డాక్టర్ మీరు చూసారా? | Kakaraparti Bhagwan Krishna story as Special appreciation | Sakshi
Sakshi News home page

డాక్టర్ మీరు చూసారా?

Published Sun, Jul 17 2016 2:51 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

డాక్టర్ మీరు చూసారా?

డాక్టర్ మీరు చూసారా?

ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ
మనిషి తన అపూర్వమైన మేధాసంపత్తితో చంద్రుని మీదకు వెళ్లిరావడమే కాకుండా ఆకాశంలో ఉన్న ఇతర గ్రహాల మీదకు కూడా సజీవంగా వెళ్లిరావడానికి పరిశోధిస్తున్నాడు. కాని ఎన్నాళ్లు పరిశోధిస్తాడు? అతను జీవించినంత కాలమే కదా! మరణించాక మరి పరిశోధనలు ఉండవు కదా! కాని ఈ మరణాన్ని ఎందుకు జయించలేకపోతున్నాడు? అని అనేక మంది ప్రశ్నలు సంధిస్తుంటారు. నేను ఈ విషయంలో ఒక కోణంలో ఏకీభవించాను. ఎందుకంటే మనిషి జీవనానికి నాడి అయిన గుండెలను చీల్చి అందులో లోపాలను సరిచేసి, కొన్ని వందల గుండెలను స్పందించేట్లు చేసే డాక్టర్‌ని కాబట్టి. అయితే ఈ గుండెజబ్బులు అసలు లేకపోతేనో, ఇదో చిక్కు ప్రశ్న.
 
హాస్పిటల్‌లో నా చాంబర్‌లో ఆలోచనల్లో మునిగిపోయిన నాకు క్షణం క్రితమే వెళ్లిపోయిన హార్ట్ పేషెంట్ గుర్తుకొచ్చాడు. ఆయనకు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ అయింది. మరలా ఇప్పుడు ఆయనకు అదే లోపం వచ్చింది. ఆయన గుండెకు ఇప్పుడు మరలా ఆపరేషన్ చెయ్యాలి. కాని ఆయన వయస్సు అరవై తొమ్మిది దాటింది. ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేటు చాలా తక్కువ. నాకేమీ కాదు చెయ్యండి అని ఆయన అంటాడు. అమ్మో వద్దు బతికినన్నాళ్లూ బతుకుతారులే, అని ఆయన భార్య అంటుంది. బాగా ఆలోచించుకుని రమ్మని వారిని పంపించేశాను.
 
ఇంతలో ఒక పదేళ్ల పాపను తీసుకుని దంపతులు వచ్చారు. వాళ్ల ముఖాల్లో దుఃఖం గూడు కట్టుకుని ఉన్నట్లుగా ఉన్నారు. పాప మాత్రం చలాకీగా ఉంది. పసుపూ గంధమూ కలగలిపిన రంగులో సుమారు నాలుగు అడుగుల ఎత్తులో బొద్దుగా ఉంది. గుండ్రని ముఖం, నవ్వుతున్నప్పుడు చొట్టలు పడే బుగ్గలూ, పొడవాటి ముక్కూ, గిరజాల జుట్టూ, విశాలమైన నుదురూ, మిలమిలా మెరిసిపోయే పెద్ద కళ్లూ, చిన్ని నోరూ ముత్యాల పలువరుసతో పున్నమి చందమామను చూసిన ఆనందం కలిగింది నాకు. ‘దైవమా ఈ ముద్దులొలికే పాపను గుండెజబ్బుకు గురి చేశావా?’ అనుకున్నాను.
 
‘‘నమస్తే డాక్టర్ - మా పాప పేరు గాయత్రి. మా ఊరిలో హార్ట్ క్లీనిక్ వారు మీ దగ్గరకు వెళ్లమని చెప్పారు. మీరే మా పాపను బతికించాలి’’ అంటూ గొల్లుమంది తల్లి.
 నేను పాప ఫైలు తీసుకుని కేస్ స్టడీ చేశాను. ఒక వాల్వ్‌కు రక్త ప్రసరణ సరిగా లేదు, మరో వాల్వ్ నుండి రక్తం గుండె బయటకు వెళ్లిపోతోంది. ఫైలులో ఆపరేషన్ సాధ్యమైనంత తొందరగా చేయాలని రాశారు.
 
