ప్రత్యేక గ్రీవెన్స్‌కు మంగళం
– ‘మీ కోసం’తో పాటే ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్
– మూడు నెలలుగా ఇదే తంతు
అనంతపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి నెలలో ఒక రోజు ప్రత్యేక గ్రీవెన్స్ తప్పని సరిగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు అధికారులు మంగళం పాడారు. మీ కోసం కార్యక్రమంతో పాటుగా నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు సాగుతోంది. తాజాగా ఈ నెల 12న కూడా అదే తరహాలో మీ కోసంతో కలిపి నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందేందుకు నెలలో రెండో గురువారం ఆ వర్గాల కోసం ప్రత్యేక గ్రీవెన్ నిర్వహించే విధానాన్ని గత కలెక్టర్ కోన శశిధర్ అమలులోకి తెచ్చారు. కొద్ది నెలలు సక్రమంగానే సాగింది. అయితే అటు తరువాత ప్రత్యేక గ్రీవెన్స్ ప్రక్రియను నీరుగార్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీ కోసం, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించలేదు. అటు తరువాత ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక గ్రీవెన్స్‌ను మరిచారు..
అయితే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ను మాత్రం నెలలో రెండో గురువారం నిర్వహించడం లేదు. నెలలో ఏదో ఒక సోమవారం మీ కోసం కార్యక్రమంతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్‌ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజున ఇటు సామాన్య ప్రజలు, అటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు హాజరవుతూ తమ సమస్యలను విన్నివించుకుంటున్నారు. రద్దీ ఎక్కువై ఎస్సీ, ఎస్టీలు ప్రత్యేకంగా తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సమయం ఉండడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తే రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ వర్గాల ప్రజలు తమ సమస్యలను అధికారులకు సావధానంగా వివరించి పరిష్కారం పొందేందుకు వీలవుతుంది. ఇదే విషయంపై గతనెల 15న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసంలో జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణికి దళిత సంఘాల నాయకులు పెద్దన్న తదితరులు విన్నవించారు.