మార్చి 15 నుంచి స్మార్ట్ కార్డుల జారీ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి
సాక్షి, ముంబై: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తోన్న ‘స్మార్ట్ కార్డు’లను మార్చి 15 నుంచి జారీచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. బాంద్రాలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కార్యాలయంలో దేశంలోనే మొట్టమొదటి ‘స్పెషల్ కార్పొరేట్ ఆఫీస్’ను గురువారం ఆయన ప్రారంభించారు.
బడా కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, కార్మికులకు శ్రేష్టమైన, సత్వర సేవలను అందించేందుకు ఈ కార్యాలయం దోహదపడనుంది. బాంద్రాలోని ఈ కార్యాలయం పరిధిలోకి 16 కంపెనీలను చేర్చారు. ఆయా కంపెనీల ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్స్‌ను ఈ కార్యాలయం చేపడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమం అనంతరం బండారు దత్తాత్రేయ ‘సాక్షి’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే సంఘటిత కార్మికుల కోసం ‘యూనివర్సల్ అకౌంట్ నెంబరు’ (యూఎఎన్)ను ప్రారంభించినట్టు చెప్పారు. దీంతోపాటు అసంఘటితక కార్మికుల సంక్షేమం కోసం ‘యునివర్సల్ వర్కర్ ఐడెంటిఫికేషన్ నెంబరు’ (యూవీఐఎన్) పేరుతో పిలిచే స్మార్టుకార్డులను రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిని మార్చి 15 నుంచి జారీ చేయాలన్న యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. ఈ కార్డులు జారీ చేసిన అనంతరం కేంద్ర కార్మిక శాఖలోని రూ. 27 వేల కోట్ల నిధులను అన్ని రంగాల కార్మికులకు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
నైపుణ్యం పెంపుదలకు ప్రత్యేక శ్రద్ద...
అసంఘటిత రంగంలో నైపుణ్యంలేని కార్మికుల సంఖ్య అధికంగా ఉందని బండారు దత్తాత్రేయ తెలిపారు. వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు నైపుణ్యం కలిగిన (స్కిల్డ్ వర్కర్లు) కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా భవననిర్మాణ రంగంలో సుమారు 4.70 కోట్ల మంది కార్మికులుండగా వీరిలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే స్కిల్డ్ (నైపుణ్యం) కార్మికులున్నారు. వీరికి శిక్షణనిచ్చి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
నైపుణ్యం పెంపుదల విషయంలో చైనా రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తుండగా, జపాన్ కోటి మందికి శిక్షణనిస్తోందని చెప్పారు. మనదేశంలో గతంలో కేవలం 2.80 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య పది లక్షలకు చేరిందన్నారు. రాబోయే రోజుల్లో జపాన్‌తో సమానంగా కోటి మందికి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
శిక్షణ పొందే సమయంలో అసంఘటిత కార్మికులకు ప్రతి గంటకు రూ. 35 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులు 165 ఉన్నాయని, వీటిలో శిక్షణ పొందేవారికి 50 శాతం ప్రభుత్వం, మిగిలిన సగాన్ని శిక్షణనిచ్చే సంస్థ ద్వారా అందించేందుకు కృషి చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. నైపుణ్యం సంపాదించిన వారికి నెలసరి వేతనం రూ. 15 నుంచి రూ. 18 వేల వరకు వస్తోందని, బీటేక్ చేసిన వారికి కూడా ఇంతే వేతనం వస్తోందని చెప్పారు.