గీత దాటి వ్యవహరిస్తున్నారు- ఆమంచి | Former MLA of Cheerala YSRCP Incharge Of The Constituency Amanchi Krishnamohan Has Lashed Out At Several Special Branch Officials Of The Police Department For Making False Reports | Sakshi
Sakshi News home page

గీత దాటి వ్యవహరిస్తున్నారు- ఆమంచి

Published Sat, Aug 3 2019 11:40 AM | Last Updated on Sat, Aug 3 2019 11:40 AM

Former MLA of Cheerala YSRCP Incharge Of The Constituency Amanchi Krishnamohan Has Lashed Out At Several Special Branch Officials Of The Police Department For Making False Reports - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌  

సాక్షి, ఒంగోలు: పోలీసు శాఖలోని పలువురు స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది తమది కాని వ్యవహారాల్లో సైతం తలదూర్చడంతో పాటు ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్‌ చాంబర్‌లో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వడంతో పాటు రాతపూర్వకంగా ఎస్‌బీ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది అంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కళ్లు, చెవులు, ముక్కు వంటి వారన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో పనిచేస్తున్న వారు గీత దాటి మరీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన వ్యక్తులు నేటికీ ఎస్‌బీలో కొనసాగుతూ ప్రభుత్వంపై తప్పుడు తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో అప్పటి ఎస్పీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ జిల్లాలో అరాచకంగా వ్యవహరించినందునే ఆయన్ను బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్‌ తప్పించిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన టీడీపీకి తొత్తుగా పనిచేశారని, ప్రభుత్వం మారినా ఇంకా ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన సిబ్బందే ఆ వ్యవస్థలో కొనసాగుతుండటం అభ్యంతరకరమన్నారు. ఇటీవల తిమ్మసముద్రంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తే దాన్ని తప్పుడు పద్ధతిలో ఎస్‌బీ సిబ్బంది రిపోర్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చీరాల ఏరియా వైద్యశాలలో వైఎస్సార్‌ సీపీ నాయకులు చికిత్స పొందుతూనే ఉన్నారన్నారు. ఎస్‌బీ డీఎస్పీ రాంబాబు, సీఐ కె.వెంకటేశ్వరరావు, మరికొంతమంది సిబ్బంది వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 

మంత్రి లెటర్‌ హెడ్లపై దుష్ప్రచారం
ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతో కూడిన లెటర్‌ హెడ్లు ఫోర్జరీ అయ్యాయంటూ నానా యాగీ చేసిందీ ఎస్‌బీ సిబ్బందేనని ఆమంచి గుర్తు చేశారు. ఫోర్జరీ అయితే మంత్రి ఫిర్యాదు చేయాలని, అంతే తప్ప కలర్‌ జిరాక్స్‌లపై ఫోర్జరీ సంతకాలంటూ దుష్ప్రచారం చేసిన వారిలో ఏబీ వెంకటేశ్వరరావు తయారు చేసిన బ్రిగేడ్‌లే ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నాయకుల ఇళ్లల్లో సాక్షాత్తు స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది తనిఖీల పేరుతో సృష్టించిన హంగామాపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని ఆమంచి వివరించారు. తాను స్పెషల్‌ బ్రాంచి వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడం లేదని, అదే విధంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పు పట్టడం లేదన్నారు. కేవలం కొంతమంది స్పెషల్‌ బ్రాంచిలో చేస్తున్న కుట్రపూరిత మోసాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని, తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ బాగా పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇంటెలిజెన్స్‌ ఐజీగా బాధ్యతలు స్వీకరించనున్న స్టీఫెన్‌ రవీంద్ర, డీజీపీ గౌతం సవాంగ్‌ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లనున్నట్లు ఆమంచి పేర్కొన్నారు. ఆమంచి వెంట వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, కర్నేటి రవికుమార్, తులసి, మునగపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement