వ్యర్థ జలాల శుద్ధికి ప్రత్యేక వ్యవస్థ
పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
♦ నక్సల్స్ ప్రభావిత 35 జిల్లాలకు వెయ్యి కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే కార్యక్రమంలో భాగంగా వ్యర్థ జలాల శుద్ధికి పీపీపీ(ప్రభుత్వ-ప్రైవేటు భాగసామ్య పద్ధతి) ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కానుంది. సంబంధిత ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దేశంలో వ్యర్థ జలాల నిర్వహణ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థ కృషి చేయనుంది. దీనికింద ఏర్పాటు చేయబోయే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)... శుద్ధి చేసిన జలాలకు మార్కెటింగ్ వసతి కల్పించే బాధ్యతలను కూడా పర్యవేక్షించనుంది. కంపెనీల చట్టం-2013 ప్రకారం ఏర్పాటు చేయబోయే ఈ ఎస్‌పీవీ్ర స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. వ్యర్థ జలాల శుద్ధి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ, నీటి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల నుంచి యూజర్ చార్జీల వసూలు వంటివి ఒప్పందంలో భాగంగా ఉంటాయి.
కేబినెట్ ముఖ్య నిర్ణయాలివీ..
► ఏడు రాష్ట్రాల్లోని 35 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులకు రూ.1000 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం. ఇందులో జార్ఖండ్(16 జిల్లాలు), ఛత్తీస్‌గఢ్(8 జిల్లాలు), బిహార్(6), ఒడిశా(2), మహారాష్ట్ర(1), ఆంధ్రప్రదేశ్(1), తెలంగాణ(1) రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు రూ.28.57 కోట్ల చొప్పున నిధులు అందనున్నాయి.
► అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టుల నిర్వహణతోపాటు వాటిని అభివృద్ధిపరిచే బాధ్యతలను సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్ కట్టబెట్టే ప్రతిపాదనకు ఆమోదం.
► ఎస్సీ, ఎస్టీలకు చెందిన 2.5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘స్టాండప్ ఇండియా స్కీం’ పథకానికి ఆమోదం. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు అందివ్వాలన్నది ఈ పథకం ఉద్దేశం.