తల్లీ తండ్రీ ఆతృతగా నన్ను చూస్తున్నారు. పాప తండ్రి ‘‘పాపకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నారండీ. లేకపోతే పాప ఎంతో కాలం బతకదన్నారు. మా ఊరి డాక్టరు మీ దగ్గరకు తీసుకువెళ్లమనీ, మీరు ఇటువంటి కేసులు ఎన్నో నయం చేశారనీ కూడా చెప్పారు. మీ మీదే...’’ అంటూ పొంగుతున్న దుఃఖంతో మాటలు రాక మూగబోయాడు.
 ‘‘పాపను రేపే జాయిన్ చెయ్యండి. ఒక పది రోజుల్లో ఆపరేషన్ చేసేద్దాం. పాపకు తప్పక నయమౌతుంది. పాపకు ఏ భయం లేదు’’ అన్నాను వెంటనే పాప చేతిని నా చేతికి అందించి. వాళ్లిద్దరూ నా కాళ్లమీద పడ్డారు, నేను కాళ్లు వెనక్కు లాక్కునే లోపే. వాళ్లిద్దరి కళ్లల్లోంచి కన్నీళ్లు నా పాదాలను తాకనే తాకాయి.

నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అయినా నేను ఇలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు నా మనసును స్థిరపరచుకుని కర్తవ్యోన్ముఖుణ్ని అవుతుంటాను.
 స్పెషల్ వార్డ్‌లో గాయత్రిని చేయించి అన్ని పరీక్షలు చేశాం. ఒక వారం రోజుల్లో ఆపరేషన్ పోస్ట్ చేశాం. పాప గదిలో తల్లీ తండ్రీ తప్ప ఎవర్నీ రానివ్వడం లేదు. ప్రతీవాళ్లు వచ్చి పాపను చూసి సానుభూతి ప్రదర్శిస్తుంటే పాప కుమిలిపోతుందని.
 
పాప తల్లిదండ్రులకు దైవం మీద ఉన్న నమ్మకానికి నేను ఆశ్చర్యపోయాను. పాప ప్రాణాలు కాపాడుకోవడం కోసం అంతులేని ఆరాటంతో అనేక రూపాలలో ఉన్న భగవంతుణ్ని అనుక్షణం ప్రార్థిస్తూనే ఉన్నారు. ఒకరోజు విష్ణు సహస్రనామ పారాయణం, శివునికి రుద్రాభిషేకం చేయించిన తీర్థం, ఇంకో రోజు గాయత్రీదేవి కోటి యజ్ఞం, లలితా సహస్రనామం, మృత్యుంజయ హోమం... ఇలా ఎన్నో చేయిస్తున్నారని పాప వుండే స్పెషల్ రూమ్ అటెండయ్యే మా నర్స్ చెప్పింది.
 
ఈ సందర్భంలో నేను చదివిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఇటలీలో 999 మంది హృద్రోగులను డాక్టర్లు నియమిత కాలంలో పరీక్షించారుట. హాస్పిటల్‌లో చేరిన తరువాత వారి హృదయ స్పందన మామూలుగా ఆరోగ్యంగా మారడం ఆశ్చర్యంతో గమనించి వారిని ప్రశ్నించగా, ‘‘నేను రోజూ దేముణ్ని ప్రార్థిస్తాను, నా గుండెను దేముడే రక్షిస్తున్నాడు’’ అన్నారుట వాళ్లందరూ. అదే సమయంలో దేముడంటే విశ్వాసం లేని వారి గుండెజబ్బు త్వరగా నయం కాకపోవడం కూడా డాక్టర్లు నిశితంగా గమనించారట. అందుకే ఎన్ని రకాలుగా దైవాన్ని పూజించినా ఎవరికి అభ్యంతరం ఉంటుంది?
 
పాపను చూడటానికి స్పెషల్ రూమ్‌లో ప్రవేశించాను. ‘‘నమస్కారం సార్’’ అంది పాప. వెన్నెల వంటి చిరునవ్వు ముఖంతో, పాప కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. అలాగని అనవసరమైన విషయాలు కాదు, ఎంతో చక్కగా వివేకంతో మాట్లాడుతుంది.
 
‘‘డాక్టర్, నేను మా క్లాసులో టాపర్‌ని. ఎవరికీ ఫస్ట్ ర్యాంక్ రానివ్వను. నేను వేణువు నేర్చుకుంటున్నాను. చౌరాసియా అంకుల్‌లాగా నేను అందర్నీ మైమరపిస్తాను. వేణుగానంతో, సంగీతం నేర్చుకుంటున్నాను. సుశీల ఆంటీలా సినిమాల్లో మంచి పాటలు పాడతాను. నేను డాక్టరు చదువుతాను. గుండెజబ్బులపై ప్రత్యేకంగా చదివి, గాయత్రీ హార్ట్ కేర్ అని హాస్పిటల్ స్థాపించి, పేదవారికి ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేస్తాను. నాకు ఇంకా ఎన్నో ఆశలు వున్నాయంకుల్.

నేను అనుకున్నవన్నీ చేయగలనా అంకుల్. అయితే ఇవన్నీ మీ వలననే అవుతాయంకుల్. ఎందుకంటే నాకు ఆపరేషన్ మీరు బాగా చేస్తే నేను అనుకున్నవన్నీ చేసేస్తానంకుల్...’’ అంటూ కనుగుడ్లూ, చేతులూ అటూ ఇటూ తిప్పుతూ మాట్లాడుతున్న పాపను చేష్టలుడిగి చూస్తూ వుండిపోయాను. పాప కళ్లల్లో తేజస్సు వుంది. ఈ పాప తాను అనుకున్నవన్నీ చేయగలదు. అయితే ఈ క్లిష్టమైన ఆపరేషన్ అనే యమదూతతో సమరాన్ని జయించాలి.

చిన్ని పాప హృదయంలో కోటి ఆశలూ ఆశయాలూ కల్పించావే సర్వాంతర్యామీ, అదే చేత్తో ఈమెకు సంపూర్ణ ఆయుర్దాయం కూడా ప్రసాదించు అని నా వంతుగా దైవానికి నా కోరిక విన్నవించుకున్నాను.
 ఇంతలో పాప నా ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా లాక్కుంటూ, ‘‘సారీ అంకుల్’’ అంటూనే నా చెవిలో ‘‘అంకుల్ మా మమ్మీ, డాడీ నాకు చెప్పారు. దేముడెక్కడో లేడు. ఎప్పుడూ మన గుండెల్లోనూ, మన వెనకాలే ఉంటాడని. మన వెనకాలే వుంటే మరి కనపడడేం అంకుల్. నేను చాలాసార్లు ఎంతోసేపు కళ్లు మూసుకుని, గభాల్న వెనక్కు తిరిగి చూశాను. దేవుడు కనుపిస్తాడేమోనని. నేను చూసేలోగానే గభాల్న దాక్కున్నాడేమో. అయితే మా అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదంకుల్. మన గుండెల్లో తప్పక ఉంటాడంకుల్.
 
అందుకని మీరేం చేస్తారంటే, నా గుండె కోసి తెరచినప్పుడు మీరు నా గుండెల్లో బాగా లోతుగా చూడండంకుల్, దేవుడున్నాడేమో. ఒకవేళ ఆపరేషన్ తరువాత నేను బతికి వున్నా లేకపోయినా మీరు దేవుడిని చూసిన విషయం మా అమ్మా నాన్నలకు, మిగతావారికీ చెప్పండంకుల్. నాకైతే నా గుండెల్లో దేవుడుంటాడని గట్టి నమ్మకం అంకుల్...’’ పాప ఇంకా మాట్లాడుతూనే వుంది.
 
