి డెబిట్ కార్డుని ఇష్టమొచ్చినట్టుగా వాడుకోవడం. మొదట్లో ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోలేకపోయాడు రామ్మూర్తి. తన అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్న తీరు చూసి, ఇదంతా కొడుకు మహిమే అని మాత్రం ఆ తరువాత తెలిసొచ్చి, తలపట్టుకున్నాడు. ఇది ‘గరీబీ హటావో’ కాలం కాదనుకున్నాడు రామ్మూర్తి. ‘మేకిన్ ఇండియా’ అంటే ఇదేనేమో అనుకున్నాడు. పోనీ కొన్ని వస్తువులనైనా సరిగా వాడుకున్నది లేదు. ఫేస్బుక్లో, వాట్సప్‌లో చూసి, లేటెస్ట్ వర్షన్లు, అప్డేటెడ్ సిరీస్‌లు వచ్చాయని పాత వాటిని ఆన్లైన్లో వేలం పెట్టేవాడు. అరవై వేలకు కొన్న వస్తువునైనా ఇరవై వేలకే అమ్మేసేవాడు. మళ్లీ డబ్బులు కావాలని అడగడం, లేదంటే అలగడం క్షణాల్లో జరిగిపోయేవి. కొన్నిసార్లు ఏడ్చైనా సాధించేవాడు. బైకుల మీద బైకులు మార్చాడు. అయినా రామ్మూర్తి ఏనాడు నోరు మెదపలేదు. కారణం కొడుకు మీదున్న ప్రేమే. ఏ తండ్రికైనా తన పిల్లల పట్ల ప్రేముంటుంది. కానీ, రామ్మూర్తి ప్రేమ అంతకు మించింది. తన ఊరి నుండి వచ్చే బంధువులు చిన్ననాడే కిరణ్‌ను చూసి, మీ నాన్నే మళ్లీ పుట్టిండనేవాళ్లు రామ్మూర్తితో. అది నిజమో అబద్ధమో తెలియదు, రామ్మూర్తి మాత్రం అప్పటినుండి కొడుకులో తన తండ్రిని చూసుకునేవాడు. పెద్దయ్యాక తండ్రిని బాగా చూసుకోవాలనుకున్న తన కోరిక తీరకుండానే రామ్మూర్తి, తన తండ్రిని కోల్పోయాడు. అందుకే కిరణ్ అంటే తనకు పంచ ప్రాణాలు.. ‘‘అట్లా కాదయ్యా’’ అని నచ్చచెప్పిన అనుభవమే తప్ప, చెయ్యెత్తి దండించింది లేదు. ఆనాడు తాను ఐదారు చదివినందుకే ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడేమో పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు దొరకడం లేదు. కొడుక్కు ఏదో ఒక జాబ్ పెట్టించాలని రామ్మూర్తి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. కనిపించిన ఆఫీసర్ల కాళ్లా వేళ్ల పడ్డాడు. అయినా కుదరదన్నారు. అడ్డదారిలో లంచమిచ్చి ఉద్యోగం కొనడానికి మనసొప్పలేదు. రామ్మూర్తి ప్రయత్నాలేవీ కిరణ్‌కు తెలియవు. తను చదివిన బీటెక్‌కు ఏ జాబు రాదని డిసైడ్ అయ్యాడు కిరణ్. కారణం లక్షల్లో నిరుద్యోగ ఇంజనీర్లు. ఇక లాభం లేదని తండ్రి మీద అనేక దండయాత్రలయ్యాక, ‘‘బిజినెస్ పెట్టుకుంటాను ఓ పది లక్షలివ్వమని’’ పోరు మొదలుపెట్టాడు. రామ్మూర్తికి ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడ్డట్టయ్యింది. మూడేళ్ల కిందట కూతురు పెళ్లికోసం చేసిన అప్పులే ఇంకా తీరలేదు. అప్పుడే పది లక్షలంటే ఎలా సర్దాలో అర్థంకాక, కుడితిలో పడ్డ ఎలుకలా సందిగ్ధంలో పడ్డాడు. తన యవ్వనంలో వెయ్యి రూపాయలు కూడా ఊహకు అందని విషయం. అది కూడా తండ్రి మీదపడి అడగాలనే ఆలోచన కూడా అప్పట్లో రామ్మూర్తికి లేదు. కారణం తమను బతికించడం కోసం, తండ్రి చేస్తున్న అవిశ్రాంత యుద్ధం తనకు తెలుసు. అలా ఏ అవసరానికో కొంత డబ్బు అడగాలంటే బరువనిపించి, నోరు రాక, కూలీ పనులు చేసి, తనే సర్దుకున్న గతం రామ్మూర్తిది. అవన్నీ కిరణ్‌కి కూడా తెలుసు. ఈ విలువలన్నీ ఎటు పోయాయి? ఒక దశ వరకు బాగానే విన్నాడు. ఆ తరువాత మాత్రం ఇదంతా పనికిరాని సోదిగా అనిపించింది కిరణ్‌కు. ఏ తండ్రి అయినా తన జీవితంలాగే తన కొడుకు జీవితం ఉండాలని ఎందుకు కోరుకుంటాడు. తాను నాలుగు మెట్లెక్కితే, తన కొడుకును ఐదో మెట్టు నుండి ఎక్కించాలి. అంతే తప్ప, ఇలా ప్రతిసారీ తన గతం గురించి చెప్పడం ఎందుకనుకున్నాడు కిరణ్. మాటలు పలకలేని కాసులు, తండ్రీ కొడుకుల మధ్య మాటలు లేకుండా చేశాయి. కిరణ్ ఎక్కువసేపు ఇంట్లో ఉండడం లేదు. ‘‘క్షణం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు’’ అన్నట్టు తనలాగే ఏ పని చేయకుండా ఊరిమీద పడి తిరిగే స్నేహితులతో కాలం గడుపుతున్నాడు. రామ్మూర్తికి మాత్రం కూతురు పెళ్లి చేసినప్పటి కష్టం కంటే, కొడుకు భవిష్యత్తే ఎక్కువ కష్టంగా తోస్తున్నది. కంటి మీద నిద్రే కరువైంది. ‘‘అడిగిన డబ్బు ఇవ్వలేనప్పుడు ఎందుకు కన్నారు’’ అంటూ తల్లి మీద అంతెత్తున లేచిన విషయం తెలిసి, రామ్మూర్తి జీవితంలో ఎప్పుడూ పడనంతగా బాధపడ్డాడు. భార్యకు తెలియకుండా, ఒక్కడే ఆ రాత్రంతా వినపడకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ‘‘తప్పు నాదా? వాడిదా? లేక రెక్కలు తొడుక్కొని పరుగెడుతూ, అందరినీ డబ్బుల వెంట పరుగెత్తిస్తున్న కాలానిదా? ఈ ఊహల్లో మేడలేంటీ? జీవితమంటే డబ్బేనా? బతుకంటే షేర్ మార్కెటా లాభనష్టాలు చూసుకోవడానికి? నోరెత్తితే విదేశాల బాటేనా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరదేశాలు వెళితే, తాము చస్తే తలకొరివి పెట్టే దిక్కెవరు?’’ ఏవేవో ఆలోచనలు రామ్మూర్తి మెదళ్లో గిరికీలు కొడుతున్నాయి. అల్లారు ముద్దుగా కని పెంచిన కొడుకు ఇలా తనకే ఎదురుతిరిగే వాడయ్యాడు. తన పెంపకంలోనే తప్పుందేమోనని ఒకటికి రెండుసార్లు తరచి చూసుకుంటున్నాడు. అయినా సమాధానం దొరకలేదు. కిరణ్‌లో మాత్రం రోజురోజుకు అసంతృప్తి సెగలు మిన్నంటుతున్నాయి. ‘‘ఏందీ జీవితం? ఇట్లా ఎంతకాలం? నాతోటి వాళ్లంతా ఏదో స్థాయిలో లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. నేను మాత్రం దేనికీ పనికిరాకుండా పోయాను’’ ఇలా ఎన్ని వందలసార్లు అనుకున్నాడో కిరణ్. మూడు పదుల వయసు దాటుతున్నా, తను సెటిల్ కాకపోవడానికి, తన తండ్రి రామ్మూర్తే కారణమని లోలోపలే తిట్టుకుంటూనే ఉన్నాడు. ‘‘అమెరికాకు వెళ్తాను, జీఆర్ఈ, టోఫెల్ కోచింగులకు, వీసాకు డబ్బులు కట్టమంటే మనవల్ల కాదంటాడు. పోనీ ఇంట్లో పేదరికం ఉందా అంటే అదీ లేదు. తండ్రి అలసత్వం పైచదువుల వంక చూడకుండా చేసింది. ఇప్పుడు ఏం చేయాలో తేల్చుకోలేక ఆగిపోయాను. అసలు ఏ తండ్రైనా ఇలా కొడుకును గాలికొదిలేస్తాడా? ఇంతకాలం డబ్బులకు ఎలాంటి అడ్డంకులు చెప్పని తండ్రీ, ఇవాళ తనకు బిజినెస్ పెట్టడానికి డబ్బు కావాలంటే ఎందుకు సర్దడం లేదో అర్థం కావడం లేదు. ఉన్నది తానొక్కడే. ఏం సంపాదించి పెట్టినా తనకే కదా, తానేమైనా తాగి తందనాలడడానికి అడుగుతున్నాడా? తండ్రిలో ఈ మొండి పట్టుదల ఎందుకు? పైగా రిటైరయ్యాక ఊరికెళ్లి వ్యవసాయం చేద్దామంటాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్నోళ్లకు, ఉరితాళ్లు తప్ప ఏం మిగిలాయని? అందుకే ఈ కాలానికి వ్యవసాయమే కాదు, ఈయన కూడా పనికిరాడు. అంతా వేస్టు. నీతులు, సూక్తులు చెప్పుకోవడానికే. ఆయన తలుచుకుంటే ఏ లోనుకో అప్లయి చేసి, తనకు డబ్బివ్వొచ్చు. అయినా సరే తాను ఆ ప్రయత్నాలేవీ చేయడం లేదంటే తనమీద ఇంతకాలం ఉన్నది ప్రేమ కాదు. అందుకే తనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓవైపు తోటి స్నేహితులంతా వీసాలు దొరికి, ఫారిన్ దేశాలకు ఎగిరెళ్లుతూ తన ముందే ఫోజులు కొడుతున్నారు. వాళ్లందరి ముందు నేనెంత నామోషీ అవుతున్నానో ఆయనకేం తెలుసు’’ అనుకుంటూ చేతిలో ఉన్న బీర్ సీసాను గోడకేసి పగలగొట్టాడు. బార్ షాప్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ తలలు తిప్పి చూశారు. ఈ సంఘర్షణంతా మరిచిపోలేక బార్ షాపులోనే సేద తీరుతున్నాడు కిరణ్. తాగడానికి, వాగడానికి కంపెనీ కూడా ఉంది. ‘గ్లాస్‌మేట్స్’ తాగినప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు. ఆ మాటల సారాంశం ఒక్కటే ‘‘మీ నాన్న మారిపోయాడు. నువ్వొక వేస్టుగాడిలా కనిపిస్తున్నావు. కొడుకు బాగును కోరుకోని తండ్రి, ఒక తండ్రేనా?’’ అని రెచ్చగొడుతున్నారు. కిరణ్‌లో కోపం కట్టలు తెగుతున్నది. మంట చిన్నగా ఉన్నప్పుడు గాలి దాన్ని చప్పున ఆర్పేస్తుందట. మంట కొంచెం పెద్దగా ఉంటే చాలు, అదే గాలి మంటను మరింత పెద్దది చేసి మండిస్తుందట. ఇప్పుడు కిరణ్ స్నేహితులు కూడా అలాగే అగ్గికి ఆజ్యం పోస్తున్నారు. ‘‘వీడి తండ్రిని చూడరా, చచ్చి ఆయన ఉద్యోగాన్ని వీడికిచ్చిపోయాడు. మహానుభావుడు. తండ్రి అంటే అలా ఉండాలి’’ అన్నాడొక స్నేహితుడు. అప్పటిదాకా తాగింది దిగిపోయింది కిరణ్‌కి. ఈ మాట తనకు ఎక్కడో కనెక్ట్ అయ్యింది. మరో బాటిల్ మూత తీశాడు. ఈసారి గ్లాసులో పోయకుండానే గటగటా సగం బాటిల్ తాగేశాడు. తన కంటే తక్కువ తాగిన ఫ్రెండ్స్ అంతా షాకయ్యారు. బార్ షాప్ మూసే వేళయిందని అంతా ఇళ్లకు వెళ్లిపోయారు. మనసులో వచ్చిన ఆలోచనల టెన్షన్‌కు, కిరణ్‌కు ఇవాళ మత్తెక్కడం లేదు. ఇంటికి కూడా వెళ్లాలనిపించలేదు. కాలనీ మధ్యలో ఉన్న వాటర్‌ట్యాంక్ వద్దకొచ్చి కూర్చున్నాడు కిరణ్. కాలనీ ఎప్పుడో నిద్రపోయింది. వెన్నెల వెలుగులో వాటర్‌ట్యాంక్ నీడ, మర్రిచెట్టు నీడలా కనిపిస్తున్నది. అది ట్యాంక్ నీడా, తన నీడా? ఉద్యోగం లేకుంటే తన నీడ కూడా తనను భయపెడుతుందా? ‘‘ఛ ఎంత చీపైపోయాను’’ అనుకున్నాడు. తనకు ఉద్యోగం లేదని, ఎందుకూ పనికిరాడని, వీడికి ఎవ్వరూ పిల్లనివ్వరని హేళన చేసే వాళ్లందరి నోళ్లు మూయించాలి. ఇదంతా జరగాలంటే తనకు అర్జంటుగా ఉద్యోగం కావాలి. తనకు వెంటనే ఉద్యోగం రావాలంటే తన తండ్రి, తన ఉద్యోగం నుండి తప్పుకోవాలి. ఊరికే తప్పుకోడు. అలా తప్పుకున్నా, సింగరేణిలో తనకు ఆ ఉద్యోగం ఇవ్వరు. ఏదో జరగాలి. ఏం జరగాలి? సిగరెట్ వెలిగించాడు కిరణ్. ఔను, తాను చేసేది తప్పే అని తెలుసు. అయినా గత్యంతరం లేదనుకున్నాడు. ఈ రాత్రికే పని పూర్తిచేయాలి. ఏ గుండెపోటుతోటో తండ్రి పోయాడని కాలనీవాళ్లందరిని నమ్మించాలి. ఇదీ పథకం! లేచి బైక్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ వెళ్లే ఇంటికి అయినా, ఈసారి దొంగలా వెళ్లాడు. టైం సరిగ్గా రాత్రి ఒంటిగంటన్నర. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎప్పటిలాగే తల్లే వచ్చి తలుపు తెరిచింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తల తిప్పుకొని ఇంట్లోకి వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకొని, తండ్రి బెడ్ రూంలోకి తొంగి చూశాడు. తండ్రి లేడంటే నైట్ షిఫ్ట్‌లో ఉన్నాడని అర్థమైంది. ఛా అవకాశం మిస్సయ్యిందనుకున్నాడు. ‘‘మీ నాన్న ఇంతకుముందే ఫోన్ చేసి, నువ్వొచ్చావో లేదోనని అడిగాడురా, రా అన్నం తిందువు’’ అన్నది తల్లి. కిరణ్ ఆ మాటకు కొంత ఖంగారు పడ్డాడు. ‘‘వొద్దొద్దు తినొచ్చా. నువ్ పడుకో’’ అన్నాడు. తల్లి పడుకుంది. ఉదయాన్నే తండ్రొస్తాడు. వచ్చి పడుకుంటాడు. ఎలా ఖతం చేయాలి. తల్లి, పాల పాకెట్ తేవడానికి వెళ్లి వచ్చేలోపే, ఏదో ఒక రకంగా తండ్రిని శాశ్వత నిద్రలోకి చేర్చాలనుకుంటూ ప్లాన్ గీసుకున్నాడు. ఉదయాన్నే తల్లి ఏడుపులు వినిపిస్తున్నాయి. మొదట కల అనుకున్నాడు. అటూ ఇటూ దొర్లాడు. అయినా ఏడుపులు ఆగడం లేదు. కల కాదని అర్థమైంది కిరణ్‌కు. ఉరుకుల పరుగుల మీద హాస్పటల్‌కు చేరారు. గుంపులు గుంపులుగా జనాలు. తోటి కార్మికులు పదుల సంఖ్యలో అక్కడికొచ్చారు. రామ్మూర్తి కాళ్లు పోయాయంటున్నారు. కొంచెం అయితే ప్రాణమే పోయేదట అని ఇంకెవరో అంటున్నారు. రాధమ్మ గుండెలు బాదుకుంటూ పెడబొబ్బలు పెడుతూ జనం మధ్యలో నుండి ఐసీయూకి చేరారు. ఒళ్లంత కట్లతో, మోకాళ్ల వరకున్న మొండి దేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ‘‘దేవుడా