Special Branch Police
-
జైలుకెళ్లినా బుద్ధి మారలే.. సహజీవనం చేయాలని కానిస్టేబుల్ ఒత్తిడి
సాక్షి, రంగారెడ్డి: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు గతంలో మాదన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. వెంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించింది. అయినా వినకుండా మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు 25 జనవరి, 2021 రోజున సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వెంకటేశ్వర్లు బుద్ధి మార్చుకోకుండా మహిళను వేధించడంతో పాటు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఎంతకీ అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో 2021, మే నెలలో వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ సమ యంలో సదరు మహిళ ఫోన్ నంబర్‌తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్‌కు, అక్కడి నుంచి మీర్‌పేట సీతాహోమ్స్కు మార్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం మహిళ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనం చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేసి, వీడియోలు ఫొటోలు తీశాడు. ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పదజాలంతో దూషిస్తూ లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న మీర్పేట్ పోలీసులు వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
పంద్రాగస్ట్ ముందు ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం
సాక్షి, న్యూఢిల్లీ: పంద్రాగస్ట్ వేడుకలకు ముందు ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలజడి సృష్టించాలని భావించిన దుండగుల ప్రయత్నాన్ని భద్రతా దళాలు చేధించాయి. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దుండగుల వద్ద నుంచి 55 పిస్టల్స్, 50 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎర్రకోట వైపు వెళ్లే దారులను పూర్తిగా మూసివేశారు. ఆ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
డ్రోన్లు ఎగరాలంటే ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంపై డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ వాటి ముప్పు గురించిన చర్చ మొదలైంది. అయితే, డ్రోన్ల వల్ల తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ముందే పసిగట్టిన మన రాష్ట్ర పోలీసులు వాటికి విరుగుడుగా గత ఏడాది గరుడదళం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ దళం ఉనికి, పనితీరు గురించిన పురోగతిని ఇంతవరకూ పోలీసు శాఖ వెల్లడించకపోవడం గమనార్హం. ప్రధానంగా మావోయిస్టులను కట్టడి చేయడమే ధ్యేయంగా ఈ గరుడదళానికి పురుడుపోశారు. ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్రల నుంచి మావోలు అప్పుడప్పుడూ రాష్ట్రంలోకి ప్రవేశించేవారు. డ్రోన్ల సాయంతో కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి–ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో తక్కువ ఎత్తులో ఎగిరే అనుమానాస్పద డ్రోన్లను పట్టుకునేందుకు ‘‘గరుడస్క్వాడ్’’పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయా లని 2020 ఆగస్టులో పోలీసు శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని గద్దలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇద్దరు శిక్షకులను కూడా నియమించింది. ఈ శిక్షణ 2021 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఆ తరువాత అవి విధుల్లో చేరతాయని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది జూలై వచ్చినా వీటి గురించి ఎలాంటి సమాచారం లేదు. జిల్లాల్లో ఇష్టానుసారంగా.. జిల్లాల్లో కొందరు ఫొటో, వీడియోగ్రాఫర్లు ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం డ్రోన్లను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. కొందరు అర కిలోమీటరు ఎత్తు వరకు ఎగిరే డ్రోన్లను కిరాయికి తీసుకు వస్తున్నారు. మరికొందరు నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లు, బారసాలలు, జాతరలు, ర్యాలీలు, ఉత్సవాలు, రాజకీయనేతల సభలు, సమావేశాల్లో వీటిని ఎడాపెడా వాడుతున్నారు. ముఖ్యంగా వీఐపీల నివాసాలు, సాగునీటి ప్రాజెక్టుల సమీపంలో ఎగరేస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ డ్రోన్లు దాదాపు 500 గ్రాముల బరువును మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటాయి. 90 శాతం డ్రోన్లకు అనుమతుల్లేవు.