హోంగార్డులకు ప్రవర్తనా నియమావళి!
సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్న హోంగార్డులకు సీఎం వరాల జల్లుతో ఉపశమనం లభించింది. అయితే హోంగార్డులకు సంబంధించి ఇప్పటివరకు ప్రవర్తనా నియమావళిగానీ, నిబంధనలు గానీ లేవు. వారు ఏదైనా తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేయడం, ఉద్యోగం నుంచి తొలగించడం వంటివి చేస్తున్నారు. వివరణ కోరడం, విచారణ, ఏవైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టడం వంటివేమీ లేవు. అలాగాకుండా పోలీసు శాఖకు ఉన్నట్టుగానే హోంగార్డులకు కూడా ప్రత్యేకమైన ప్రవర్తనా నియమావళి ఉండేలా.. నిబంధనలు రూపొందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ నిబంధనల ప్రకారమే వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా హోంగార్డులు ఏవైనా తప్పులు/పొరపాట్లు చేస్తే.. ఆ తప్పు స్థాయిని, వారి ఉద్దేశాన్ని గుర్తించి క్రమశిక్షణ చర్యలు చేపడతారు. వేతనాల్లో కోత, మెమో, చార్జి మెమో, మౌఖిక విచారణ, సస్పెన్షన్ తదితర క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందించనున్నారు.
వేతనానికి తగినట్లుగా డ్యూటీ చార్ట్
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్రంలో హోంగార్డులకు జీతాల పెంపు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. హోంగార్డులకు చాలా చోట్ల హాజరు నమోదు వంటివేమీ లేకుండా జీతాల చెల్లింపు, యూనియన్ల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పోలీసు అధికారులు అటాచ్మెంట్ పేరుతో పెద్దగా ఉపయోగం లేని విభాగాల్లో డ్యూటీలు వేయడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేలా హోంగార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. పోలీసుశాఖలోని ఏయే విభాగంలో ఎంత మంది హోంగార్డులు ఉండాలి, వారిలో ఆ విభాగానికి పనికి వచ్చేవారు ఎంతమంది, వారికున్న నైపుణ్యాలేమిటి, టెక్నాలజీ తెలిసి ఉంటే ఆ దిశగా శిక్షణ ఇచ్చి వినియోగించుకోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు ప్రతి హోంగార్డుకు సర్వీస్ రికార్డు సైతం ఉండేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
నియామక విధానంలోనూ మార్పు
ఇప్పటివరకు హోంగార్డుల నియామకానికి ప్రత్యేక నిబంధనలు, విధానాలేమీ లేవు. 2004 నుంచి పరుగు పందెం, ఎత్తు, బరువు, చూపు.. ఇలా పలు అంశాలను పరీక్షించి హోంగార్డులుగా నియమించారు. దానిని మరింత మెరుగుపర్చి కానిస్టేబుల్ నియామకాలకు తగినట్లుగా, హోంగార్డులు భవిష్యత్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా నియామక పద్ధతులు తీసుకురావాలని యోచిస్తున్నారు. వాస్తవానికి గత ఐదేళ్లుగా హోంగార్డుల నియామకం కూడా లేదు. ఇక ముందు హోంగార్డుల నియామకం కోసం.. కానిస్టేబుళ్లకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు, రాతపరీక్ష సైతం నిర్వహించాలని యోచిస్తున్నారు.