ఏందీ ఘోరం’’ అంటూ రామ్మూర్తిని పట్టుకొని ఏడ్చింది రాధమ్మ. రామ్మూర్తి మాత్రం ఈ పాపపు లోకాన్ని చూడలేనన్నట్టు... కళ్లు మూసుకునే ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. కన్నతండ్రిని అలా చూసి కూడా, కిరణ్‌లో ఎలాంటి చలనం లేదు. ఎవరో పరాయి మనిషిని చూస్తున్నట్టు చూస్తుండిపోయాడు. ఎవరిదో చెయ్యి తన భుజం మీద పడితే వెనక్కి తిరిగి చూశాడు. తన తండ్రి రామ్మూర్తితో పనిచేసే వరదరాజు. బయటికి రమ్మని, కిరణ్‌ను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు. ‘‘కంపెనీలో నీకు ఉద్యోగం కోసమేరా మీ నాన్న, బొగ్గుబావిలో తన కాళ్లను మిషన్ రంపెల కింద పెట్టాడు’’ అన్నాడు. ఒక్కసారిగా షాకయ్యాడు కిరణ్. ‘‘ఏంటంకుల్ మీరనేది?’’ అన్నాడు. అవునురా నువ్ ఉద్యోగం కోసం పడుతున్న బాధ, తను భరించలేకపోయాడురా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కిరణ్ గుండె ఇప్పటికి కరిగింది. ఇన్ని రోజులుగా కిరణ్ కళ్లమీద కమ్ముకున్న పొరలు తొలగిపోతున్నాయి. కాళ్ల కింది నేల కదిలిపోతున్నట్టుంది కిరణ్‌కు. తండ్రి మంచితనాన్ని చూడలేని తన అంధత్వానికి, తనను తానే తిట్టుకున్నాడు. ఇలాంటి తండ్రి ప్రాణమా, తాను తీయాలనుకున్నది, సిగ్గుతో బోరున ఏడుస్తూ కూలబడ్డాడు. ఆన్లైన్లో కొనే వస్తువులకు ప్రతీసారి ‘వారెంటీ ఉందా’ అని చూసే కిరణ్, కన్నప్రేమకు మాత్రం ఏ ‘ఎక్స్పైరీ’ ఉండదని తెలుసుకోలేకపోయాడు. - పసునూరి రవీందర్ -
ఎవరూ లేరండీ..
ఉగాది కథల పోటీలో ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ఠంగు ఠంగుమని గోడ గడియారం పదిమార్లు గంట కొట్టింది. మంచం మీద కూర్చొని మోకాళ్ల నుండి కిందివరకు కాళ్ళు ఒత్తించుకొంటున్న జగన్నాథం, నేలమీద కూర్చొని ఒత్తుతున్న రాఘవయ్య ఇద్దరూ ఒక్కమారుగా ఉలిక్కిపడి గడియారం వంక తలతిప్పి చూశారు. ‘అప్పుడే పదయిపోయిందే... ఇక పడుకొందాం...’ అంటూ జగన్నాథం కాళ్ళను పక్కకు పెట్టాడు. రాఘవయ్య పైకి లేచి జగన్నాథానికి ఇంకేమైనా కావాలా అని చుట్టూ చూశాడు. వెనక్కు తిరుగుతున్న రాఘవయ్యతో జగన్నాథం అన్నాడు, ‘రేపు టిఫిన్ ఇడ్లీ కదా! ఇడ్లీలోకి చుక్కాకు చెట్నీ ఎలా ఉంటుంది?’ ‘పుల్లపుల్లగా బాగుంటుందయ్యా! తోడుగా నల్లగారం పొడి కూడా ఉంది. నాలుగు నేతిచుక్కలు వేసుకుంటే... మీరు మామూలుగా తినే నాలుగు ఇడ్లీల కన్నా ఇంకో రెండు ఎక్కువ తింటారు.’ ‘మధ్యానం నాటుకోడి పులుసు చేసుకొందాం. చాల్రోజులయింది తిని...’ రాఘవయ్య నోట్లో నీళ్ళు ఊరాయి. ‘నాటుకోడి అయితే నేను ఒక ముద్ద సంగటి చేసుకొంటాను. మీరూ కొంచెం తిని చూడండి...’ ‘సంగటి నాకు అరగదేమో రాఘవయ్యా...’ ‘అన్నీ అరగతాయి లెండయ్యా... అన్నం కూడా చేస్తా కదా... నచ్చకపోతే అన్నమే తిందురుగాని...’ ‘కొంచెం మిరియాల చారు కూడా చెయ్యాలి...’ ‘చేస్తానయ్యా... ఇక నేను పడుకుంటా. తెల్లార్తోనే లేచి చెత్తలూడ్చి, బోకులు కడిగి, మీకు పేపరు తీసుకొచ్చి, ఆరున్నరకల్లా కాఫీ రెడీ చెయ్యాలి గదా... మంచినీళ్ళు అక్కడ పెట్టాను. ఇంకేమన్నా కావాలంటే గట్టిగా ఒకమారు పిలవండి. లేచేస్తాను’ అంటూ సమాధానం కోసం చూడకుండా పడుకోవడానికి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రాఘవయ్య. ఉదయం ఎనిమిది గంటలకల్లా సుశీలమ్మ ఒక చేటలో ఆవు పేడ తీసుకొచ్చింది. బాత్రూంలోకెళ్ళి బక్కెట్లో నీళ్ళు పట్టుకొచ్చి పేడ కలిపింది. ఇంటిముందు పరకతో తోసేసి పేడనీళ్ళు చల్లింది. పేడనీళ్ళను కొంతసేపు ఆరనిచ్చి పరకతో అలికింది. ఆ తర్వాత ముగ్గుపిండి తీసుకొని తనకు వచ్చిన ముగ్గు వెయ్యసాగింది. జగన్నాథం ముందు గది తలుపు దగ్గర కుర్చీ వేసుకొని పేపరు చదువుతున్నాడు. అప్పుడప్పుడూ ముగ్గు వెయ్యడంలో సుశీలమ్మ నేర్పరితనాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. ఆమెకు అరవై ఏళ్ళుంటాయి. ‘ఎవరూ లేరయ్యా! ఏదైనా పనిచెప్పండి. పడి ఉంటాను’ అని ఒకరోజు వచ్చింది. తనకు అన్ని పనులు చెయ్యడానికి రాఘవయ్య ఉన్నాడు, ఆమె దీనంగా అడిగితే కాదనలేకపోయాడు జగన్నాథం. అప్పుడే ఇంటిముందు పేడనీళ్ళు చల్లి ముగ్గు పెట్టడానికి మనిషిలేరే అని గుర్తుకు వచ్చింది. ‘మంగళవారం, శుక్రవారం వచ్చి పేడతో అలికి వెళ్ళు, నెలకు ఎంతో కొంత ఇస్తాను,’ అన్నాడు. సరే అంది సుశీలమ్మ. ఆమె అలకడం ముగ్గు పెట్టడం చూస్తూ, అప్పుడప్పుడూ పేపర్లోకి తల దూర్చుతూ ఉన్న జగన్నాథానికి హఠాత్తుగా గుండుగల్లు చెట్నీ గుర్తుకు వచ్చింది. ఎన్నో ఏళ్ళ నుండి ఆ చెట్నీ తినాలనుకొంటున్నాడు గాని చేసిపెట్టేవాళ్ళే లేరు. ఎవర్నడిగినా ఆ పేరే మేము వినలేదు అంటున్నారు. సుశీలమ్మను అడిగి చూద్దాం అనుకొన్నాడు. ‘నీకు గుండుగల్లు చెట్నీ చెయ్యడం తెలుసా?’ అన్నాడు. ‘గుండుగల్లు సెట్నీనా...?’ కాస్సేపు ఆలోచనలో పడింది సుశీలమ్మ. ‘ఎప్పుడూ విన్లేదుసా... ఎవురూ ఆ మాట అనింది కూడా గురుతుకు రావడం లేదు. నువ్వు సెప్పే గుండుగల్లు సెట్నీ ఎట్లా ఉంటుంది? యాడ దిన్నావు?’ అంది. ‘నలభై ఏళ్ళకు ముందు ఒక స్నేహితుణ్ణి... ఆయన పేరు చిన్నస్వామి... ఆ చిన్నస్వామిని చూడడానికి నేను గుండుగల్లు వెళ్ళా. ఆ ఊరు ఆంధ్రా కర్ణాటక బార్డర్లో ఉంది. ఆ ఊళ్ళో మా స్నేహితుడి భార్య ఈ చెట్నీ చేసిపెట్టింది. ఎంత బాగుంది అంటే నేను తినే అన్నమంతా ఆ చెట్నీతోనే తిన్నాను. ఇంకో కూర తాకలేదు. ఈ చెట్నీ ఎలా చేస్తారు అంటే ఆమె అప్పుడేదో చెప్పింది కాని ఏమీ గుర్తుకు రావడం లేదు. నాకేమో ఆ చెట్నీ మరుపుకు రావడం లేదు. వాళ్ళేమో ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎక్కడికి పోయారో ఏమో తెలీదు,’’ జగన్నాథం గుండుగల్లు చెట్నీ పూర్వవృత్తాంతం చెప్పాడు. సుశీలమ్మకు చాలా జాలివేసింది. ‘అయ్యో!’ అనుకొంటూ, ‘ఎవుర్నన్నా అడుగుతా సా... ఆ పక్కోళ్ళు ఈ పక్క ఎవురన్నా ఉండారేమో... వాళ్ళకు తెలిసుంటుంది. నువ్వు సెప్పిన పేరేమి? గుండుగల్లు సెట్నీనా? అదేనా దానిపేరు?’ అంది. ‘ఆ చెట్నీ పేరు ఏమో నాకు తెలీదు సుశీలమ్మా... నేను ఆ ఊర్లో తిన్నా కాబట్టి గుండుగల్లు చెట్నీ అంటున్నాను...’ ఆలోచనలో పడిపోయింది సుశీలమ్మ. ఆలోచనతోబాటు కొంత దిగులు కూడా కలిగింది. ‘సార్... నువ్వు ఎప్పుడైనా సీకికొళ్ళతో సేసిన సెట్నీ తిన్నావా?’ అంది. ‘సీకికొళ్ళా...?’ నోరువెళ్ళబెట్టాడు జగన్నాథం, ‘సీకాయచెట్టు చిగుర్లేనా నువ్వు చెబుతున్నావు?’ ‘అవున్సా... సీకాయ సెట్టు సిగుర్లే... ఎర్రగా ఉంటాయి... అవి దెచ్చి ఇడిపించుకొని చిన్నయర్రగడ్లు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, ఉప్పు, చింతపండు అన్నీ నూనెలో బాగా ఏయింసి రోట్లో ఏసి తిరగబాత పెడితే శానా శానా బాగుంటుంది సార్... రేపు ఎప్పుడైనా తెచ్చేదా...’ యజమానికి ఏదో ఒక తృప్తి కలిగించాలి అనే స్థిర నిర్ణయంతో ఉన్నట్లు అంది సుశీలమ్మ. ‘ఈకాలంలో సీకాయచెట్లు ఇంకా ఉన్నాయా? నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను.’ ‘గొల్లపల్లి దగ్గర ఒక సెట్టుంది సార్... దగ్గరే కదా... ఇది సిగురుపెట్టే టయిమే... ఉంటే కోసుకొస్తాను... రాఘవయ్య దగ్గర నేనే ఉండి సెట్నీ సేయిస్తాను.’ గుండుగల్లు చెట్నీ కాకపోతే ఇంకో కొత్త చెట్నీ రుచి చూడొచ్చుగదా అని జగన్నాథం ‘సరే’ అన్నాడు. సుశీలమ్మలో ఆలోచన ఆగలేదు. ‘‘పాపం ఈ సారుకు అన్నీ ఉన్నాయి. డబ్బుకు లోటులేదు. అన్నీ ఉన్నా ఈ వయసులో నోటికి రుసిగా సేసిపెట్టే వాళ్ళే లేరు... నాకు తెలిసింది ఏదయినా సేసిపెడితే బాగుణ్ణు’’ అనిపించింది. ఆ ఆలోచనలతోనే ముగ్గు వెయ్యడం పూర్తిచేసి ముగ్గుపిండి గిన్నెలు లోపల కిటీకీ ఊచల దగ్గర పెడుతున్నప్పుడు ఏదో గుర్తుకొచ్చిందేమో... గట్టిగా ‘సార్...’ అంది. జగన్నాథం ఉలిక్కిపడి ఆమె వంక చూశాడు. ‘నీకు నల్లేరు సెట్నీ సేస్తారు తెలుసా?’ అంది. జగన్నాథానికి నల్లేరు తెలుసు. తన చిన్నప్పుడు ఎవరికయినా కుక్క కరిస్తే నల్లేరు దంచి, దాంతోబాటు ఒక రాగి దమ్మిడీని గాటుపడిన చోట పెట్టి కట్టుకడితే విషం పీల్చేస్తుందని అందరూ అనేవారు. నల్లేరుతో బ్రాహ్మణులు సాంబారు చేసి తింటారని కూడా విన్నాడు. చెట్నీ సంగతి వినలేదు. తన ఇంట్లో ఎప్పుడూ చెయ్యలేదు. సుశీలమ్మకు సమాధానం ఇస్తూ, ‘తెలుసుగాని... ఎప్పుడూ తిన్లేదు,’ అన్నాడు. సుశీలమ్మ కళ్ళు ఆనందంతో మిలమిలమన్నాయి. అయ్యగారు ఇంతవరకూ రుచి చూడని చెట్నీ... ఒకటి కాదు రెండు చేసిపెట్టే అవకాశం వచ్చింది కదా అని సంబరపడిపోయింది. ‘మంగలారం సీక్కొళ్ళు తెస్తాను... మల్లా సుక్రోరం నల్లేరు తెస్తాను. నేనే దగ్గరుండి సేయిస్తాను,’ అంది వెళ్ళబోతూ. సుశీలమ్మ వెళ్ళిపోతూ ఉంటే జగన్నాథం, ‘సుశీలమ్మా’ అని పిలిచాడు. ఆమె ఆగింది. ‘నాకేదో చేసిపెడతానంటున్నావు... నీ సంగతేమిటి? నీకేమి తినాలనిపిస్తుంది?’ అన్నాడు. సుశీలమ్మ సిగ్గుపడి పోయింది. చెప్పాలా వద్దా అని ఒక క్షణం సంశయించి ఆ తర్వాత చెప్పింది. ‘ఏడేడిగా సికెన్ బిరియానీ దానికి తోడు ముసిలుమోళ్ళు సేసినట్లు పలసగా వంకాయకూర తినాలనుంది సార్...’ అంది. అన్న తర్వాత సుశీలమ్మ అక్కడ ఉండలేదు. తను చెప్పి ఉండకూడదు, తప్పు చేశాను అన్నట్టు జగన్నాథం ఇంకో ప్రశ్న వెయ్యక మునుపే గబగబా వెళ్ళిపోయింది. మంగళవారం కొంచెం ఆలస్యంగా వచ్చింది సుశీలమ్మ. ఒకచేతిలో యథాప్రకారం చేటలో ఆవుపేడ ఉంది. ఇంకోచేతిలో ఒక పలచని గుడ్డలో ఏవో చుట్టుకొని తెచ్చింది. మంగళవారం సీకిచిగుళ్ళు తెస్తానని చెప్పింది గుర్తుకొచ్చింది జగన్నాథానికి. సుశీలమ్మ ముఖంలో ఏదో తేడా కనిపించింది జగన్నాథానికి. తన పనంతా పూర్తయిన తర్వాత నడుంమీద చేతులు పెట్టుకొని నిలబడి ముగ్గు వంక కొంతసేపు పరీక్షగా చూసి, తృప్తిగా తల ఆడించుకొంటూ లోపలివైపు రావడానికి అడుగులు వేస్త్తూ జగన్నాథానికి ఎదురుగా బయటిపక్కే నిలబడి మొదలుపెట్టింది. ‘సూడండి సా... నేను తొలిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం సెప్పాను? ఎవురూ లేరని సెప్పాను గదా... నేను సెప్పింది నిజమేసా...’ లోపల ఏదో ఉద్వేగం తన్నుకొచ్చినట్లుంది సుశీలమ్మకు. రెండు క్షణాలు ఆగి మళ్ళీ మొదలుపెట్టింది. ‘నాకొక్క కొడుకున్నాడు సార్... ఏడేళ్ళయింది వాడు గలుఫు దేశాలు పట్టిపొయ్. నిన్న ఇంటి కొచ్చినాడు... వచ్చి నాల్రోజులయిందట. తర్వాత తెలిసింది. ఈవూర్లో వాడి సావాసగాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళతో ఏదో బిజినెస్సు మాట్లాడేదానికి వచ్చినాడంట, ఇంటికొచ్చినోడు ‘‘అమ్మా ఎట్లుండావు? తిన్నావా లేదా? నీకు పూట ఎట్లగడస్తా ఉంది?’’ అని అడగాల్నా? వద్దా? అవేమీ లేదు. పక్కన కూర్చోలేదు. నా సెయ్యి పట్టుకోలేదు. నాకేమో కళ్ళలో నీళ్ళు దుమకతా ఉన్నాయి. నాయ్నా అని వాణ్ణి వాటేసుకోవాలని ఉంది. వాడు దగ్గరికొస్తే పాంటూ సర్టూ నలిగిపోతాయనేటట్లు నాలుగడుగుల దూరంలోనే నిలబడినాడు సార్... ఎంతసేపు? వక్కకొరికినంత సేపు. సేతిలో ఏదో పొట్లం ఉంది. దాన్ని నా ముందు పెట్టి ... ఉహూ... పెట్టలా... నా ముందు పడేసి, ‘‘నీకోసం సికెన్ బిరియానీ తెచ్చాను. నీ కిష్టం కదా!’’ అన్నాడు. అప్పుడు సూడండి సా... నాకు యెక్కడ లేని కోపం వచ్చింది. వాడు ఇసిరేసిన పొట్లం అందుకొని నేను యిసిరేశాను సూడండిసా... అదిపొయ్ తలుపుకవతల యీదిలో పడింది. ఆ తర్వాత వాడు ఒక నిమసం కూడా నిలబడ్లా. ‘‘నువ్వేదో కోపంగా వుండావు. రేపు పొయ్యేటప్పుడు మల్లా వస్తాన్లే అని ఎల్లిపోయ్నాడు’’. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లు ఆగింది సుశీలమ్మ. తను చెప్పదలచుకొన్నది పూర్తి కాలేదు అన్నట్లు తెలుస్తూనే ఉంది. ‘‘ఈ దినం తెల్లార్తో మల్లా వచ్చినాడు సా... నూర్రూపాయలనోట్లు కట్టతీసి ఒగటి రెండూ అని పది లెక్కబెట్టి నా సేతిలో పెట్టి, ‘‘కరుసుకు ఉంచుకో... నాలుగు నెల్లకు మల్లా వస్తా,’’ అన్నాడు. నేను ఉలకలేదు, పలకలేదు తలెత్తి వాడి మొగం వంక సరిగా సూడనుగూడా లేదు. బలింతంగా నోట్లు నా సేతిలో పెట్టాడు. నేను యిసిరేశాను. యేమనుకొన్నాడో యేమో... ఒగ నిమసం అట్లే నిలబడి శరశరా యెల్లిపోయాడు’. సుశీలమ్మ చెప్పడం అయిపోయింది. కొంగుతో రెండు కళ్ళూ తుడుచుకొని సీకి చిగుళ్ళు తీసుకొని వంటింట్లోకి నడిచింది. రాఘవయ్య అప్పటికే చికెన్ బిరియానీకి, వంకాయకూరకు అన్నీ సిద్ధం చేసుకొన్నాడు. ఆ రోజు ముగ్గురూ అక్కడే తిన్నారు. సుశీలమ్మ ఆనందంగా చికెన్ బిరియానీ రెండుమార్లు వడ్డించుకొని వంకాయకూరతో తినింది. జగన్నాథం సీకికొళ్ళ చట్నీ నంజుకొంటూ బిరియానీ తిన్నాడు. సుశీలమ్మ చెప్పినట్లే సీకికొళ్ళ చెట్నీ చాలా బాగుంది. ఉత్త అన్నంలో కూడా కలుపుకొని, నేతిచుక్కలు నాలుగు వేసుకొని తృప్తిగా తిని, ‘ఇదే ఇంత బాగుంది... నేను అప్పుడెప్పుడో తిన్న గుండుగల్లు చెట్నీ తింటే ఎలా ఉంటుందో ఏమో...’ అన్నాడు నవ్వుతూ. రాఘవయ్యా, సుశీలమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. శుక్రవారం వచ్చింది. నల్లేరు చెట్నీ తయారయింది. మాంసం వేపుడు కూడా చెయ్యమన్నాడు జగన్నాథం. ముగ్గురూ ఆనందంగా తిన్న తర్వాత జగన్నాథం అన్నాడు, ‘రెండు కొత్త రకం చెట్నీలు తిన్నాను. చాలా రుచిగా ఉన్నాయి. ఇక గుండుగల్లు చెట్నీ తినకపోయినా ఫర్వాలేదు.’ ఆరోజు రాత్రి పడుకొనే ముందు జగన్నాథానికి కాళ్ళు ఒత్తుతూ రాఘవయ్య, ‘అయ్యా... ఒక మాట చెప్పేదా,’ అన్నాడు. ‘చెప్పు’ అన్నాడు జగన్నాథం. ‘సుశీలమ్మ నాకెవురూ లేరు అని ఇంకోమారు తేల్చి చెప్పేసింది. నా సంగతి నీకు తెల్సు. పదేండ్లు దాటిందో పదైదేండ్లు దాటిందో నా కొడుకూ కోడలూ యిల్లొదిలిపెట్టి ఎల్లిపోయి. ఇన్నేండ్లు రానోల్లు యింకేముస్తారు. సుశీలమ్మ చెప్పినట్లు నాకూ ఎవ్వరూ లేరు గదయ్యా... నేను పన్లో చేరిన కొత్తలో మీరూ అదే మాటన్నారు. కొడుకు ఏదో దేశం ఎల్లిపోయ్నాడు అంటిరి కదా...’ ‘ఏదో దేశం కాదు రాఘవయ్యా... సినిమాల్లో హీరో వేషాలు వేస్తానని బొంబాయి పోయ్నాడు. పట్టుబట్టి ఆస్తులన్నీ అమ్మించి తీసుకెళ్ళిపోయాడు. మిగిలిపోయింది ఈ యిల్లే... నాకిది చాల్లే... బ్యాంకులో ఉన్న డబ్బుతో నా జీవితం గడిచిపోతుంది. వాడు మళ్ళీ తిరిగొస్తాడని నేను అనుకోవడం లేదు. నువ్వున్నావు. ఆ సుశీలమ్మ ఉంది. నాకేం కావాలన్నా చేసిపెడతారు. ఈ వయసులో ఇంకా కావలసిందేముంది?’ ఔ అన్నట్లు రాఘవయ్య తల ఆడించాడు. ఆ మరుసటి రోజు జగన్నాథాన్ని నిద్రలేపింది సుశీలమ్మ, ‘కాపీ తెచ్చినాన్సార్!’ అంటూ. ఉలిక్కిపడి పైకి లేచాడు జగన్నాథం. కళ్ళు నులుముకొంటూ ‘నువ్వొచ్చినావేం సుశీలమ్మా... రాఘవయ్య ఏడీ...?’ అన్నాడు ఆదుర్దాగా. ‘ఏమో తెలీదుసా... తెల్లారి మబ్బుతోనే మా యింటికి ఒచ్చినాడు ‘‘సుశీలమ్మా... నేను అరిజెంటు పనిమీద యాడో బోతా వుండాను. నువ్వు రెండు మూడు దినాలు అయ్యగార్ని సూసుకోవల్ల,’’ అన్జెప్పి నిలవనుకూడా నిలవలేదుసా... అదే పొయ్‌నాడు. నాకు దిక్కుతెలీక నేనుగా యీడికొచ్చేసినా...’ తన తప్పేమీ లేదన్నట్లు, సంజాయిషీ ఇస్తున్నట్లు చెప్పింది సుశీలమ్మ. ఎంత ఆలోచించినా రాఘవయ్య వెళ్ళిన కారణం జగన్నాథానికి అంతుపట్టలేదు. జగన్నాథం మనసు మనసులో లేదు. సుశీలమ్మ తనకు చేతనైనంత వరకూ చేసిపెడుతోంది. జగన్నాథానికి తినబుద్ధి పుట్టలేదు. మరుసటిరోజు ఉదయం సుశీలమ్మ కాఫీ తీసుకెళ్ళి జగన్నాథాన్ని పిలిచినా లేవలేదు. కాఫీకప్పు పక్కనపెట్టి ఒంటిమీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. గబగబా పరుగెత్తికెళ్ళి ఆ ఊళ్ళో ఉండే ఒక ఆరెంపీ డాక్టర్ని పిలుచుకొచ్చింది. ఆ రోజంతా గంజి, పాలు, కాఫీ, రెండు రొట్టెముక్కలు తప్ప ఇంకేమీ ముట్టలేదు జగన్నాథం. రాత్రి జగన్నాథం గదిలోకి సుశీలమ్మ రెండుమార్లు వెళ్ళి ఒంటిమీద చెయ్యివేసి చూసింది. రెండుమార్లు చూసినప్పుడు జ్వరం తగ్గినట్లుంది. కాని తెల్లవారేసరికి మళ్ళీ తిరగబెట్టింది. ఆరెంపీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ పరుగెత్తుకెళ్ళింది. డాక్టర్ ఇంజెక్షను కూడా వేశాడు. ‘మధ్యాన్నం వరకూ ఇట్లాగే ఉంటే టౌనుకు పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి’ అని చెప్పి వెళ్ళిపోయాడు. జగన్నాథం లేవలేదు. అప్పుడప్పుడూ మూలుగుతున్నాడు. పిలుస్తున్నా బదులు పలకడం లేదు. పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? పాలుపోలేదు. పన్నెండు గంటలప్పుడు గుమ్మం దగ్గర చప్పుడయింది. గబుక్కున లేచి చూసింది సుశీలమ్మ. రాఘవయ్య ఇంట్లోకి వస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది సుశీలమ్మకు. ఆ కోపంలో ఏం మాట్లాడాలో తెలీలేదు. కోపం కాస్తా ఏడుపయింది. కొంగు నోట్లో దూర్చుకొని దుఃఖాన్ని దిగమింగుతూ జగన్నాథాన్ని చూపించింది. రాఘవయ్య జగన్నాథం మంచం పక్కన నిలబడి కాస్సేపు తదేకంగా చూశాడు. ఒంటిమీద చెయ్యి వేశాడు. వేడిగానే ఉంది. ‘అయ్యా అయ్యా’ అని పిలిచినా స్పందన లేదు. కాస్సేపు అలాగే నిలబడి ఆలోచించిన రాఘవయ్య వంటింట్లోకి వెళ్ళిపోయాడు. బియ్యం ఒక స్టౌ మీద పెట్టి, రెండో దాంట్లో బాణలి పెట్టాడు. కాస్సేపటి తర్వాత మిక్సీ ఆన్ చేశాడు. గంటన్నర లోపల వంట పూర్తయింది. ‘ఇప్పుడు వంట చేయడం అంత ముఖ్యమా! అయ్యగారిని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళే విషయం ఆలోచించకుండా ఈ రాఘవయ్య వంటింట్లోకి దూరాడే! ఈ మూడురోజులూ తిండి తిన్లేదేమో!’ సుశీలమ్మ మనసులో విసుక్కొంటోంది. రాఘవయ్య వంటింట్లోంచి అన్నం గిన్నెతోబాటు ఇంకో గిన్నె కూడా తెచ్చాడు. జగన్నాథం కంచంలో అన్నం పెట్టి, ‘అయ్యా! గుండుగల్లు చెట్నీ చేశానయ్యా! రెండురోజులు కష్టపడితే మీ స్నేహితుడు చిన్నస్వామి పక్కింటివాళ్ళు చెప్పారు. ఏం లేదయ్యా ఫస్టు బాణలిలో నూనె వేసి ఆవాలు, ఉద్దిపప్పు, సెనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత చింతపండు, చిన్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేయాలి. చివరలో కొత్తిమీర, కరివేపాకు వేసి ఇంకొంత సేపు వేయించాలి. ఉప్పువేసి అంతా మిక్సీలోకి వేస్తే గుండుగల్లు చెట్నీ రెడీ. ఫస్టు మీరే రుచి చూడాలయ్యా. కంచంలో పెట్టుకొని వచ్చా’ అన్నాడు. జగన్నాథం మంచం మీద లేచి కూర్చున్నాడు. వేడి వేడి అన్నంలో చెట్నీ కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ‘అదే అదే... ఇదే గుండుగల్లు చెట్నీ’ అని ఆనందంగా అన్నాడు. ఆయన ముఖమంతా వెలిగిపోయింది. ఆబగా చెట్నీ కలుపుకొంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి తినసాగాడు. రాఘవయ్య చూస్తూ ఉండలేకపోయాడు. గబగబా లోపలికెళ్ళి తనకో కంచం, సుశీలమ్మకో కంచం తీసుకొచ్చాడు. - నాయుని కృష్ణమూర్తి