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల వివరాలు సేకరిస్తోంది. అధికారిక కార్యక్రమాలు మినహా ప్రైవేట్ కార్యక్రమాలలో వినియోగించే డ్రోన్లపై దృష్టి సారించింది. ఎక్కడైనా డ్రోన్లను ఎగరేయాలనుకుంటే ముందుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల అనుమతి తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 నుంచి 2,000 వరకు డ్రోన్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. గ్రేటర్ పరిధిలోనే 800లకుపైగా ఉన్నట్టు సమాచారం. సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం... వీటిలో 90 శాతం డ్రోన్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అని 2014లోనే కేంద్రం హెచ్చరించింది. నెదర్లాండ్స్ స్ఫూర్తితో... డ్రోన్లను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ దేశంలోని పోలీసులు గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో వీరిబాటనే పలు దేశాలు అనుసరిస్తున్నాయి. డ్రోన్లతో ఉగ్రముప్పు ఉన్న విషయాన్ని ముందుగానే ఊహించిన తెలంగాణ పోలీసులు ఆ మేరకు గతేడాదే సంసిద్ధులయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్టుల ఆటకట్టించే దిశగా ఎంపిక చేసిన గద్దలకు శిక్షణ ప్రారంభించారు. కానీ, వాటి పురోగతిని మాత్రం తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారు. -
గీత దాటి వ్యవహరిస్తున్నారు- ఆమంచి
సాక్షి, ఒంగోలు: పోలీసు శాఖలోని పలువురు స్పెషల్ బ్రాంచి సిబ్బంది తమది కాని వ్యవహారాల్లో సైతం తలదూర్చడంతో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ చాంబర్లో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వడంతో పాటు రాతపూర్వకంగా ఎస్బీ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ బ్రాంచి సిబ్బంది అంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కళ్లు, చెవులు, ముక్కు వంటి వారన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో పనిచేస్తున్న వారు గీత దాటి మరీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన వ్యక్తులు నేటికీ ఎస్బీలో కొనసాగుతూ ప్రభుత్వంపై తప్పుడు తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అప్పటి ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ జిల్లాలో అరాచకంగా వ్యవహరించినందునే ఆయన్ను బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన టీడీపీకి తొత్తుగా పనిచేశారని, ప్రభుత్వం మారినా ఇంకా ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన సిబ్బందే ఆ వ్యవస్థలో కొనసాగుతుండటం అభ్యంతరకరమన్నారు. ఇటీవల తిమ్మసముద్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తే దాన్ని తప్పుడు పద్ధతిలో ఎస్బీ సిబ్బంది రిపోర్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చీరాల ఏరియా వైద్యశాలలో వైఎస్సార్ సీపీ నాయకులు చికిత్స పొందుతూనే ఉన్నారన్నారు. ఎస్బీ డీఎస్పీ రాంబాబు, సీఐ కె.వెంకటేశ్వరరావు, మరికొంతమంది సిబ్బంది వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మంత్రి లెటర్ హెడ్లపై దుష్ప్రచారం ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతో కూడిన లెటర్ హెడ్లు ఫోర్జరీ అయ్యాయంటూ నానా యాగీ చేసిందీ ఎస్బీ సిబ్బందేనని ఆమంచి గుర్తు చేశారు. ఫోర్జరీ అయితే మంత్రి ఫిర్యాదు చేయాలని, అంతే తప్ప కలర్ జిరాక్స్‌లపై ఫోర్జరీ సంతకాలంటూ దుష్ప్రచారం చేసిన వారిలో ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన బ్రిగేడ్‌లే ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లల్లో సాక్షాత్తు స్పెషల్ బ్రాంచి సిబ్బంది తనిఖీల పేరుతో సృష్టించిన హంగామాపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని ఆమంచి వివరించారు. తాను స్పెషల్ బ్రాంచి వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడం లేదని, అదే విధంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పు పట్టడం లేదన్నారు. కేవలం కొంతమంది స్పెషల్ బ్రాంచిలో చేస్తున్న కుట్రపూరిత మోసాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని, తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ బాగా పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న స్టీఫెన్ రవీంద్ర, డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లనున్నట్లు ఆమంచి పేర్కొన్నారు. ఆమంచి వెంట వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, కర్నేటి రవికుమార్, తులసి, మునగపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు
విజయనగరం టౌన్: స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం వారు ఎస్పీ జి.పాలరాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఖైనీ, గుట్కా, పశువుల అక్రమ రవాణాదారులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఎస్పీ సోమవారం వివరాలు వెల్లడించారు. దాడుల్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ సురేంద్రనాయుడు, కౌంటర్ ఇంటలిజెన్స్ ఏఎస్ఐ జోగారావు, జానీ, హుస్సేన్, శ్రీను, రాజశేఖర్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. దాడుల వివరాలు.. ► స్పెషల్ బ్రాంచ్ ప్రత్యేక విభాగం ఆదివారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో రెండు టాటా గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్న 27 పశువుల మాంసాన్ని పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు. ►నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామంలో ఖైనీ, గుట్కా, సిగిరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న నాగుల భాస్కరారవును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆయన నుంచి రూ.5 లక్షల విలువైన నిషేధిత సరుకును స్వాధీనం చేసుకుని, నెల్లిమర్ల పోలీసులకు అప్పగించారు. ► పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.60 వేల విలువైన ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పేర్ల త్రినాధ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. ► పట్టణంలోని పుచ్చలవీధిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి పతివాడ పైడిరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, రూ.10 వేల విలువైన ఖైనీ,గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ని టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ► జామి మండలం అలమండ సంత సమీపంలో ఏపీ 24 టీసీ 4918 వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 12 ఆవులను, ఆరు లేగ దూడలను స్వాధీనం చేసుకుని, తెలంగాణలోని భువనగిరికి చెందిన బండ శ్రీధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని జామి పోలీసులకు అప్పగించారు. ► పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్వతీపురం, కొమరాడ మండలంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, 11 మందిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్వతీపురం రూరల్ పోలీసులకు వారిని అప్పగించారు. -
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండల పరిధిలోని వాగేటికోనలో స్పెషల్ పార్టీ పోలీసులు ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ(ఆపరేషన్స్) సత్య ఏసుబాబు తెలిపారు. స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంప్ బయటపడిందన్నారు. ఈ డంప్‌లో దాదాపు రూ. 2 కోట్ల రూపాయల విలువైన, మూడు టన్నుల బరువున్న 87 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాగేటికోన, కంజిమడుగు ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. -
నకిలీ ఫర్నీస్ ఆయిల్ గుట్టురట్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కొంతకాలంగా కొనసాగుతున్న నకిలీ ఫర్నీస్ ఆయిల్ గుట్టురట్టైంది. వివరాలు...వరదయ్యపాల్యం మండలం రాచర్లలో లక్ష లీటర్ల ఫర్నీస్ ఆయిల్ తయారుచేస్తున్న ఐదు మంది నిందితులను చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారికి సంబంధించిన రెండు లారీలు, ఐదు ట్యాంకర్లను సీజ్ చేశారు. -
స్పెషల్ వసూళ్లు !
స్పెషల్‌బ్రాంచ్ పోలీస్...ఈ పేరు చెప్పగానే అసాంఘిక శక్తుల వెన్నులో వణుకుపుడుతుంది. తప్పు చేసేవారెవరైనా వీరి నుంచి తప్పించుకోలేరనే పేరుంది. అయితే వారే దారి తప్పుతున్నారు. పాస్‌పోర్టు జారీ చేసే ముందు జరిపే పరిశీలన జరిపి, ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తన విషయంలో విచారణ రిపోర్ట్ వారికి అనుకూలంగా ఇచ్చేందుకు కొంతమంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో ఆ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ఓ మంత్రి బంధువు, మాజీ ఐజీ మేనల్లుడి పాస్‌పోర్ట్ ఇటీవల పోయిం ది. తెలిస్తే తిడతారని ఇంట్లో వాళ్లకు తెలియకుండా కొత్తగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సత్వరం పరిశీలన జరిపి పాస్‌పోర్ట్ వేగంగా వచ్చేలా చూడాలని స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలోని ఒకాయన్ని కలిశారు. రూ.5 వేలు ఇస్తే మొత్తం చూసుకుంటానని చెప్పి తీసుకున్నారని తెలిసింది. అనుకున్నట్టే కార్యాలయ ప్రక్రియ అంతా పూర్తి చేశారు.పరిశీలనకు విజయనగరం టౌన్‌లోని ఒక జోన్ స్పెషల్ బ్రాంచి సిబ్బందికి అప్పగించారు. డబ్బులిచ్చారన్న విషయం తెలియకో, లాలూచీకి ఇష్టపడకో విచారణలో సానుకూలంగా స్పందిం చలేదు. దీంతో ఆలస్యం చోటు చేసుకుంది. ఇదేంటని డబ్బులు తీసుకున్న వ్యక్తిని దరఖాస్తుదారుడు సంప్రదించాడు. వెంటనే అప్రమత్తమైన ఆ ఉద్యోగి మళ్లీ ప్రక్రియ ప్రారంభించాడు. శ్రద్ధ తీసుకుని పరిశీలన తతంగాన్ని చేయించాడు. ఈ క్రమంలో పరిశీలనకెళ్లిన ఉద్యోగి ఆ రిటైర్డు ఐజీని కలిసాడు. అదేంటి మా మేనల్లుడికి ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉందని మళ్లీ పరిశీలన ఏంటని ఆరాతీయగా పాత పాస్ పోర్ట్ పోవడంతో కొత్త దానికి దరఖాస్తు చేసుకున్నారని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చారు. దీంతో మేనల్లుడ్ని పిలిచి అడిగేసరికి మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. పోలీసు శాఖలో పనిచేసిన తమ నుంచే రూ.5వేలు తీసుకున్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చని సన్నిహితుల వద్ద ఆ మాజీ ఐజీ చెప్పుకుని బాధపడినట్టు తెలిసింది. పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేసి ఉద్యోగవిరమణ చేసిన ఒకాయన తన కుమారుడు పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆశ్రయిం చాడు. ఆయనతో కూడా ఓ ఉద్యోగి ఒప్పందానికి దిగాడు. రూ.1500తో అయిపోవల్సిన రెన్యువల్‌కు రూ.3వేలు తీసుకున్నారని తెలిసింది. పోలీసు శాఖలో పనిచేసినోళ్లనే వదల్ని వీరు సామాన్యుల్ని ఇంకెంత పీడించేస్తున్నారోనని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. ఒక్క పాస్‌పోర్ట్ విషయంలోనే కాదు కొత్తగా ఉద్యోగాలు వచ్చే వారిపై పరిశీలన సమయంలో కూడా వేలాది రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అన్ని విభాగాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు వీరి విషయంలో ఉదాసీనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగాలకనో, చదువులకనో విదేశాలకు వెళ్లవలసి వస్తే పాస్‌పోర్ట్ తప్పనిసరి. దీంతో పాస్‌పోర్ట్‌కు డిమాండ్ పెరిగింది. పాస్‌పోర్ట్‌ల జారీ కార్యాలయం విశాఖలో ఉన్నప్పటికీ వాటి కోసం చేసిన దరఖాస్తులపై విజయనగరం జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిశీలన చేయాల్సి ఉంది. పరిశీలన చేసి, నివేదిక ఇస్తే తప్ప అధికారులు పాస్‌పోర్ట్ జారీ చేయరు. అలాగే రెన్యువల్ కూడా చేయ రు. దీన్ని అవకాశంగా తీసుకుని విచారణ కెళ్లిన పలువురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, జిల్లా కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఇలా నెలకి రూ.60వేల నుంచి రూ.70వేలు సంపాదిస్తున్నారని సమాచారం. పాస్‌పోర్ట్‌లు, ఉద్యోగాల విచారణ, ప్రత్యేక నిఘా కోసం స్పెషల్ బ్రాంచ్ విభాగం ఒకటి ఉంది. దీని పరిధిలో జిల్లా వ్యాప్తంగా జోన్లు ఉన్నాయి. సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ తదితర హోదాల గల 40మంది ఈ జోన్లలో విధులు నిర్వహిస్తున్నారు. తమ నిఘా కార్యకలాపాలతో పాటు పాస్‌పోర్టు దరఖాస్తుదారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వవల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నీ పక్కాగా ఉన్నాయా ? లేదా?, స్థానికంగా ఉన్నారా? లేదా?, అభ్యంతరాలేమైనా ఉన్నాయా? అన్న దానిపై నివేదిక నివ్వాల్సి ఉంది. అలాగే, కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిపై కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలి. వారి ప్రవర్తనా శైలి, వాస్తవ పరిస్థితులు, కేసులు, ఇతరత్రా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిపై నివేదికలో పొందుపరచాలి. అయితే విచారణకొచ్చేసరికి పలువురు చేతులుచాపుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం ఉద్యోగి ఒకరు ఈ విషయంలో కాస్త ముందంజలో ఉండగా, పార్వతీపురం, విజయనగరం టౌన్‌లోని ఒక జోన్, కొత్తవలస, భోగాపురం, బొబ్బిలి, ఎస్‌కోట జోన్లలో ఈ తరహా సంస్కృతి ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అటు పాస్‌పోర్ట్, ఇటు ఉద్యోగుల పరిశీలన చేసినప్పుడు రూ.వెయ్యి నుంచి ఏడు వేలు వరకు వసూలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రి పెడుతున్నారని తెలిసింది. దీంతో ఎందుకొచ్చిందన్న భయంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు,కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు తప్పని పరిస్థితుల్లో ముట్టజెబుతున్నారు.