చాటుగా నిలబడి, పాపనూ, నన్నూ నర్స్‌నీ గాయత్రి తల్లి చీరకొంగులో ముఖం దాచుకుని వలవలా ఏడుస్తోంది. తండ్రి టర్కీ టవల్ ముఖానికి అడ్డం పెట్టుకుని మోకాళ్లమీద కూర్చుని విలపిస్తున్నాడు. పాపను చూడడానికి వచ్చిన ప్రతిసారీ, వాళ్లు కుళ్లి కుళ్లి రోధించడం చూస్తూనే వున్నాను. కన్నతల్లి తండ్రి ఆవేదన, దుఃఖం ఎవరు ఆపగలరు? కడుపు నిండా ఏడిస్తే వారి దుఃఖ భారం తగ్గవచ్చును. అందుకే వారిని ఆపేవాడిని కాదు.
 
ఆ రోజు పాపకు ఆపరేషన్. ఆపరేషన్ థియేటర్‌లో అడుగుపెట్టాను. కళ్లు మూసినా తెరచినా గాయత్రి రూపమే ప్రత్యక్షమౌతోంది. ‘‘డాక్టర్ నన్ను రక్షించండి’’ అంటూ దీనంగా వేడుకుంటున్నట్లుగా. ఇంతవరకూ ఎన్నో ఆపరేషన్లు చేశాను గాని, నాకు ఈ పాప ఆపరేషన్ ఒక వ్యక్తిగతమైన కేసులాగా, చాలెంజింగ్‌గా తీవ్రమైన పరీక్షలా అనిపిస్తోంది.
 
ఆపరేషన్ థియేటర్‌లో మంద్ర స్వరంతో గాయత్రి మంత్రం వినిపిస్తోంది. గాయత్రి బీజాక్షరాల సంపుటిలో పంచభూతాల సంబంధమైన బలం, ఒక్కో అక్షరంలో ఇమిడి వుంది. ఈ బీజాక్షరాలను జపించడం ఎంతో మంచిది. వీటిని పలికిన కొద్దీ, శరీరంలోని మలం కరిగిపోతుంది. నాడీ మండలం వికసించి మలిన రక్తం క్రమక్రమంగా శుభ్రపడి శరీరమంతా శుద్ధి అవుతుంది. ఈ మంత్రం జనన మరణ చక్రం నుండి తప్పించి అమృతం ప్రదానం చేస్తుంది. ఉచితమూ, అవసరమూ ఐన కోరికలను తీరుస్తుంది అంటారు. అందుకే కల్పవృక్షం అన్నారు. అందుకే నేను ఈ మంత్రాన్ని మా హాస్పిటల్‌లో డాక్టర్స్ ఛాంబర్స్‌లోనూ, రోగులు కూర్చునే హాల్స్‌లోనూ ఆపరేషన్ థియేటర్స్‌లోనూ వినిపించే ఏర్పాటు చేశాను.

మా హాస్పిటల్‌లో గుండె ఆపరేషన్స్ సక్సెస్‌కి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తాం.
 ఆ రోజు తొమ్మిది ఆపరేషన్స్‌లో తొలి ఆపరేషన్ పాపదే పోస్ట్ చేశాం. ఎందుకంటే ఫ్రెష్‌గా నేను ఇంటి వద్ద దైవ ధ్యానం చేసుకుని, ప్రశాంతంగా హాస్పిటల్‌కి రాగానే గాయత్రికి ఆపరేషన్ చెయ్యాలి.
 ప్రతీ ఆపరేషన్‌కీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ సంబంధిత పేషెంట్ యొక్క ప్రాథమిక ఆపరేషన్ అంటే రోగి యొక్క ఛాతీ మధ్యభాగాన్ని బలమైన కత్తితో కోసి, ఛాతీ ఎముకలను కత్తులతో కోసి, పండు మధ్యలో కోసి విడదీసినట్లుగా, మధ్యలో ఉన్న గుండెను బయటకు కనిపించే రీతిలో చేస్తారు.

అంతకుముందే మోకాళ్ల కింద భాగం మధ్యలో కోసి గుండె ఆపరేషన్‌లో ఉపయోగించడానికి నరాన్ని తీసి ఉంచుతారు. ఊపిరితిత్తులను, గుండెను తాత్కాలికంగా పనిచేయించడానికి హార్ట్ లంగ్ బైపాస్ మెషీన్‌కి కనెక్ట్ చేస్తారు. అప్పుడు నన్ను పిలుస్తారు. నేను ఆపరేషన్ పూర్తి చేశాక, కోసిన శరీర భాగాలను మూసేయడం, మందులు వేయడం, బ్యాండేజ్ వేయడం వంటి పనులన్నీ వాళ్లే చేస్తారు. ప్రాథమిక ఆపరేషన్ మొదలైనప్పటి నుండి మొత్తం ఆపరేషన్ పూర్తి అయ్యేవరకూ పేషెంట్ వెంటిలేటర్ కంట్రోల్‌లోనే జీవిస్తాడు.
 
రోగి గుండె బయటకు కనిపించగానే నన్ను పిలుస్తారు. నేను వెళ్లి గుండెకు సంబంధించిన లోపాలను, రోగి కాళ్ల నుండి తీసిన నరంతో లోపాన్ని సరిచేసి, గుండె మామూలు స్థితికి వచ్చిందో లేదో చూసి వచ్చేయడం వరకే నా డ్యూటీ. ‘డాక్టర్ రండీ’ అంటూ నా అసిస్టెంట్ వచ్చారు. అయితే పాపకు ఆపరేషన్ చేసే సమయం వచ్చేసిందన్నమాట. ఆపరేషన్ టేబుల్ మీద గాయత్రి ప్రకాశవంతమైన ముఖం మత్తులో పడుకుని ఉంది.
 
జాతి, మతం, కులం మొదలగు వైషమ్యాలతో మనిషి సతమతమైపోతుంటాడు. కాని ఏ శరీరాన్ని కోసినా ఎర్రని రక్తం చిందుతుంది. డాక్టర్లుగా మేము ప్రతీరోజూ చూసే దృశ్యమే ఇది. అయితే ఈ రోజు పాప గాయత్రి రక్తం చూస్తోంటే, ఏదోలా అనిపించింది. ఆమె రక్తంలో వింత కాంతి గోచరిస్తోంది.
 
కోసిన గుండెలో రక్తం లేకుండా రక్తాన్ని ఆపుచేస్తాం. అందువలన గుండెలో లోపాలు క్లియర్‌గా తెలుస్తాయి. అప్పుడు సంబంధిత గుండెకు సంబంధించిన రిపోర్టులు పరిశీలించిన దానిని బట్టి ఆ లోపాలను సరిచేస్తాం. ఆ విధంగా గాయత్రి గుండెలోని లోపాలన్నీ సరిచేశాను.
 ‘‘డాక్టర్స్... బ్లడ్ సప్లై రిస్టోర్ చెయ్యండి’’ అన్నాను. ఒక నిముషం కూడా కాలేదు.
 
నా పక్కనే వున్న అసిస్టెంట్స్ ‘‘సారీ సర్... పాప గుండెలోకి బ్లడ్ రావడం లేదు, ఎలాగా? చిన్న పాప కదా ఒకవేళ బాడీ రెస్పాండ్ కాలేకపోతోందేమో...’’ అన్నారు. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది.
 ఎందుకు బ్లడ్ రిస్టోర్ కాదు? అవుతుంది. అని ప్రశాంత వదనంతో నిర్జీవంగా తెరచిన గుండెతో పడివున్న గాయత్రి వద్దనే నిలబడ్డాను.
 ఇంతలో ‘‘డాక్టర్... ఆపరేషన్ తరువాత నేను బతికినా, చనిపోయినా ఫర్వాలేదు గాని డాక్టర్, నా గుండెల్లో దేవుడుంటాడని అమ్మ చెప్పింది. దయచేసి నా గుండె తెరచిన తరువాత బాగా పరిశీలనగా చూసి, మీరు నా గుండెల్లో దేవుడున్నాడో లేదో మా అమ్మా నాన్నలకు చెప్పండంకుల్’’ అని పదే పదే చెప్పిన పాప మాటలు నా చెవుల్లో రింగు రింగుమంటున్నాయి. వెంటనే నేప్‌కిన్‌తో ముఖం తుడుచుకుని,
 
