Special system
-
ప్రభుత్వ శాఖల్లో న్యాయ వివాదాల సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: వివిధ శాఖల్లో పెరిగిపోతున్న న్యాయ వివాదాలను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం లీగల్ మేనేజ్మెంట్ యూనిట్ (ఎల్ఎంయూ), లీగల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ (ఎల్ఎంవో) పేరుతో రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ లీగల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (ఓఎల్‌సీఎంఎస్) ఏర్పాటు చేసిన తర్వాత నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఆర్థికపరమైనవే. వీటికి న్యాయపరంగా పాటించాల్సిన ప్రోటోకాల్స్, పరిష్కారం తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడం కారణంగా గుర్తించింది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్) లీగల్ మేనేజ్మెంట్ యూనిట్, లీగల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ సహాయం తీసుకోనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎల్ఎంయూ, ఎల్ఎంవో విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఎల్ఎంయూ సీనియర్, జూనియర్ న్యాయ విశ్లేషకులు, పోగ్రామ్ మేనేజర్, డేటా ఎనలటిక్స్ సభ్యులతో లీగల్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఏపీసీఎఫ్ఎస్ఎస్కి గవర్నెన్స్ కన్సల్టెన్సీ వింగ్‌గా పనిచేస్తుంది. వివిధ శాఖల్లో న్యాయపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఓఎల్సీఎంఎస్ను సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. న్యాయ శాఖ అధికారుల సూచనలతో ప్రతి విభాగంలో లిటిగేషన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, టెంప్లెట్స్, అధికారులకు సూచనలు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎల్ఎంయూకు అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అడ్వొకేట్ జనరల్ కో చైర్‌పర్సన్‌గా ఉండే ఈ అడ్వైజరీ కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హోం, పాఠశాల విద్య, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శులు, ఫైనాన్స్, జీఏడీ కార్యదర్శులు, ఓఎల్‌సీఎంఎస్ నోడల్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. న్యాయ శాఖ కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమై అన్ని విభాగాల్లో అమలవుతున్న ప్రాజెక్టులు, వాటి పనితీరు, న్యాయపరమైన ఇబ్బందులు వంటి వాటిని గుర్తించి పరిష్కరించాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా వివిధ శాఖల విభాగాధిపతులతో కూడిన 12 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పర్యవేక్షిస్తుండాలి. ఎల్ఎంవో సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఎల్ఎంయూ సహకారం అందిస్తుంది. న్యాయపరంగా కేసులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, అధికా రులు, ప్రభుత్వ ప్లీడర్లు, ఏజీ కౌన్సిల్ ఆఫీసర్ల సమాచారం త్వరతగతిన చేరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎల్ఎంవోగా ప్ర ముఖ న్యాయసేవల సంస్థ దక్ష సొసైటీ వ్యవహరించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
రైతన్నకు సౌరశక్తి!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న విద్యుత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సౌర విద్యుదుత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఈ దిశగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించే పథకం చిరస్థాయిగా నిలవాలన్నారు. ఐదేళ్ల సబ్సిడీనే పెట్టుబడి.. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటి సామర్థ్యం 120 లక్షల హార్స్పవర్ (హెచ్‌పీ) ఉంటుంది. ఒక హెచ్‌పీకి 1,240 యూనిట్ల విద్యుత్ ఏటా ఖర్చవుతోంది. ఈ లెక్కన ఏటా 13 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వ్యవసాయానికి అవసరమవుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏటా డిస్కమ్‌లకు రూ.8 వేల కోట్ల సబ్సిడీ చెల్లిస్తోంది. ఇలా కాకుండా ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రూ. 32 వేల కోట్లు ఖర్చవుతుంది. ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్‌ను సరఫరా చేయడానికి మరో రూ.4 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లు వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల సబ్సిడీనే పెట్టుబడిగా భావిస్తే ఆ తర్వాత ఉచితంగానే డిస్కమ్‌లకు విద్యుత్ అందినట్టే కదా? అని ముఖ్యమంత్రి జగన్ అధికారులతో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 50 వేల ఎకరాల లభ్యత రాయలసీమలో సౌర విద్యుదుత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని నెడ్‌క్యాప్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భూమి లభ్యత కూడా తగినంత ఉందన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు లెక్కగట్టారు. ప్రకాశం జిల్లాలో 6 వేల ప్రభుత్వ భూమి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైందని తేల్చారు. మిగతా ప్రైవేటు భూమిని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో సేకరించే వీలుందని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. అక్కడ భూమి కూడా చౌకగా లభిస్తుందని చెప్పారు. ఇలా మొత్తం 50 వేల ఎకరాలు సోలార్ ప్లాంట్ల కోసం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు బ్రహ్మంసాగర్, గండి, మైలవరం రిజర్వాయర్లలో నీటిపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించామని జెన్కో అధికారి తెలిపారు. చౌకగా విద్యుత్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే వీలుందని జెన్కో డైరెక్టర్ ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 32 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వ్యవసాయ అవసరాలకు ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడిస్తున్న విద్యుత్ ఖరీదు యూనిట్ రూ. 5.40 వరకు ఉంటోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. సోలార్ విద్యుదుత్పత్తి ధర యూనిట్ రూ. 4.20 మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పారు. పదేళ్లలో పెట్టుబడి మొత్తం రాబట్టే వీలుందని, మరో 15 ఏళ్లు చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అధ్యయనం పూర్తి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్), ఏపీ జెన్కో నివేదిక రూపకల్పనపై కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ రెండు విభాగాలు ఇప్పటికే అనేక ప్రాంతాలను పరిశీలించి సానుకూల అంశాలను గుర్తించాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇంధనశాఖ ఉన్నతాధికారి తెలిపారు. దీనిద్వారా ప్రాజెక్టు కోసం రుణాన్ని పొందే వీలుందని వివరించారు. అయితే పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వం సమకూర్చే ఆలోచన కూడా పరిశీలనలో ఉందన్నారు. సౌరశక్తి రైతులకు వరం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజుల్లో ఈ పథకంపై పూర్తి స్పష్టత వస్తుంది. సోలార్ ద్వారా రైతులకు పగటిపూట విద్యుత్ ఇబ్బంది లేకుండా అందించవచ్చు. సౌర విద్యుత్తు రైతులకు వరం లాంటిది. – శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి మంచి ఫలితాలిస్తుంది సౌర విద్యుదుత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి మంచి అవకాశాలున్నాయి. వ్యవసాయానికి అనుకూలం కాని ప్రాంతాల్లో భూమిని సోలార్ విద్యుదుత్పత్తి కోసం ఇవ్వడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. లీజుకు తీసుకున్నా, కొనుగోలు చేసినా సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణ వ్యయం పెద్దగా పెరగదు. – రమణారెడ్డి నెడ్‌క్యాప్ ఎండీ -
జీఎస్టీ మోసాల నివారణకు ప్రత్యేక వ్యవస్థ
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానాన్ని అమలు చేసే జీఎస్టీ నెట్వర్క్ కేవలం పన్ను వసూళ్ల పోర్టల్‌గానే కాకుండా.. జీఎస్టీ పరమైన మోసాలను ముందుగానే పసిగట్టడంపై కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఫ్రాడ్ అనలిటిక్స్ సిస్టమ్‌ను (ఎఫ్ఏఎస్) డిజైన్, అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్ ప్రతిపాదన (ఆర్ఎఫ్పీ) ప్రకారం ఎఫ్ఏఎస్ రూపకల్పనకి ఏడాది వ్యవధి ఉంటుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, ఈ–వేబిల్స్‌తో పాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), బ్యాంకులు, రాష్ట్రాల ఆదాయ పన్నుల శాఖల దగ్గరనుంచి వచ్చే సమాచారం అంతా క్రోడీకరించి .. పన్ను చెల్లింపుదారుల వివరాలు అన్ని కోణాల్లో సమగ్రంగా లభ్యమయ్యేలా ఎఫ్ఏఎస్ వ్యవస్థ ఉండనుంది. దాదాపు రూ. 300 కోట్ల టర్నోవరు, గడిచిన మూడేళ్లలో లాభాలు నమోదు చేసిన కంపెనీలు బిడ్లను దాఖలు చేయొచ్చు. అడ్వాన్స్డ్ ఆనలిటిక్స్‌ను అమలు చేయడంలో అనుభవం ఉండాలి. అర్హత పొందిన సంస్థ ఆరేళ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే జీఎస్‌టీఎన్‌కి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను అందించిన కారణంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి వీలుండదు. -
వ్యర్థ జలాల శుద్ధికి ప్రత్యేక వ్యవస్థ
పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ నక్సల్స్ ప్రభావిత 35 జిల్లాలకు వెయ్యి కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే కార్యక్రమంలో భాగంగా వ్యర్థ జలాల శుద్ధికి పీపీపీ(ప్రభుత్వ-ప్రైవేటు భాగసామ్య పద్ధతి) ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కానుంది. సంబంధిత ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దేశంలో వ్యర్థ జలాల నిర్వహణ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థ కృషి చేయనుంది. దీనికింద ఏర్పాటు చేయబోయే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)... శుద్ధి చేసిన జలాలకు మార్కెటింగ్ వసతి కల్పించే బాధ్యతలను కూడా పర్యవేక్షించనుంది. కంపెనీల చట్టం-2013 ప్రకారం ఏర్పాటు చేయబోయే ఈ ఎస్పీవీ్ర స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. వ్యర్థ జలాల శుద్ధి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ, నీటి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల నుంచి యూజర్ చార్జీల వసూలు వంటివి ఒప్పందంలో భాగంగా ఉంటాయి. కేబినెట్ ముఖ్య నిర్ణయాలివీ.. ► ఏడు రాష్ట్రాల్లోని 35 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులకు రూ.1000 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం. ఇందులో జార్ఖండ్(16 జిల్లాలు), ఛత్తీస్‌గఢ్(8 జిల్లాలు), బిహార్(6), ఒడిశా(2), మహారాష్ట్ర(1), ఆంధ్రప్రదేశ్(1), తెలంగాణ(1) రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు రూ.28.57 కోట్ల చొప్పున నిధులు అందనున్నాయి. ► అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టుల నిర్వహణతోపాటు వాటిని అభివృద్ధిపరిచే బాధ్యతలను సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్ప్రైజ్ కట్టబెట్టే ప్రతిపాదనకు ఆమోదం. ► ఎస్సీ, ఎస్టీలకు చెందిన 2.5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘స్టాండప్ ఇండియా స్కీం’ పథకానికి ఆమోదం. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు అందివ్వాలన్నది ఈ పథకం ఉద్దేశం. -
పాస్‌పోర్ట్ ఒక్క రోజులోనే క్లియరెన్స్
♦ ఆధునిక పరిజ్ఞానంతో పారదర్శక సేవలు ♦ ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు ♦ అమల్లోకి తెచ్చిన గుంటూరు అర్బన్ పోలీసు యంత్రాంగం గుంటూరు ఎడ్యుకేషన్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు పాస్‌పోర్ట్ కోసం ఇకపై రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్ట్ పొందేందుకు అవసరమైన ధృవపత్రాలతో దరఖాస్తు సమర్పించిన తరువాత ఒక్కరోజు వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయి పాస్‌పోర్ట్ అందుకునే విధానం అమల్లోకి వచ్చింది. గుంటూరు అర్బన్ పోలీసు యంత్రాంగం ఈ ప్రక్రియను ఇటీవల ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. ‘‘జీయూపీ సేవ డాట్ ఇన్’’ పేరుతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టునే గుంటూరు అర్బన్ పోలీసులు అమల్లోకి తెచ్చారు. జీయూపీ అంటే గుంటూరు అర్బన్ పోలీసు అని అర్ధం. గుంటూరు రూరల్ మండలం బుడంపాడులోని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసిన ఆరుగురు బీటెక్ గ్రాడ్యుయేట్లు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇప్పటివరకూ మాన్యువల్ విధానంలో జరుగుతున్న పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలను నూతన విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ వెళుతుంది. అందిన దరఖాస్తులను అర్బన్ పరిధిలోని 16 పోలీస్ స్టేషన్లకు పంపుతారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు సమర్పించిన దరఖాస్తు దారుడి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లే కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికీ ట్యాబ్లెట్ పీసీలను అందజేశారు. పాస్‌పోర్ట్‌కు సంబంధించి జరిగే పరిశీలన, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే అంశాలన్నీ పూర్తి పారదర్శకంగా జరగడం ఇందులోని ముఖ్యాంశం. తద్వారా సింగిల్ విండో విధానంలో పాస్‌పోర్ట్‌కు క్లియరెన్స్ రావడంతో పాటు అవినీతికి తావులేని విధంగా పారదర్శకత ఉంటుంది. ఈ సందర్భంగా ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులు ప్రత్తిపాటి వెంకటేష్ బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, డెరైక్టర్ డాక్టర్ శ్రీకాంత్, ఈసీఈ విభాగాధిపతి ఎస్డీఎల్వీ ప్రసాద్ అభినందించారు.