‘ఆక్వా’ అభివృద్ధికి ప్రత్యేక ఫిషరీస్ పాలసీ
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి
సాక్షి, విజయవాడ: ఆక్వాతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఫిషరీస్ పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన ‘భారత్‌లో ఆక్వా హబ్‌గా ఆంధ్రప్రదేశ్’ సదస్సులో మంత్రి మాట్లాడారు. మత్స్యశాఖ ఉత్పత్తులను రూ.23 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెంచేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు.
మత్స్యశాఖ అభివృద్ధికి రూ.187 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. భీమవరం సమీపంలోని తుందుర్రులో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని వివరించారు.