‘‘డాక్టర్స్ ఒక్కసారి మళ్లీ పాప గుండె చూడండి’’ అంటూ నేను కూడా ఆతృత ఆపుకోలేక పాప తెరచిన గుండె చూద్దును కదా. ఆమె గుండెలో ఎర్రని రక్తం మెల్లగా ప్రవహించడం మొదలైంది. చిప్పిల్లిన ఆ ఎర్రని రక్తంలో నాకు మెరుపులు గోచరించాయి.
 అంతే! మరుక్షణం నా మనసూ, శరీరమూ, దూది పింజల్లా గాలిలో తేలిపోయాయి ఆనంద డోలికల్లో.
 గాయత్రి గుండెలో నిజంగా దేముడు ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడు అనే మాట నా చెవుల్లో ముమ్మారు ప్రతిధ్వనించింది.
 
అంబరాన్నంటిని సంబరంతో -
 ‘‘డాక్టర్స్ ఫినిష్ ది ఫార్మాలిటీస్. షి ఈజ్ ఆల్ రైట్’’ అంటూ బయటకు నా రూమ్‌లోకి వస్తున్నాను.
 ఆపరేషన్ థియేటర్‌లో మిగతా ఎనిమిది మంది మత్తులో బెడ్స్ మీద పడుకుని ఉన్నారు.
 వారందరి గుండెలూ నేను ఇవ్వాళ చూడాలి.
 వాళ్లందరూ ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు.
 వారిని ఏం చేసినా వారికి ఏమీ తెలియదు.
 
వారి మనుగడ జనన మరణాల మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది ఈ రోజున.
 నేను చేతులూ, ముఖమూ కడుక్కుని, థియేటర్‌లో నా రూమ్‌కి వచ్చి టేబుల్ మీద మంచినీళ్లు తాగుతూంటే నా మనోఫలకం మీద...
 బంగారు మేని ఛాయలో గాయత్రి గులాబి రంగు చీర కట్టుకుని వేదికపై వేణుగానం చేస్తూ ఆడిటోరియంలోని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న దృశ్యం...
 ఎర్రని పట్టుచీర కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆడిటోరియంలో ఆపదమొక్కులవాని భక్తిగీతాలు ఆలపిస్తోన్న గాయత్రి ముగ్ధమోహన రూపం...

 లేత నీలం రంగు వాయిల్‌చీర మీద తెల్లని కోటు ధరించి, మెడలో స్టెత్‌తో చిరునవ్వులు చిందిస్తూ చురుకుగా పేషెంట్స్ అందరినీ విశదంగా పరీక్షిస్తూ, వారందరికీ భుజం తట్టి ధైర్యం చెబుతున్న గాయత్రి నా కళ్ల ముందు కనిపిస్తోంది. నా మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది.
 ఆలోచనల్లో ఉన్న నాకు మరో గుండె ఆపరేషన్‌కు పిలుపు వచ్చింది.
 
 
ఇటలీలో 999 మంది హృద్రోగులను డాక్టర్లు నియమిత కాలంలో పరీక్షించారుట. హాస్పటల్‌లో చేరిన తరువాత వారి హృదయ స్పందన మామూలుగా ఆరోగ్యంగా మారడం ఆశ్చర్యంతో గమనించి వారిని ప్రశ్నించగా, ‘‘నేను రోజూ దేముణ్ని ప్రార్థిస్తాను, నా గుండెను దేముడే రక్షిస్తున్నాడు’’  అన్నారుట వాళ్లందరూ. అదే సమయంలో దేముడంటే విశ్వాసం లేని వారి గుండెజబ్బు త్వరగా నయం కాకపోవడం కూడా డాక్టర్లు నిశితంగా గమనించారట. అందుకే ఎన్ని రకాలుగా దైవాన్ని పూజించినా ఎవరికి అభ్యంతరం ఉంటుంది?
- కె.బి.కృష్ణ (కాకరపర్తి భగవాన్ కృష్ణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement