స్పెషల్ వసూళ్లు ! | Special collections on Minister relative | Sakshi
Sakshi News home page

స్పెషల్ వసూళ్లు !

Published Mon, Oct 27 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

స్పెషల్ వసూళ్లు !

స్పెషల్ వసూళ్లు !

స్పెషల్‌బ్రాంచ్ పోలీస్...ఈ పేరు చెప్పగానే అసాంఘిక శక్తుల వెన్నులో వణుకుపుడుతుంది. తప్పు చేసేవారెవరైనా వీరి నుంచి తప్పించుకోలేరనే పేరుంది. అయితే వారే దారి తప్పుతున్నారు. పాస్‌పోర్టు జారీ చేసే ముందు జరిపే పరిశీలన జరిపి, ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తన విషయంలో విచారణ రిపోర్ట్ వారికి అనుకూలంగా ఇచ్చేందుకు కొంతమంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో ఆ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ఓ మంత్రి బంధువు, మాజీ ఐజీ మేనల్లుడి పాస్‌పోర్ట్ ఇటీవల పోయిం ది.  తెలిస్తే తిడతారని ఇంట్లో వాళ్లకు తెలియకుండా కొత్తగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సత్వరం పరిశీలన జరిపి పాస్‌పోర్ట్ వేగంగా వచ్చేలా చూడాలని స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలోని ఒకాయన్ని కలిశారు. రూ.5 వేలు ఇస్తే మొత్తం చూసుకుంటానని చెప్పి తీసుకున్నారని తెలిసింది. అనుకున్నట్టే కార్యాలయ ప్రక్రియ అంతా పూర్తి చేశారు.పరిశీలనకు విజయనగరం టౌన్‌లోని ఒక జోన్ స్పెషల్ బ్రాంచి సిబ్బందికి అప్పగించారు. డబ్బులిచ్చారన్న విషయం తెలియకో, లాలూచీకి ఇష్టపడకో విచారణలో  సానుకూలంగా స్పందిం చలేదు. దీంతో ఆలస్యం చోటు చేసుకుంది. ఇదేంటని డబ్బులు తీసుకున్న వ్యక్తిని దరఖాస్తుదారుడు సంప్రదించాడు. వెంటనే అప్రమత్తమైన ఆ ఉద్యోగి మళ్లీ ప్రక్రియ ప్రారంభించాడు. శ్రద్ధ తీసుకుని పరిశీలన తతంగాన్ని చేయించాడు. ఈ క్రమంలో పరిశీలనకెళ్లిన ఉద్యోగి ఆ రిటైర్డు ఐజీని కలిసాడు. అదేంటి మా మేనల్లుడికి ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉందని  మళ్లీ పరిశీలన ఏంటని ఆరాతీయగా పాత పాస్ పోర్ట్ పోవడంతో కొత్త దానికి దరఖాస్తు చేసుకున్నారని సదరు ఉద్యోగి చెప్పుకొచ్చారు. దీంతో మేనల్లుడ్ని  పిలిచి అడిగేసరికి మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. పోలీసు శాఖలో పనిచేసిన తమ నుంచే రూ.5వేలు తీసుకున్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చని సన్నిహితుల వద్ద ఆ మాజీ ఐజీ చెప్పుకుని బాధపడినట్టు తెలిసింది.
 
  పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా పనిచేసి ఉద్యోగవిరమణ చేసిన ఒకాయన తన కుమారుడు  పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆశ్రయిం చాడు. ఆయనతో కూడా ఓ ఉద్యోగి ఒప్పందానికి దిగాడు. రూ.1500తో అయిపోవల్సిన రెన్యువల్‌కు రూ.3వేలు తీసుకున్నారని తెలిసింది. పోలీసు శాఖలో పనిచేసినోళ్లనే వదల్ని వీరు సామాన్యుల్ని ఇంకెంత పీడించేస్తున్నారోనని ఆయన  సన్నిహితుల వద్ద వాపోయారు. ఒక్క పాస్‌పోర్ట్ విషయంలోనే కాదు కొత్తగా ఉద్యోగాలు వచ్చే వారిపై పరిశీలన సమయంలో కూడా వేలాది రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అన్ని విభాగాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు వీరి విషయంలో ఉదాసీనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది.
 
 ఉద్యోగాలకనో, చదువులకనో విదేశాలకు వెళ్లవలసి వస్తే పాస్‌పోర్ట్ తప్పనిసరి. దీంతో  పాస్‌పోర్ట్‌కు డిమాండ్ పెరిగింది. పాస్‌పోర్ట్‌ల జారీ కార్యాలయం విశాఖలో ఉన్నప్పటికీ వాటి కోసం చేసిన దరఖాస్తులపై విజయనగరం జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిశీలన చేయాల్సి ఉంది. పరిశీలన చేసి, నివేదిక ఇస్తే తప్ప  అధికారులు పాస్‌పోర్ట్ జారీ చేయరు. అలాగే రెన్యువల్ కూడా చేయ రు.  దీన్ని అవకాశంగా తీసుకుని విచారణ కెళ్లిన పలువురు హెడ్‌కానిస్టేబుళ్లు,  ఏఎస్‌ఐలు, జిల్లా కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఇలా  నెలకి రూ.60వేల నుంచి రూ.70వేలు సంపాదిస్తున్నారని సమాచారం.    
 
 పాస్‌పోర్ట్‌లు, ఉద్యోగాల విచారణ, ప్రత్యేక నిఘా కోసం స్పెషల్ బ్రాంచ్ విభాగం ఒకటి ఉంది. దీని పరిధిలో జిల్లా వ్యాప్తంగా జోన్‌లు ఉన్నాయి. సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ తదితర హోదాల గల 40మంది ఈ జోన్‌లలో విధులు నిర్వహిస్తున్నారు. తమ నిఘా కార్యకలాపాలతో పాటు పాస్‌పోర్టు దరఖాస్తుదారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వవల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నీ పక్కాగా ఉన్నాయా ? లేదా?, స్థానికంగా ఉన్నారా? లేదా?, అభ్యంతరాలేమైనా ఉన్నాయా? అన్న దానిపై నివేదిక నివ్వాల్సి ఉంది. అలాగే, కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిపై కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలి. వారి ప్రవర్తనా శైలి, వాస్తవ పరిస్థితులు,  కేసులు, ఇతరత్రా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిపై నివేదికలో పొందుపరచాలి.
 
 అయితే  విచారణకొచ్చేసరికి పలువురు చేతులుచాపుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం ఉద్యోగి ఒకరు ఈ విషయంలో కాస్త ముందంజలో ఉండగా, పార్వతీపురం, విజయనగరం టౌన్‌లోని ఒక జోన్,  కొత్తవలస, భోగాపురం, బొబ్బిలి, ఎస్‌కోట జోన్‌లలో ఈ తరహా సంస్కృతి ఎక్కువగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అటు పాస్‌పోర్ట్, ఇటు ఉద్యోగుల పరిశీలన చేసినప్పుడు రూ.వెయ్యి నుంచి ఏడు వేలు వరకు వసూలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రి పెడుతున్నారని తెలిసింది. దీంతో ఎందుకొచ్చిందన్న  భయంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు,కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు తప్పని పరిస్థితుల్లో ముట్టజెబుతున్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement