లాలూచీపై పోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : చంద్రబాబు దగా.... మోసం. ‘ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే ముఖ్యమని 2016 అక్టోబర్ 24న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 2017 టీడీపీ మహానాడులో హోదా వద్దని ప్యాకేజీ కావాలంటూ తీర్మానం చేశారు. అదే ఏడాది మార్చి 16న ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ కూడా పెట్టారు.’
♦ కేంద్ర రైల్వే శాఖామంత్రి పీయూష్‌గోయల్ నాడు చంద్రబాబు రాసిన లేఖలు మంగళవారం విడుదల చేయడంతో సీఎం బండారం బయటపడింది.
♦ ‘హోదా ఏమైనా సంజీవనా....ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగింది...ప్రజలను మభ్యపెట్టొద్దు...హోదా కోసం రోడ్డెక్కితే జైలుకు పంపిస్తా.’’ బీజేపీతో అంటకాగినంతకాలం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం.. ఈయన గారి అవినీతి వ్యవహారం తెలిశాక ఎప్పటికప్పుడు విడుదల చేసిన నిధులకు లెక్కలు అడగడంతో కేంద్రంతో తెగదెంపులు చేసుకుని ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ బొంకడంలో దిట్ట అయిన చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రత్యేక హోదా కోసం తానే పోరాడుతున్నట్టుగా ఊదరగొట్టడమే కాకుండా ప్రభుత్వ నిధులతో ధర్మపోరాటాల దీక్షల పేరుతో అబద్ధాలు వల్లించారు. మాయమాటలు చెప్పుకుని పబ్బం గడిపేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఉద్దేశంతో కుట్ర రాజకీయాలకు తెరలేపారు. చెప్పిన అబద్ధమే మళ్లీ మళ్లీ చెప్పి అదే నిజమనిపించే యత్నం చేశారు.
వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరు
అదే ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. ఐదేళ్లుగా ప్రత్యేక హోదా మరుగున పడకుండా అవిశ్రాంత పోరు చేశారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా హోదాయే ఊపిరిగా ఉద్యమాలు చేస్తూనే వచ్చారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిని నిర్వహించారు. మన జిల్లాలోనైతే రెండు సార్లు పర్యటించి హోదా ఆవశ్యకతను ఎలుగెత్తి్త చాటారు. 2016 జనవరి 27న కాకినాడలోని అంబేద్కర్ భవన్లో యువభేరి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయ్యారు. అదే ఏడాది మే 10వ తేదీన హోదా కోసం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. ఇక, ఐదేళ్లుగా ధర్నాలు, బంద్‌లు, రాస్తారోకో తదితర నిరసనలతో హోదా డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లారు. హోదా కోసం ఎంపీ పదవులను సైతం వైఎస్సార్సీపీ నేతలు త్యాగం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన లోక్‌సభ సభ్యులంతా రాజీనామా చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ ఆమరణ నిరాహార దీక్షలకు సైతం ఉపక్రమించారు. అంతటితో ఆగలేదు.
కాకినాడ వేదికగా మూడో పోరు
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేసిన వంచనలపై వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున గర్జన సభలు నిర్వహించింది. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల తర్వాత కాకినాడ వేదికగా నవంబర్ 30న వంచనపై గర్జన సభలు నిర్వహించింది.
విభజనతో వచ్చే ప్రయోజనాలివీ..
విభజనతో అన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయింది. తల లేని మొండెంలా మిగిలిపోయింది. నిరుద్యోగం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు నిస్తేజంలోకి వెళ్లిపోయాయి. దాదాపు అన్ని రంగాలు అచేతన స్థితిలో ఉన్నాయి. ఆదుకోవల్సిన కేంద్రప్రభుత్వం మొండి చేయి చూపింది. పోరాడాల్సిన రాష్ట్రప్రభుత్వం రోజుకొక వైఖరితో ప్రజలతో ఆటాడుకుంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని. హోదా వస్తేనే జిల్లాకు మేలు జరగనుంది. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం గ్రాంటుతో కేంద్ర నిధులు పోటెత్తుతాయి. పారిశ్రామిక ప్యాకేజీలు, రాయితీలు రావడంతో పరిశ్రమలు వెల్లువెత్తుతాయి. హోదాతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జిల్లా ప్రగతి సాధించనుంది. ముఖ్యంగా జిల్లాను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య తీరనుంది. ప్రత్యేక రాయితీలొస్తే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపితేనే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీనికోసం రాష్ట్రప్రభుత్వం పోరాడకుండా యువత భవిష్యత్‌ను పణంగా పెట్టి, స్వార్థపూరిత రాజకీయాలు చేసింది.
ప్రత్యేక హోదా రాకపోతే.. కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు పెద్దాపురం, సామర్లకోట, రాజానగరం వంటి ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసింది. కానీ, వీటిలో ఆశించిన స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. జిల్లాలో 2360 చిన్నతరహా పరిశ్రమల్లో 18,568 మంది, 108 మధ్య, భారీ పరిశ్రమల్లో 57,848 మంది పనిచేస్తున్నట్టుగా రికార్డుల్లో కన్పిస్తున్నాయి. కానీ వీటిలో చాలా వరకు మూతపడ్డాయి. వీటిలో ముఖ్యంగా కడియంలో మూడు పవర్ ప్లాంట్లు మూతపడి ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం కాకినాడ తీరాన ఏర్పాటైన కోరమండల్, నాగార్జున ఫెర్టిలైజర్స్ తప్ప మరే పెద్ద పరిశ్రమ రాలేదు. వాకలపూడిని ఆనుకుని పరిశ్రమలున్నా అవి అంత పెద్దవి కావు. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని (కేఎస్ఈజెడ్)ను 2008లో ఏర్పాటు చేసింది. కొత్తపల్లి మండలం నుంచి తొండంగి మండలం వరకు తీరాన్ని ఆనుకుని సుమారు 20 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. 5500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ రెండు పరిశ్రమలే ఏర్పాటయ్యాయి. పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంతా ఆశించారు. ప్రత్యేక హోదా రాకపోవడంతో ఆశించిన వారందరికీ నిరాశే ఎదురైంది. ప్రత్యేక హోదా వచ్చినట్టయితే ప్రత్యేక రాయితీల కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉండేది.
అమలుకు నోచుకోని విభజన చట్టం హామీలు..
కాకినాడ తీరంలో యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు ఉన్న నేపథ్యంలో హోదా వస్తే జిల్లాలో ఎక్కువగా పారిశ్రామిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తే కార్గో హ్యాండ్లింగ్ మూడు రెట్లు పెరగడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ ప్రత్యేక రాయితీల్లేక అవేవి రావడం లేదు. ఇక్కడి తీరంలో పెట్రోకారిడార్, హార్డ్‌వేర్, హార్టికల్చర్ ఉత్పత్తులు, కోకోనట్ పీచు పరిశ్రమలు వంటి వాటితో కోస్టల్ కారిడార్ చేస్తామని ఊదరగొట్టారే తప్ప అచరణకు నోచుకోలేదు. ఇక, విభజన చట్టంలో పేర్కొన్న పెట్రో యూనివర్సిటీ , ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, లాజిస్టిక్ వర్సిటీ, ఇండస్ట్రియల్ పార్క్ తదితర ప్రాజెక్టులు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీనికంతటికీ హోదా లేకపోవడమే కారణం.
సన్నగిల్లిన వ్యవ‘సాయం’
హోదా రాకపోవడంతో వ్యవసాయానికి ప్రోత్సాహం కొరవడింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి, ఆ రంగానికి సాంకేతిక సాయం అందించేందుకు వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప అమలు జరగలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఊసేలేదు. విదేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులకు సైతం పరిశ్రమలు పెడతామన్నారు. అవీ లేవు. రాజమహేంద్రవరం సమీపంలో రూ.300 కోట్లతో కొబ్బరి పార్కు ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకువచ్చాయి. కానీ, ఏర్పాటు కాలేదు. కొబ్బరి సంఘాల ద్వారా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు రాయితీలతో రుణాలిచ్చి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ప్రత్యేక హోదా ఉంటే మరిన్ని రాయితీలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పడేవి. నిరుద్యోగ యువతకు ఉపాధి కలగడంతో పాటు జిల్లాలో దాదాపు 50 వేల మంది కొబ్బరి రైతులకు, వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరికేది. హోదా లేక, రాయితీలు రాక కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. కొబ్బరి ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలేవీ లేవు. కొబ్బరి నీటిని మార్కెట్ చేసేందుకు పెప్సికో ముందుకొచ్చిందని గతంలో చెప్పారు. కానీ ఆచరణలో కన్పించలేదు.
పెరిగిన నిరుద్యోగం
జిల్లాలో 90 వేల మంది నిరుద్యోగులు ఉపాధి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మరో 3 లక్షల వరకు ఉన్నారు. సాంకేతిక విద్య, ఇంజినీరింగ్, డిప్లమో, ఐటీఐ, మెకానిక్ విభాగాల వారికి ఉద్యోగులు వచ్చేది పరిశ్రమలతోనే. కానీ ఆ పరిశ్రమలు మన జిల్లాకు రావడం లేదు. డిగ్రీ, పీజీలకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దగా లేనందున ప్రైవేటు పరిశ్రమలపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. ఉన్నతాభ్యాసం పూర్తి చేసిన వారిలో 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసమైతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి ఉంది. జిల్లాలో 30 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. 100 వరకు ఎలక్ట్రికల్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్, మెకానిక్ తదితర శిక్షణ సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 10 వేల మంది శిక్షణ తీసుకుంటున్నా కానీ, వారికి ఉపాధి దొరకడం లేదు. వాచ్మన్లు, సెక్యూరిటీ గార్డు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు పరిమితమవుతున్నారు.
విభజన హామీలు అమలు చేయాలి
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయవలసిన బాధ్యత పాలకులపై ఉంది. దానినుంచి తప్పించుకోవాలని ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. లేకుంటే పరిశ్రమలు రాక, చదువుకున్న యువత ఉపాధి దొరకక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను సీఎంని చేసి, రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రత్యేక హోదాను సాధించడం తేలికవుతుంది.
– ఎస్.శ్రీరామకృష్ణ, కానవరం, రాజానగరం మండలం
జగన్‌తోనే ప్రత్యేక హోదా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్టు ప్యాకేజీలతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. కేవలం చట్ట సభల ద్వారా సంక్రమించే ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది పోయి, చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. ప్రత్యేక హోదా జగన్మోహన్రెడ్డితోనే వస్తుంది.
– ఆకుమర్తి చిన మాదిగ, రామచంద్రపురం
చెడ్డోళ్లు అయిపోతారా?
టీడీపీ, మరికొన్ని పార్టీలు ప్రత్యేక హోదాను సా«ధిద్దామన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో గెలవడం ఎలా అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నప్పుడు పీఎం నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ సమర్థులని పొగిడారు. ఎన్నికల్లో వారు దూరం కావడంతో ఇప్పుడు ద్రోహులని వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళకు అవసరముకుంటే మంచోళ్ళు, కాదనుకుంటే చెడ్డోళ్ళు అయిపోతారా?
– పట్నాల పట్టాభిరామయ్య, మాచర